Chai Bisket’s Story Series: నాలో నేను (Part – 7)

జరిగిన కథ: Part – 1, Part – 2, Part – 3, , Part – 4 Part – 5 Part – 6

వాళ్ళది కాంచీపురమేనట, తను రైలు లో చెప్పకుండా ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో చెప్పింది. వాళ్ళింటికి తీసుకెళ్ళింది. అక్కడే ఉండమన్నారు వాళ్ళు. తన పెళ్లి ఆమె బావతో. వాళ్ళింట్లోనే ఉన్నాను, పెళ్లి తంతు ముగిసేంతవరకు. ఆప్యాయతకు భాష, ప్రాంతం, వర్గం, వర్ణం అనే భేదాలు ఉండవని నిదర్శనం దొరికింది అక్కడ. వాళ్ళ తాత గారికి నేను ఎంతో నచ్చాను, చాలా దగ్గరి మనిషిలా అనిపించారు నాకు కూడా. ఆయన వలన తమిళం కొద్దిగా వంటబట్టింది. ఒకప్పుడు సాంబార్ అంటేనే నచ్చని నేను, సాంబార్ లేకుండా తినలేని స్థితికి చేరుకున్నాను. బర్ముడాలా స్థానం లుంగీ ఆక్రమించింది, టీ-షార్ట్ లపై బానియన్లు దండయాత్ర చేసాయి. దాదాపు ప్రతీ రోజూ కామాక్షమ్మ సన్నిధికి వెళ్ళేవాడిని. ఆ గుడి, పరిసరాలు, ప్రశాంతత, కోనేరు, భక్తులు, పురోహితులు, పూజలు, శ్లోకాలు, అగరొత్తుల సువాసన, దీపాలు, పొంగలి, సన్యాసులు, కొంతమంది వ్యక్తులు, అన్నీ, అందరూ నాకు బాగా దగ్గరయ్యారు. సాయంత్రం ఐదింటికి వెళ్లి అర్ధరాత్రి మూడు నాలుగు వరకు ఆలయ ప్రాంగణంలోనే గడిపేవాడిని. ఎన్నో రాత్రులు సన్యాసులతో కూర్చొని పుట్టుక, చావు, దైవం, దయ్యం, మనిషి, మనసు, ఆలోచన, అంతరాత్మ, భారతీయత, సంస్కృతీ, సంస్కారం, గొప్పతనం, కథలు, గాధలు, బాధలు, నీతులు, ధర్మాలు, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఇలా ఎన్నో విషయాల గురించి సుదీర్ఘ చర్చలు జరిపేవాడిని. వారి భిక్షపాత్రలో ఆహారాన్ని పంచుకుతినేవాడ్ని, గంజాయి తాగేవాడ్ని, విభూతి పూసుకొని తిరిగేవాడ్ని, సన్యాసుల్లో సన్నాసిలా కలిసిపోయి నడిచేవాడ్ని. ప్రతీ రోజు జరిగేది నోట్స్ రాసుకునేవాడ్ని.

కంచిలో గుర్తుండిపోయే మరో అద్భుతం పట్టు చీరల అల్లకం. చెప్పలేను…మాటల్లో చెప్పలేను ఆ అందం. పనిలో పరమాత్మని చూసే మనుషులు వాళ్ళంతా. వాళ్లకి ఆ విషయం తెలుసోలేదో కాని అత్యంత జాగ్రత్తగా శ్రద్ధతో అల్లుతుంటారు. పరమాద్భుతం దూదిపింజలు దారల్లా చేరి వస్త్రంగా మారే ప్రక్రియ. ఇదే దినచర్య ఎంతకాలం గడిచిందో తెలీదు కాని, వాళ్ళ పెళ్లి ఘడియ దగ్గరికి వచ్చింది. ఆ ఇంట్లో నేనూ ఓ మనిషిలా అయిపోయాను. పెళ్లి పనులు అన్నిట్లో పక్కనే ఉన్నాను. గడ్డం, జుట్టు బాగా పెరిగింది. తెల్ల పంచె, ముదురు గులాబి రంగు చొక్కా కుట్టించారు నాకోసం. తమిళనాడు కనుక నా వాలకం చూసి ఎవ్వరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు, మన దగ్గరయ్యుంటే కొత్త బాబా వచ్చాడని కాళ్ళు పట్టుకొని, కండువలు గట్రా కప్పేసి, బొట్టు పెట్టేసి, దండలేసి దండాలు పెట్టేసేవాళ్ళు. పద్దతిగా కన్నుల పండుగగా ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా జరిగింది పెళ్లి. ఇంచుమించుగా మన దగ్గర జరిగే తంతే, కాని ఇక్కడ కుడి ఎడమ అవుతుంది అంతే. అంటే అమ్మాయి అబ్బాయికి కుడివైపు ఉంటుంది పెళ్ళిపీటల మీద. అప్పటివరకు సరదాగా మాట్లాడటం తప్పించి ఏమి చెప్పని తాతగారు, పెళ్లి సమయంలో నా దగ్గరికి వచ్చి, “కంచికుడి” చూసావా అని అడిగారు. అప్పటివరకు ఆ పేరే వినలేదు నేను. లేదండీ! చూడలేదు అని చెప్పాను. “మంచిది రేపొకసారి వెళ్లి చూడు” అని చెప్పి వెళ్ళిపోయాడు. పెళ్లి గొడవలో పడి ఆ విషయం మర్చిపోయాను నేను. ఆ తర్వాతి రోజు బయట నడుచుకుంటూ వెళ్తుంటే కనిపించింది, “కంచికుడి”. నేనుండే ఇంటికి పర్లాంగు దూరంలోనే ఉంది, ఇంతకాలం చూడలేదు నేను. “కంచికుడి” అనేది శతాబ్దం కిందటి ఇల్లు, అప్పుడు వాడిన వస్తువులు, పరికరాలు, వస్త్రాలు అన్నిటిని పద్దతిగా దాచి ఉంచారు. గడప లోనికి అడుగుపెడితే వందేళ్ళు వెనక్కి వెళ్లినట్టు ఉంది. ఇంటికి వెళ్లి తాతగారిని అడిగాను, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళమన్నారు అని. “నువ్వు వచ్చిన పని మర్చిపోయినట్టు ఉన్నావే ? ఆ ఇంటికి వెళ్ళావా లేదా ?” అని అడిగారు ఆయన. వెళ్లాను. “ఆ ఇల్లు నీకేం చెప్పలేదా మరి ? అర్ధమవుతుంది లే వెళ్ళు!” అని కళ్ళతో నవ్వుతున్నారు ఆయన. నిజమే అక్కడో కాగితం మీద ఓ వాక్యం చూసాను, తమిళంలో రాసుంది ఏమనంటే “ముందు నీ గురించి తెలుసుకో!” అని. అంతకు మించి ఒక్క ముక్కా ఎక్కువ లేదు. దీని గురించే చెప్పినట్టు ఉన్నారు ఆయన. అర్ధమయ్యింది తాతగారు అని పళ్ళు కనిపించేలా నవ్వాను నేను. “చెప్పింది కదా! నీ చుట్టూ ఉన్నది నీకేదో చెప్పాలని చూస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా! నువ్వెవ్వర్ని నమ్మిన నమ్మకపోయినా, నీకు కావాల్సిన వారు నీకోసమై వెతుకుంటూ వస్తారు. వెళ్ళు! కుదిరితే ఈ తాత కోసం ఎప్పుడైనా ఒక్కసారి వస్తావుగా” అని ఆనందంతో వచ్చే కన్నీళ్ళతో చెప్పాడు తాత. తప్పకుండా తాతగారు, మీకోసం బామ్మ కోసం తప్పకుండా వస్తాను. అప్పటివరకు తర్వాతి క్షణం ఎక్కడికి అనే ఆలోచన లేని నేను, మరి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను అక్కడ. సరే నేను వెళ్తాను మరి అని ఆ ఇంట్లో, ఆ ఊర్లో నాకు తెలిసినవాల్లందరికి చెప్పి కన్యాకుమారి వెళ్ళే రైలు ఎక్కాను.

అక్కడికే ఎందుకో తెలీదు, వెళ్ళాలనిపించింది. స్టేషన్ కి వెళ్ళగానే రైలు సిద్ధంగా ఉంది, ఎక్కేసాను. వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఓ రెండు రోజులు గడిపాను. దేశంలోకి ఎవరు వస్తున్నారో అని కాపుకస్తున్నట్టు ఉంది విగ్రహం. వివేకానందుడి పాదాలు తాకాలని అంతులేని పోరాటం చేస్తున్నట్టు ఉంది హిందూ మహా సముద్రం, దాని అలలు చూస్తుంటే. అలజడి, ప్రశాంతత, శూన్యం, గాంభీర్యం, అంతులేని ఆకాశాన్ని తనలో దాచుకున్న సాగరాన్ని తన పాదాల కింద అదుపులో పెడుతున్నట్టు ఉన్నాడు వివేకానందుడు. అక్కడ నాకెవ్వరు పరిచయం అవ్వలేదు. కాని ఇద్దరు గుర్తుండిపోయారు, వివేకానందుడు, సముద్రుడు. సముద్రుడిలా అత్యంత చంచలంగా ఉన్న నా ఆలోచనలను, తన చూపులతో మార్చేసినట్టు ఉన్నాడు నరేంద్రుడు. ఆయన కాళ్ళ దగ్గర నిల్చొని తలెత్తితే ఆకాశాన్ని అంటుకొని ఉన్నట్టు అనిపించింది. ఆయన నాకేదైనా చెప్పాలనుకున్నారా ? దూరం నుండి ఆయన కన్నులు నా వైపే చూస్తునట్టు అనిపించింది. అక్కడ ఉన్నన్ని రోజులు నోరు తెరిచిన గుర్తేలేదు. ఉన్నపళంగా వెళ్లిపోవాలి అనిపిపించింది, లోకల్ బస్సు ఎక్కేసాను వాడు ఓ రైల్వే స్టేషన్ దగ్గర ఆపాడు. దిగి టికెట్ తీసుకుని రైలు కోసం ఎదురుచూస్తున్నాను. చాలా పాత స్టేషన్ లా ఉంది, చెక్క బల్లాలు, ఇనుప కుర్చీలు, పసుపు రంగు టికెట్లు, పెంకులతో కట్టిన స్టేషన్. నా పక్కగా పల్లీలు అమ్ముతున్న బామ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడుదాం అని చూసాను, నాకొచ్చిన తమిళానికి ఆవిడ మాట్లాడే తమిళానికి పూర్తీ వ్యత్యాసం ఉంది. ఓ పిరికెడు పల్లీలు తీసుకొని పది రూపాయలు ఇవ్వబోయాను. వద్దని వారించింది. నేనెంతగా ప్రయత్నించినా తను ఒక్క పైసా కూడా తీసుకోలేదు. పల్లీలు ఇచ్చేసి పక్కగా వచ్చి కూర్చున్నాను నేను.

అటు పక్క ప్లాట్ఫారం మీద శైలు. తను శైలు ఏనా ? నాకు సందేహం కలిగింది. ఒకతే ఉందేమిటి ? తన మొహంలో ఎదో ఆందోళన, ఖంగారు, తత్తరపాటు కనిపిస్తున్నాయ్. తను నన్ను చూసింది. నా వైపు వచ్చింది, “సారీ చెప్పింది. ఏడుస్తుంది. క్షమించమని బతిమాలుతుంది. తప్పు చేసాను, నన్ను మన్నించవ. నిన్ను వద్దునుకోవటం నేను చేసిన తప్పు, కాదు పాపం. నా మీద కోపం లేదు కదా.” ఇలా తన మానాన తను మాట్లాడుతుంది. నేను ఏమైంది అని అడిగేలోపు, వాళ్ళ నాన్న వచ్చాడు. వెళ్దామా అని, తనని తీసుకువెళ్ళిపోతున్నాడు. తను కళ్ళ నిండుగా నీరుతో నావైపే చూస్తుంది, నేను కదలకుండా తననే చూస్తున్నాను. ఏం చేయాలో తోచలేదు నాకు. రెప్ప పాటులో ఆ దృశ్యం నా కళ్ళలో చెరిగిపోయింది, మనసులోకి చేరిపోయింది. నాకేం అర్ధం అవ్వటం లేదు. శైలు, కన్యాకుమారిలో ఏం చేస్తుంది. తనకు పెళ్ళైపోయింది కదా. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నా పక్కగా ఓ సన్యాసి కూర్చొని ఉన్నాడు. “ఏంటి! ఆందోళన పడాల వద్దా అని ఆందోళన పడుతున్నట్టున్నావ్ ?” అని అడిగారు ఆ సన్యాసి. నేనేదో అడిగేలోపు, “చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఏది పూర్తిగా చెయ్యవా నువ్వు ? ఎంత నమ్మకం ఉందొ తెలుసా నీపైన నాకు. ఒక దగ్గర మొదలవుతావ్, ఎక్కడికో వెళ్ళిపోతావ్. ఇప్పటివరకు చూసి చూసి నాకు విసుగొచ్చేసిందిరా అబ్బాయ్, ఈ ఒక్క ప్రయాణం అయినా పూర్తి చెయ్. తర్వాతి గమ్యం ఎక్కడికి ?” వారణాసి అని నాకు తెలీకుండానే నేను సమాధానం చెప్పేసాను. “వచ్చావు గా, ఇక్కడేం చేయాలనుకున్నావో చేయి మరి. నాకు వేరే పనుంది మళ్ళీ కలుస్తా” అంటూ వెళ్ళిపోయారు ఆయన. అప్పటివరకు నా చుట్టూ ఉన్న పరిసరాలని పట్టించుకోని నేను, ఆయన వెళ్ళిన దారి వెంట చూస్తూ అవాక్కయిపోయాను. వారణాసి లో హరిశ్చంద్ర ఘాట్ లో ఉన్నాను నేను. ఎదురుగా గంగమ్మ తల్లి, ఇంతకాలాని గుర్తొచ్చానారా అనట్టు చూస్తుంది నావైపు. ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది గుర్తులేదు నాకు. అవసరం కూడా లేకపోయింది, ఎందుకంటే కాశికి అంటే కైలాసం కదా, ఎలా వస్తే ఏంటి ? వెంటనే వెళ్లి అప్పటివరకు చేసిన పాపాలన్నీ గంగమ్మకు అప్పగించి, దేహాన్ని ఆత్మని శుద్ధి చేసుకొని విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాను. ఎదో తెలీని దైవత్వం నా చుట్టూ చేరినట్టు, నాతో నడుస్తున్నట్టు, నాలో ఉనట్టు అనిపించింది. వారణాసి లో అగోరాలు అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.

ఘాట్ లో ఓ పెద్ద చెట్టు కింద, కూర్చొని ఆతురుతగా చపాతీలు తింటున్న నా పక్కన వచ్చి కూర్చున్నారు ఓ పెద్ద మనిషి. “ఎందుకీ ఆరాటం ?” ఆకలిగా ఉందండీ. “ఇప్పటికీ తీరలేదా ?” ఇప్పుడే తింటున్నానండీ. “హా హా హా హా”. ఎందుకు నవ్వుతున్నారు ? “కడుపులో పుట్టే ఆకలి గురించి కాదు, కలవరం పుట్టించిన ఆకలి గురించి అడిగింది. ఇల్లు వదిలి ఇంత కాలం చేసిన ప్రయాణంలో ఆకలికి అర్ధాన్ని తెలుసుకోలేకపోయావే. ఏ గమ్యం చేరితే ఏంటి ?” ఒక్క ముక్క తినగానే ఆకలి తీరిపోయింది, చపాతీ పక్కన పెట్టి ఆయనకు నా గురించి ఎలా తెలుసా అని అడిగాను. “నా గురించి తర్వాత, ముందు నీ గురించి తెలుసుకున్నావా ?” దానికోసమే తిరుగుతున్నానండీ, ఎక్కడికి వెళ్ళినా అర్ధం అవ్వటం లేదు, అంతు చిక్కటం లేదు. “హా హా హా నీకోసం నువ్వు ఎక్కడున్నాను, ఎలా ఉంటాను అనేది తెలుసుకోవటానికి ఇన్ని ఊర్లు ఇంత ప్రయాణం చేస్తున్నావా? అద్దం ముందు నిలబడితే సరిపోయేది కదా.” ఆ అద్దం గురించే వెతుకుతున్నానండి. ప్రతిబింబాన్ని చూపించే అద్దాలు చూస్తూనే ఉన్నాను చిన్నప్పటినుండి, ప్రతీది వివరించే అద్దం కోసమే ఈ ప్రయాణం. ఎంతకీ గమ్యం దొరకటం లేదు. విసుగొచ్చేస్తుంది. “ఆ అక్కడే తప్పు చేస్తున్నావు. అద్దంలో చూడకు, అద్దంలోకి చూడు. నువ్వే అద్దానివి, నువ్వు చూసే ప్రతి ఒక్కరు నీ సహజ పరివర్తన లక్షణ ప్రతిబింబాలు మాత్రమే. నువ్వు ప్రతిబింబాలు చూసి చూసి అవే నిజం అనుకోని బ్రమపడుతున్నావ్. నువ్వు ప్రతిబింబానివో, పరివర్తనవో కావు అద్దానివి. నేలపైన నిలబడి నీ పాదాలు ఎక్కడ ఉన్నాయా అని ఆకాశం లో వెతికితే ఎప్పటికీ దొరకవు, అలానే నీలో కాకుండా వేరెక్కడో వెతికితే నీకు నువ్వు ఎలా తెలుస్తావ్. నువ్వున్న స్థితిలో ప్రతిబింబాలు లేని ప్రాంతానికి వెళితే తప్ప నిన్ను నువ్వు గుర్తుపట్టలేవు. నీ గురించి నీకు తెలిసిన క్షణనా కాలం నిశ్చలంగా నిలిచిపోతుంది.” ఆయన చెప్తుంటే నేను నిశ్చేష్టుడిని అయి కనురెప్ప వేయకుండా ఆయన్నే చూస్తూ ఉన్నాను. “నువ్వే నేను! ఎంతసేపు నిన్ను నువ్వే వేరేలా నాలో చూస్తూ ఉంటావ్. వెళ్ళు వెళ్ళు.” ఎక్కడికి ? “కాళ్ళని నమ్ము, అవే తీసుకుపోతాయ్.” సరే, అని వెనక్కి తిరగ్గానే అమ్మ ఎదురుగా నిల్చొని ఎక్కడికి అని అడిగింది.

మిగిలిన కథ తర్వాతి భాగం లో….

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,