An Explanation Of పంచభూతాలు We All Have Within Ourselves

 

Contributed By: Vineeth Alladi

మన చుట్టూ ఉండే పంచభూతాలు ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనల్ని తయారుచేసింది ఆ పంచభూతాలే అవే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు. మానవుని పంచప్రాణాలు ఈ పంచభూతాలు. ఇవి లేనిదే మనిషి లేడు ఈ సృష్టి లేదు. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబిస్తుంది.

 

1. గాలి:

మన ఉఛ్వాస నిశ్వాస లో ఊపిరిగా ఆ గాలి ఉంటుంది. గాలిని మనం చూడలేము పట్టుకోలేము కానీ అది మనకి స్పర్శనిస్తుంది, మనిషి శరీరానికి కావలసిన ప్రాణవాయువును అందిస్తుంది. అటువంటి గాలితో ఆటలు ఆడితే అది మనల్ని చెడుగుడాడుతుంది. కొంటెగా వచ్చే పిల్లగాలే కౄరరూపంలో సుడిగాలై మనల్నే ఈడ్చుకెళుతుంది.


 

2. నింగి:

మన ఊహాలోకమే అంతులేని అందుకోలేని ఆకాశానికి ప్రతీక. మానవ మేధస్సు ఈ అనంతవిశ్వమంత.. కానీ అదే విశ్వం(space) శూన్యానికి కూడా గుర్తు. ఆ ఊహాలోకంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. చెడు చీకటిగా మనల్ని కమ్మేస్తే, మంచి ఆ నిశీదిని పెకలిస్తూ ఉషోదయంలా ప్రజ్వలిస్తూ వస్తుంది.

మన ఊహకైనా దేనికైనా హద్దు ఉండాలి నింగికి నిచ్చెన వేసి ఎక్కుతాను అంటే ఎన్నటికీ గమ్యం చేరలేము. మన ఆలోచనలు ఉత్తమమైనవి అయితే అవి చల్లని వెన్నెల్లో కిలకిల నవ్వులు.. అవే సరిగా లేవంటే సూర్యుడి కోపాగ్ని జ్వాలలు.


 

3. నిప్పు:

ఈ లోకంలో అన్నిటికన్నా స్వచ్ఛమైనది అగ్నిగా భావిస్తారు. అన్ని భూతాల్లోకల్లా ఈ నిప్పు లేదా అగ్ని మనకి మొట్టమొదటిగా పరిచయమైనట్లు నా అభిప్రాయం. అది ఎలా అంటే మనం ఈ లోకంలో అడుగు పెట్టకముందు నుండే తల్లిలోని గర్భగుడిలో ఆ వెచ్చదనాన్ని పొందుతాం. మనం శరీరం నిండా పారే నెత్తురులో కూడా ఆ వేడిమి ఉంటుంది. మనలోని ఒక చిన్న అగ్గిరవ్వే క్రాంతిదీపమై నలుగురికి వెలుగు పంచవచ్చు లేదా అదే నిప్పురవ్వకి చెడు ప్రేరకాలు తగిలితే

పెను కార్చిచ్చు అయ్యి మనల్నే కాల్చివేయవచ్చు.


 

4. నీరు:

చాలా ముఖ్యమైన భూతం ఇది. నీరు లేకపోతే జీవమే లేదంటారు. విశ్వంలో మరే గ్రహం మీదా లేనిది ఈ భూమి మీద మాత్రమే ఉంది. మనం కార్చే కన్నీరు, మనం బయటకు వదిలే స్వేదం, మన శరీరంలోని ఎన్నో ద్రవాలు ఇవన్నీ నీటికి గుర్తు. ఆనందమైనా బాధైనా కళ్ళు చెప్పే భాష కన్నీరుతోనే. అందరిలోనూ కనురెప్ప వెనక సప్తసాగరాలుంటాయి కొందరిలోనే భావసునామీ వల్ల కంటిని దాటుకొని ఉప్పెనలా ఆ కన్నీరు బయటకు వస్తుంది. ఇకపోతే స్వేదం కష్టానికి గుర్తు. మనిషి చేసే కష్టమే అతని పొట్ట నింపుతుంది. దాహం తీర్చే చిరు చినుకులో కూడా ప్రళయంలా ముంచేసే శక్తి ఉంటుంది. ఈ నీరు కోసం మూడో ప్రపంచయుద్ధం వస్తుందట మరి. తస్మాత్ జాగ్రత్త!


 

5. నేల:

మనలోని ప్రతీ అవయవం మట్టిలోనుండి పుట్టినవే తర్వాత కూడా ఆ మట్టిలో కలిసిపోవాల్సినవే. మనకి కవచంగా ఉండి కాపాడే చర్మం, విశాలమైన హృదయం మనం నిలబడే ఈ నేలకు గుర్తు. మనసు పంచే ప్రేమలోని స్వచ్ఛదనమే ఈ నేలపై పరచుకున్న పచ్చదనం. పగలు, ప్రతీకారాలే ఆ పచ్చదనాన్ని మింగేసే కరువు కాటకాలు. మన మాటల గలగలే సెలయేళ్ల సవ్వడులు. అటువంటి నేల కూడా కంపిస్తే మనం ఇంక నేరుగా పాతాళానికే.

ఇటువంటి పంచభూతాలని దేన్నీ వదలకుండా మానవుడు నాశనం చేస్తున్నాడు అంటే మనల్ని మనమే హరింపచేసుకుంటున్నాం. ఇలా అయితే మన భావి తరాల వారికి మనం ఏం సమాధానం చెబుతాం..?

దయచేసి ఆలోచించండి.


 

#మన _చుట్టూ_ ప్రకృతిని_ప్రేమిద్దాం మన_ముందు_తరాలకు_అందిద్దాం

#SaveNatureSaveFuture.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,