ఒక రచయిత్రి ప్రస్థానం – A Short Poem On The Journey Of A Writer.

 

Contributed By Sai Ram Nedunuri

సూక్ష్మ పరిశీలనా తత్వంతో
పదాల మధ్య తన అస్తిత్వంతో
పరమార్థానికై నిరంతర శోధనతో
అనుక్షణం జ్ఞాన దాహంతో

నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను

 

సమాజపు సంకెళ్ళు తెంచుకుంటూ
వెక్కిరింపుల వనవాసాన్ని తట్టుకుంటూ
తనకి ఇష్టమైన దారిని ఎంచుకుంటూ
సాహితీ హృదయుల పట్టాభిషేకం అందుకుంటూ

నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను

ఏకాగ్రతని నిప్పుల కొలిమిగా మార్చి
ఇనుమంటి ఆలోచనలని అందులో కాల్చి
తను పంచాలనుకున్న భావాలుగా మలచి
రచనా ప్రపంచానికి ప్రతినిధిగా నిలిచి

నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను

 

ప్రసంశలకి పొంగిపోకుండా
విమర్శలకి విసిగిపోకుండా
అహంభావం దరి చేరనీయకుండా
ఏనాడూ అలసిపోకుండా

నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను

వేల భావాలతో సహవాసం చేస్తూ
వాటిని ప్రపంచానికి పంచాలని తపిస్తూ
కృంగదీసే జడత్వాన్ని గెలుస్తూ
నిత్యం ఈ విశ్వంలో ధ్వనిస్తూ

 

నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను
అనిర్వచనీయమైన ఆనందంలో ఓలలాడుతోంది తను

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , ,