గెలుపు అనే లక్ష్యం వైపుకు ప్రయాణిస్తున్న బాటసారుల కోసం – A Short Note

 

ఎలా ఉన్నావు నేస్తం..కాలం పరుగులు తీస్తూ వేగంగా వెళుతుంది,నీ కథ మాత్రం ఏ కదలిక లేకుండా అక్కడే ఆగిపోయింది అనే భాదతో ఉన్నావా??
నిమిష నిమిషానికీ నీకో పరీక్ష పెడుతూ రోజులు భారంగా గడుస్తుంటే రేపు ఎలా ఉంటుందో అనే భయంతో ఉన్నావా??
అందరిలా నువు లేవనీ,నువు కోరుకున్నది ఇంకా అందుకోలేదనీ నిరాశతో,నైరాశ్యంతో ఉన్నావా??
గత కాలపు గాయాల బందీఖానాలో చిక్కుకొని నిస్సహాయతతో ఉన్నావా??
ఉన్నావుగా..గాయాల్నితట్టుకుంటూ…ఉన్నావుగా…వేదనలన్నీ భరిస్తూ…ఉన్నావుగా…

 

సుదూర తీరం ఈదాలనే నీ లక్ష్యం ముందు ఇవన్నీ ఎంత చిన్నవి కదా
సుధీర్ఘ ప్రయాణం చేయాలనుకునే నీ సంకల్పం ముందు ఈ పరీక్షలన్నీ ఎంత ?
రోజుకో సవాలును అతి సులువుగా ఛేదించే నిన్ను ఏ బాధ కుంగదీస్తుందోయ్
పూటకో పరాజయం పలకరిస్తున్నా,వెనుదిరగని నీ ధైర్యాన్ని ఏ నైరాశ్యం లొంగదీస్తుందోయ్
వందలోమందలో ఒకడిగా కాకుండా ఓ శిఖరం అధిరోహించాలని ముళ్ళ బాట ఎంచుకున్న సాహసికుడువి నువ్వు,నిన్ను వెనక్కి నెట్టగలవా ఈ కష్టాలు?

 

నీకు గుర్తుందా,నువు నీ ప్రయాణం మొదలు పెట్టిన రోజున ఎంతటి విశ్వాసంతో ఉండేవాడివో,
ఊహించావా నేస్తం ఇంతటి కఠిన పరీక్షల్ని ఎదుర్కుంటావని,ఎదురు నిలిస్తావనీ, ప్రతికూలతల్ని ఎదురిస్తావని?
ఈ గాయాలు నీకేన్ని గుణపాఠాలు నేర్పాయో కదా
నువ్వే సైన్యంలా మారి ఓ యుద్ధమే చేస్తున్నావే.. నిన్నా భయపెడుతున్నాయి ఈ చిన్న చిన్న ఆడ్డంకులు ఆటంకాలు ఆటుపొట్లూ
అసలెవరన్నారు మిత్రమా నువ్వు పరాజితుడివి అని ,సాధకుడివి నువు,కార్య సాధకుడివి, ఎవరెన్ని అన్నా,ఎదురేమున్నా,దృష్టి మరల్చక ముందుకు పోతున్నావు,దారి మార్చకుండా సాగిపోతున్నావు నిన్ను అనేది ఎవరూ?? నిన్ను ఆపేది ఎవరూ?

 

ఒంటరిగా మైళ్ళ దూరం నడిచొచ్చావు..ఆ అడుగులనడుగు వెనక్కి రాకు,ముందుకు సాగిపో అని చెబుతున్నాయి
నీ గుండె సడిని అడుగు నువ్వేంతటి ధృడ సంకల్పం ఉన్నవాడివో చెబుతాయి
నీ నిశ్శబ్దాన్ని అడుగు,నీ మౌనాన్ని అడుగు,నీ వేదనని అడుగు…ఒకటే జవాబు వినిపిస్తుంది….ఏదేమైనా నువు ముందుకు సాగిపో అని,ఎదురేమున్నా వెనకడుగు వేయొద్దు అనీ,ఎందాకైనా ఎన్నాళ్ళైనా పోరాడుతూనే ఉండూ అని,నువు చేసేది ఒక యుద్దమనీ,నువ్వే వీరుడివీ అని ముక్త కంఠంతో చెబుతున్నాయవి
నీది పరాభవం కాదు అవన్నీ అనుభవాలే,రేపటి రోజున ఎందరికో స్పూర్తి నింపుతాయవి
ప్రతి నిత్యం నీతో నువు చేసే సంఘర్షణ ఎందరికో ప్రేరణగా మిగులుతుంది
ఇన్నిటికి ఎదురు నిలిచిన నీకోసం విధి ఏ నిధిని దాచిందో
ఎన్నిటినో మౌనంగా భరించిన నీ గెలుపు తాలూకా జయా ద్వాణాలు దిక్కులు పిక్కటిళ్లెలా వినిపిస్తావు

 

నువ్వు ఒంటరివి కాదు మిత్రమా…నేనూ నీబోటి వాడ్నే…ఓ ఎడారిలో నువ్వున్నావు…ఓ సముద్రం నేనీదుతున్నాను……..
నన్ను నమ్ము నేస్తం…నిన్నటి రోజు గడిచిపోయింది..నేడూ అంతే…కానీ రేపటి రోజు నీదీ…నాదే….విశాల విశ్వం మనల్ని ఆహ్వానిస్తుంది…ప్రపంచం పరాక్రమించు నన్ను అని పిలుస్తుంది….మనలాంటి వీరులకి కాక ఇంకెవరికి సాధ్యం మిత్రమా..పద…
రారా జగతిని జయించుదాం

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,