This Book About 108 Cancer Survivors Will Give You All The Inspiration You Need

 

నయమైన మనుషులు ఇతరులకు నయం చేయగలరు.

క్యాన్సర్ అనే ఒక సముద్రాన్ని దాటినా వ్యక్తులే దాని యొక్క తీవ్రత, అందులో ఉండే కష్టనష్టాల గురించి, ఎలా తీరాన్ని చేరుకోగలమో స్పష్టంగా నిజాయితీగా వివరించగలరు. “నేను క్యాన్సర్ ను జయించగలిగాను” అనే ఈ పుస్తకం క్యాన్సర్ ను ఎదురించి పోరాడి గెలిచిన 108 హీరోల కథలు. ఇందులో ఏ చెడు అలవాట్లు లేకుండా క్యాన్సర్ బారినపడిన వారు ఉన్నారు, అర్ధరాత్రి వరకు మందు తాగి ఆరోగ్యాన్ని నాశనం చేజేతులా పాడుచేసుకున్న వ్యక్తులు ఉన్నారు. వీరికి సరైన గైడెన్స్ ఇచ్చి, అడుగడుగునా కాపాడుకుంటూ, హీరోలుగా తీర్చిదిద్దగలిగిన కింగ్ మేకర్ డాక్టర్. పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారు.


 

మీరెంత శక్తిమంతులో మీకు తెలియదు, శక్తిమంతులు కావడమే మీకున్న ఏకైక మార్గమని తెలిసేదాక.

ముందుగా కింగ్ మేకర్ గురించి తెలుసుకుందాం..
కష్టాల కడలికి పక్కనే ఆశాతీరం ఉంటుంది. ఈ తీరం లక్షలకోట్ల ఇసుకరేణువులతో ఏర్పడింది. ఏ రేణువు కారేణువుకే విశిష్టతా లేదు. కానీ అవన్నీ కలిపితేనే తీరం అవుతుంది. శక్తిమంతమవుతుంది. సముద్రం ఈ తీరాన్ని ఎప్పుడూ కబళించాలనే చూస్తుంది. కానీ వెలిగే కన్నీళ్లతో శుద్ధమై బంగారు ఇసుక చిరునవ్వులు చిందిస్తుంది. నేను పాలకొండ విజయ్ ఆనంద్, ఒక ఆంకాలజిస్టును. రాత్రికి ఇంటికి వచ్చి అందరిలాగే భోజనం చేసి హాయిగా కునుకు తీయడం నాకిష్టం. రాత్రి ఏదో సమయంలో కన్నీటితో తడిసిన దిండు నన్ను మేల్కొల్పక మానదు. అని తన గురించి తాను వివరించుకుంటుంటే ఆయన ఎన్ని జీవితాల లోతుల్ని చూసి వారిని తీరాన్ని చేర్చుటకు మానసికంగా పడ్డ శ్రమ, పేషేంట్ల పట్ల ప్రేమ తెలుస్తుంది.


 

మీలో విశ్వాసాన్ని పెంచి పోషించండి, మీ భయాలు వాటంతటవే అంతమొందుతాయి.

అనేక లక్ష్యాలతో, కలలతో, అందమైన కుటుంబం స్నేహితులతో నిండిన ఒక జీవితం.. ఏదో చిన్న అనారోగ్య సమస్యకు డాక్టర్ గారికి చూపిస్తే ‘మీకు క్యాన్సర్ ఉంది’ అనే బాంబు వాళ్ళ నెత్తిమీద వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఇలాంటి మాటలను డాక్టర్ గారు ఎందరికో చెప్పారు. ఇక మేము కొన్ని వారాలు, కొన్ని నెలలు మాత్రమే ఈ అందమైన భూమి మీద ఉంటామా.? అయ్యే నేను ఇంకా అనుభవించగలిగింది, చెయ్యవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయే అనే సంఘర్షణలో చాలామంది మొదట బాధ పడడం సహజం. కానీ డాక్టర్ గారి మాటలు చికిత్స పద్ధతులు తెలుసుకున్న తర్వాత పేషేంట్స్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం పది లక్షల కొత్త కేసులు కనుక్కుంటున్నారు, అన్నిదశలతోనూ కలిపి లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుతం 66% వరకు క్యాన్సర్ నయమవుతుంది. క్యాన్సర్ ను ప్రారంభదశలోనే గుర్తించగలిగితే కనుక 90% వరకు నయం చేసుకోవచ్చు, అదే ముదిరిపోయి ఉన్నట్లయితే 50% కన్నా తక్కువ నయమయ్యే అవకాశం ఉంది.


 

వింత ఏమంటే గుండె చెదిరినప్పుడే అసలైన బతుకువిలువ తెలుస్తుంది.

ఈ పుస్తకం మొదట్లోనే క్యాన్సర్ బారినపడి దానిపై గెలిచిన క్రికెటర్ యువరాజ్ సింగ్, యాక్ట్రెస్ మనీషా కోయిరాలా, గౌతమి గారి అనుభవాలతో స్వాగతం పలుకుతారు. మిగిలిన 108 జీవితాలు అతి సామాన్యమైనవి. నెలల వయసులోనే క్యాన్సర్ వచ్చిన వారిన దగ్గరి నుండి 80 సంవత్సరాల వయసులోనూ ఎలా దానినిపై విజయం సాధించగలిగారు.? వారు ఎలాంటి చికిత్స(రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ, టార్గెటెడ్ థెరపీ) తీసుకున్నారనే విషయాలతో పాటుగా, డాక్టర్ గారు వ్యాధికి సంబంధించిన అనేక కారణాలను, పాటించవలసిన జాగ్రత్తలను వివరిస్తారు. 108 కథలలో ఒక మూడు కథలను ఇక్కడ మనం పరిశీలిద్దాము.


 

పదేళ్లకు పైబడి రోజుకు పది సిగరేట్లు/ బీడీలు తాగేవారికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 80 శాతం ఎక్కువగా ఉన్నాయి.

1. స్మోకింగ్ మానేసి చాలా సంవత్సరాలయింది, ఐన కానీ:
75 సంవత్సరాల రాజమల్లు గారి కథ మనందరికీ ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది. ఒకప్పుడు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసాను, ఇప్పుడు ఆరోగ్యాన్ని బాగానే చూసుకుంటున్నానుకుంటే కుదరదు. రాజమల్లు గారు స్మోకింగ్ మొదలుపెట్టేనాటికి ఆయన వయసు పన్నెండు సంవత్సరాలు. అప్పుడేదో ఉడుకు రక్తం.. ఏమి తిన్నా, తాగిన ఏమి కాదులే అనే ధీమాతో కూడిన వయసు అది. రోజుకు పది నుండి ఇరవైదాకా బీడీలు కాల్చేవారు, ఐతే 20 ఏళ్ల వయసుకు వచ్చేనాటికి ఆ అలవాటును పూర్తిగా వదిలేశారు. ఆ చెడు అలవాటు తాలూకు ఫలితం లేటు వయసులో బయటపడింది. ఛాతి నొప్పి ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్ లో చెకప్ చేయించుకుంటే ‘కుడి ఊపిరితిత్తుకు క్యాన్సర్ సోకిందని తేలింది‘. ఎప్పుడో చిన్నతనంలో చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు శిక్ష అనుభవించాలా? అని దీనిని జీర్ణం చేసుకోవడానికి కూడా రాజమల్లు గారు సిద్ధంగా లేరు. ఆ తర్వాత ఎలాగోలా అపోలో హాస్పిటల్ లో రేడియోథెరపిస్ట్, ఆంకాలజిస్ట్ ఐన డా. విజయ ఆనంద్ గారిని కలుసుకున్నారు. ఐదు వారాల పాటు కీమోథెరపి, రేడియోథెరపి ద్వారా కణితి చాలా కుచించుకుపోయింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకోవడం మూలంగా వ్యాధి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం వారు ఎటువంటి మందులు వాడటం లేదు. కేవలం ఒక్క నిజం తెలుసుకోకపోవడం మూలంగా వారి జీవితంలో ఇంతటి ఉపద్రవం వచ్చిపడింది.

మీరు మీ భవిషత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు, ఐతే ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిషత్తును మార్చగలవు.

 

2. హ్యాంగోవర్ తో మధ్యాహ్నం నిద్రలేచేవాడిని:
ఆర్.వి.ఆర్. కృష్ణంరాజు గారి జీవనశైలి విధ్వంసకరం. సిగరెట్లు మీద సిగరెట్లు తాగుతారు, అర్ధరాత్రి వరకు మందుతాగి ఎప్పుడో మధ్యాహ్నం హ్యాంగోవర్ తో నిద్రలేస్తారు. వారి దృష్టిలో తినడం వినోదం కోసం తప్ప బ్రతకడం కోసం మాత్రం కాదు. చాలామంది ఆపమని చెప్పారు కానీ వాళ్ళమాటలు పట్టించుకునేస్థితిలో లేరు, నిండా మద్యం, నికోటిన్ మత్తులో ఉండేవారు. ఫలితంగా 42 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వచ్చింది. ఇంట్లో చెబితే అమ్మ కుప్పకూలిపోయింది. కృష్ణరాజు గారికి జీవితం విలువ అప్పుడు తెలిసింది. ఎలాగైనా బ్రతకాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ బ్రతకాలి అని నిర్ణయానికివచ్చారు. కానీ బ్రతకడం అనుకున్నంత సులభమైతే కాదు. డా.విజయ్ ఆనంద్ గారు కృష్ణంరాజు గారి రిపోర్టులను చూసి దిగులుపడాల్సినదేమి లేదని “మీరు కేవలం బెడ్ మీద పడుకోండి, మిగిలిన కష్టమంతా మా డాక్టర్లు పడతారని భరోసా కల్పించారు”. రేడియో, కీమోథెరపి అంటే నొప్పి ఎక్కువగా ఉంటుందని ముందుగా ఆయనకు ఎవరో చెబితే విన్నారు. కానీ చికిత్స మాత్రం ఊహించినంత కష్టంగా లేకుండా సవ్యంగా జరిగిపోయింది. క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది.. కృష్ణంరాజు గారు మళ్ళీ పుట్టారు, మళ్ళీ బ్రతుకుతున్నారు కాకపోతే కొత్తగా.. డాక్టర్ ఆనంద్ గారి పట్ల, సహకరించిన డా. శర్మ గారికి ఆయన ఎంత కృతజ్ఞులో వారు మాటల్లో చెప్పలేరు.

 

3. ప్రశాంత వాతావరణంలోనూ కల్లోలం:
47 అజంతా గారు ఒక యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రపంచపు గడబిడలు, గందరగోళాలకు దూరంగా సుందరమైన ప్రశాంత వాతావరణంలో వారు అకడమిక్ జీవితాన్ని గడుపుతారు. అక్కడ దుమ్ము, పొగలకు దూరంగా, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లతో జీవితాన్ని గడుపుతారు. ఇలాంటి జీవితంలో ఒక్కసారి రొమ్ము క్యాన్సర్ వచ్చి పడింది. ఏ హాస్పిటల్ కు వెళ్ళాలి, ఏ డాక్టర్ గారిని కలిస్తే మంచిదని డజన్ల కొద్దీ డాక్టర్లను కలిసి, చివరికి విజయ్ ఆనంద్ గారిని కలిశారు. దయార్ద్రహృదయం, ప్రోత్సాహం నిండిన డాక్టర్ గారి మాటలు అజంతా గారికి సగం వ్యాధి నయమైనట్టుగా బలాన్ని తీసుకొచ్చింది. ఆరు సైకళ్ల కీమో థెరపి, రాపిడ్ ఆర్క్ రేడియా థెరపీ, హార్మోన్ థెరపీ లాంటి రకరకాల చికిత్సల ద్వారా వారు రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడగలిగారు. ప్రస్తుతం క్యాన్సర్ అంటే ఒక స్పీడ్ బ్రేకర్ లానే వారి జీవితంలో ఉంది, అంతే తప్ప తలుచుకున్నప్పుడల్లా బయపెట్టడం లేదు. ఎప్పటిలానే తన జీవితంలో తాను విహరిస్తున్నారు.

 

ఆందోళన పడడం వల్ల రేపటి ఇబ్బందులేవి తొలగవు, పైగా అది ఇవ్వాల్టి శాంతిని హరించివేస్తుంది. అంతమాత్రం చేత నిర్లక్ష్యంగా ఉండకూడదు. కేవలం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చూసుకుందాములే అనే నిర్లక్ష్యానికి ఒక్కోసారి ప్రాణాల్ని అర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి ఊహించలేని కథలు 108 వరకు ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఇప్పటి నుండి మన జీవితం పట్ల, ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలను, అలాగే క్యాన్సర్ పట్ల ఎంతో అవగాహనను అందిస్తాయి.

 

ఈ పుస్తకం అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్, ఆన్ లైన్ స్టార్స్ లో లభ్యమవుతుంది. ప్రస్తుతం చాలా తక్కువ కాపీలు మాత్రమే మార్కెట్ లో ఉన్నాయి.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , ,