Telugu Book Recommendations To Read: 8 Must Read Books For Beginners

Contributed By Divya Vattikuti

తెలుగు సాహిత్యం లో ఎన్నో కళలు,ఎన్నో కవితలు, ఎన్నో కథలు, ఎన్నో పుస్తకాలు, ఎందరో రచయతలు. ఎన్ని పుస్తకాలు ఉన్న, కొన్ని పుస్తకాలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అలాంటి కొన్ని తెలుగు నవలలు మీకోసం ఇలా.

ఈ బుక్ రికమండేషన్ సిరీస్ లో ఇంతకు ముందు వచ్చిన ఆర్టికల్ మిస్ అయ్యుంటే ఒకసారి అది కూడా చూసేయండి.

 అందమైన జీవితం (మల్లాది వెంకటకృష్ణమూర్తి)

మన రోజువారి జీవితంలో చాలా చిన్న మరియు అసంభవమైన సంఘటనలు మనల్ని సంతోషంగా మరియు ఆనందంగా చేస్తాయి అని చెప్పేదే ఈ నవల. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని మనం పట్టించుకోమని, ఇలాంటి ఆనందాలను వదిలేసి డబ్బు వెనక పరుగులు పెడుతున్నాం అని చెప్తారు రచయత. శాంతి, ప్రీతం చుట్టూ నడిచే ఈ కథ ద్వారా జీవితం లోని చిన్న చిన్న ఆనందాలను మనం అనుభవించడం నేర్చుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు.

చివరకు మిగిలేది ( బుచ్చిబాబు)

బుచ్చిబాబు అనే కలం పేరుతో శివరాజు వెంకట సుబ్బారావు గారు రాసిన నవల “చివరకు మిగిలేది”. దయానిధి అనే డాక్టర్ తన తల్లి చనిపోయిన తర్వాత తన జీవితం లో ఎదుర్కొనే సందిగ్తలను ఎలా ఎదురుకున్నారు అన్నదే ఈ నవల. పెళ్లి కోసం తనకో భార్యను వెతికే ప్రయత్నం లో సమాజం తో చాలా పెద్ద గొడవల్లో చిక్కుకుంటాడు దయానిధి.

అతడు అడవిని జయించాడు(డా. కేశవ రెడ్డి )

1984లో ప్రచురితమై పాతికేళ్ళపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అలరించిన అతడు అడవిని జయించాడు నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట రచన. లేశమాత్రమైన కథాంశంతో, అనామకుడూ, అపరిచితుడూ ఐన నాయకుడితో, అద్భుతమూ, అపూర్వమూ ఐన అరణ్య నేపథ్యంతో తన రచనను ఒక పురాగాథ స్థాయికి తీసుకెళ్ళారు రచయిత శ్రీ కేశవరెడ్డి.

ఒకే ఒక పాత్ర తో, అదీ ఎలాంటి ప్రత్యేకత లేని , ఒక వృద్దుడు ఒకే ఒక రాత్రి లో ప్రారంభం అయి , ముగిసి పోయే కథ ఎవరైనా ఊహించగలరా !

మైదానం(చలం )

స్త్రీ, సమాజ విలువలని ప్రశ్నిస్తూ, అనాదిగా వస్తున్న వివాహ బంధాలనుండి తన స్వేచ్ఛ లోకంలో ఆనందాన్ని పొందటాన్ని చాల చక్కగా మనకు తెలిపారు చలం గారు. 1926 కాలం లో వచ్చిన కథ అంటే ఇప్పటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది పాఠకులకి. అలాంటి పరిపక్వత తో ఉంటుంది కథ. ఒక గృహిణి తన స్వేచ్చని శోధించే ప్రక్రియలో పడిన మనోవేదన, ఆత్మ పరిశీలన గురించే ఈ కథ.

అంతర్ముఖం (యండమూరి వీరేంద్రనాథ్)

యండమూరి క్లాసిక్స్‌లో ఇది ఒకటి. మానవ సంబంధాలు, స్వార్థం, కుటుంబ విలువలు ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ తో సాగుతుంది ఈ కథ. జీవితం చివరి దశ లో ఉన్న వ్యక్తి తన జీవితం లో జరిగిన తప్పు ఒప్పులను తిరిగి గుర్తుచేసుకొని ప్రయత్నంలో తెలుసుకొనే గుణపాఠాలు ఈ కథ.

కీర్తి కిరీటాలు (యద్దనపూడి సులోచనారాణి)

టాలీవుడ్ లోని ఎందరినో మెప్పించిన పుస్తకం కీర్తి కిరీటాలు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఏ ఈపుస్తకాన్ని తప్పక చదవి అని చెప్పారంటే ఈ పుస్తకం లోకి గొప్పతనం అలాంటిది. కథలోని ముఖ్య పాత్ర అయిన  తేజ తన జీవితంలో వచ్చే ఒడి దుడుకులను ఎదుర్కొనే విధానం వాళ్ళ కథ చివరికి తేజ మీద ప్రతి ఒక్కరికి చాలా గౌరవం కలుగుతుంది.

అసమర్ధుని జీవయాత్ర (త్రిపురనేని గోపీచంద్)

ధనవంతుడైన సీతారామ రావు పేరు కోసం పాకులాటలో ఉన్న ఆస్తినంతా కోల్పోతాదు. తాను నమ్మిన వారు కూడా తనకి సహాయం చెయ్యకపోవడంతో సీతారామారావు కి కోపం కాస్త బాధగా మారుతుంది. అలంటి గుణాలతో సీతారామారావు జీవితం ఎలా మారుతుందో అన్నదే ఈ కథ.

కళ్ళు తెరిచిన సీత(రంగనాయకమ్మ)

ఇది, ‘కథ’ కాదు,’నవల’ కాదు,’కవిత’ కాదు,’వ్యాసం’ కాదు,’వార్త’ కాదు,’ఆత్మకథ’ కాదు. ఇది, వాటిల్లో ఏ కోవలోకీ చేరదు. మరి, ఇది ఏమిటి అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్తారు రంగనాయకమ్మ గారు. ఈ పుస్తకాన్ని గురించి వర్ణిస్తూ. ఫెమినిజం గురించి ఆ రోజుల్లోనే అద్భుతంగా రాసారు రంగనాయకమ్మ గారు. పెళ్లి అన్నది ఎలా సహజమో, విడాకులు అన్నది కూడా అంతే సహజం. విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి దృష్టి కోణం గురించి వర్ణించేదే ఈ కథ.

మరిన్ని పుస్తాకాల గురించి మరోసారి వస్తాం. అంతలోపు మీకు నచ్చిన పుస్తకం గురించి కొన్ని మాటాలు పంచుకోండి మరి.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,