This Short Story Explains The Importance Of The Bond We Share With Our Grandparents

 

మన పుట్టుకే ఒక పెద్ద అయోమయం తో మొదలవుతుంది. ఏమి తెలియని అమాయకత్వంతో ఏమి తెలియదు అని భయమేసి కాబోలు ఏడుస్తూ పుడతాం. తరువాత అమ్మ నాన్న స్పర్శ తో కొంత ధైర్యం తెచ్చుకుని నవ్వటం నడవటం మాట్లాడటం మొదలుపెడతాం. మొదట్లో కొన్ని మాటలు వరకే అమ్మ నాన్నలు మనకు నేర్పిస్తారు మిగితావన్ని మనమే మన చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ నేర్చుకుంటాం.

 

అలా మనకు మనమే నేర్చుకున్నా… ఇంకా మనకున్న అయోమయం తీరదు. ఇంకా ఎన్నో ప్రశ్నలు మనం మెదడుని తొలిచేస్తూ ఉంటాయి. ఆ అయోమయమే మన బాల్యం లో ఏదైనా నేర్చేసుకునే ఒక ఉత్సాహాన్ని ఆత్రుత ని మనలో కలిగిస్తాయి. ఈ టైం లో మన అన్ని ప్రశ్న లకు సమాధానం చెప్పే గురువు ఉంటే… ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు, కానీ ఆ గురువు ని ఎక్కడో వెతక్కర్లేదు. మన ఇంట్లోనే.. ఏ పుస్తకం చదువుకుంటూనో.. టివి చూస్తునో.. లేదా ఈ ఫోన్ తో కుస్తీ పడుతూనో ఉండే మన తాతయ్యల కన్నా జీవితాన్ని నేర్పే గురువులు ఇంకొకరు ఉండరు. వాళ్లతో కాసేపు కూర్చుని మాట్లాడిన సరిపోతుంది.

 

తాతయ్య మన జీవన్నాటకం లో ఒక ముఖ్య పాత్రధారి. మనకు ఊహా తెలిసే సమయానికి అప్పటి వరకు పరుగులు పెట్టి ఆయాసపడి విశ్రాంతి తీసుకుంటూ… ఉన్న పళ్ళు చాల వరుకు ఊడిపోయి చిన్నపాప లా బోసి గా నవ్వుతుంటారు… కానీ ఆ చిన్నిపాప నవ్వు వెనక ఏమి తెలియని అమాయకత్వం ఉంటె… మన తాతయ్య బోసి నవ్వు వెనక అన్ని తెలిసిన జ్ఞానం ఉంటుంది..

తాతయ్య ల జీవితం మూడు తరాలు చూసిన ఎన్నో అనుభవాలా సారం. అది తన తరువాతి తరాలకు పంచాలన్న ఆశ తనది. ఇలాంటి సమయం లో తనతో కొంచెం సేపు ఉండగలిగితే చాలు మనం వెతుకున్న సమాధానం తెలీకుండా మనకే తడుతుంది. క్లాస్ పాఠాలు సైతం నేర్పని లోక జ్ఞానం ఆయన మాటల్లో మనం నేర్చుకోవచ్చు.

 

మనమందరం అంతకుముందే సమాధానం దొరికిన ప్రశ్నలనే వెతుకుతాం, అందుకే గూగుల్ ని కనిపెట్టింది. కానీ.. మనకు మన జీవితం గురించి కలిగిన ప్రశ్నలకు సమాధానం అందులో దొరకదు. ఆ ప్రశ్న ల కి సమాధానం మన తాతయ్య ల దగ్గర ఉంటుంది. మనం వెళ్ళి అడగాలి అంతే. తాతయ్యల అనుభవాన్ని మనం అందుకుని మన తరువాతి తరానికి అందిస్తే.. అభివృద్ధి ఒక దారి లో సూటిగా వెళ్తుంది . లేదంటే పాత ప్రశ్నలకి సమాధానాలు వెతుకుంటూ… ఒక సర్కిల్ లో అలా తిరుగుతూనే ఉంటుంది..

 

కానీ ఈ గజి “బిజీ” జీవితం లో తాతయ్య ల తో మాట్లాడే సమయం ఉంటుందా అసలు వాళ్ళతో పాటే ఉంటున్నామా? దీనికి సమాధానం చాలా వాళ్ళ దగ్గర “నో” అనే వస్తుంది. ఉద్యోగాల వల్ల చదువుల వల్ల తాత మనవళ్ల మధ్య ఒక దూరం ఏర్పడింది. ఆ దూరం ఒక అనుభవాన్ని జీవిత విలువలని నేర్చుకునే ఒక అవకాశాన్ని దూరం చేసింది. ఆఫీస్ కో కాలేజ్ కో వెళ్లే దారి లో , ఏమి తోచనప్పుడో, నువ్వు ఇష్టపడే వాళ్లకి మెసేజ్ చేసి రిప్లై కోసం ఎదురుచూస్తున్నప్పుడో… ఓ సారి ఫోన్ చేసి మాట్లాడితే వారికి ఆనందం మనకు అనుభవం దొరుకుతుంది.

 

నా తాతయ్య లు ఒకరు సంతోషాన్ని ఇంకొకరు సంస్కారాన్ని. నేర్పారు. ఒకరు సినిమాల పైన ఇష్టానికి కారణం అయితే., ఇంకొకరు సంగీత సాహిత్యాలపై ఇష్టానికి కారణం. మొత్తంగా జీవితానికి కావాల్సిన ముఖ్యమైన పాఠాలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను చూసే ప్రతి సినిమా నా తాతయ్య నాకు చెప్పే కబుర్లనే అనుకుంటా. నేను రాసే ప్రతి మాట నా తాతయ్య నా చెయ్యి పట్టుకుని రాయించారనే అనుకుంటా.. చివరి క్షణాల్లో వాళ్ల పక్కన లేనని బాధ ఉన్న వారి జ్ఞానం జ్ఞాపకాలు నాతోనే సజీవంగా ఉంటాయి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,