ఇద్దరు ఆజాదు చివరి మజిలీ కి సాక్ష్యం గా నిలిచినా కాలం కథ ఇది – A Short Story

 

Contributed by Raviteja Ayyagari

 

నేను, మీకు అవసరము లేనప్పుడు నెమ్మదిగా కదులుతాను, మీకు అవసరం ఉన్నప్పుడు వేగంగా పరిగెడతాను అని మీరు వెక్కిరించే కాలాన్ని. నిజానికి, నేను ప్రతి క్షణము ఒకటే వేగంతో సాగుతాను. కానీ, మీ పరిస్థితుల ప్రభావం వల్ల మీకు నేను అలా ఆనతాను. మీతో పాటు నేను కూడా ఆ పరిస్థితి ని అనుభవించే ముందుకి సాగుతాను. మీరు మీ బాధని పంచుకోగలరు, నేను పంచుకోలేను. ఒకొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, నేను వెనక్కి వెళ్లగలిగితే బాగుండునేమో అని. మంచి సందర్భాలు వచ్చినప్పుడు నేను అక్కడే ఉండిపోయేటట్టు, చేదు సందర్భాలు వచ్చినప్పుడు అవి అసలు రాకుండా ఉండేటట్టు చెయ్యగలిగే శక్తీ నాకు ఉంటె బాగుంటుంది అనిపించేది.

 

అలా రెండు సంఘటనలు నన్ను బాగా కదిలించాయి. రెండు సందర్భాలు నన్ను ఆలోచింపచేసాయ్. బహుశా అలాంటి సందర్భాలు నేను ఇంతక ముందు చూసే ఉంటాను. కానీ అవి ఒకే సారి, ఒకే పూట వచ్చేసరికి వాటి ప్రభావం నా పైన మరింత బలపడింది.

ఒక మండు వేసవి రోజు…
కాశ్మీర్ లోని ఒక చిన్న పల్లెని ఆక్రమించుకున్న ఉన్మాదులు…
యుద్ధానికి సిద్ధమవుతున్న భారత సైన్యం…

 

నా ముందు ఉన్నది చంద్ర శేఖర్ ఆజాద్, ఇతను ఒక ఆర్మీ మేజర్. భయం ఎరుగని, బాధ్యత ఎరిగిన పౌరుడు. కాశ్మిర్ లో జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే తన రక్తం లావా లాగ మరిగిపోయింది. అతను తన సైనికులతో పాటు యుద్ధానికి సిద్ధపడ్డాడు. నాయకుడు కదా, యుద్ధం వైపు మొదటి అడుగు వేసే ముందు సైనికుల్ని ఉత్తేజపరచడానికి నాలుగు నీతి వాక్యాలు చెప్పాడు.

 

అతను మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఆవేదన, ఆక్రోశం, అతని గుండె ధైర్యం, అతని మాట లోని గాంభీర్యం, అతని ఉనికిలో ఆత్మ విశ్వాసం, ఇవన్నీ కలిసి అక్కడ ఉన్న సైనికులలో వాళ్ళు అప్పుడే గెలిచేసాం అనే ధైర్యాన్ని ఇచ్చాయి. మనుషులు వొళ్ళు జలదరించడం అంటే ఏంటో అనుకున్న. బహుశా ఇదేనేమో! అసలు ఆ సమయం ఒక్కసారి నేను ఆగిపోగలిగితే ఎంత బాగుండునో అనిపించింది.

 

ఒకొక్క అడుగు వేసుకుంటూ యుద్ధానికి వెళ్లారు. అందులో కొంత మందికి అది మొదటి యుద్ధం. కొంత మందికి ఆఖరి యుద్ధం. కొంతమందికి వాళ్ళు వేసిన మొట్టమొదటి అడుగే ఆఖరి అడుగు. చంద్రశేఖర్ ఆజాద్ ఆ రోజు పోరాడిన తీరు, అతను చూపిన తెగింపు వర్ణించడానికి నా దగ్గర వ్యాకరణం లేదు. గుండెలో ఎన్ని గుళ్ళు దిగినా, అతని అడుగు ఆగలేదు, శత్రువు ని సంహరించడం ఆపలేదు. చివరి శ్వాస వరకు, దెస సంరక్షణకై, తోటి సైనికుల రక్షణకై పాటుపడిన ఆజాద్ కళ్ళల్లో గర్వం కనిపించింది. ఆ క్షణం ఎం జరుగుతోందో నాకు తెలియలేదు. నా ప్రమేయం లేకుండానే నన్ను ఎవరో ముందుకి బలవంతంగా తోసేస్తున్నట్టు అనిపించింది. ఇంకొంచం ముందుకి కదలాగానే, భారత సైన్యం గెలిచింది. ఆజాద్ మృత దేహం పేటిక పైన జెండా కప్పి అతనికి వీర నివాళి అర్పించారు. జై హింద్ అని వాళ్ళు అరిచిన ఆ అరుపు, నా చెవులలో ఇప్పటికి మారు మ్రోగుతూ ఉంటుంది.

 

అతని శవాన్ని వాళ్ళ ఇంటికి తీస్కుని వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్లు కురుస్తూనే తమ కొడుకు వీరత్వానికి గర్వంతో పొంగిపోయారు. అదే రోజు వాళ్ళ తమ్ముడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతని నిర్ణయం విని నాకు రోమాలు నిక్కపురుచుకున్నాయ్. అన్న చనిపోయాడు అని తెలిసి కూడా తమ్ముడు సైన్యంలో చేరడం అనుకున్నాడు. ఆ సంఘటన చూసి, నా గమ్యంలో ఇలాంటి సందర్భాలే కావలి అని కోరుకున్నాను. కానీ అదే రోజు నేను ఇంకొక సంఘటన చూసాను.

 

అదే రోజు అదే సమయం…
హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్ లో…
తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న ఇంకొక చంద్రశేఖర్ ఆజాద్…

ఇతని పేరు కూడా చంద్రశేఖర్ ఆజాద్. ఇతను ఒక అమ్మాయితో రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ, ప్రతి ప్రేమ కథలాగే, వీళ్ళ ప్రేమ కథ కూడా అనివార్య కారణాల వల్ల అర్ధమయ్యింది. అతను ఆ అమ్మాయి ని తలచుకుంటూ బాధ పడి కుమిలిపోయాడు. అతని పరిస్థితి చూసి తల్లిదండ్రులు కూడా బాధ అనుభవిస్తున్నారు. కానీ, అతని బాధ చూసి నాకు ఎందుకో అంత బాధ కలగలేదు. బహుశా తల్లిద్రండ్రులని పట్టించుకోకపోవడం వల్ల అనుకుంట. ఇందాక చెప్పినట్టు, నేను త్వరగానే కదిలాను, కానీ అతని పరిస్థితి వల్ల అసలు టైం బాలేదు రా అని నన్ను తిట్టుకున్నాడు.

 

కానీ అతనికి ఆ మేజర్ ఆజాద్ కి ఉన్నంత గుండె ధైర్యం లేదనుకుంట. ఎవరికీ ఉపయోగం లేదు అని తెలిసిన ఆత్మహత్య మార్గం ఎంచుకున్నాడు. ఆ మేజర్ ఆజాద్ అనుభవించినంత నొప్పి ఇతను కూడా అనుభవించాడు. ఆ సమయం లో అనిపించింది ఈ ఒక్క క్షణం నిజం కాకపోతే బాగుండు అని. అతని శవం చూసిన తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. అతని తండ్రి కుప్పకూలిపోయాడు. అసలు అతనితో ఎటువంటి సంబంధం లేనట్టు గా ఉండే తమ్ముడు, అదే రోజు సాయంత్రం తాను ప్రేమించిన అమ్మాయితో షికారుకు వెళ్ళాడు. తల్లిదండ్రులకి అవమానం, అతను చుట్టు పక్కల వాళ దృష్టిలో (నాతో సహా) గౌరవం కోల్పోయాడు.

 

ఎటువంటి భావన లేని నాకు ఆ రెండు సంఘటనలు నాలో ఉన్న భావాలన్నీ బయట పెట్టెల చేసాయి. నన్ను ఏడిపించాయి, నవ్వించాయి, కోపం వచ్చేలా చేసాయి, గర్వ పడేలా చేసాయి, ఒక మనిషిని అసహ్యించుకునేలా చేసాయి. ఆ రోజు, ఒక విషయం తెలుసుకున్నాను. ఒక చావు ప్రేమించిన వాళ్ళకి గర్వాన్ని అందించాలి, ఆ మనిషికి గౌరవం అందించాలి. ఇది మీ, కాలం రాసిన కథ.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , , ,