The Journey Of This Differently-Abled Voice Artist From Khammam Is Next Level Inspirational!

పద్మావతి గారికి ఊహ తెలిసినప్పటి నుండి తన శరీర బరువును తన కాళ్ళతో మోయలేదు, సుమారు సంవత్సరం వయసున్నప్పుడే పోలియో రావడంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో తనని పోషించే స్థోమత లేక అత్యంత బాధాకర సందర్భంలో ఖమ్మంలోని పోలియో పునరావాస కేంద్రానికి దత్తత ఇచ్చారు, కనీసం అక్కడైన సరైన వైద్యం, శిక్షణ లభిస్తుందన్న ఆశతో. “పై చదువుల కోసం వేరే ఊరికి వెళ్తేనే మనం బాధపడతాం, కాని తను మాత్రం కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే ఒక పక్క శారీరక లోపం, మరోపక్క తనని అమితంగా ప్రేమించే అమ్మ నాన్నల నుండి దూరమయ్యే సరికి పద్మావతి గారు అంతటి చిన్న వయసులో విపరీతమైన బాధను అనుభవించారు. శరీరంలో చాలా వరకు పోలియో వ్యాధి నాశనం చేయడంతో పద్మావతి గారికి చిన్నతనంలో 8ఆపరేషన్లు చేశారు. ఈ కష్టతర కాలాన్ని దాటడం వల్ల నాలుగు గోడల మధ్య ఉన్న మంచం నుండి లేచి వీల్ చేయిర్ కి మారేంతటి శక్తిని సంపాదించుకున్నారు.

“మన లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే మనం అంత ఎత్తుకు ఎదుగుతాం” అని పద్మావతి గారు మొదటి నుండి బలంగా నమ్మేవారు. అందుకు తగ్గట్టుగా మొదట డాక్టర్ (లేదా) సైంటిస్ట్ అవ్వాలని కలలు కన్నారు అందుకోసం ఉన్నత మార్కులతో పాస్ ఐనా కూడా వికలాంగురాలు అని మెడికల్ కాలేజిలో సీట్ ఇవ్వనన్నారట. ఈ విషయం తనని విపరీతంగా కుంగదీసింది. “నేను కలలు కన్న లక్ష్యాన్ని సాధించలేనందుకు ఈ జన్మ ఎందుకు.?” అని విలపించినా గాని అక్కడితో ఆగిపోకుండా తన గమ్య ప్రయాణాన్ని మార్చుకున్నారు. పద్మావతి గారికి చిన్నతనం నుండి పాటలు పాడడం హాబీగా ఉండేది తర్వాత ఆ హాబినే తన కెరీర్ గా ఎంచుకున్నారు. గాయనిగా మాత్రమే కాకుండా రంగస్థల నటిగా కూడా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. ఒక్క ఖమ్మంలో మాత్రమే కాదు రాష్ట్రస్థాయిలో, దేశ స్థాయిలో ఎన్నో అవార్ఢులు అందుకున్నారు.


అలా నటిగా, గాయనిగా మనదేశంలోని 18 రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చారు. వైకల్యం ఉన్న కాని ఇంతలా ప్రతిభను ప్రదర్శిస్తున్న పద్మావతి గారిని గౌరవించాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వికలాంగులలో విశిష్ట వ్యక్తులకు ఇచ్చే పురస్కారాలతో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రెండుసార్లు (Best Creative Individual with Disabilities, Jhansi LakshmiBai) అవార్ఢులను అందించారు. మనం పైకి ఎదిగితే సరిపోదు, మనలాంటి వారిని కూడా పైకి తీసుకురావాలి అని సంకల్పంతో ఇప్పటికి ఎంతోమంది వికలాంగులకి సంగీతం, కంప్యూటర్, టైలరింగ్ లో శిక్షణ అందిస్తూ వారిని ఇంకొకరి దయాదక్షిణ్యాల మీద బ్రతకకుండా ఒక దారిని చూపిస్తున్నారు. ప్రస్తుతం పద్మావతి గారు తెలుగు సినిమా సెన్సార్ బోర్డు సభ్యులుగా పనిచేస్తున్నారు.


అదృష్టమే విజయానికి కారణం అని బలంగా భ్రమపడి ఈ వైకల్యంతో ఏమి సాధించలేమని స్టీఫెన్ హాకింగ్, లూయీ బ్రెయిలీ లాంటి మహానుబావులు అనుకునేదుంటే రోడ్డు పక్కన భిక్షవానిలా బ్రతికే వారు. ఒక్క స్టీఫెన్ హాకింగ్, లూయీ బ్రెయిలీ మాత్రమే కాదు నిన్నటి ఒలంపిక్స్ లో మనదేశం తరుపున మెడల్స్ సాధించిన మరియప్పన్, దీపా మాలిక్ లాంటి ఎందరో వ్యక్తులు తమలో శారీరక లోపం ఉన్నా తాము ఉహించిన దాని కన్నా ఎక్కువ ఎదిగారు.. వారి లక్ష్యానికి లోపం అడ్డుగా ఉంటే ధృడ సంకల్పంతో, ధైర్యంగా లక్ష్యాన్ని ఛేదించారు. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉన్నట్టే ఏదైన ఒక లోపం కూడా ఉంటుంది.. అది శారీరకంగా గాని, మానసికంగా గాని, ఆర్ధికంగా కాని, మరేదైనా కావచ్చు.. ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను ఒదిలేసి అక్కడే గతాన్ని, తమ లోపాలను తలుచుకుంటు ఏడుస్తు కూర్చుంటే మనం బ్రతికున్నప్పుడే మన సమాధిని నిర్మించుకుని దాని పక్కనే జీవితం గడపటం లాగా ఉంటుంది. “విత్తనమంత చిన్న ఆలోచన మనలో పాతి దానికి నిరంతరం శ్రమ అనే నీటిని అందిస్తే అదే నిదానంగా మనలో సమూల మార్పులను తీసుకువస్తుంది.. ఆ మార్పే పదిమందికి ఉపయోగపడే చెట్టులా మనల్ని మారుస్తుంది”.



If you wish to contribute, mail us at admin@chaibisket.com