This Analysis On Petrol Price Hike In Recent Years Is Something You Must Know!

 

ఒక్క పైసా కేవలం ఒకే ఒక్క పైసా తగ్గించారు.. బహుశా స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ కూడా పెట్రోల్ మీద ఇంత తక్కువ ధర తగ్గించి ఉండరు. మీకో విషయం తెలుసా ఈ ఒక్క పైసా తగ్గించడం వల్ల వందమంది లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఒక్క రూపాయి నష్టం వస్తుంది. అదే ఒక్క రూపాయి పెంచడం వల్ల కేంద్రానికి ఎంత లాభం వస్తుందో తెలుసా అక్షరాలా రూ.10,725 కోట్లు. ఇంత ఆదాయం వస్తుంది కాబట్టే పెంచడం రూపాయలలో, తగ్గించడం పైసలలో చేస్తున్నారు. ఇదే టాపిక్ మీద భారత దేశంలో ఈ పెట్రోల్ ధరల పెరుగుదల మీద కొంత అవగాహన పెంచుకుందాం.


1. 60% Two Wheelers వినియోగదారులే:
బండి నడపడానికి మాత్రమే కాదండి ప్రపంచం నడవాలన్నా కావాల్సింది పెట్రోలే. మన దేశం మిగితా దేశాలనుండి దాదాపు 85% ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇందులో అత్యధికంగా 60% వినియోగిస్తున్నది టూ విలర్స్ అంటే మధ్యతరగతి వారే. ఒకప్పుడు పెట్రోల్ వినియోగదారులు తక్కువగా ఉండేవారు, దాని మూలంగా బంకులు తక్కువగా ఉండడం, వినియోగం తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి వాహనదారులు, బంకులు, వినియోగం. ఒకప్పుడు పది వేల లీటర్లు అమ్మినవారే ఇప్పుడు 30, 40 వేల లీటర్లు అమ్ముతున్నారు.


“పెట్రోల్ అసలు ధర కన్నా దాని మీద విధించే టాక్స్ లే అధికంగా పెరుగుతున్నాయి”

2. లీటర్ పెట్రోల్ అసలు ధర రూ.40.
శుద్ధి చేసిన లీటర్ పెట్రోల్ ధర 37రూపాయలు. దీనికి బంక్ వారి లాభం 3రూపాయాలు కలుపుకుంటే 40రూపాయలకు చేరుకుంటుంది (ఏ విధమైన పన్నులు లేకుండా). కాని అన్ని రకరకాల టాక్సులు కలుపుకుంటే అసలు కన్నా రెట్టింపుతో 83.07రూపాయలకు చేరింది. ఇది దాదాపు రెట్టింపు ధర. 30 సంవత్సరాల క్రితం లీటర్ పెట్రోల్ ధర పది రూపాయల లోపే ఉండేది. 1989లో లీటర్ పెట్రోల్ రూ.8.50, డీజిల్ రూ.3.50. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ధరలు పెంచాలాంటే ఇప్పుడున్నట్లు ఇష్టారాజ్యంగా కాకుండా సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకునేవారు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.


“పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆటో, బస్, నిత్యావసరాలు అన్ని పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి ఐనా, ప్రైవేట్ ఉద్యోగి ఐనా.. మరి సామాన్య ఉద్యోగి జీతం ఎందుకు పెరుగుతున్న ధరలలానే పెరగడం లేదు.?”

ప్రపంచ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పెరిగినా పెంచుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెంచుతున్నారు. ఒక్కసారి 2000 సంవత్సరంలో చూసుకుంటే లీటర్ పెట్రోల్ 25 రూపాయాలు ఉండేది. 2004 కాంగ్రెస్ పార్టీ ప్రభుతంలోకి వచ్చేసరికి అది 35కు పెరిగింది. ఇక అప్పటి నుండి ఒక స్పష్టమైన భారీ పెరుగుదల కనిపిస్తూ వస్తుంది ఓ పీడ కలలా. దాదాపు పది సంవత్సరాల క్రితం అంటే 2009లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 138 డాలర్లు ఉంటే లీటర్ పెట్రోల్ 45 రూపాయలు ఉండేది. అదే బిజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తరువాత(2015) బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర రూ.25కి పడిపోతే లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉందో తెలుసా 64రూపాయాలు. అసలయితే ఈ ధర 25రూపాయాలకు దిగిరావాలి. దిగిరాకపోవడానికి పెరగడానికి గల ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే టాక్సులు. (సంవత్సరంలో ఒక ధర ఆధారంగా తీసుకున్నవి)


“బీహార్ రాష్ట్రములోని బీర్ గంజ్ ప్రాంతం నుండి నేపాల్ దేశం దగ్గర. అక్కడ లీటర్ పెట్రోల్ కేవలం 66 రూపాయలు, బీహార్ లో 84 రూపాయాలు.. ఇక్కడ కన్నా అక్కడ చౌక ఉండడంతో ప్రతిరోజూ వందలాది మంది బీర్ గంజ్ నుండి నేపాల్ కు వెళుతున్నారు.”

3. దాదాపు 3లక్షల కోట్లకు పైగా ఆదాయం:
కేంద్రం చమురును ఆదాయ వనరుగా భావిస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా అని కాదు రోజులు గడుస్తున్న కొద్ది పన్నులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. UPA ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్సయిజ్ టాక్స్ దాదాపు 8 రూపాయాలకు పెంచారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా చమురును ఆదాయ వనరుగా భావించి విపరీతంగా పెంచడం మొదలు పెట్టింది. ఫలితంగా కేంద్రానికి వేలకోట్ల నుండి లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. 2013-14 ఆర్ధిక సంవత్సరానికి 78 వేల కోట్లు వస్తే, 2014-15 కు అది లక్షకోట్లకు పైగా పెరిగింది. ఆ తరువాతి సంవత్సరాలలో అంటే 2015-16 కు లక్షా 78 వేల కోట్లు, 2016-17 కు రెండు లక్షలా 42 వేల కోట్లు, 2017-18 కు ఆ సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. ఇంతలా కేంద్రం చమురు మీద ఆదాయాన్ని ఆర్జిస్తుంది.


“సామాన్యుడికి ప్రభుత్వం అండగా నిలబడాలి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఇక్కడ పెట్రోల్ ధర పెంచారు. అదే క్రూడ్ ఆయిల్ ధర పెరిగేతే ఇంకెంత పెంచుతారో అనే ఆలోచనే భయంకరంగా ఉంది”.

4. అసలు కన్నా అధికం:
మన దేశంలో దొరికే అన్ని వస్తువుల మీద కన్నా ఒక్క పెట్రోల్, డీజిల్ మీదనే ఇంతలా పన్నులు వసూలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, కొనుగోలు ధర, ప్రాసెసింగ్ కాస్ట్, డీలర్ కమిషన్ మొదలైన ఖర్చులన్నీ కలిపితే ఇదిగో రూ.83.07 రూపాయలకు చేరింది. అదంతా కూడా సామాన్యుడే కట్టాలి. ఇదేమని అడిగితే గ్యాస్ మీద సబ్సిడీ, సంక్షేమ పథకాల కోసం ఖర్చుపెడుతున్నామని చెబుతున్నారు కాని మీకో విషయం తెలుసా బీజేపీ ప్రభుతంలోకి వచ్చాకా బడా వ్యాపారుల 3.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు, కొన్ని లక్షల కోట్ల వరకు కూడా కంపెనీలకు రాయితీలను ఇస్తున్నారు. తగ్గించాల్సిన చోట తగ్గించకుండా, పెంచాల్సిన చోట పెంచుతున్నారు.


5. ఒకవేళ GST పరిధిలోకి తీసుకువస్తే.?
భారతదేశ ప్రగతికి GST కీలకంగా ఉపయోపడుతుందని కేంద్రం అట్టహాసంగా GST పన్ను విధానాన్ని అమలుజరుపుతుంది. అన్నీ ఈ పరిధిలో ఉన్నాయి కాని పెట్రోల్, డీజిల్, లిక్కర్ GST పరిధిలో లేవు. లిక్కర్ తర్వాతి సంగతి లిక్కర్ ధర తగ్గనందు వల్ల ఇప్పుడు కొంపలేం మునిగిపోవు. చమురు అనేది దేశ ప్రగతికి మాత్రమే కాదు వ్యక్తి ప్రగతికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. GST Maximum Tax 28% పెట్రోల్ మీద వేసినా గాని లీటర్ పెట్రోల్ ధర దాదాపు 45 రూపాయలకే వస్తుంది.


ఇది దుర్మార్గపు ప్రభుత్వం, ఈ పార్టీని వచ్చే ఎన్నికలలో ఓడించాలి అని ప్రతి పార్టీ పోరాటం చేస్తుంది, అధికారంలోకి వస్తుంది. తర్వాత ఇది సామాన్యుడి ప్రభుత్వం.. మీకు మంచి రోజులు వచ్చాయి అని అధికారంలోకి వచ్చాక మళ్ళి షరా మామూలే అవ్వే పెరుగుదల, అవ్వే రోజులు!!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,