This Short Story Perfectly Describes How Merciless We’re Becoming Day By Day

Contributed by Masthan Vali
తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారి.
సమయం మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. ఎండ మండి పోతోంది. రోడ్డు పక్కనే ఉన్నాను. ఇంతలో…ఎవరో దారిన పోయే వాడు నా దగ్గరికొచ్చి నిలబడి చెమట తుడుచుకుంటున్నాడు. పాపం…బాగా ఎండకి వచ్చాడు కదా, అలసి పోయినట్లున్నాడు. రోడ్డు దాటడం కూడా కష్టంగా ఉంది, రహదారి పైన వాహనాలు రయ్..రయ్.. మని దూసుకెళ్తున్నాయి.
ఆ వాహనాలలో ఒక ట్రాక్టర్. దాని నిండా మనుషులు. అందరూ లోపలి ఖాకి డ్రాయరు కనబడేలా లుంగీలు పైకి కట్టుకున్నారు. చాలా మొరటుగా ఉన్నారు.
ట్రాక్టర్ దిగి నా వైపుగా పెద్ద పెద్ద అడుగులతో నడవసాగారు. వారి మొరటు చేతులకు అతికినట్టు సరిపొయే గొడ్డల్లు.
ఆ ట్రాక్టర్ పక్కగా ఒక విలాసవంతమైన కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగాడు ఓ వ్యక్తి, ట్రాక్టర్ లోని మనుషులకు పూర్తి భిన్నంగా, హుందాగా డ్రెస్ చేసుకున్నాడు. బహుశా ఏదో ఆఫీసర్ అనుకుంటా. ఆ మొరటు వ్యక్తులు, ఆఫీసర్ కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. మధ్యలో నా వైపు రెండు మూడు సార్లు చేయి చూపారు. నెనేమోలే అనుకున్నా. తర్వాత, ఆ ఆఫీసర్ కారు ఎక్కి వెళ్లిపోయాడు.
మొరటు వ్యక్తులు నా వైపు నడక కొనసాగించారు. ఈ సారి కాస్త వేగంగా…ధృడంగా నడవసాగారు. మొత్తం ఐదు మంది ఉన్నారు. చాలా సేపటి నుండి నా ప్రక్కన నిల్చున్న వ్యక్తి వారి వైఖరి చూసి వారేంచేయబోతున్నారో అర్థం చేసుకున్నట్టు తను తాగుతున్న సిగరెట్టు కింద పడేసి, కనీసం దాన్ని ఆర్పకుండా నా నుంచి దూరంగా వెళ్లాడు.ఇంతలో ఆ మొరటు వ్యక్తులు నాకు చేరువయ్యారు.
వారిలో ఒకరు…నా చుట్టూ తిరుగుతూ తన గొడ్డలిని తిప్పుతున్నాడు. ఏం జరగబోతోందో ఊహించేలోపే, రెప్ప పాటులో నా పై పడింది… ఓ గొడ్డలి వేటు. అతనితో పాటు మిగతా నలుగురూ కలిసారు. రాక్షసురిలా ఎగబడుతున్నారు. అడ్డంగా నరకసాగారు. ఇంత సేపు ప్రక్కనే నిలుచున్న ఆ వ్యక్తి “వద్దు…ఆపండి…” అన్న కనీస మాట కూడా చెప్పకుండా వినోదం చూస్తున్నాడు. దారిన పొయే వారందరూ రొడ్డు ప్రక్కన ఒక దారుణం జరుగుతుంటే చూసీ చూడకుండా వెళుతున్నారు. “నన్ను రక్షించండి” అని గొంతు నరాలు తెగేలా అరుస్తున్న అరుపులు వారికి వినిపించట్లేదేమో… ఇంత కర్కశమైన మనుషులా… నీచులు, అసలు మానవత్వం ఉందా…? క్రమంగా నా యాతన తీవ్రమవుతోన్నట్టు తెలుస్తోంది. మెల్లగా నా ప్రాణాన్ని కొన ఊపిరితో వదిలేసారు.
ఇంతలో వారి ఫోన్ మోగింది. ఆ మొరటు వ్యక్తుల్లోని ఒకరు ఫోన్ తీసి
” అయ్యా…పనైపోయింది…” చెమట చిందిస్తూ అన్నాడు.
” బహుశా కారు లోనుంచి హుందాగా దిగిన వ్యక్తేమో…” నా మనసు కొన ఊపిరితో కొట్టుకుంటూ చెబుతోంది.
ఎవరూ నన్ను చూసి ‘అయ్యో ’ అనలేకపోయారు.
సమయం – సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది. ఒక ముసలాయన వయసు 60 ఏళ్ళు పైబడి ఉంటుంది.తెల్లటి చొక్కా, పంచె ధరించి ఉన్నాడు.
నన్ను నరికి కొన ఊపిరితో వదిలేసిన అదే రహదారికి ప్రక్కగా నడుస్తున్నాడు. అతని చేతిలో ఓ చిన్న మొక్క.
” నేను కూడా పెరిగి పెద్దయ్యాకా ఇలానే చంపేస్తారా…? దానికంటే పెంచక పొవడమే మంచిది కదా…!!” అంటూ ఆ మొక్క నా వైపు ఆవేదనతో చూస్తోంది.
మనసుతో తప్ప చెవులతో వినలేని ఆ మాటలు ముసలాయనకి వినబడ్డాయో లేదో మరి. తను కూడా ఏదో ఒక రోజు ఇలానే కను మూస్తుందనుకుంటున్న తరుణంలో…
“రోడ్డు విస్తరణలని…అపార్టుమెంటులనీ…ఇలా పెద్ద పెద్ద చెట్లనూ…పది మందికి నీడనిచ్చే వాటిని నరుక్కుంటూ పోతారా…?” గొనుక్కుంటూ నడవసాగాడు ముసలాయన….
మొక్క మాటలు వినబడినట్లున్నాయ్…
వృక్షో రక్షతి రక్షితః
If you wish to contribute, mail us at admin@chaibisket.com