Sirivennala Gari Last Song: Here’s Beautiful Meaning Behind Sirivennala Song From Shyam Singha Roy

Contributed by Sairam Nedunuri

“శ్యామ్ సింఘ రాయ్” చిత్రం నుండి ఈ మధ్యనే వచ్చిన “సిరివెన్నెల” పాట రాశారు “సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు”.

ఎప్పటిలాగే శాస్త్రిగారు ఈ పాటని అత్యద్భుతంగా రాశారు. ముఖ్యంగా ఈ పాటలోని గొప్పతనం ఏంటంటే, పాటలోని కొన్ని పదాలను, భావాలను గమనిస్తే ఈ ప్రకృతిలోని చంద్రుడు, రాత్రి, ఆకాశం, భూమి, చుక్కలు వాటి మధ్య సంబంధం వర్నించినట్టు ఉంటుంది.అలాగే చిత్రంలోని కథానాయకుడు, కథానాయిక మధ్య పరిచయాన్ని, సంభాషణలను వర్ణిస్తునట్టు కూడా ఉంటుంది.’

ఒకే పాటలోని పదాలని, రెండు వేరు వేరు సందర్భాలకు వర్తించేటట్టు రాయడం శాస్త్రిగారి గొప్పతనం. అప్పట్లో “చక్రం” చిత్రంలోని “జగమంతా కుటుంబం నాది” పాటని కూడా “సూర్యుడు”కి, “కవి”కి, ఇద్దరికీ వర్తించేటట్టు రాశానని చెప్పారు శాస్త్రిగారు.

“సిరివెన్నెల” పాటలోని కొన్ని వాక్యాల భావాలని నాకు అర్థమైనంతలో కింద విశ్లేషించడం జరిగింది. తప్పులుంటే మన్నించండి.

నెల రాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల

దూరమా, దూరమా .. తీరమై చేరుమా

ప్రకృతికి వర్తించే భావం:నెలారాజు అంటే చంద్రుడు. ఇల రాణి అంటే భూమి అనుకోవచ్చు. చంద్రుడు నుంచి వచ్చే వెన్నెల కిరణాలు భూమిమీద పడతాయి. ఆ విధంగా సిరివెన్నెల కిరణాలు చంద్రుడిని, భూమిని కలిపాయి అని అద్భుతంగా రాశారు శాస్త్రి గారు. చంద్రుడికి, భూమికి మధ్య చాలా దూరం ఉంటుంది. ఆ దూరాన్ని చెరిపేసి, తన దగ్గరికి తీరమై చేరుకోమని భూమి చంద్రుడిని అడుగుతునట్టు ఉంది రెండవ వాక్యం.

చిత్రానికి వర్తించే భావం:పాట లోని సన్నివేశాలని చూస్తే, నాని, సాయి పల్లవి పాత్రలు వెన్నెల రాత్రిలో తమ భావాలని మొదటిసారి పంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా, ఆ రెండు పాత్రలను సిరివెన్నెల రాత్రి కలిపింది కాబట్టి, ఈ వాక్యాలు చిత్రంలోని సన్నివేశానికి కూడా సరిగ్గా సరిపోతాయి.

నడి రాతిలో తెరలు తెరిచి,

నది నిద్దురలో మగత మరిచి

ఉదయించినదా కులుకులొలుకు

చెలి మొదటి కలతన నవ్వులలో తలుకు తలుకు,

తన చెంపలలో చమకు చమకు,

తన మువ్వలలో ఝనకు ఝనకు సరి కొత్త కళ

ప్రకృతికి వర్తించే భావం:మగత అంటే నిద్దుర వలన వచ్చిన మత్తు అనే అర్థం వస్తుంది. చంద్రుడు ఉదయించే తీరుని వర్నిస్తునట్టుగా ఉంటాయి పైన వాక్యాలన్నీ. చీకటి రాత్రి తెరలు తెరుస్తూ, నిశ్శబ్ధంగా నిద్దురపోతునట్టు ఉన్న సముద్రం నుంచి చంద్రుడు ఉదయించే ప్రక్రియను వర్ణించారు. ఆ చంద్రుడి లో ఉండే మెరుపు, తలుకుబెలుకులని కూడా పై వాక్యాలలో వర్ణించారు.

చిత్రానికి వర్తించే భావం:అందరూ నిద్రిస్తున్న వేళ, రాత్రి సాధారణంగా ఉండే నిద్దుర మత్తుని సైతం మరిచి, సమాజపు కట్టుబాట్లు అనే చీకటి తెరలను తెరుస్తూ, కథానాయిక యొక్క కల ఉదయించింది అనే అర్థం వచ్చేటట్టు రాశారు శాస్త్రి గారు. కథానాయకుడి వైపు నుంచి కథానాయికను వర్ణించడానికి కూడా సరిగ్గా సరిపోతాయి పైన వాక్యాలు.అలాగే కల, కళ అనే రెండు పదాలను రెండు వేరు వేరు వాక్యాలలో ఎంత అద్భుతంగా అమర్చారో.

చాంగురే ఇంతటిదా నా సిరి

అన్నది ఈ శారద రాతిరి

మిలమిలా చెలి కన్నుల

తన కలలను కనుగొని అచ్చేరువున మురిసి

అయ్యహో ఎంతటిదీ సుందరి

ఎవ్వరూ రారు కదా తన సరి

సృష్టికే అద్దము చూపగా పుట్టిందేమో నారీ సుకుమారీ

ఇది నింగికి నెలకి జరిగిన పరిచయమే.

ప్రకృతికి వర్తించే భావం:ఈ భూమి, చంద్రుడిని చూసి అంటున్న మాటలు లాగా అనిపిస్తాయి పైన వాక్యాలు. శారద రాతిరి అంటే, శరద్ ఋతువు లోని రాతిరి (అంటే September to November మధ్యలో ఉండే చలి కాలంలోని రాతిరి)అని అర్థం వస్తుంది. చలి కాలం లోని ఈ భూమి మీద రాతిరి, చంద్రుడి శోభను చూసి ఆశ్చర్యపోతునట్టు ఉన్నాయి పైన వాక్యాలు.

అలాగే, రాతిరి భూమి మీద వస్తువులు కనపడటానికి చంద్రుడి వెన్నెల సహకరిస్తుంది. అంటే, భూమి మీద చీకటిలో కనే కలలు కనిపించడానికి, చంద్రుడి వెన్నెల కన్ను లాగా ఉపయోగపడుతుంది అనే భావం వచ్చేలా”మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగొని” అనే వాక్యం రాసారేమో శాస్త్రి గారు.

తనలో భాగమైన జాబిల్లిని చూసి, ఈ సృష్టి తన అందాన్ని తానే, అద్దంలో చూసుకునేటట్టుగా చేసింది సుకుమారమైన జాబిల్లి అని అర్థం చేసుకోవచ్చు. అలాగే మన మనస్సు ఎలా ఉందో మనకి జాబిల్లి అలాగే కన్పిస్తుంది “యద్భావం తద్భవతి” అనట్టు. కాబట్టి చూసేవాళ్ళకి వారి వారి భావాల ప్రతిబింబాలు అద్దంలో లాగా కనపడేటట్లు చేసింది ఆ జాబిల్లి అని కూడా అర్థం చేసుకోవచ్చు.

ఈ విధంగా, చంద్రుడి ద్వారా, నింగికి నేలకి పరిచయం జరిగింది అని రాశారు.

చిత్రానికి వర్తించే భావం:అచ్చెరవు అంటే ఆశ్చర్యం అనే అర్థం వస్తుంది.చిత్రానికి వర్తించే భావంలో, కథానాయకుడి పాత్రని రాత్రితో పోల్చుకోవచ్చు.నాని పాత్ర, సాయి పల్లవి పాత్రని కలిసినప్పుడు, తన కలలు, ఆశయాలు ఆమె కలలు ఆశయాలు ఒకటే అని తెలిసినప్పుడు తను పొందే ఆశ్చర్యాన్ని పై వాక్యాలలో వర్ణించారు. ఈ సృష్ఠికి కథానాయిక కనపడే తీరు, సృష్ఠి తనని తాను అద్దంలో చుసుకునట్టు ఉంటుందని వర్ణించారు. అలాగే కథానాయిక తీరు, స్వభావం, చూసే వాళ్ళ కళ్లని బట్టి, వారి వారి స్వభావాల బట్టి ఉంటుందని చెప్పడానికి, “సృష్టికి అద్దము చూపగా” అని రాసుంటారేమో శాస్త్రిగారు.

తెర దాటి, చెర దాటి

వెలుగు చూస్తున్న భామనిసరిసాటి,

ఎదమీటి పలకరిస్తున్న శ్యాముని

ప్రియమార గమనిస్తూ పులకరిస్తోంది యామిని

ప్రకృతికి వర్తించే భావం:భామ అంటే ఇక్కడ జాబిల్లి అనుకోవచ్చుశ్యాముడు అంటే నల్లని రంగు కలవాడు, కృష్ణుడు అని కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నల్లని చీకటి అలుముకున్న రాతిరి అనే అర్థం వచ్చేటట్టు రాసుంటారు.యామిని అంటే చుక్కలతో నిండి ఉన్న ఆకాశం.చెర అంటే ఆంక్షలతో కూడిన నిర్బంధం అనే అర్థం వస్తుంది.

మబ్బుల తెర, చెర నుంచి బయటకి వచ్చిన జాబిల్లిని, చీకటి పలకరిస్తున్నప్పుడు, చుక్కలతో నిండి ఉన్న ఆకాశం మురిసిపోతూ చూస్తూ ఉంది,అనే లోతైన భావాన్ని, కొన్ని పదాలనే ఉపయోగించి ఎంత అద్భుతంగా రాశారో శాస్తి గారు.

చిత్రానికి వర్తించే భావం:భామ అంటే కథానాయికకథానాయకుడి పేరు శ్యామ్వాళ్లిద్దరూ కలిసింది చుక్కలు నిండిన ఆకాశం కింద.సమాజపు చెరను దాటి వచ్చిన కథానాయికను, తనకి సరిసాటి అయిన కథానాయకుడు పలకరిస్తున్నప్పుడు, చుక్కలతో నిండి ఉన్న ఆకాశం చూస్తూ మురిసిపోయింది అని ఎంత గొప్పగా వర్ణించారో.

కలబోసే ఊసులే విరబూసే ఆశలై

నవరాత్రి పూసిన వేకువ రేఖలు రాసిందీ నవల

మౌనాలే మమతలై మధురాలా కవితలై

తుదిచేరని కబురుల కథకళి కదిలెను

రేపటి కథలకు మున్నుడిలా

ప్రకృతికి వర్తించే భావం:మున్నుడి అంటే ముందుమాట అనే అర్థం వస్తుంది.రాత్రి ప్రకృతిలో జరుగుతున్న ఈ ఊసుల సంభాషణ, తదుపరి వచ్చే వేకువ రేఖలను రాస్తుందని, అలాగే ఈ కబుర్లు ఆడే కథకళి మరుసటి రోజు జరిగే పరిణామాలకు ముందుమాటగా నిలుస్తాయని వర్ణించారు.

చిత్రానికి వర్తించే భావం:ఆ రాతిరి, కథానాయకుడు, కథానాయిక మాట్లాడుకున్న మాటలు, వారి కలలు, సమాజంలోని మార్పులకి నాంది పలుకుతూ, తరువాతి కాలంలో జరిగిన కథలకి (భవిష్యత్తుకి) ముందుమాటగా నిలిచాయనే అర్థం వచ్చేటట్టు ఉన్నాయి వాక్యాలు.

ఇదిలా అని ఎవరైనా చుపనేలేదు కంటికి

అదెలాగో తనకైనా తోచనేలేదు మాటకి

ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి

సంతోషం సరసన సంకోచం మెరిసినా

ఆ రెంటికీ మించిన పరవశ లీలను కాదని అనగలమా

కథ కదిలే వరసనా తమ ఎదలేం తడిసినా

గత జన్మల పొడువున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా.

ప్రకృతికి వర్తించే భావం:ఆ వెన్నెల రాత్రిని చూసేంత వరకు, ఇది ఇలా ఉంటుంది అని భూమికి, భూమి మీద ఉండే జీవరాశుల కంటికి, ఎవరు చూపలేదని, వెన్నెలకి కూడా ఇంత అందం ఎపుడూ తోచలేదని వర్ణించారు.చీకటి వలన వచ్చే సంకొచాన్ని, వెన్నల వలన వచ్చే సంతోషాన్ని మించి, మొత్తం మీద కలిగిన పరవశాన్ని ఎవ్వరూ కాదనలేరు అని వర్ణించారు. ఎన్నో కోట్ల సంవత్సరాలు, జన్మల నుంచి దాచుకున్న భావాలు ఇప్పుడే భూమికి, జాబిల్లికి పరిచయం అయ్యాయా అన్నట్టు ఉందని వర్ణించారు.

చిత్రానికి వర్తించే భావం:ఇద్దరికీ, ఇపుడిపుడే మనసైన భవిష్యత్తు దొరికిందని, ఒక పక్క సంతోషం, మరోపక్క సంకోచం ఉన్నా సరే ఇద్దరికీ కలిగిన పరవశం ముందు మిగతావి చిన్నవే అని వర్ణించారు. అలాగే బహుశా చిత్రంలో ఉండే పూర్వ జన్మ కథ గురించి చెప్తున్నట్టుగా కూడా ఉన్నాయి వాక్యాలు.

ఇంతటి లోతైన, అద్భుతమైన కొత్త భావాలు ఇకపైన శాస్త్రి గారి కలం నుంచి వినలేమని బాధపడాలో, ఆయన మనకి ఇచ్చి వెళ్లిన జ్ఞాన భాండాగారాన్ని నిరంతరంసోధిస్తూ, పాటలని స్మరిస్తూ ఆనందాలలో ఒలలాడాలో తెలియని భావోద్వేగంతో, మన అందరి తరఫున సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నమస్కారాలు తెలుపుతున్నాను.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,