తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే ‘తెలుగు మహాసభలు’ – నేటి నుండి మన హైదరాబాద్ లో!

 

తెలంగాణ లోగిలిలో తెలుగు వెలుగుల రంగవల్లికను అందంగా తీర్చిదిద్దే రోజు వచ్చేసింది. తెలంగాణ భాష, సాహితీ సంపదను ప్రపంచానికి ఘనంగా చాటే శుభఘడియ సమీపించింది. సంస్కృతికి పట్టుగొమ్మగా.. సంప్రదాయాలకు ప్రతిబింబంగా ప్రపంచ తెలుగు మహాసభలను వైభవోపేతంగా నిర్వహించడానికి వేదిక సిద్ధమైంది. భాషావికాసం, సాహితీ సౌరభం కలగలిసి ఐదురోజులపాటు మాతృభాషాభిమానుల మదిని ఓలలాడించడానికి భాగ్యనగరం ముస్తాబయింది. ఎనిమిది వేల మంది కవులు, రచయితలు, చరిత్రకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులతో ఇంకొన్ని గంటల్లో.. అతిపెద్ద తెలుగు భాషా సంరంభానికి తెరలేవనుంది.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్త్రంలో తెలుగు భాష వికాసమే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు నేటి నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఆరంభ వేడుక లాల్ బహుదూర్ స్టేడియం లో ఘనంగా ఈరోజు సాయంత్రం కనులపండుగగా జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథి కాగా, మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డిలు వేదికపై ఆశీనులు కానున్నారు.


11 కమిటీలతో కార్యక్రమాల కూర్పు జరిగింది. మహాసభలకు ఎల్బీ క్రీడామైదానంతో పాటు మరో ఆరు వేదికలను ఎంపిక చేశారు. వీటిలో తెలుగు భాషా సదస్సులు, చర్చాగోష్ఠులు, కథాసాహిత్యం, నవల, విమర్శ, గేయం, బాల, మహిళా సాహిత్యాలు, చరిత్ర, పరిశోధన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నారు. అష్టావధానం, హాస్యావధానం, జంట కవుల, నేత్ర, శతావధానాలు జరగనున్నాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు, న్యాయపరిపాలన రంగాల్లో మాతృభాష, ప్రవాస భారతీయ భాషా సాంస్కృతిక వికాసాలపైనా చర్చలుంటాయి. సదస్సుకు కవులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. 1500 మందికి పైగా హాజరవుతున్నారు. అమెరికా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌, మలేసియా తదితర దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి 2000 మంది హాజరవుతున్నారు.


ప్రపంచ తెలుగు మహాసభల షెడ్యూల్

Source – http://wtc.telangana.gov.in

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,