This Hanumakonda Temple Is A Must Visit For Those Who’d Love To Get Lost Spirtually

 

Contributed by Aravind Arya

 

కాలుడు అంటే యముడు. ఆయన పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమ గల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అలాంటి విశిష్టత కలిగిన దేవాలయమే హన్మకొండలోని సిద్ధ భైరవాలయం. – 

ఎక్కడ ఉంది ? :

హనుమకొండ బస్ స్టేషన్ నుంచి పద్మాక్షి గుట్ట వెళ్లే దారిలో ఎడమ వైపు ఒక 200 మీటర్లు ప్రయాణిస్తే సిద్ధేశ్వర ఆలయం వస్తుంది. ఆ ఆలయం పక్కన ఉన్న గుట్టే ఈ సిద్ధులగుట్ట. పేరు ఎలా వచ్చింది ? : పూర్వం సిద్ధులు ఈ గుట్టమీద తపస్సు చేసుకునేవారట. శివ పూజే పరమావధిగా జీవించేవారట. వాళ్ల కోరిక మేరకు స్వామి సిద్ధ భైరవుడుగా వెలశాడంటారు. వారు నివసించిన ఆ గుట్ట సిద్ధుల గుట్టగా పేరు పొందింది. సిద్ధులు తపమాచరించిన కారణంగా ఈ గుట్టకు సిద్ధులగుట్ట అనే పేరు వచ్చింది. సిద్ధులు పూజించిన కారణంగా ఇక్కడి స్వామిని సిద్ధి భైరవ స్వామిగా కొలుస్తుంటారు. 

దిగంబరునిగా:

ఆలయంలో భైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. స్వామివారి మూలవిగ్రహం ఎప్పుడు వెలిసిందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లేవు. జైనమతం ప్రాచుర్యంలో ఉన్న సమయంలో ఆలయం నిర్మించడం వల్ల స్వామి దిగంబరునిగా దర్శనమిస్తాడని అంటారు. కానీ పురాణాతిహాసాల్లోనూ శ్రీ కాలభైరవుడిని దిగంబరుడిగానే పేర్కొనడం జరుగుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదని చెప్తున్నారు. గతంలో ఇక్కడ అనేక మంది తపస్సు చేసుకున్నారడానికి వీలుగా ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. ఎక్కడ చూసినా శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది భైరవ విగ్రహాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. కాకతీయుల కాలంలో ఈ గుట్ట మీది నుంచి భద్రకాళి ఆలయానికి సొరంగ మార్గం ద్వారా ప్రయా ణించేవారట. ఇప్పటికీ ఆ సొరంగాల ఆనవాళ్లు కనిపిస్తాయి. 

దినదినాభివృద్ధి:

గతంలో గుట్టపైకి వెళ్ళడానికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు . 10 యేండ్ల క్రితం గుట్ట కింది భాగం నుంచి పైకి మెట్లదారి నిర్మించటంతో గుట్ట పైవరకు భక్తులు నేరుగా వెళ్లే సౌకర్యం కలిగింది. పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుంచి భైరవుడిని దర్శించుకొనేందుకు భక్తులు గుహలోంచి వెళ్లేదారి చూడముచ్చటగా ఉంటుంది. గుహలో ఉన్న భైరవుడి విగ్రహం చుట్టూ ఇటీవలే గ్రానైట్, మార్బుల్స్‌తో తీర్చిదిద్దారు. దైవదర్శనం చేసుకొని గుట్టలోని గుహల మధ్య కూర్చొని సందడి చేస్తారు. ఎయిర్ కండీషన్(ఏసీ)ని మించిన చల్లని గాలి రావడం తో అనేక మంది ఇక్కడి గుహల్లో సేద తీరేందుకు ఆసక్తి చూపుతారు. గుట్ట పై నుంచి పరిసర అందాలు చూడ ముచ్చటగా కనిపిస్తాయి. దీంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. ప్రతీ శుక్రవారం ఇక్కడ దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

గుట్టపైన తాగునీటి సౌకర్యం లేనందున ఇబ్బందులు పడక తప్పదు. చారిత్రక నేపథ్యం సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు. ఈ భైరవావతారానికి గల ఒక కారణం ఉంది. ఒకానొక సందర్భంలో బ్రహ్మ, విష్ణువు మధ్య వివాదం తలెత్తింది. విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? అనేది ఆ వివాదం. మహర్షులు సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తేల్చడానికి వీలుకానిది. మీరిద్దరూ ఆ శక్తి విభూతి నుంచే ఏర్పడిన వారే అన్నారు. పరతత్వం మరెవరోకాదు, నేనే అని బ్రహ్మ అహం ప్రదర్శించాడు. అప్పుడు పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడట. భైరవుని రూపంసాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. 

నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తిమంతుడు రక్షాదక్షుడు ఈ కాల భైరవుడు. కాలభైరవుని క్షేత్రపాలక అని కూడా అంటారు. గుట్టపైకి ఇలా చేరుకోవచ్చు: పద్మాక్షి గుట్ట పక్క నుంచి ఉన్న రోడ్డు ద్వారా, సిద్ధేశ్వర ఆలయం పక్క నుంచి వస్తే గుట్ట కనపడుతుంది. కింది నుంచి మెట్లదారి మీదుగా గుట్టపైకి చేరుకొనేందుకు మార్గాలు ఉన్నాయి. బస్టాండ్ సమీపం నుంచి ఆటోల ద్వారా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు వాహనాలలో సైతం గుట్ట వద్దకు రావచ్చు.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,