Here Is All You Need To Know About ‘Sirisilla Sella’ Through The Person Who Weaved It For KCR

 

“ఒకప్పుడు సిరిసిల్ల నేతన్నకు వారానికి 1,000 రూపాయలు కూడా రాకపోయేవి, కానీ ఇప్పుడు మాత్రం ప్రతీ నేతన్న నెలకు రూ.20,000కు పైగా సంపాదిస్తున్నారు.”

 

సిరిసిల్లను పూర్వం ‘సిరిశాల’ అని పిలిచేవారు. సిరి అంటే సంపద, శాల అంటే ఇల్లు లేదంటే ప్రదేశం. వాడుకలో ఐతే పద్మశాలీలు(70% శాతానికి పైగా ఇక్కడ ఉండేవారు) ఎక్కువగా సంపాదిస్తుండడం వల్ల శాల అంటే పద్మశాలి చేనేతలు అని గర్వంగా చెప్పుకునేవారు. ఒకప్పుడు సిరి ఐతే కొన్ని దశాబ్దాల వరకు అది ఉరిసిల్లగా మారింది. కానీ ప్రస్తుతం ఆ ఊరికి మంచి రోజులు వచ్చాయి. ఎప్పటిలానే సిరిశాల అనే పేరుకు సార్ధకతను సాధించింది. సిరిసిల్ల చేనేత వస్త్రాలకు ప్రతీతి. ఇక్కడి అభివృద్ధి కూడా ఏ ఫ్యాక్టరీ వల్లనో జరగలేదు, దాని ఆత్మకు తగ్గట్టుగానే అభివృద్ధి జరిగింది. ఇక్కడ కొందరు నేతన్నలు బతుకమ్మ చీరలు నేస్తే, మరికొందరు పంచెలు, ఇతర వస్త్రాలను నేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా వాడుతున్న ‘సెల్లా’ కూడా సిరిసిల్ల నుండే వచ్చింది. ఈ సెల్లా గురించి, అలాగే ఈ సెల్లాను ముఖ్యమంత్రి గారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోటేశం గారి గురించి కాస్త తెలుసుకుందాం.


 

“నేతన్నకే కాదు ఇతర కూలి పనుల వారికి కూడా ఇక్కడ సరైన వేతనం ఇస్తారు. బయట రోజుకు రూ.230 ఇస్తే, ఇక్కడ మాత్రం రోజుకు రూ.300కు పైగా కూలీ ఇస్తారు. దానివల్ల ప్రతిరోజు వేరే ఊళ్ల నుండి ఇక్కడికి వచ్చి పనిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు”.

 

సెల్లా:
పల్లెటూళ్ళల్లో ఇప్పటికి సెల్లా ఉపయోగిస్తున్నారు. సెల్లా అసలైన తెలంగాణ పదం. భుజం మీద సెల్లా వేసుకుని అలా బయటకుపోతే అన్ని అవసరాలకు అది ఉపయోగపడుతుంది. ముఖం తుడుచుకోవడానికి, మూటలు మోయ్యవలసివస్తే వెంటనే సెల్లాను తలపాగాగా చుట్టుకుని పనిచేసేవారు, కర్చీఫ్ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చెయ్యలేదు సెల్లా ఐతే రోజులో అన్ని పనులకు వాడుకోవచ్చు. కోవిడ్19 విస్తరిస్తున్న ఈ సమయంలో ముఖానికి మాస్క్ వేసుకోవడం ముఖ్యమంత్రి గారికి కాస్త ఇబ్బందిగా ఉంది, సెల్లా ఉంటే బాగుంటుందని తెలుసుకున్న కోటేశం గారు ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ గౌరవంతో ప్రత్యేకంగా సిరిసిల్లలోనే ఓ మేలైన సెల్లాను తయారుచేసి పంపారు. కేసీఆర్ గారు కొన్ని చిన్నపాటి మార్పులు సూచించి వారికి ఇష్టమైన సెల్లాను వాడుతున్నారు. 

“సిరిసిల్లలో అభివృద్ధి కిందిస్థాయి వరకు జరుగుతుంది. నేతన్నకు ప్రతిరోజు ఎంత కూలి ఇవ్వాలి, యజమాని ఎంతవరకు ఆదాయం తీసుకోవాలి, ఎన్ని పనిగంటలు ఉండాలి, దళారి ఎంతవరకు లాభం తీసుకోవాలి.? లాంటి ముఖ్య విషయాలన్నీ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారి నుండి, అధికారుల సూచన ప్రకారం పాటిస్తారు”.

 

దేశమంతటికి మన సిరిసిల్ల సెల్లా:
అమ్మ నాన్నలతో పాటుగా నేత పని చేయడం చిన్ననాటి నుండి కోటేశం గారికి అలవడింది. ఒకప్పుడు అందరితో కష్టాలు పడ్డట్టుగానే ప్రస్తుతం అందరితో పాటుగా లాభాలు పొందుతున్నారు. ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ కొందరు చీరలు ఇతర వస్త్రాలు నేసినట్టుగా కోటేశం గారు పెద్ద ఎత్తులో సెల్లా తయారుచేస్తున్నారు. ఎనిమిది హ్యాండ్లూమ్స్ ద్వారా ప్రతిరోజు పన్నెండు వందల సెల్లాలను తయారుచేసి దేశమంతటికి సెల్లాను ఎగుమతి చేస్తున్నారు. రూ.45 దగ్గర నుండి రూ.250 వరకు గల సెల్లా ఇక్కడ తయారు అవుతుంది, ఈ సెల్లా పెట్టిన డబ్బుకు సరి సమానంగా ఉందని వ్యాపారస్తులు వినియోగదారులు గుర్తించారు. ప్రతి సంవత్సరం లక్షల్లో న్యాయంగా ఆదాయాన్ని పొందుతూ తన దగ్గర పనిచేసే నేతన్నలతో పంచుకుంటున్నారు. 

ఇలా ఉంటేనే ఫ్యాషన్ ఇలా ఉంటే కాదు అని చెప్పడానికి ఎవ్వరికీ అర్హత లేదు. ఫోటోలు తీసుకోవడం వరకే కాదు, మనం వేసుకునే బట్టలు మన శరీరానికి అందంగా ఉండడంతో పాటు ఉపయోగకరంగా ఉండాలి. ‘సెల్లా’ వేసుకునే శరీరానికి వ్యక్తిత్వానికి కొత్త గౌరవం తీసుకురాగల శక్తి దానికి ఉంది. వీలుంటే మీరు ట్రై చెయ్యండి. ‘సెల్లా, కండువా, పై పంచె’ ప్రాంతం ఏదైనా, పేరు ఏదైనా కానీ దాని ఉపయోగం, గౌరవం దానికి ఇప్పటికి అలానే ఉంది.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,