The last page in the diary of an old man – a personal note that will hit you in the feels

 

Contributed By Chandu Machineni

 

ఒక వైపు చావు ఎప్పుడు వస్తుందో తెలియదు,
ఇంకొక వైపు అరవైరెండు యేళ్ళ జ్ఞాపకాలను మర్చిపోవడం ఎలానో తెలుసుకోలేను.
బహుశా, ఇన్ని సంవత్సరాల జ్ఞాపకాలకు ముగింపు నా సమాధే అనుకుంటా..!

 

బాల్యంలోనే అమ్మా నాన్నలను కోల్పోయిన నన్ను చేరదీసి, ఎన్నో అనురాగాలు, అనుబంధాలతో పెంచారు ఊరంతా. దానికి కారణం మా అమ్మానాన్నల మంచితనమో లేక ఆనాటి మనుషుల మంచి గుణమో తెలియదు…

 

ఇరవైఒక్కేళ్ళకి పెళ్లి చేసి నాకు ఒక తోడుని, ఒక బాధ్యతని అప్పగించారు.

భానుమతి,
పేరుకి తగ్గట్లు తను కూడా చాలా అందంగా ఉండేది, అస్తమించే భానుడిలో ఉండే అందం తన ముఖచిత్రంలో కనిపిస్తూండేది.
ఒక మనిషిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు, అందులోనూ నా జన్మ నక్షత్రాలకు, నేను పుట్టిన ఘడియలకు సరైన జోడీ అని, మేము ఒకరిని ఒకరు చూసుకోకుండానే పెళ్లి చేసేసారు.

 

తనని అర్థం చేసుకోవడానికి నాకు తొమ్మిది నెలలు పట్టింది.
ఎలా అంటే తొమ్మిది నెలలు రూపం తెలియకుండా, తనను మించిన భారాన్ని మోస్తూ జన్మనిచ్చే తల్లికి బిడ్డని చూడగానే కలిగే ఆనందం కలిగింది నాకు ఆ రోజున.

అలా ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటూ, ఒకరి తప్పులని ఒకరు సరిదిద్దుకుంటూ, కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాం.

కొన్ని నెలలకు గర్భవతి అయింది తను
ఆ రోజు దేవుడి మీద కోపం వచ్చింది,
అమ్మ మీద జాలేసింది,
నా భార్యని చూసి బాధ కలిగింది.

 

ఎంత సున్నితమైనది ఆడదాని శరీరం, చెప్పులు లేకుండా నడిస్తే కందిపోయే లేత పాదాలు, ఇప్పుడు ఆ పాదాలు కూడా ఉన్నట్లుండి రెండు ప్రాణాల బరువుని మొస్తున్నాయి.

అనవసరంగా తన బాధకి కారణమయ్యానే అని నా మీద నాకే ఛీ అనిపించింది.

ఆ బరువుని కూడా
రూపంలేని గంగను మోస్తున్న రుద్రుడిలా,
అలల తాకిడికి బెదరని సంద్రంలా ఓర్పుగానే మోస్తూన్నది భానుమతి.

 

తను కాన్పు రోజన్న మాటలు ఇప్పటికీ గుర్తు వస్తున్నాయి నాకు..

” ఏమయ్యో!
ఇలారా.. ఎందుకు అలా గాబరా పడుతున్నావ్!
నువ్వు చూపించే ప్రేమ ముందు ఈ నొప్పులు చాలా చిన్నవైపోయాయి.
నా పక్కనే ఉండు, చేయి వదలకు ” అని కన్నీటిని కారుస్తూ చెప్పింది.
పుట్టిన వాడి మొహం చూడగానే, నా గుండెల్లో బాధ, నా మొహంలో భయం ఒక్కసారిగా పరారయ్యాయి.

 

చూస్తుండగానే వాడు పెద్దోడై పట్టణంలో చదువులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు.
పట్టణంలో నీరు ఒంటపట్టలేదో లేక తిండి ఒంటపట్టలేదో తెలియదు కానీ, వాడు ఇంటికి వచ్చిన తెల్లారికే
” మరో కొన్ని రోజుల్లో మంచి ఉద్యోగం వస్తుంది, అది చేస్తున్న కొన్నాళ్లకే పొరుగు దేశానికెళ్ళి డబ్బు బాగా సంపాదించి స్థిర పడిపోవచ్చు ” అని ఏవేవో అంటున్నాడు.
నాకేమీ అర్ధమవ్వట్లేదు కానీ, కొడుకు మాటలకి వాడు ఒక గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు అనే అనుభూతిలో ఉండిపోయింది భానుమతి.
నేను వాడి మాటలకు అడ్డు చెబుతూ ” ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేసి నీ కష్టానికి ఫలితం ఇక్కడే అనుభవించు ” అని చెప్పాను.
” ఇక్కడ పడే ఆ కష్టానికి ఆ దేశంలో ఫలితం అరవై రెట్లు ఎక్కువుంటుంది నాన్న ” అని అన్నాడు.
కన్న తండ్రి మాటల్లో స్వార్థం అక్కడున్న వాళ్లేవరికి అర్థం కాలేదు, చివరికి వాడి తల్లికి కూడా.!!
వెళ్లొద్దు అని అడ్డుగా ఎన్ని మాటలు చెప్పినా వాడికి నా బాధలో ఉన్న ప్రేమ అర్థం కాలేదు, వాడిని ఏమార్చిన ధనవిలువ ముందు.

 

” అమ్మా, ఆయనకి ఎంత చెప్పినా అర్థం కాదు, చదువుకుంటే అర్థమయ్యేదేమో నా మాటల విలువ, నువ్వు నాతో రా, నాకు తోడుగా ఉండు, నిన్ను సుఖంగా, ఏ కష్టం రాకుండా చూసుకుంటా అంటున్నాడు, ” కొడుకు.

” బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో చదువు ఒకటి.
చదువుకొని మనం జ్ఞానం పొందకపోయినా పర్లేదు కానీ అజ్ఞానంగా, సంస్కారం లేని వాడిగా ప్రవర్తిస్తే మనిషిగా నీ అర్హత కోల్పోయినట్లే.”

 

ఆ రోజు అర్థమైంది. చదువు విలువ, అది నేర్పే పాఠాలు, మనం నేర్చుకునే గుణపాఠాల విలువ.

” వాడికి రాత రాయడం నేర్పినందుకేమో! మా ఇద్దరి తలరాతలు మార్చేసి తనని నా నుంచి దూరంగా తీసుకెళ్తున్నాడు. ”
మా ఇద్దరిని వీడు ఇలా దూరం చేస్తాడు అని తెలిస్తే, వీడిని ఈ భూమి మీద అడుగు పెట్టనిచ్చే వాళ్ళమే కాదు, తనని ఆ తొమ్మిది నెలలు బరువు మోయించే వాడిని కాదు.

 

భానుమతి కూడా బయలుదేరి పోయింది. నన్ను వదిలి, వాడితో కలిసి వెళ్ళడానికి బహుశా, తను మోసి కన్న రక్తపుముద్ద కదా, దూరమవుతుంటే భారమనిపించిందేమో!!
అయినా తన తప్పేముందిలే, ఆ గర్భం ఏదో, నేను మోసినా అలానే వాడి వెనుక వెళ్ళే వాడిని కావొచ్చు…

 

మూటాముల్లే సర్దుకుని గడప దాటి వెనక్కి తిరిగి చూసింది. కన్న కొడుకు ప్రేమ ముందు, నా ప్రేమ కనిపించలేదేమో
వాకిలి దాటి ఇక వెనక్కి తిరిగి చూడలేదు.

” తను నాకు దూరం అవుతున్న కొద్దీ,
తన జ్ఞాపకాలతో నేను దగ్గరవుతున్నా,
నీ రూపురేఖలను స్మరించుకునే నాకు తెలుసు
నువ్వు నా చెంతకొస్తావని,
మబ్బుల చాటున తొంగి చూస్తున్న జాబిలమ్మలా, నాకోసం నువ్వు ఎదురు చూస్తుంటావ్ అని నాకు తెలుసు,
కానీ తన జీవితానికి నేను నిశీధిలా కనిపించానేమో, ” నన్ను వదిలి వెళ్లింది.

 

తను మాత్రం నాకెప్పటికి నిశీధి వెలుతురులో కనిపించే తారే!
తోక చుక్కలా జారిపోకుండా,
ధ్రువపు చుక్కలా స్థిరంగా కలకాలం నా మనసులో ఉండిపోయింది.

 

••••••••••••••

తన జ్ఞాపకాలతో ఈ మధ్యే షష్ఠి పూర్తి కూడా జరుపుకున్నా.
ఎక్కడుందో తెలియదు, ఉత్తరం రాసి బాగోగులు తెలుసుకుందాం అంటే చిరునామా తెలియదు.
భానుమతి కి నేను గుర్తున్నానా?
అసలు ఆ రోజు నా ఇంట్లో నుంచి నన్ను వదిలి వెళ్ళిపోయింది తనేనా!!
కాన్పు రోజు నా చెయ్యి పట్టుకుని, నా పక్కనే ఉండు అన్నది తనేనా?

 

ఇప్పుడు తను ఎలా ఉందో, ఎంత కష్టపడుతోందో, ఒంటరిగా ఉంటున్న నాకోసం తోడుగా రావాలని ప్రయత్నించిందేమో, నా చేయి పట్టుకొని చివరి రోజులు గడపాలని అనుకుని ఉండొచ్చు, కానీ తన పరిస్థితులు ఎలా ఉన్నాయో.!!
ఇలా తన గురించి తలుచుకుంటూ గడుపుతున్న క్షణాలే, నా ఈ జీవితపు చివరి ఘడియలు.
నా జ్ఞాపకాలకు రూపం ఇస్తూ, అక్షరాలకు ప్రాణం పోస్తున్న ఈ కలానికి కూడా బాధ కలిగిందేమో సరిగా రాయలేకపోతుంది.

 

తను వెళ్ళిపోయాక పరిచయమైన డైరీయే ఇన్ని సంవత్సరాల జ్ఞాపకాల్ని మోస్తూ నా బాధని పంచుకున్నది.

సిరా అయిపోయింది కలంలో,
చప్పుడు ఆగిపోయింది నా హృదయంలో.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,