This Short Story Of A Poor Boy Asking His Mom For A Birthday Dress Is Emotional

Contributed by Krishna Prasad
పొద్దు పొద్దున్నే బయట పెద్ద వర్షం, అయినా ఎప్పటిలాగే రాము బడికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. రాము వాళ్ళఅమ్మ , రాత్రి మిగిలిన గంజిని కట్టెల పొయ్యి మీద పెట్టి వేడి చేస్తుంది. గుడిసె కావటంతో వర్షపు చినుకులు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. రాము మాత్రం ఎంత పెద్ద వర్షం వచ్చినా బడికి మాత్రం తప్పకుండా వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. రాముకి చదువంటే అంత ఇష్టం.అమ్మ కాచీఇచ్చిన గంజి తాగుతూ ఆమెతో ఇలా అంటున్నాడు….
రాము : అమ్మా !
అమ్మ : ఏంట్రా…
రాము : నీకు తెలుసు కదమ్మ ఇంకో రెండురోజుల్లో నా పుట్టిన రోజని. కొత్త బట్టలు ఇంకెప్పుడు కొంటావ్. నేను కొత్తబట్టలు అడిగేదే సవంత్సరానికి ఒకసారి. నాన్నేమో డ్యూటీ పని మీద ఊరు వెళ్లారు, నువ్వేమో ఎప్పుడు అడిగినా రేపు కొంటా, రేపు కొంటా అంటావ్ ఇంకెప్పుడమ్మ…
అమ్మ : (మనసులో) ఈనెల నాకు వచ్చిన జీతం 1000 రూపాయిలు .వాటిలో కరెంట్ బిల్లు 200, కిరాణా కొట్లో నెలంతా సరుకులు కొన్నందుకు అక్కడ కట్టాల్సింది 700. ఇక 100 తో వాడికి ఏమని కొనాలి. వీళ్ళ నన్నేమో డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి వారం రోజులు పడుతుంది.
అమ్మ : రేపు కచ్చితంగా కొంటానురా సరేనా….
రాము : సరేనమ్మ ( సంతోషంగా ).
మళ్లీ మరోరోజు ఉదయం అయ్యింది ,రాము మళ్లీ అమ్మని అడిగాడు ,అమ్మ రేపు కచ్చితంగా కొంటారా అని చెప్పింది.
రాము : సరేనమ్మ ( ఈసారి బాధగా,నిరాశగా ),కానీ రేపే కదమ్మా నా పుట్టిన రోజు…సాయంత్రం తీసుకురా అమ్మ….( జాలిగా)
రాత్రి అయ్యింది అమ్మ పని నుంచి వచ్చేటప్పుడు కొత్త బట్టలు తీసుకువస్తుందని రాము ఆశగా అమ్మ కోసం ఎదురుచూస్తున్నాడు.
అమ్మ వచ్చింది ,చేతిలో సంచిని చాలా ఆత్రంగా చూసాడు రాము ,కానీ ఆ సంచిలో ఏమి లేదు.రాము చాలా నిరాశతో, అమ్మతో మాట్లాడకుండా , దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.
ఉదయం అయ్యింది ,రాము పుట్టిన రోజు రానేవచ్చింది.కానీ రాము కి మాత్రం కొత్తబట్టలు కొనలేదని చాలా బాధగా ఉంది.మంచం మీదనుంచి కిందకు దిగుతుండగా తన దిండు పక్కనున్న ఒక సంచి, చేతికి తగిలింది. రాము ఆ సంచిని చూడగా ఆ సంచిలో కొత్త బట్టలు.రాముకి పట్టలేని ఆనందం కలిగింది ,అమ్మ కోసం ఇల్లు మొత్తం వెతికి ,ఇంటి పక్కనున్న కుళాయి వద్ద ఉన్న అమ్మని చూసి కౌగలించుకున్నాడు.అమ్మ కూడా చాలా సంతోషంతో రాముని ముద్దాడింది.
రాము అమ్మ మెడ లో పుస్తెలు లేకపోవటాన్ని గమనించి అడగగా …అమ్మ మెరుగు పెట్టించటానికి ఇచ్చానని అబద్ధం ఆడింది.
నిజం ఏమిటంటే పిల్లాడికి పుట్టిన రోజునాడు కూడా బట్టలు కొనలేక పోతున్ననే బాధతో అమ్మ తన పుస్తెలని అమ్మేసింది.
If you wish to contribute, mail us at admin@chaibisket.com