Revisiting Suvvi Suvvi Suvvalamma Song From Swathi Muthyam: A Fan’s Meaningful Note

 

Contributed By Sarveswar Reddy Bandi

 

కేవలం థియేటర్లలో వసూళ్ళు చేస్తే హిట్టు అంటారు.. అలా కాకుండా యేళ్లు గడిచినా టీవీలో రిమోట్ మార్చకుండా చేసే సినిమాలను, పాటలను క్లాసిక్స్ అంటారు..

 

కొన్ని సినిమాలు ఏ బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం అవుతాయో గానీ వాటికి అన్ని విభాగాలు (క్రాఫ్ట్స్) సహకరిస్తాయి.. ఎంతగా అంటే అందులో నటించే పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లతో పాటు కేవలం కాసేపు కనిపించి పోయే అతి స్వల్ప పాత్రధారులు (జూనియర్ ఆర్టిస్ట్స్) వరకూ అందరూ అద్భుతంగా సరిపోతారు.. ఎంతలా అంటే ఆ పాత్రలో మరే ఇతర నటులను ఊహించుకునే సాహసం కూడా ప్రేక్షకుడు చేయనంతగా…

 

కేవలం నటీ నటులే కాదు, టెక్నికల్ విభాగాలు కూడా సినిమాలో అత్యంత మఖ్య పాత్ర పోషిస్తాయి.. అందులో సంగీతం ఒకటి..అతి బలహీనమైన కథాంశంతో సినిమా మునిగిపోతుందని అందరూ అనుకున్న సమయంలో కేవలం పాటలే సక్సెస్ గట్టుకు తీసుకురావడమే కాకుండా, కొన్ని సినిమాలు ఏకంగా బ్లాక్ బస్టర్లు అందుకున్న సందర్భాలూ ఉన్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు అనే చెప్పాలి..

 

అలాంటి మహత్తరమైన పాటలు అంతకంటే బలమైన కథకు తోడైతే, తెలుగు ప్రేక్షకుల సుడి బాగుండి దానికి కళా తపస్వి గారే దర్శకులైతే.. ఇంకేముంది ఇలా చరిత్ర అవుతుంది..

 

చాలా సినిమాల్లో కథ బాగుందా..? పాటలు బాగున్నాయా..? నటనా..? లేకపోతే దర్శకత్వమా..? అని ఎవరైనా అడిగితే ఇట్టే చెప్పగలం.. కానీ కొన్ని సినిమాల విషయంలో అది పాత కరెన్సీ నోట్ల లాగా ఏమాత్రం చెల్లదు.. అందులో స్వాతి ముత్యం ఒకటి..

 

ఇందులోని పాటలు ఏదో కమర్షియల్ అంశాల కోసం నిర్మాతకు అదనపు ఖర్చుగా కాకుండా, ప్రతీ పాట కూడా తనవంతు భాగంగా కథను ముందుకు తీసుకెళ్తూ నాలుగైదు సీన్ల డబ్బులు మిగిల్చినట్లు కనిపించడమే కాక వాటి అర్థాలు తెలుసుకోవాలి అనిపించేలా మాస్ ప్రేక్షకుడిని సాహిత్యానికి దగ్గర చేస్తాయి..

 

ముఖ్యంగా సువ్వి సువ్వి పాట..

 

రచయిత సి. నారాయణ రెడ్డి గారికి దర్శకులు పాట సందర్భం చెప్పినప్పుడు అనవసరమైన ప్రాసలు, పద్యాలు లేకపోయినా పర్లేదు.. “ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయికి అనుకోని కారణాల వల్ల భర్తకి దూరమైతే, చావడానికి కూడా అవకాశం లేనట్లు కొడుకును ఇచ్చి, అలా అని బ్రతకడానికి అవకాశం లేనట్లు బంధువులను ఇచ్చి, భగవంతుడు వేధిస్తున్నాడు అనుకునే సందర్భంలో అదే ఊర్లో చొక్కా సరిగ్గా తొడుక్కోవటం చేతకాని ఒక అమాయకుడు తనకేం పర్లేదని ధైర్యం చెప్తూ” పాడే పాట కాబట్టి దీనికి రామాయణం నుండి సీతమ్మ పాత్ర మాత్రమే సరైన ఉదాహరణ, కానీ అంత పెద్ద జీవితాన్ని కేవలం ఒక పాటలోని రెండు చరణాల మధ్య రాయడం అసాధ్యం కనుక మీకు నచ్చిన శైలిలోనే రాయండి, ఈ పాట కథకు ఉపయోగపడితే చాలు అని వదిలేశారు విశ్వనాథ్ గారు..

 

కానీ మన ఆత్మ విశ్వాసం బలమైనది అయితే ఈ సృష్టిలో అసాధ్యం అనే పదం మన దరికి కూడా రాకుండా ప్రకృతే చేస్తుంది అన్న విషయం ఇక్కడ రుజువైంది.. విశ్వనాథ్ గారి కోరిక బలమైనది కాబట్టి ఆయన అనుకున్న అన్నీ ఈ పాటలో కుదిరాయి..

 

అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా

(అబద్దం పలకడు, అధర్మం చేయడు, పరాయి స్త్రీని కోరుకోడు లాంటి లక్షణాలను చూసి అందరు ఆడపిల్లల వలే సీతమ్మ కూడా తన భర్త జీవితాంతం బాగా చూసుకుంటాడని బలంగా నమ్మినపుడు, పెళ్లి తర్వాత నిండు గర్భిణిని నిర్దయగా అడవిలో వదిలేసినప్పుడు ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో చెప్తూనే తనకు ధైర్యం చెప్పిన విధానం)

 

అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు..

(నిజాన్ని నిప్పుతో పోల్చుతారు. అనుమానాన్ని, చిన్న చిన్న తాత్కాలిక సమస్యలను నీటి అలలతో పోల్చుతారు, ప్రమాణం చేయాల్సి వచ్చినపుడు ఒకప్పుడు భూమి మీద, ఆకాశం మీద వేయమని చెప్పేవారు, ఎందుకంటే ఇక్కడ మనుషుల కంటే శాశ్వమైనవి అవే కనుక..
దీని అర్థం నిజాన్ని నిప్పుతో పోల్చుకుంటూ ఉంటాం, అలాంటి నిప్పులోనే దూకి, తాత్కాలిక అలల లాంటి అనుమానాలు తుడిచేసావ్, అంత ధర్మంగా ఉన్న నీవు ఏదోక రోజు తప్పక గెలుస్తావని భూమి, ఆకాశం, నీ మీద ఒట్టు అని ఒక భావం ఆ రెండు నీ తోడుగా ఉంటాయని ఇంకో భావన )

 

చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచీ
నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు

(ప్రకృతి ఉన్నంత ఎవరు ఒంటరి వాడు కాదు, నీ చుట్టూ ఉన్న చెట్టులే నీ తోబుట్టువులని అనుకో, ఇప్పుడు నీ కంట కారే కన్నీరు నీ దాహాన్ని తీరే దారిని చూపిస్తాయి. గ్రహణం వీడి నీవు పున్నమి గా వెలిగే వేళ వస్తుందని ఒక సానుకూల దృక్పధం నీ మాటలో ఉంటుంది. ఒక మంచి మాట చెప్పడానికి తెలివైన వాడే కావక్కర్లేదు. మంచి మనసున్న చిన్న పిల్లొడైన చాలు అని ఈ పాట శివయ్య చేత పాడించి చెప్పకనే చెప్పారు దర్శకులు.)

 

మన సినిమా భాషలో చెప్పాలంటే సీతమ్మ కథలోని ఇంట్రడక్షన్ నుండి ఇంటర్వల్ వరకూ మొదటి రెండు లైన్లు, ప్రీ క్లైమాక్స్ నుండి శుభం కార్డు వరకూ చివరి రెండు లైన్లలో, అంటే అక్షరాలా నాలుగైదు వాక్యాలు ఉన్న కేవలం ఒక చరణం లోనే డైరెక్టర్ అడిగిన సీతమ్మ reference తో పాటు తాపీ మేస్త్రి కట్టిన గోడ లాంటి అద్భుతమైన ప్రాసను కూడా అందులోనే రాయగలిగాడంటే ఆ రచయిత తన మనస్సును ఎంత దగ్గరకు తీసుకున్నారో, ఎన్ని పేపర్స్ తన చెత్త బుట్టకి గోల్ వేశాడో అర్థం అవుతుంది..

 

ఈ పాట పదాలకు ఇక ఇళయరాజా గారి సంగీతం, ఎస్పీ బాలు, జానకీ గారి గొంతు తోడై దాన్ని చరిత్రలో ఉండేలా చేశాయి..

 

ఏది ఏమైనప్పటికీ అంత గొప్ప పాటని రాసిన రచయితకు, దాన్ని అమలు చేసిన దర్శనిర్మాతలకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలెం.. అప్పుడప్పుడు వాళ్ళని ఇలా గుర్తుంచుకుని మనసులో థాంక్స్ చెప్పుకోవడం తప్ప..

 

Reference video:


 

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,