Here Are Some Interesting Behind The Scene Facts About 90s Youth’s Favorite ‘Nuvve kavali’

 

This Post was originally written by Pulagam Chinnarayana garu on his Facebook page.

 

కొన్ని గుర్తులు చెరిగి పోతాయి…
కొన్ని జ్ఞాపకాలు చెదిరి పోతాయి…
కొన్ని రికార్డులు కొట్టుకుపోతాయి…
కొన్ని మైలురాళ్లు శిథిలమైపోతాయి…
కానీ , కొన్ని అంటే కొన్నే హిస్టరీ లో నిలిచిపోతాయి!
హిస్టరీ గా మిగిలిపోతాయి!!
అలాంటిదే ఈ “నువ్వే కావాలి” సినిమా.
21 వ శతాబ్దం ఎంటర్ అవుతూ తెలుగు సినిమా కి ఇచ్చిన తియ్యటి హగ్ ఇది.
19 ఏళ్ళు గడిచినా మనం ఇప్పటికి ‘నువ్వే కావాలి’ అంటున్నామంటే అందులో ఏదో మ్యాజిక్ ఉండే ఉంటుంది. ఆ మేజిక్ మేకింగ్ ముచ్చట్లు మీ కోసం …

 

కళ్లలోకి కళ్లుపెట్టి చూడవెందుకు…: ‘నువ్వే కావాలి’
నిన్ను ఇష్టపడేవారిని హీనంగా చూడకు! నిన్ను హీనంగా చూసేవారిని ఇష్టపడకు! ఫెయిల్యూర్ బుద్ధే అలాంటిది. దాన్ని ఎంత హీనంగా చూసినా, మనల్నే ఇష్టపడుతుంది. సక్సెస్ కూడా అంతే! మనమెంత ఇష్టపడినా కూడా, ఒక్కసారిగా హీనంగా చూస్తుంది.

 

కిందపడడం, మళ్లీ పైకి లేవడం నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌కు అలవాటైపోయింది. ‘రౌడీ మొగుడు’, ‘లింగబాబు లవ్‌స్టోరీ’ సినిమాలు బాగా దెబ్బతీశాయి. ‘మావిచిగురు’, ‘ఎగిరే పావురమా’ సినిమాలు మళ్లీ ఆయన్ని చిగురింపజేసి పెకై గిరేలా చేశాయి. దాంతో రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మూడు సినిమాలు తీశారాయన. ‘గిల్లికజ్జాలు’… ‘మనసులో మాట’… ‘పిల్ల నచ్చింది’. హిట్టని చెప్పలేరు. అలాగని ఫ్లాపూ కాదు. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ‘స్రవంతి’ నిలబడదు.

 

మలయాళ చిత్రం ‘నిరమ్’… క్యూట్ లవ్‌స్టోరీ. యౌవనప్రాయంలోని స్నేహాన్నీ, ప్రేమనీ, అంతఃసంఘర్షణనీ అద్భుతంగా డీల్ చేసిన సినిమా. మలయాళంలో సూపర్‌హిట్. చూసీ చూడగానే రవికిశోర్‌కి విపరీతంగా నచ్చేసింది. ఇమ్మీడియట్‌గా రీమేక్ చేసేద్దామనేంత ఆత్రం. కానీ అప్పటికే చాలా మంది దర్శక నిర్మాతలు కర్చీఫ్‌లు వేసుకొని కూర్చున్నారు. ముత్యాల సుబ్బయ్య… భీమనేని శ్రీనివాసరావు… ‘నిధి’ ప్రసాద్… ఇలా చాలామంది ట్రయల్స్‌లో ఉన్నారు.

 

దాంతో ‘నిరమ్’ ప్రొడ్యూసర్ కొండ మీదెక్కి కూర్చున్నాడు. 31 లక్షలకు ఒక్క రూపాయి తక్కువైనా ఇచ్చేది లేదంటున్నాడు. చాలా ఎక్కువ రేటు. ఆ రేటుతో కొని రీమేక్ చేస్తే వర్కవుట్ కాని పరిస్థితి. కానీ ‘స్రవంతి’ రవికిశోర్ మనసంతా దాని మీదే ఉంది. తన కష్టాలు తీర్చే ఆశాదీపంలాగా ‘నిరమ్’ అనిపిస్తోంది. ఏదో ఒక దారి కనబడితే బాగుణ్ణు? దారి కనబడింది. జేడీ చక్రవర్తి. ‘స్రవంతి’ సంస్థలో ‘ఎగిరే పావురమా’ చేశాడు. అతనికి ‘నిరమ్’ డెరైక్టర్ క్లోజ్. ఆ రూట్‌లో ట్రై చేశారు రవికిశోర్. వెంటనే పని అయిపోయింది. 5 లక్షలకు డీల్ ఓకే.

 

ఓ మంచి యంగ్ హీరోతో చిన్న బడ్జెట్‌లో తీస్తే లాభాలు వస్తాయి. ఇదీ రవికిశోర్ ప్లానింగ్. మహేశ్‌బాబు అప్పుడే హీరోగా ఎంటరయ్యాడు. అతనికైతే భలే ఉంటుందనిపించింది. ‘నిరమ్’ చూడమని మహేశ్‌కి ప్రింట్ పంపించారు. 2 నెలలైనా నో రెస్పాన్స్.
ఇంకో ఆప్షన్ సుమంత్. అతనప్పుడు ‘యువకుడు’, ‘పెళ్లి సంబంధం’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అతనికి ఈ సినిమా మీద ఇంట్రస్ట్ ఉంది. కానీ అతనికి చేయలేని పరిస్థితి. రామ్‌గోపాల్ వర్మ హిందీలో తీస్తున్న ‘మస్త్’ సినిమాలో ఆఫ్తాబ్ శివ్‌దాసానీ హీరో. అలాంటి వాడైనా దీనికి యాప్ట్. కానీ బడ్జెట్ లిమిట్ దాటిపోతుంది.
ఏం చేయాలి?

 

రవికిశోర్ లెక్కలు వేసుకున్నారు. ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్‌కు ఎక్కువ ఖర్చుపెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తన ఒక్కడి వల్లా కాదు. ఎవరో ఒకరి సపోర్ట్ కావాలి.
రామోజీరావు గుర్తొచ్చారు. ఉషాకిరణ్ మూవీస్‌తో కలసి కాంబినేషన్‌లో కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని ఎప్పటి నుంచో ఓ ప్రతిపాదన ఉంది. అదేదో దీనితోనే మొదలు పెడితే?

 

రామోజీరావును కలిశారు రవికిశోర్.
‘నిరమ్’ సినిమా చూపించారు.
‘‘తెలుగులో కొన్ని మార్పులు చేద్దాం’’ అంటూ రవికిశోర్ ఏదో చెప్పబోతుంటే, ‘‘అవసరం లేదు… మీకు నమ్మకముంటే గో ఎ హెడ్’’ అని రామోజీరావు గ్రీన్‌సిగ్నల్.
ప్రాజెక్ట్ సెట్. బడ్జెట్ బాధ్యత అంతా ఉషాకిరణ్ వాళ్లదే. ఎగ్జిక్యూషన్ అంతా రవికిశోర్ చూసుకోవాలి. నెలకు 10 లక్షల రూపాయల జీతం. లాభాల్లో 20 శాతం వాటా. డీల్ ఓకే. వర్క్ స్టార్ట్.

 

రవికిశోర్ వెంటనే విజయభాస్కర్‌ను పిలిచారు. లేటెస్ట్‌గా ‘స్వయంవరం’ డెరైక్ట్ చేశాడాయన. ఇద్దరికీ ముందు నుంచే పరిచయం. ఓ మూమెంట్‌లో… టీవీ సీరియల్స్ కలసి తీద్దామని కూడా అనుకున్నారు. ఎందుకో కుదర్లేదు. ఇలా ఇప్పుడు కుదిరింది. ‘‘‘స్వయంవరం’ కి త్రివిక్రమ్ డైలాగ్స్ బాగా రాశాడు. అతనీ స్క్రిప్టుకి కరెక్ట్’’ చెప్పారు విజయభాస్కర్. ‘‘ఓసారి పిలిపించండి. మాట్లాడదాం’’అన్నారు రవికిశోర్.

 

అప్పుడు త్రివిక్రమ్ భీమవరంలో ఉన్నాడు. అది వాళ్ల సొంత ఊరు. ‘స్వయంవరం’ తర్వాత ఊరెళ్లిపోయాడు. రెండు నెలలుగా అక్కడే ఉంటున్నాడు.
విజయభాస్కర్ ఫోన్ చేయడంతో త్రివిక్రమ్ చెన్నై ట్రయినెక్కాడు. ‘నిరమ్’ గురించి డిస్కషన్స్. ఏవో కొన్ని సీన్లు చెప్పాడు త్రివిక్రమ్. రవికిశోర్‌కి అతని టాలెంట్ అర్థమై పోయింది. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా! అప్పటికప్పుడు త్రివిక్రమ్‌కి పాతికవేలు అడ్వాన్స్ ఇచ్చేశారు. విజయభాస్కర్, త్రివిక్రమ్‌లు ఇద్దరికీ స్క్రిప్టులో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఎంత రీమేక్ అయినా కూడా జిరాక్స్‌లా ఉండకూడదనుకున్నాడు త్రివిక్రమ్. ‘నిరమ్’ ఎస్సెన్స్ మాత్రమే తీసుకొని తనదైన శైలిలో పంచ్‌లు, హ్యూమర్ యాడ్ చేశాడు. ‘నువ్వెందుకురా నాకు ముందు ఐ లవ్యూ చెప్పలేదు’ లాంటి కొన్ని సీన్లకు తప్ప మిగతాదంతా త్రివిక్రమ్ ఫ్లేవర్‌తో స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయింది.

 

హోటల్ రూమ్‌లో కూర్చొని త్రీ డేస్‌లో ఫస్ట్ వెర్షన్ డైలాగ్స్ రాసిచ్చేశాడు. పక్క రూమ్‌లో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి దిగారు. కోటి ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్. పగలు డైలాగ్స్ రాసుకోవడం, రాత్రిళ్లు వాళ్లతో కూర్చోవడం. త్రివిక్రమ్ నిద్ర కూడా పోకుండా ఈ ప్రాజెక్ట్‌లో లీనమైపోయాడు.
కోటి, సీతారామశాస్త్రి, భువనచంద్ర బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. రవికిశోర్‌కి తను తీసిన ‘మహర్షి’ సినిమాలోని ‘మాట రాని మౌనమిది’ పాట అంటే చాలా ఇష్టం. ఆ పాట తరహాలో ఓ పాట చేయమన్నారు. అలా పుట్టిందే ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు…’ పాట. ‘నిరమ్’లో విద్యాసాగర్ స్వరపరచిన ఓ పాటను తెలుగులో కూడా వాడాలనుకున్నారు. ‘అనగనగా ఆకాశం ఉంది…’ పాట అలా తయారైంది.

 

ఫైనల్‌గా కొత్తవాళ్లతోనే ఈ సినిమా తీద్దామని రవికిశోర్ డిసైడై పోయారు. ఏవేవో ఆప్షన్లు. టీవీలో ఓ ప్రకటన వస్తోంది. అందులో నటించిన కుర్రాడు చాలా బాగున్నాడు. వినీత్‌లా ఉన్నాడు. కానీ కాదు. ఎంక్వైరీ చేస్తే తరుణ్ అని తేలింది. సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణి కొడుకు. ఉషాకిరణ్ సంస్థలో ‘మనసు – మమత’ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన తరుణ్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశాడు. కొంచెం పెద్దయ్యాక ఈ యాడ్‌లో యాక్ట్ చేశాడు. తరుణ్‌ను హీరోగా చేయాలని అప్పటికే చాలామంది ట్రై చేస్తున్నారు. రోజారమణి మంచి లాంచింగ్ కోసం వెయింటింగ్. ఉషాకిరణ్ వాళ్లే ‘చిత్రం’ కోసం కూడా అడిగారు. ఆ టైమ్‌లో ‘నిరమ్’ చూపించారు రవికిశోర్. ఆమె వెంటనే ఓకే చెప్పేశారు. 3 లక్షలు రెమ్యూనరేషన్.

 

హీరోయిన్ సెలక్షన్ కోసం చాలా ప్రాసెస్ జరిగింది. రిజెక్టెడ్ లిస్టే ఎక్కువ. ఎవ్వరూ నచ్చడం లేదు. మళ్లీ రిజెక్టెడ్ లిస్ట్ ఫొటోలు రీ-చెక్ చేస్తుంటే ఒకమ్మాయి బావుందనిపించింది. ఆమె పేరు రిచా. ఓకే. ఇంకో హీరోగా సాయికిరణ్ సెలక్టెడ్. సింగర్ రామకృష్ణగారబ్బాయి.
ఫస్ట్ డే షూటింగ్…
తరుణ్‌కి వైరల్ ఫీవర్. 104 డిగ్రీల జ్వరం. కదల్లేని పరిస్థితి. కానీ షూటింగ్‌కి అటెండ్ కాక తప్పదు. జ్వరంలోనే తలస్నానం చేశాడు. మేకప్‌మ్యాన్, కాస్ట్యూమర్ ఇద్దరూ పట్టుకుని లొకేషన్‌కి నడిపించుకుని తీసుకెళ్లారు.
ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ఫోన్‌లో అడిగే సీన్ అది. అంత నీరసంలోనూ తరుణ్ సీన్ బాగా చేశాడు. కానీ మొహంలో నీరసం తెలిసిపోతోంది. ఫస్ట్‌షాట్ కాబట్టి సెంటిమెంట్‌గా దాన్ని అలాగే ఉంచేశారు.

 

మాగ్జిమమ్ సినిమా అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు. 75 లక్షల బడ్జెట్ అనుకున్నారు. తీరా చూస్తే కోటి 20 లక్షలు తేలింది.
2000 అక్టోబర్ 13
చాలా తక్కువ ప్రింట్లతో… తక్కువ థియేటర్లలో ‘నువ్వేకావాలి’ రిలీజ్. చినుకులా మొదలై సునామీలా మారడమెలాగో ఈ సినిమా రిజల్ట్ చూపించింది.
పాటలకూ, మాటలకూ ఫుల్‌మార్క్స్ పడ్డాయి. సిరివెన్నెల రాసిన ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోంది…’, ‘ అనగనగా ఆకాశం ఉంది…’, ‘ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు…’ పాటలైతే మార్మోగిపోయాయి. ‘ఇడ్లీనా…డెడ్లీగా ఉంటుంది’, ‘పాలంటే ఎలర్జీ, కానీ పాలే ఎనర్జీ’, ‘నీకు ఉదయమే అయింది, నాకు జ్ఞానోదయం కూడా అయింది’ లాంటి త్రివిక్రమ్ పంచ్‌లు బాగా పేలాయి.

 

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఓడియన్ థియేటర్‌లో అంతకు ముందు ఎడల్ట్ సినిమాలు ఎక్కువ ఆడేవి. అలాంటి థియేటర్‌లో ‘నువ్వేకావాలి’ రిలీజ్ చేయడమేంటి…వెరీ బ్యాడ్ అన్నారు చాలా మంది. తీరా చూస్తే ఫుల్ క్రౌడ్. వందో రోజున అయితే ఓడియన్ కాంప్లెక్స్ మొత్తం అమ్మాయిలూ అబ్బాయిలతో ఫుల్ ప్యాక్డ్. సినిమా మొత్తం కాకుండా ఓన్లీ సాంగ్స్ ప్రొజెక్ట్ చేయమని ఒకటే గొడవ. చివరకు పోలీసులు రావాల్సి వచ్చింది. ఆ థియేటర్‌లో ఓవరాల్‌గా రూ. 97.50 లక్షల షేర్ వచ్చింది. అంటే నియర్లీ వన్ క్రోర్. ఒక థియేటర్‌లో ఇంత షేర్ రావడమనేది అప్పట్లో రికార్డ్. అప్పుడు బాల్కనీ టిక్కెట్ రేటు పాతిక రూపాయలే.
ఓవరాల్‌గా ఈ చిత్రాన్ని 3 కోట్ల 25 లక్షల మంది ప్రేక్షకులు వీక్షించారు. ఇప్పుడున్న 100 రూపాయల టిక్కెట్ ప్రకారం చూస్తే రూ. 300 కోట్ల కింద లెక్క అన్నమాట. ఈ సినిమా మొత్తం మీద 24 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదంతా ఓన్లీ థియేటర్ వసూళ్లు మాత్రమే. ఈ లెక్క ప్రకారం చూస్తే ‘నువ్వేకావాలి’ ఏ రేంజ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

 

తరుణ్, రిచా, సాయికిరణ్, సునీల్, త్రివిక్రమ్, కోటి, విజయ్ భాస్కర్…ఇలా అందరికీ ఈ సినిమా ఓ పెద్ద బ్రేక్. ‘స్రవంతి’ రవికిశోర్‌కైతే పెద్ద రిలీఫ్. అప్పటివరకూ పడిన కష్టాలన్నీ ఒక్క దెబ్బతో ఉఫ్.

 

ఇష్టం ఎంత ఎక్కువైతే…
కష్టం అంత తక్కువైపోతుందన్నమాట. మనం ఏదైనా బలంగా ‘కావాలి’ అని కోరుకుంటే అది తప్పకుండా సిద్ధిస్తుంది.
‘స్రవంతి’ రవికిశోర్ చేసింది కూడా అదే. ‘విజయమా… నువ్వేకావాలి’ అని కోరుకున్నారు. ప్రకృతి సహకరించింది. ఆయన కోరిక ఫలించింది. అంతే!

 

హిట్ డైలాగ్స్ :
1. వెళ్లిపోవడం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది.
మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం కష్టం!
2. గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పగలం.
కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్లతోనే చెప్పగలం!
3. మంట దూరంగా ఉంటే వేడి తెలీదు.
మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలీదు.
4. ఇష్టపడితే భయపడకు.
భయపడితే ఇష్టపడకు.
ఇష్టపడి, భయపడితే బాధపడకు

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,