The Story Of A Girl Who Meets A Guy In A Train Journey Comes With A Pleasant Twist

 

Contributed By Sowmya Uriti

ఎక్స్క్యూజ్ మీ” ఈ మాటకి ఏదో ఆలోచనలలో ఉన్న ప్రతీక్ తల తిప్పి చూశాడు. నల్లని కళ్ళ అమ్మాయి. ఆ కళ్ళు తననే చూస్తున్నాయి “ఆ విండో సీట్ నాదే ,” అంది. ప్రతీక్ వెంటనే లేచి అమ్మాయికి దారిచ్చాడు. తన బ్యాగ్స్ పైన పెట్టి కుర్చుంది అమ్మాయి. పక్కనే ప్రతీక్. మొబైల్ చూసుకుంటూ, “అయ్యో మర్చిపోయా..” అంటూ “మీరేమీ అనుకోనంటే కొంచెం పైనున్న బ్లూ బ్యాగ్ తీసిస్తారా, ” అని అడిగింది ప్రతీక్ ని. ప్రతీక్ కి గుండెల్లో ఆందోళన మొదలైంది. ఆ అమ్మాయి తన వైపే చూస్తుంది బ్యాగ్ తీసిస్తాడని.

 

చెప్దామా ఈ అమ్మాయికి…కానీ చెప్తే?…వద్దు చెప్పొద్దు..” అనుకొని లేచి పైనున్న బ్యాగ్ తీసిచ్చాడు. “అయ్యో ఇది కాదండి. బ్లూ బ్యాగ్. పక్కనే ఉంటుంది,” అంది అమ్మాయి.

ఓ..సారీ..” అంటూ పక్కనున్న బ్యాగ్ తీసిచ్చాడు. అమ్మాయి థాంక్స్ చెప్పి తన పని తను చూసుకుంటుంది. “థాంక్ గాడ్!” అనుకుంటూ తన ప్లేస్ లో కూర్చున్నాడు ప్రతీక్.

 

నేను నయన..,“అని మాటలు కలిపింది ఆ అమ్మాయి. “బాగుంది మీ పేరు. నేను ప్రతీక్,” అని కొనసాగించాడు ప్రతిక్. “ఏం చేస్తుంటారు మీరు?” అడిగింది నయన. “వెబ్ కంటెంట్ రైటర్ ని, మీరు?” ఆడిగాడు ప్రతీక్.

నేను పెయింటింగ్స్ వేస్తుంటా. ఫోటోగ్రఫీ కూడా వచ్చు,” అంది నయన. “ఆఆహా,” అని ఊరుకున్నాడు ప్రతీక్. తనకి ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు ఎక్కడ బయటపడవలసి వస్తుందో అని.

 

కాని నయన మాట్లాడుతూనే ఉంది. త్వరగా కలిసిపోయే అమ్మాయి మరి. తన మాటలు వింటూ ఉండిపోయాడు ప్రతీక్.

ఏంటండీ! నేనే మాట్లాడుతున్నా. మీరూ చెప్పండి…పోనీ నా పెయింటింగ్స్ చూస్తారా?” అంటూ తన మొబైల్ తీసింది.

 

ప్రతీక్ కి మళ్ళి గుండె వేగం పెరిగిపోయింది. నయన తన పెయింటింగ్ పిక్స్ చూపిస్తుంటే ప్రతీక్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

సరే చెప్పేదాం..ఎందుకు దాచడం? కానీ చెప్తే తను నా గురించి ఏమీ అనుకోదు కదా!” ఆలోచిస్తుండగా ఇది చూడండి. నేను వేసిన వాటిలో నాకు బాగా నచ్చేది ఇది. ఎలా ఉంది?” మరో పిక్ చూపిస్తుంది నయన.

 

ప్రతీక్ కి ఇబ్బందిగా అనిపిస్తుంది. “చెప్పేస్తేనే బెటర్! ఎందుకో తను నచ్చింది. కాని నేను విషయం చెప్పిన తరువాత తను నన్ను వేరుగా చూసినా వేరే విధంగా మాట్లాడినా నేను మనసుకి తీసుకోలేనేమో,” ఇలా చెప్పాలా వద్దా అనే రెండు పదాల మధ్య చాలా ఆలోచనలు నడుస్తున్నాయి ప్రతీక్ మదిలో.

ప్రతీక్ గారు.. మీరు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. ఏమైన చెప్పాలా? చెప్పండి పర్లేదు..” అంది నయన.

 

ఇక ఏదయితే అదయింది. చెప్పేద్దాం. ఒకవేళ మా పరిచయం ప్రయాణం అయితే చెప్పలి కదా,” అనుకొని “నయన! మీరు మీ పెయింటింగ్స్ చూపిస్తున్నారు. అవి చాలా కళాత్మకంగా ఉన్నాయేమో. కాని నేను వాటిని ఆశ్వాదించలేను. వాటిలో ఉండే రంగుల మధ్య వ్యత్యాసం తెలియదు నాకు. అందరికీ వాటిలో చాలా వర్ణాలే కనిపిస్తాయేమో. నాకు కనిపించేవి మాత్రం రెండే..తెలుపు నలుపు. నా చిన్నప్పటి నుండి నాకు తెలిసినవి ఆ రెండే. కొందరు ప్రకృతిలో రంగులను వర్ణిస్తే వినడం తప్ప చూసి ఎరుగను. గుర్తించలేను. ఆకాశంలో నీలం తెలియదు, పైరులోని పచ్చదనం తెలియదు, హరివిల్లులోని సప్తవర్ణాలు తెలియవు. వాటన్నిటిలో నాకు కనిపించేవి ఆ జంట రంగులు మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే.. నాకు కలర్ బ్లైండ్ నెస్.. ఇది మీరు మీ బ్లూ బ్యాగ్ తీసివ్వమన్నప్పుడే చెప్దాం అనుకుని ఎందుకో ఆగిపోయా. మీ మాటలు విన్నాను. మీ భావాలు నచ్చాయి. మీతో ప్రయాణం కొనసాగించవచ్చేమో అనిపించింది. అలా అయితే నేను నా గురించి, అదే నా లోపం గురించి చెప్పాల్సిందే అని ఇక చెప్పేసా,” అని ముగించాడు ప్రతీక్.

ప్రతీక్! మీరంటున్న కలర్ బ్లైండ్ నెస్ అనేది ఉండడం మీ డిఫెక్ట్ కాదు కదా. అది చిన్న జెనెటిక్ డిజార్డర్ అంతే. దాని వల్ల నేను మిమ్మల్ని తక్కువగా చూస్తాననీ మీతో మాట్లాడనేమో అని ఎలా అనుకున్నారు? నేను మనుషుల వ్యక్తిత్వానికి విలువ ఇస్తాను. మీరు ఈ విషయం చెప్పకుండా దాటేయవచ్చు. కాని చెప్పారు. అర్ధమవుతుంది మీరేంటో..మీ మనస్తత్వం ఎంటో, నాక్కూడా మీతో ప్రయాణం కొనసాగించవచ్చేమో అనిపిస్తుంది..ఇప్పుడు మీరు రాసిన కొన్ని ఆర్టికల్స్ చదువుదాం ఏమంటారు ? ” అంటూ నవ్వింది నయన. ప్రతిగా ప్రతీక్ కూడా నవ్వాడు తేలికగా.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , ,