ప్రయత్నం – This Short Story Tells You That Trying Is More Important Than Succeeding In Life.

మనందరికి చాలా  ఆలోచనలు  ఉంటాయి  , అలానే  నాకు  ఒక  చిన్ని కేఫ్ పెట్టాలని కోరిక . 9-5 మనతో  కష్టం అని ఎప్పుడో అర్ధమయింది. 90 % ఆలోచనలు  గమ్యం  దాకా  చేరవు  అనేది  వాస్తవం  కానీ  ఎందుకు  ? భయమా ? బద్దకమా? ఊహల  దగ్గరే  చనిపోయిన  కలలు  ఎన్నో నాది వాటిలో  ఒకటేనా  ? కేఫ్  పెట్టేంత  డబ్బు   లేదు  , పెట్టాలన్న  ఆలోచన  తప్ప.దారి  తెలీదు  కానీ  వెళ్లాల్సిన  గమ్యం  మాత్రం  తెలుసు .సమాజం  వంటలోడు  అంటారు . కాంపిటీషన్  ఎక్కువ  , పెట్టుబడి  లేదు  , ఎం ఉంది  మరి  పిచ్చి  పిచ్చి  రెసిపిలా? అసలా  ఇవన్నీ  పక్కన  పెడితే  ముందు  ఇంట్లో  వాళ్ళు  ఒప్పుకోవాలి  కదా  ? ఇంకోక సంవత్సరం లో  ఇంజనీరింగ్  అయిపోతుంది.

పైకి ఇలా కనిపిస్తాం కానీ మనలో చాలా భయాలు ఒక పెద్ద టెంట్ ఏస్కోని కూర్చుంటాయి మన లోపల. చిన్నప్పుడు  ఎవరు ఎం అనుకుంటారు అనే ఆలోచన ఉండదు. నాకు కావాలంటే అడుగుతా  , కోపడతా , అవసరం అయినా గోల గోల చేస్తా , నాకు కావాలి అంటే కావాలి అంతే. అది మన చేతికి వచ్చాక వచ్చే సంతోషం వేరే లెవెల్. చిన్నపూడి చేతికి అమ్మ నాన్న సంకెళ్లు వేసిన మనసు మాత్రం ఎపుడు స్వేచగానే ఉండేది , అదేంటో పెద్దగా అయ్యే కొద్దీ చేతికి ఉన్న సంకెళ్లు పోయిన , మనం సంపాదించినా సరే మనసుకు తెలీకుండానే ఎక్కడో సంకెళ్లు పడిపోయాయి. ఏది చేయాలన్న భయం , ఎవరు ఎం అనుకుంటారనే ఆలోచన. ఊహల దగ్గరే  చనిపోయిన కలలు ఎన్నో.

ఇంజనీరింగ్ అయిపోయింది , జీవితం గురించి తెలిసిందే కదా ! బాధ్యతల పేరుతో అదే సాఫ్ట్వేర్ ఉద్యోగం భుజాన వేసింది. చేసే పని ఇష్టం లేదు కానీ తప్పలేదు. అసలా  నేనొకడినేనా , లేకపోతే  నాలాంటి  వాళ్ళు  ఉన్నారా  అని  చుట్టూ  పక్కన  వాళ్ళని  అడిగాను  . ఇంచుమించు  100 లో  50 మంది  కలలు  చంపుకుని  వచ్చిన వాళ్లే ఇంకో  50 మంది  పెద్ద  ఆలోచన లేక  ఏదోటి  చేయాలి  కాబట్టి దింట్లోకి  వచ్చామని  చెప్పిన  వాళ్లే  , బహుశా  అన్ని  సాఫ్ట్వేర్  కంపెనీస్  చనిపోయిన  కలల్ని  దాచుకునే  స్మశానం ఏమో . అప్పుడు కలిసింది  నా  ఫ్రెండ్  నిత్య  , తను నేను  ఇంజనీరింగ్  లో  చాలా  ఆశలు  , ఆలోచనలు  గురించి  మాట్లాడుకునే వాళ్ళము  , ఒక  పెద్ద  డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తనది. బహుశా  అవన్నీ మర్చిపోయి  ఎక్కడో  ఉద్యోగమో  పెళ్లో చేసుకొని ఉంటది అనుకున్నా. ఆశ్చర్యం ఏంటంటే ఆ సుడిగుండాల్లో పడకుండా తను ఒక సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంది. జీతం తక్కువే పైగా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు , చుట్టాలు పెళ్లి పెళ్లి అని సావా గొడుతున్నారంట. ఇన్ని ఉండగా ఎందుకు వెళ్ళావ్ సినిమా ప్రపంచం లోకి అని అడిగితే ఒకటే అంది

” నేను నమ్మిన ప్రపంచం లో ఓడిపోయినా పర్లేదు , ప్రయత్నించాను , ప్రయత్నించి ఓడిపోయా అని నా మనసుకి నేను సమాధానం చెప్పుకోవచ్చు. ఒక 10  సంవత్సరాల తర్వాత అరె చేసి ఉంటె బాగుండే అనే ఆలోచన కన్నా , ప్రయత్నించాను కానీ కుదరలేదు అని చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఈరోజు మనం కోరుకుంటున్న డబ్బు , ఒక 2 -3 సంవత్సరాల తర్వాత అయినా కచ్చితంగా వస్తుంది, కానీ నీ కల కోసం ఇప్పుడు ప్రయత్నించక పోతే ఇంకెప్పటికీ ప్రయత్నించలేవు.

నా జీవితాన్ని బ్రతకాల్సింది నేనే కదా  , ఇంకా చుట్టాలు అంటావా అలిసిపోయే వరకు మొరుగుతారు. నేను చేసేది మంచికే అని నమ్మకం పోయే రోజు వరకు ఓడిపోయినా గెలిచినా ప్రయత్నిస్తూనే ఉంటాను”

అలా చెప్పి వెళ్ళిపోయాక ఒక్క క్షణం భయం వేసింది , నా కల నాతోనే చనిపోతుందా? అసలా ఎంత వరకు ట్రై చేశాను ?ఇంకా ఇలా కాదు అని ఒక వంటల యూట్యూబ్  ఛానల్ ఓపెన్ చేశాను. 10 – 15  వీడియోస్ అయ్యాక మెల్లగా పేరు వచ్చింది. చేసే వంటలు కొంచెం కొత్తగా ఉండడం తో ఒకటి రెండు బాగా వైరల్ అయ్యి డబ్బులు కూడా వచ్చాయి. నా కల సాదించేసినట్టేనా ? జాబ్ చేస్తూ అలానే వీడియోస్ చేస్తున్నా,చేస్తున్నప్పుడు ఆనందంగానే ఉంది కానీ ఏదో తెలియని అసంతృప్తి.సినిమా అయినా , వంట అయినా , ఏ కళ అయినా అది నలుగురికి చేరి , వాళ్ళ కళ్ళలో కానీ మాటల్లో కానీ ఆనందం చూస్తే మనకి ఆనందం. నేను వండాలనుకున్నది డబ్బుల కోసం కాదు , నాకంటూ ఒక కేఫ్ , నేను చేసిన వంట తిన్నాక జనాల కళ్ళలో చూడాలనుకున్న సంతృప్తి కదా.

మనసేం బాలేదు, ఎప్పటిలానే ఆఫీస్ కి సెలవు పెట్టేసి , నాకిష్టమైన కడక్ బిర్యానీ చేసుకొని మంచిగా తినేసి పాడుకుండిపోయా. రాత్రంతా ఇవే ఆలోచనలు. తెల్లారింది, ఆఫీస్ కి వెళ్లే టైం అయింది. వెళ్లాలనిపించలేదు.

ఏదో తెలియని తెగింపు , ధైర్యం , ఆరోజు తర్వాత ఇంకా ఆఫీస్ కి వెళ్ళకూడదు అనే నిర్ణయం మదిలో మెదిలింది. అనుకున్నట్టే మళ్లీ ఆఫీస్ మొహం చూడలేదు. అది విన్నాక ఇంట్లో 6 నెలలు మాట్లాడలేదు. అప్పటిదాకా ఉన్న కొంచెం డబ్బులతో చిన్న ఛాయ్ బండి , అదే బండి లో సాయంత్రం తినడానికి వింత వింత వంటలు. అదృష్టమో ఏమో తెలీదు కానీ జనాలకి విపరీతంగా  నచ్చాయి , రోజు రోజుకి ఎక్కువ మంది రావడం మొదలు పెట్టారు , అలానే పార్సెల్ కూడా తీసుకువెళ్లే వాళ్ళు.

నేను అనుకున్నట్టే చుట్టాలందరు  పిల్లలకి  వాళ్ళ  మాటలు  వినకపోతే  నాలా  ఛాయ్  బండి  పెట్టుకోవాల్సి  వస్తుంది  అన్నారు  , ఇంట్లో  వాళ్ళు  బాధ  పడుతున్నారని  తెలుసు  కానీ , సాయంత్రం  ఆ  రెండు  గంటలు  నా  మనసుకి  కలిగే  ఆనందం  అంత  ఇంత  కాదు  , వాటి  ముందు ఆ అవమానాలేం కనిపించలేదు . గౌరవం  పరంగా  తప్ప , చెప్పాలంటే  ఆ  9 – 5  జాబ్  కన్నా  ఇక్కడే  ఎక్కువ  సంపాదిస్తున్నా.

అలా రెండు  సంవత్సరాలు అయిపోయాయి  , బండితో  పాటు  యూట్యూబ్  వీడియోస్  కూడా  చేస్తూనే  ఉన్నా , ఆ వీడియో చూసి ఒకరోజు పెద్ద చెఫ్ కాల్ చేసారు ఇంటికి పిలిచారు , అదే  వంటకం  చేసి వడ్డించమన్నారు.మనదేం  పోయింది  , చేసి  పెడితే  పోలె  అని  చేశాను. తినేసి , ఓకే  ఇంకా  వెళ్ళచ్చు  అన్నారు . మొదట  అర్థంకాలేదు  తర్వాత  కోపం వచ్చింది , సరే  ఆయన చెప్పే  రెసిపీస్  నాకు  ఇష్టం , ఆ  గౌరవంతో ఎం మాట్లాడకుండా ఇంటికి వచ్చేసా. ఒక 2 వారాల తర్వాత  ఒక  లెటర్  వచ్చింది. ఆయన  కేఫ్  లో  హెడ్ చెఫ్  గా అప్పోయింట్ చేసారు ఆ కిందనే  ఇంకొక కాగితం ఉండే , చూసి  షాక్  అయ్యి  వెంటనే  ఆయన  దగ్గరికి  వెళ్ళాను.

“నువ్వు  చూసింది  నిజమే  , నీ  బండి దగ్గర  6 నెలల ముందు  ఒకసారి  తిన్నాను, అప్పటి  నుండి  ప్రతి రోజు  పార్సెల్  కూడా  తెప్పించుకుంటున్న  , నీ  వీడియోస్  అన్ని చూసాను ,  అవి చేస్తున్నప్పుడు  నీ  ఆనందం చూసాను . నీ  పని  మీద  నీకు  ప్రేమ  ఉంది ,అది  ఉన్నన్ని  రోజులు  నీ  మనసు  ఎప్పుడు  సంతోషంగానే  ఉంటుంది  . కేఫ్ ని  మరి  ఎక్కువ  మార్చవనే  అనుకుంటున్నా  ,ఒకవేళ  మార్చినా నా  కోసం  ఒక  టేబుల్   అలానే  ఉంచు ! ” అని చెప్పి వెళ్లిపోయారు.

ఇంకో  నెలలో  ఆయన  ఆస్ట్రేలియా  వెళ్తున్నారు అందుకే  తన  కేఫ్  ని  నాకు రాసి ఇచ్చేసారు . ఆనందమో , ఆశర్యమో  తెలీదు  కానీ  ఒక్కసారి గతమంతా  కళ్ల ముందు  కనిపించింది  . ఆయన  ఇచ్చిన కేఫ్ నా జీవితం లో పెద్ద మెట్టు. ఆయన రాసి ఇవ్వడం మంచితనం , మనం తీస్కోకపోడం బాధ్యత . పెట్టిన నమ్మకాన్ని నిలబెడుతూ అక్కడే 3 ఏళ్ళు పని  చేసి  మొత్తానికి 3  ఏళ్ళ తర్వాత ప్రనిత్య అనే కేఫ్ ఓపెన్ చేశాను.

ఒకవేళ నా  భయాలు  దాటి  యూట్యూబ్  ఛానల్  పెట్టకపోయినా  , ఉద్యోగం  మానేసి  ఛాయ్ బండి  పెట్టకపోయినా  , చుట్టాలు  ఆవుమనిస్తున్నారని  ఆ  బండి  ఆపేసిన  ఈరోజు  నేను  ఈ స్థాయిలో  ఉండే  వాడ్ని  కాదు. ఒకవేళ  ఈ  స్థాయి రాకపోయినా , అదే  బండి  దగ్గర ఉండే ఆ రెండు  గంటలు  మనస్ఫూర్తిగా   ఉండే  వాడ్ని . నా  ఊహ , కల  నిజమైంది. ప్రయత్నించక పోయి  ఉంటె  ఒక  చిన్న  ఆఫీస్  రూమ్ లో ఇప్పటికి  మనసు  చంపుకుని  పని  చేస్తూ  కూర్చునే  వాడ్నేమో.

ప్రయత్నించి ఓడిపోయినా  పర్లేదు, గెలుపు  కన్నా, ఓటమి కన్నా, స్థాయి కన్నా, డబ్బు కన్నా ప్రయత్నమే గొప్పది .

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,