Heartfelt Musing Of A Young Director Whose First Film Failed

 

Contributed By Raviteja Nekkalapu

 

సినిమా…..

ప్రేక్షకుల అభిమానం….

కళాకారుల కళ…..

ఎన్నో మాటలు అద్భుతంగా మనకిష్టమైన నటుల చేత పలికించి,

గొప్ప పాత్రల తో మెప్పించే దర్శకుల కి కూడా పాఠాలు నేర్పించే విద్యాలయం

 

అలాంటి సినిమా ప్రపంచం లో ఒక దర్శకుడి జీవితంలో ఒక పేజీ…

 

బాధ తో బరువెక్కిన నా మనసుకి కన్నీళ్లు తోడు లేవు అంతే ! నా కాళ్ళు భూమిని తాకి విడిచే శబ్దం(నడుస్తున్న) మాత్రమే నాకు వినపడుతోంది. అంతలో చిన్న స్వరంతో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అవి మరేవో కాదు నా ఆలోచనలు అని అర్ధమైంది.

“నాకు కలిగిన కోరిక నెరవేర్చమని నా ఆలోచనలకి నేను విన్నవించుకున్నప్పుడు అవి సరేనన్నాయి ఆరోజు.నిజానికి అవి సాయం చేశాయి కూడా.కానీ ఎన్నోరోజుల నుంచి నాలో విరిసిన ఆశ,కలిగిన కోరిక ఆవిరైపోయాయి.కారణాలు వెతికే ఓర్పును కూడా నా మనస్సు కోల్పోయింది.

 

దీనికోసమేనా , నన్ను నన్నుగా ప్రేమించే నా తల్లితండ్రులను విడిచి ఇంత దూరం వచ్చి, ఎన్నో కష్టాలతో ఒక సినిమా తీసి దర్శకుడిగా నా కల నెరవేర్చుకుందామనుకున్నాను. కానీ నా కల చెదిరింది

 

మొదటి సినిమా…..నేను ఎంతో కష్టపడి వ్రాసుకున్న కథ…..
నేను ఎంతో ఇష్టపడిన పాత్రలు….
ఇవన్నీ ప్రేక్షకుల్ని మెప్పించలేదంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను.
నన్ను నమ్మి నా కథ ను ఆదరించిన నిర్మాత పరిస్థితి కి కారణం నిజంగా నేను అనే ఒక ఊహ కూడా నేను భరించలేను.విమర్శకుల ప్రశంసలు నిర్మాతని కాపడలేవు ఎందుకంటే ప్రేక్షకులు తిరస్కరించారు కాబట్టి.

 

నా మొదటి సినిమాను మా అమ్మానాన్నలకి కానుకగా ఇచ్చి,ఇన్నేళ్ల నా వల్ల అనుభవించిన పుత్రశోకం నుండి దూరం చేద్దామని అనుకున్నా !మా నాన్నకు నెలకు వచ్చే చాలీచాలని జీతంతో నే ముగ్గురూ ముప్పైరోజులు గడపాలి.ఇదంతా నాకు తెలిసి కూడా మా నాన్న చెప్పిన ఉద్యోగం చేయకుండా,అమ్మ మాట వినకుండా ఇలా దూరంగా నాది కానీ ఈ ప్రపపంచం లో ఎదో సాధించాలని ఒక నమ్మకంతో గమ్యం కనపడని ప్రయాణాన్ని మొదలుపెట్టాను.

 

అన్ని కథలు అందరికి నచ్చవు అందుకనే అందరూ మెచ్చుకునే సినిమా తీయాలనుకున్నాను కానీ వాళ్ళకి నచ్చని సినిమా ఎలా మెచ్చుకుంటారని ఆలోచించలేదు. మనుషులు అంతా ఒక్కటే కానీ వారి జీవితాలు కాదు అని అర్ధమైంది నాకు.ఎన్నో అవమానాలు ఎదురైనా, నన్ను,నాలోని దర్శకుడిని నమ్మిన నా మిత్రుడి కి నేను ఏం చెప్పాలి ? నేను ఓటమిని అంగీకరించడం తప్ప ! వాడి నమ్మకం గెలిచినా, వాడి నమ్మకాన్ని గెలిపించలేకపోయాను నేను !

 

నన్ను వేలెత్తి చూపిన చేతుల నుంచి ప్రశంసలు దక్కుతాయి అనుకున్న నా ఊహ నిజం లోకి రాలేక కనుమరుగైపోయింది. ఎంతోమంది తమలోని కళ ప్రదర్శించటానికి ఎన్నుకునే గొప్ప రంగస్థలం సినిమా………”

 

అంతలో నా ఆలోచనలకి అడ్డుపడింది నా ఫోన్ రింగైన శబ్దం.మా నాన్న ఫోన్ చేస్తున్నారు. ఫోన్లో మా నాన్న

“గెలుపు అంటే ఇష్టపడే మనం ఓటమికి మాత్రం ఎందుకు భయపడాలి ? అయినా నిన్ను ఎప్పుడూ ఈ సమాజం గెలవాలని కోరుకోదు.కేవలం నీ ఓటమిని ఆనందించటానికి వెయ్యి కన్నులతో ఎదురుచూస్తుంది.అలా ఎదురుచూసే ప్రతి కంటికి అంధకారం కనపడేలా నీ గెలుపు సమాధానమివ్వాలి.అప్పుడే నువ్వు గెలుపుకి అర్హుడివి.నీకు నువ్వనుకున్న గెలుపు నీకు రాలేదు అంటే నీకోసం నువ్వు ఊహించని విజయం నీకోసం ఎదురుచూస్తోందని ఎందుకు అనుకోవు.అది సొంతం చేసుకోవాలంటే నీ ఓటమి నీకు అడ్డు కాకూడదు ఒక పాఠం కావాలి.ఈరోజు నువ్వు అందరికి సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ ఈరోజుతోనే నువ్వు నీ ప్రయాణం ఆపితే నువ్వు నమ్మిన సినిమాకి అన్యాయం చేసినట్టే.ఇన్నాళ్లు నీ భవిష్యత్తు మీద నాకు భయం ఉండేది కానీ ఇప్పుడు నువ్వు తీసిన సినిమా చెప్తుంది నీ ప్రతిభ ఎంటో అని ! సినిమా కి డబ్బులు రాకపోయినా నా కొడుకు ఒక మంచి సినిమా తీశాడు అని నలుగురికి గర్వంగా చెప్పుకుంటా……”అని మా నాన్న నాలో ధైర్యాన్ని నింపారు.

 

ఇప్పుడు నాలోని మనోవ్యధ మెల్లగా తొలిగిపోతుంది.నా మనస్సు మౌనంలోకి,కనులు ఆకాశం లోకి,ఆలోచనలు ప్రశాంతత లోకి లీనామయ్యాయి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , ,