All You Need To Know About Rapella Satyam – The Man Behind Wheat Grass Juice!

 

ఇది పది సంవత్సరాల క్రితం నాటి కథ.. రాపెల్లి సత్యం గారు తన తండ్రి నుండి లభించిన ఏడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తుండేవారు. ఇప్పుడంటే టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చింది కాని 10 సంవత్సరాల క్రితం అలా లేదు. నీటి సమస్యలు, ఆర్ధిక సమస్యలు, పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో చేస్తున్న వ్యవసాయంలో విపరీతమైన నష్టాలు సంభవించాయి. ఇలా వ్యవసాయాన్నే ఆధారం చేసుకుని బ్రతుకుదామనుకుంటే బ్రతుకే ఉండదని నమ్మి హైదరాబాద్ కు వచ్చి తనకెంతో ఇష్టమైన సినిమా ప్రపంచంలో అవకాశాల కోసం పోరాటం ప్రారంభించారు.


వ్యవసాయంలో కన్నా ఇండస్ట్రీలో అవకాశాల కోసమే సత్యం గారు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇంటి దగ్గర ఉంటే పండించిన పంట నుండే ఆహారం వచ్చేది ఇండస్ట్రీలో మాత్రం ఒక్క పూట భోజనానికి రెండు రోజులు ఎదురుచూడాల్సి వచ్చేది. ఇంటి దగ్గర ఉంటే పచ్చని పైరు తల్లి గాలి లాలి పాడేది ఇక్కడ మాత్రం వసతి లేక రోడ్డు పక్కన, రైల్వే స్టేషన్ లో పడుకుంటూ అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కున్నారు. 6 నెలల తర్వాత సత్యం గారికి సత్యం భోదపడింది.. వ్యవసాయంలో లా ఇక్కడ కూడా ఆశించిన సక్సెస్ దొరకదు అని. సరిగ్గా చూడాలే గాని ఒక్క దారి మూసుకుంటే మరో దారి కాదు లక్ష దారులు తెరుచుకుంటాయి. సత్యం గారి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది.


రోడ్డు మీద అలా తిరుగుతూ ఉండగా అమెరికాలో నివసిస్తూ సెలవుల కోసం హైదరాబాద్ కు వచ్చిన చిన్ననాటి మిత్రుడు అనిల్ సత్యం గారిని చూసి పలుకరించి కార్లో కూర్చోబెట్టుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. అనిల్ గారు స్వతహాగ డాక్టర్, ఇంకా మన భారతీయ రైతుల సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. “అందరూ చేసే వృత్తిలో కంపిటీషన్ తో పాటు, సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, నువ్వు గోధుమ గడ్డి జ్యూస్ తయారుచేసి చూడు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అమెరికాతో సహా ప్రపంచంలో చాలా దేశాలలో దీనికి మంచి గుర్తింపు ఉంది ఇప్పుడుప్పుడే ఇండియాలో కూడా తెలుస్తుంది నువ్వు ఈ గ్రాస్ జ్యూస్ తయారుచేయడం ప్రారంభించు” అని చెప్పారట.


 


అలా సత్యం గారు 2008 డిసెంబర్ 3న “వీట్ గ్రాస్ జ్యూస్” అమ్మడం మొదలుపెట్టారు. మొదట దీనిపై ప్రజలలో పూర్తి అవగాహన లేకపోవడంతో ఈ జ్యూస్ తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపలేదు. కాని ఇది క్యాన్సర్ వ్యాధి రాకుండా నివారించడం దగ్గరి నుండి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచడం, అందాన్ని పెంచడం లాంటి వాటికోసం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలియడంతో ప్రత్యేకంగా కే.బి.ఆర్ పార్క్ కు వచ్చి మరి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.


ఇక సత్యం గారి “వీట్ గ్రాస్ జ్యూస్” కి అక్కినేని వారి కుటుంబం దగ్గరి నుండి చిరంజీవి కుటుంబం ఇంకా రాజకీయ నాయకులు, సామాన్యులు ఎంతోమంది అభిమానులున్నారు. సత్యం గారు హైదరాబాద్ శివారు ప్రాంతంలో 120 గజాల స్థలంలో ఓ ఫామ్ ని నిర్మించి, ప్రతి రోజు ఐదు కేజిల గోధుమ గడ్డిని పండిస్తున్నారు. ప్రతిరోజు 1,000 మందికి ప్రత్యక్షంగా, హోమ్ డెలివరి కూడా చేస్తుంటారు. ఇంతకు ముందు పూట భోజనం కోసం రెండురోజులు ఎదురుచూసిన సత్యం గారు ఇప్పుడు మరో 20 మందికి ఉపాధిని అందించే స్థాయికి ఎదిగారు. ఇంతకు ముందు అవకాశాల కోసం ఏ ఆఫీసల చుట్టూ తిరిగారో ఇప్పుడు వారే సత్యం గారికి వినియోగదారులైనారు. ఇదే కదా నిజమైన విజయం అంటే.. మన పోరాటంలో నిజాయితీ, సరైన ప్రణాలికలు ఉంటే జీవితం మనకు అన్నీ ఇస్తుంది.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , ,