This Heartfelt Conversation Between Two Brothers Is Very Relatable All The Brothers Out There

 

Contributed By Sriram Teja

 

Lockdown జోరు గా సాగుతోంది..

తమ్ముడు, నువ్విలా మోసం చేస్తావని ఎప్పుడూ అనుకోలేదురా..
చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నిన్నెంతగానో నమ్మానురా.
కానీ సడెన్ గా నువ్విలా చేస్తావని ఊహించలేదు.
చాలా మంది చెప్తుంటారు.. అన్నదమ్ముల మధ్య చిన్నప్పుడు ఉండే రిలేషన్ పెద్దయ్యాక ఉండదని.

 

అదంతా అబద్ధం.. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. నేను కూడా నీతో అలా ఉండకూడదని అనుకున్నా.

కానీ అందరూ అన్నదే నిజం చేసావురా.

ఎందుకిలా చేసావని నేను నిన్ను అడగను. కావాలనే చేసావా.. లేదా నేనసలు నీకు గుర్తే రాలేదా అన్నది నాకనవసరం.

చాలా బాధగా ఉందిరా..

 

చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి.

నేను స్కూలుకి వెళ్లేటపుడు నాతో పాటు నిన్ను తీసుకెళ్ళిన రోజులు. స్కూల్లో నిన్ను నీ క్లాస్ లో కూర్చోబెట్టకుండా నా పక్కనే కూర్చోబెట్టుకున్న క్షణాలు.

నేను సైకిల్ తొక్కుతుంటే నా వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చేవాడివి. అది చూసి సైకిలాపి నిన్నెక్కించుకుని సైకిల్ ని తోసుకువెళ్ళిన జ్ఞాపకాలు.

ఒక్కొక్కటి కళ్లముందు మెదుల్తుంది.

 

ఇన్ని రోజులు నా తమ్ముడే కదా అనుకున్నాను. కానీ నువ్వు పెద్దవాడివై పోయావురా. చాలా పెద్దవాడివైపోయావు.
అమ్మ ఒకట్రెండు సార్లు చెప్పిందిరా. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడనిపిస్తోంది. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేస్తాం.
అవున్రా..నేనేం చేయలేను. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వేం చేయాలనుకుంటే అదే చెయ్. నీకు నచ్చింది చెయ్.
కానీ ఏది చేసినా నీ అన్నయ్యని ఒక్కసారి గుర్తుతెచ్చుకో. ఇంతకుమించి నీ దగ్గరి నుండి నేనేమీ కోరుకోనురా..

 

అని అక్కడి నుండి వెళ్ళిపోయిన అన్నయ్య దేని గురించి మాట్లాడాడో ఏమీ అర్థం కాలేదు తమ్ముడికి.
చిన్నప్పటి సంగతులన్నీ ఎందుకు చెప్పాడు.
అమ్మ ఏం చెప్పి ఉంటుంది.
అసలేమైంది అన్నయ్యకి, అని తానేం తప్పుచేశాడా అని గుర్తుచేసుకోసాగాడు. ఎంత ఆలోచించినా తప్పేం చేసాడో గుర్తు రాలేదు.

 

అమ్మకి కూడా తెలుసని అంటున్నాడు. అదే అర్థం కావట్లేదు తమ్ముడికి. అలానే ఆలోచిస్తూ కిందికి వెళ్ళిపోయిన అన్నయ్య దగ్గరికి నడిచాడు.అన్నయ్య కిచెన్ లో అమ్మకి సాయం చేస్తున్నాడు.
మటన్ కర్రీ ఘుమఘుమలతో కిచెన్ నిండిపోయింది.

 

అన్నయ్యా.. అని పిలిచాడు.

తమ్ముడు తనవద్దకి వస్తాడని ముందే ఊహించిన అన్నయ్య, అన్నయ్య అన్న పిలుపు విని హాల్లోకి వచ్చాడు.

ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.

అన్నయ్యా, నువ్వు దేని గురించి మాట్లాడావో నాకొక్క ముక్క అర్థం కాలేదు. అసలేం చెప్పాలనుకున్నావ్. ఎందుకలా మాట్లాడావు.

 

అప్పుడు అన్నయ్య- తమ్ముడూ, నాకెక్కెవ ఫ్రెండ్స్ లేరని నీకు తెలుసు కదా!
అవును తెలుసు.

 

నేనెప్పుడు ఏది చేయాలన్నా మన ఇంట్లో అందరికీ చెప్తానని తెలుసు కదా..

అవును తెలుసు. అయితే

అయితే ఏంట్రా.. నువ్వు నాకు తెలియకుండా ఏం చేసావో నాకు తెలియదా?

నేనేం చేసానన్నయ్య..

గుర్తు తెచ్చుకో..
కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచించినా అన్నయ్య అంత సీరియస్ గా మాట్లాడేంత తప్పు తానేం చేసాడో గుర్తు రాలేదు.

 

అన్నయ్యా.. ఈ ముసుగులో గుద్దులాటలు నావల్ల కావు. డైరెక్ట్ గా మ్యాటరేంటో చెప్పు.

అప్పుడు అన్నయ్య- అంతా నీ చేతుల్లోనే ఉందని చెప్పాను కదరా..

తమ్ముడికి కోపం వచ్చి సోఫాలోంచి విసురుగా లేచి, నా చేతుల్లో ఉండడమేంటి? అని ఒక్క క్షణం ఏదో గుర్తొచ్చి ఆగిపోయాడు.
అప్పుడు గుర్తొచ్చింది. ఇందాక అన్నయ్య మాట్లాడినపుడు తన చేతిలో ఉన్న బాటిల్ గురించి.
వెంటనే వెనక్కి తిరిగి, అదేనా అంటూ తల పంకించాడు.
అవునన్నట్టు అన్నయ్య తల కిందకి ఊపాడు…

 

కరోనా కారణంగా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి నేనసలు ముట్టుకోలేదురా. నాకు తెలియదు బయట దొరుకుతుందని.

బయటదాకా వదిలెయ్, ఇంట్లోనే ఉందన్న విషయమే నాకు తెలియదు.
నిన్న నీ ఫ్రెండ్ రమేష్ గాడు ఇచ్చి వెళ్తుంటే చూసాను. నాకు చెప్పకుండా నువ్వే కానిచ్చేస్తున్నావని కోపమొచ్చింది.

చిన్నప్పుడు ఒకే చాక్లెట్ ని ఇద్దరం ఎలా పంచుకోవాలో తెలియక కాకెంగిలని చెప్పి కొరికి మరీ సగం ఇచ్చేవాణ్ని. ఇప్పుడు లిక్విడ్ కదరా… ఈజీగా షేర్ చేసుకోవచ్చు కూడా.. అయినా నన్ను పిలవలేదు.

ఇదంతా విన్న తమ్ముడు, వెంటనే అన్నయ్య చెయ్యిపట్టుకుని పైకి తీసుకెళ్లాడు.
రూంలో కప్ బోర్ట్ తెరిచి చూపించాడు.

 

అప్పుడు కనిపించాయి.. రంగు రంగుల బాటిళ్ళు.. పదిదాకా ఉన్నాయి. ఒక్కోటీ ఒక్కో బ్రాండ్.. కానీ అన్నీ సగం సగం ఉన్నాయి.

నీకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరని చెప్పావు కదా.. నాకు తెలుసన్నయ్యా..
అందుకే ఇదంతా..
ఎన్నో సార్లు అడుగుదాం అనుకున్నా, కానీ నువ్వేమైనా అనుకుంటావేమోనని ఆగిపోయా.
చిన్నప్పుడు నువ్వు కొరికి ఇచ్చిన సగం ఐస్ క్రీమ్ నాకింకా గుర్తే.. అందుకే ఆ సగాన్ని నేనిప్పటికీ మర్చిపోలేదు.

 

ఎప్పటికైనా ఆ బాటిల్స్ ఖాలీ అవ్వాల్సింది నీతోనే అన్నయ్యా…

వాటివంక అన్నయ్య అలా చూస్తూండిపోయాడు.

అన్నీ సగం సగం నిండి ఉన్న బాటిల్స్.. అందులో బీర్ బాటిల్ కూడా ఉంది. అది కూడా సగమే ఉంది.

వాటివంక చూస్తూ, ఇటు తిప్పి తమ్ముడి వంక చూస్తూ ఉండిపోయాడు.

ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్యా..
ఆ మాటలకి అవునన్నట్లు అన్నయ్య తల ఊపాడు.. ఆ తర్వాత తాను ఊగాడు..

అంతే..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,