What If…Contractor From Muthyala Muggu Reacts On Global Warming?!

 

“Welcome to యమపురి and we hope you will have a most pleasant and memorable stay here. యమఫాస్ట్ Jet Airways, యమspice సూపర్ Jet, యమిoడిగో (యమ-IndiGo) లాంటి ఎన్నో ఎయిర్లైన్స్ ఉన్నా…మా Air Yama నే choose చేసుకున్నందుకు మీకు మా ధన్యవాదములు.” అన్న announcement విని… “పాపుల నెంబర్ పెరగడంతో భూ లోకం నుండి యమ లోకానికి విమానాలు నడుపుతున్నారనమాట” అనుకున్నాడు, అప్పుడే నరకం లోకి అడుగు పెట్టిన గౌతమ్. విమానం దిగి కాస్త నడవగానే ‘Tech నరక’ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ మాదిరి బిల్డింగ్ తారసపడింది. దగ్గరకి వెళ్ళగానే ఆటోమెటిక్ గేట్స్ తెరుచుకున్నాయ్…చల్లటి AC గాలి తగిలింది, ఎదో షాపింగ్ మాల్లో అడుగు పెట్టినట్టు.

నరకంలో పాపులకి, వారు చేసిన పాపాల బట్టి శిక్షని విధించే కాంట్రాక్టు ని కొట్టేసిన కాంట్రాక్టర్ తో “ New పాపి came అయ్యా” ఇంగ్లీష్ ని తెలుగుని కలిపి తెంగ్లీష్ లో అన్నాడు, ఆయన సెక్రటరీ. “అబ్బా సెగట్రీ…ఎప్పుడూ పనులూ… బిజినెస్సేనా…పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి…ఆ పక్రుతమ్మ సేవ చేసుకోవద్దూ…” అని విసుక్కున్నాడు కాంట్రాక్టర్. “Yes sir” అన్నాడు సెక్రటరీ. “ yes sir గాదు…కల్లట్టుకు సూడు…కిందేదో మర్డర్ జరిగినట్టులేదూ…భూ లోకం లో…భూమి నెత్తురు గడ్డ లా లేదూ…ఈ యేసం కాలంలో…మడిసన్నాక కాసింత కళాపోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే…మడిసికి గొడ్డుకి తేడా యేటుంటదీ.” అన్నాడు కాంట్రాక్టర్. “late అయితే భూ లోకం నుండి లేటయిన కేటుగాళ్ళ number పెరుగుతుంది కాబట్టి…త్వరగా art nutrition (కళాపోషణ) కి మన share సాయం మనం చేద్దమంటూ” రిసెప్షన్ లో వెయిట్ చేస్తున్న గౌతమ్ దగ్గరకి కాంట్రాక్టర్ ని తీసుకెళ్ళాడు…సెక్రటరీ.

“అలో…అలో…అలో…అలో…యెల్కంటూ నరకం…చానా కష్టపడినట్టున్నావ్ గా….ఏది, సచ్చాక….ఎంత డబ్బట్టుకోచ్చావ్ ఏటి?…జేబులు చూపించు…అంటూ వెటకారంగా నవ్వి…ఇది మేo ఇక్కడకి రాగానే అడిగే మొదటి question” అన్న కాంట్రాక్టర్ ని చూడగానే… “మిమ్మల్ని ఎక్కడో చూసానే…..ఆ…ముత్యాల ముగ్గు సినిమా…కాంట్రాక్టర్ కదూ” అన్నాడు గౌతమ్. “సినేమా…కధల్ జెప్పమాకా…ముందు ప్లే గ్రౌండ్ లోకి పదా” అన్నాడు కాంట్రాక్టర్. “ఆహా…నరకంలో పొద్దు పొద్దున్నే గేమ్స్ ఆడిస్తారనమాట…సూపర్, ఇంకెందుకు లేటు…వెళదాం అంటూ ఉత్సాహం ప్రదర్శించిన గౌతమ్ ని తీసుకుని…గ్రౌండ్ లోకి బయలుదేరారు కాంట్రాక్టరూ… సెక్రటరీ. అక్కడ వాల్లాడే గేమ్స్, వాటి రూల్సు, వాటి eligibility గురుంచి వివరించసాగాడు కాంట్రాక్టర్.

“ఆ పస్టు కోర్టులో జరిగే ఆట పేరు ‘అక్కు పక్షుల తప్పటడుగులు’. ఇందులో సాన్స్ కొట్టేసిన ప్లేయర్స్ అందరూ ఎంతో సెమటోడ్చి…భూమి మీద ఉన్న ఎన్నో అడవులు కనుమరుగవ్వడానికి ప్రత్యక్షంగా గాని…పరోక్షంగా గాని కారణమయిన వాళ్ళు లేదా చెట్లు నరికేయకుండా మార్చదగిన construction ప్లాన్స్ ని, మార్చకుండా నిర్లక్ష్యం చూపించిన కాంట్రాక్టర్సూ…ఇంజనీర్సూనూ. ఇదో 100 కిలోమీటర్ల పరుగు పందెం. మాములుగా పరిగెత్తమంటే zeal రాదు కాబట్టి, వాళ్ళని encourage చేయడం కోసం పై నుండి వీళ్ళ చేష్టల వల్ల అంతరించిపోయిన పక్సుల్ని, కిందనుండి కనుమరుగయిన అనేక సర్పాలను వదుల్తాం, దాoతో ప్లేయర్స్ అంతా రెట్టించిన ఉత్సాహంతో లగెడతారనమాట. “అలా చేస్తే చచ్చిపోతారు కదా” అన్నాడు గౌతమ్. “అబ్బే….ఆ సాన్స్ లేదమ్మా…ఆల్రెడీ సత్తేనే ఇక్కడికొచ్చారు…ఇంకా సచ్చే సౌకర్యం ఈళ్ళకి లేదు. నొప్పి అనుభవించడం తప్ప. అందుకే…దీన్ని… నరకం అంటారు” అంటూ వెటకారంగా అన్నాడు కాంట్రాక్టర్.

ఆ రెండో కోర్ట్ లో ఆడుతున్నరే…అది…లక్ష్మీ గణపతి ఫిలింస్ వారి ‘భూలోక మోసగాళ్ళ పై యమ లోక మొసళ్ల దాడి’. ఈ ఆటలో మొదటగా…ఆటగాల్లంతా…కుళ్ళిపోయిన కోడిగుడ్ల సువాసన వెదజల్లే Hydrogen sulfide తో పాటు అనేక రకాల వాతావరణ కాలుష్యానికి కారణమయిన గ్యాస్లతో నింపబడిన ఫ్యాక్టరీ చిమ్నీల్లో ఉంచి…సేతులు కట్టేసి భేషుగ్గా గాలి పీల్చుకునే అరుదైన అవకాశo ఇత్తాo. ఆ తర్వాత అందరినీ….స్పెసల్గా మూసి నది నుండి తెప్పించిన నీటితో తయారు సేసిన స్విమ్మింగ్ పూల్లో పడేసి…as it is గా చేతులు కట్టేసి ఈతల పోటీ స్టార్ట్ చేత్తాo. ఇందులో యరైటీ ఎంటంటే, పోటీ ప్లేయర్స్ మధ్య గాదు…వాళ్లకీ…అందులో మేము వదిలిన మోసల్లకి మధ్య. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ అంతా కూడా, తమ జీవిత కాలమంతా కష్టపడి, తమ తెలివితేటలన్నీ వాడి…పర్యావరణాన్నికాపాడడానికి పెట్టిన రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వకుండా ఎన్నోఫ్యాక్టరీలు పెట్టి కోట్లు సంపాదించిన కష్ట జీవులు మరియు వాళ్ళకి సహకరించిన ప్రభుత్వ లంచగొండులు.

అదుగో కోర్ట్ నెంబర్ 3 లో ఆడే ఆట ‘మిరపకాయ లబో దిబో’. ఈ ఆటలో మొదట అందరికీ గుంటూరు ఘాటు మిరపకాయలు తినిపిస్తాం. ఆ తర్వాత చల్లటి Coca-cola, Pepsi, Sprite ఇవన్నీ దూరంగా పెడతామ్. వాళ్ళు పరిగేట్టుకుంటూ వచ్చి తాగుదమనుకునే లోపల వాటిని…మన యిటలాచారి గారు…మా కోసం స్పెసల్గా తయారు చేసి ఇచ్చిన టెక్నాలజీ తో, అక్కడనుండి మార్చేసి….యేరే కార్నర్ కి పంపేత్తాo, దాంతో అంతా అవి దొరికేదాకా పరిగెడతూనే ఉంటారు. ఆ గ్రూప్ లో…అదుగో…సిన్న సైజు గున్న ఏనుగులా కనిపిస్తందే…ఆ లేడీసు…ఓ సారీ…వాటర్ టాప్ వదిలేసానన్న విశయం పక్కనపెట్టి…‘అత్తా…ఆస్తి నీ సొత్తా’ అనే సీరియల్ ఎక్కడ మిస్ అయిపోతానేమో అని టీవీ ముందుకు పరిగెత్తింది. దాని వల్ల దాదాపు పది బకెట్ల నీళ్ళు వేస్ట్ అయ్యాయి. ఆ గ్రూప్ లో అందరూ నీళ్ళు వేస్ట్ సేసిన కేటగిరీనే అనమాట.

ఆ నాలుగో కోర్ట్ లో జరిగుతున్న మూజికల్ ఈవెంట్ పేరు ‘కాస్కో కరెంటూ…చూపిస్తా నా టాలెంటూ’. ఇందులో అందరికీ కరెంటు షాక్ లిస్తూ, కరెంట్యాక్షరి ఆడిస్తామనమాట. ఎవరు ఏ రాగంతో మూలగడం ఆపారో, పక్కవారు అదే రాగం తో మూలగడం స్టార్ట్ సేయలనమాట. ఎవరైతే రైమింగ్ తప్పారో…వాళ్లని ఉప్పునీళ్ళలో పడేసి…వాటిలోకి కరెంటు పాస్ సేత్తామనమాట. అడుగో…ఆ సోడాబుడ్డి సుబ్బారావుగాడు లేడు…ఆడూ… ‘అప్పారావు అప్పడాల కంపెనీ పై అప్పులోల్ల దాడి’ అనే సినిమాకి వెళ్ళే దారిలో…ఇంట్లో వేసిన లైట్లు, ఫ్యాన్లు ఆపడం మర్చిపోయానే అన్న విసయం గుర్తొచ్చినా…తిరిగి యెళ్లి ఆపకుండా నిర్లక్ష్యం సేసాడు. ఆ మిగతావాళ్ళు కూడా ఈడి లాగే నిర్లక్ష్యంతో పవర్ వృధా సేసి ఈ competition లో పార్టిసిపేట్ సేసే సాన్స్ కొట్టేసరనమాట.

ఆ కోర్ట్ నెంబర్ 5 లో దారపోస్తున్న శ్రమదానం పేరు ‘లారీ తో లొల్లి’. Energetic కీడాకారులందరూ, మండు వేసవి మిట్ట మధ్యాహ్నం ఇసుకలో కూరుకుపోయి కదల లేక ఇబ్బంది పడుతున్న ఇసుక లారీ ని తమ ప్రాణాలకు తెగించిమరీ కాపాడటానికి ప్రయత్నిస్తారనమాట. ఇందులో రూల్స్ ఏంటంటే…గ్రౌండ్ లో కనీస ఉష్ణోగ్రత 60 డిగ్రీలుండాలి, పైగా…యే…ప్లేయరూ సెప్పులేసుకోకూడదనమాట. ఈ ఆటగాళ్ళలో గొప్పతనం ఏమిటంటే…యే ఒక్కరూ…. ఒక్క నిముషం కూడా బ్రేక్ తీసుకునే ప్రయత్నమే సేయరసలు. ఒక యేల తీసుకున్నారో…మా వాళ్ళు ఉప్పు కారంలో హెడ్ బాత్ సేసోచ్చిన కొరడాల సాయంతో…ఆటగాళ్ళ వీపుల మీద ముగ్గేస్తూ…వాళ్ళకి యెన్ను దన్నుగా నిలబడతారనమాట. సైకిల్ పై గాని…కాలినడకన గాని…వెళ్లి పూర్తి సేయగల పనులకి కూడా వాహనాలు వాడి వాతావరణాన్ని కాలుస్యం సేసిన తోలు మందoగాళ్ళoతా…ఈ ఆటలో పాల్గొనే లక్కీ ఛాన్స్ కొట్టేసారoటూ”…ఆటలన్నా…కళలన్నా తనకున్న అభిమానాన్ని వివరించసాగాడు కాంట్రాక్టర్. ఇంతలో సెక్రటరీకో SMS వచ్చింది, అది చదవగానే సెక్రటరీ ఫేసు, వందనిమ్మకాయల శక్తి ఉన్న ఒక చుక్క విమ్ జెల్ తో కడిగిన కంచo లా మెరిసిపోయింది. “సార్…మనం from many years…day అనగా night అనగా eyes fruits అయ్యే లాగా…ఎదురు చేస్తున్న మనసున్నమారాజులు రానే వచ్చారు, special గా వీళ్ళకోసం ఉతికించి ఇస్త్రీ చేసిన రగ్గులు రెడీగా ఉన్నాయ్…తెప్పించమంటారా?” అన్నాడు సెక్రటరీ. “ఓసోస్…ఈ ఓల్ నరకంలో…ఈళ్లేనయ్యా…నా పావ్రేట్స్…బేగి తెప్పించేయ్ మరి. అదిగో రానే వచ్చారు. అలో…అలో… అలో..అలో…రండి రండి. 2002 నుండి 2014 వరకు దేశం మొత్తం మీద వడదెబ్బకి 6529 మంది సనిపోతే, ఒక్క మన రాష్ట్రంలోనే 4769 మంది సనిపోయారు…అంటే దాదాపు 73%. యెల్త్ మినిస్ట్రీ మరియు పర్యావరణ శాఖ కిందకొచ్చే…మీరంతా ఈ విషయంలో ఏం సెర్యలు తీసుకున్నారో… బేగి సెప్పేయండమ్మా” అన్నాడు కాంట్రాక్టర్. “చర్యలు తీసుకోకపోవడమేంటి…చనిపోయిన వాళ్ళందరికీ…ex gratia ఇప్పించాం. బ్రతికున్నోల్లందరికీ…ఉదయం 10 తరువాత…సాయంత్రం 5 లోపు…ఇళ్లల్లో నుంచి బయటకి వెల్లోద్దని సలహా ఇచ్చాం.” అని గొప్పగా చెప్పాడు ఆ బాచ్ లో ఒక పెద్దాయన.

“అబ్బా సెగట్రీ…ఈ మారాజులందరికీ ఇంకా గ్యానోదయం అవలేదుగాని…ఈ బాచ్ అందర్నీ నిప్పుల తివాచీ పై నడిపిస్తూ ఊరేగింపుగా తీసుకెళ్ళండి. ఆ తరువాత, గ్రౌండ్లో ఉన్న కరెంటు పోల్స్ కి బెల్లం పాకం పూసి, గండు సీమలు విందుకు రెడీ అవగానే, వీళ్ళందరికీ రంధ్రాలున్న రగ్గులు చుట్టి వాటికి కట్టేయండి. గ్రౌండ్ లో Temperature 70 డిగ్రీలకి తగ్గకుండా చూడండి.” అని ఆర్డర్ వేసాడు కాంట్రాక్టర్. “బాబోయ్…వద్దు..చచ్చిపోతాం సార్…మమ్మల్ని వదిలేయండంటూ” ఏడవడం మొదలెట్టింది ఆ మందంతా. “సత్తే…ఎగస్ గ్రేషియా ఇప్పిద్దాంలేరా….దానికెందుకంత బాధ. ఏమీ తెలియని అమాయక పజలు బలయిన పతీ సారీ…వాళ్లు కట్టిన డబ్బులతో… వాళ్ళకే… ఎగస్ గ్రేషియాలిచ్చేయడం, temper vory సొల్యూషన్స్ వాళ్ళ మొఖాన పడేయడం.‘బయట ఎండగా ఉంటే ఇంట్లోకెల్లాలి… ఇంట్లో పెళ్ళాం పొమ్మంటే కోర్ట్ కెల్లాలి’ ఇలాంటి చవకబారిన సలహాలివ్వడానికా… మీరు జీతాలు తీసుకునేది?…ఆ మాత్రo వాళ్ళకి తెలీదా! అసల Awareness ఏదిరా జనాల్లో..? ‘ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్తుతలకి కారణం ఏంటి..? ఇప్పుడు వాటిని అదుపులో పెట్టడానికి మనమేం సేయాలి’ అన్న దానిపై అవగాహన కలిపించాల్సిన భాద్యత మీదా కాదా! అబ్బా సెగట్రీ… ‘ఈ ఎదవలకి awareness తెప్పించడం కంటే… ఎద్దులబండిని escalator మీద నడిపించడం తెలికయ్యా’…నా వల్ల కాదు, యంటనే ఈళ్ళని గ్రౌండ్ కి ఎత్తుకెళ్ళి సన్మాన సత్కారాలు సేయిన్చేయండన్నాడు కాంట్రాక్టర్.

“ఇంత చిన్న mistakesకి అంత పెద్ద శిక్షలవసరమా” అని భయపడుతూ అడిగాడు గౌతమ్. “ఏంటి సిన్న మిస్టేక్సా…ఇదిగో సెగట్రీ ఆ టైం టాబ్లెట్ ఇలా పట్రా. ఈళ్ళు సేసిన తప్పుల వల్ల మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడు….ఈ టాబ్లెట్ లో ఫ్యూచర్ డేట్ ఏదైనా టైప్ సేసి మీ ఊరు ఎలా ఉండబోతుందో చేక్చేసుకోమన్నాడు” కాంట్రాక్టర్. Random గా ఆ టైం టాబ్లెట్ లో, వాళ్ళ ఊరు పేరు…future డేట్స్ టైప్ చేసి భవిష్యత్ బాగోతం చూడడం మొదలెట్టాడు గౌతమ్.

2032…సంక్రాంతి పండుగ ముందు రోజు, ఓ సుబ్బారావు గారిల్లు…
“ఇదిగో చిన్నీ..నా చిన్నవయసులో నేను తెలిసీ తెలియక చేసిన చిన్న చిన్న తప్పులకి మీటర్ బెత్తం వాడి కనీసం లీటర్ చెమటోచ్చేలా నన్ను పరుగెత్తించేవారు మా నాన్న… మీ తాతానూ!మధ్య..మధ్యలో MTR గరం మసాల వాడి తయారు చేసిన ఘాటు బూతులు నా మీద ప్రయోగిస్తూ…వీపు విమానం మోత మోగాలి…కేక కొలంబియా దాకా వినిపించాలంటూ మా నాన్నకి గోల్స్ పెట్టే వాడు మా తాత…మీ ముత్తాతానూ! సహజ వనరులన్నీ స్వాహా చేసి…వాళ్ళ దిక్కుమాలిన అలవాట్లతో ప్రకృతికి తూట్లు పొడిచి…మనకి కన్నీళ్ళు తెప్పిస్తున్నారిప్పుడు! దానికి ఎంత పెద్ద శిక్ష వెయ్యాలో వాళ్ళకి. వాళ్ళు సుఖాలు అనుభవించి…మనల్ని నరకంలోకి తోసేశారు. ఇప్పుడు గోడెక్కి…మన వైభావాన్ని చూస్తున్న మా పూర్వికుల ఫోటోలను బయట పడేయ్. వాళ్ళకైతే భోగి మంటకి…అగ్గిపెటో…లైటరో అవసరముండేదిగాని…మనకి ఆ అవసరం లేదుగా…బయట పడేస్తే…ఈ చలి కాలం ఎండకి కూడా ఆటోమేటిక్ గా తగలడిపోతాయ్.” అంటూ పూర్వికులపై తన అమితమయిన ప్రేమను చాటాడు సుబ్బారావ్.

2050…మాఘమాసంలో ఒక రోజు…. ఓ వెంకట్రావు గారిల్లు…
“ఏమోయ్ పెళ్లి వాళ్ళు వచ్చేసారు. ఒక్కోళ్ళకి 2.812 మి.లీ మూతల్లో నీళ్ళు పట్టుకురా…ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా చూడు, అసలే ఆ నీళ్ళు మనకి ఓ వారానికి సరిపోయేవి అనుకున్నాడు మనుసులో. అలాగే వచ్చేప్పుడు…దాహం కాకుండా చప్పిరించే…ఆ టాబ్లెట్ కూడా తీసుకురా” అన్నాడు వెంకట్రావు. “నేను straight forward మనిషిని… డైరెక్ట్ గా పాయిoట్ కి వచ్చేస్తాను. మాకు పదేళ్ళకి సరిపోయే….టిష్యూ పపెర్సూ, మినరల్ వాటర్ బాటిల్సూ, ఆక్సిజెన్ సాక్స్ లు కట్నంగా కావాలన్నాడు” పెళ్ళికొడుకు తండ్రి వెంకట్రావుతో. “నేను ఇంకా straight forward మనిషినండీ…కిందట సారి వచ్చిన పెళ్లి వాళ్ళు సేమ్ ఐటమ్స్ ఐదేళ్ళకిస్తే చాలన్నారు…పైగా పిల్లాడు పెర్ఫ్యూమ్ కంపెనీ ఓనరూ…! సంవత్సారానికోసారి స్నానం చేసే ఈ కాలం బతుకలకీ ఆ పెర్ఫ్యూమ్ కంపెనీ సంబంధమే బెటర్ కాబట్టి, దయచేసి ఆ మూతల్లో ఉన్న అమృతాన్ని… అలాగే వదిలేసి వచ్చినదారినే వెళ్ళిపోవాలని” సవినయంగా మనవి చేసుకున్నాడు వెంకట్రావు. ఒక్కసారిగా…ఏదో అలారం మోగింది. అందరూ వెంటనే…ముక్కుకి మాస్కులేసుకుని…వాళ్ళ దగ్గరున్న ఆక్సిజెన్ సాక్స్ లు వాడడం మొదలుపెట్టారు. పది నిముషాల కంటే ఎక్కువ మామూలు గాలి పేలిస్తే…ఇంక పీల్చిన గాలి వదలాల్సిన అవసరం లేదు…అటు నుంచి అటు పైకి పోడమే అని ఆ అలారం అర్ధం.

“ఇంక చూసింది చాలు…ముందు గ్రౌండ్ కు పదా…ఇప్పటికే శాలా లేట్ అయిపోయినాది” అని విసుకున్నాడు కాంట్రాక్టర్. “నేనేం తప్పు చేశానని” భయపడుతూ అడిగాడు గౌతమ్. “ఇంత సదువు సదువుకున్నావ్. ఈ నాటి వాతావరణ పరిస్థితులకి కారణమయిన ‘గ్లోబల్ వార్మింగ్’ టాపిక్ మీద ప్రాజెక్ట్ లు చేసావ్. గ్లోబల్ వార్మింగ్ నిర్మూలనకి తీసుకోవాల్సిన సెర్యలు పైన సెమినార్లు ఇవ్వడమే తప్ప…సేతల్లో ఏమైనా సేసావా?…ఇంకుడు గుంతలు తవ్వావా?…మీ ఇంటి టెర్రస్ పైన మొక్కలేమైనా పెంచుతున్నావా?… ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనేప్పుడు, ఆ వస్తువు ఎనర్జీ రేటింగ్ ని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతని…మీ ఇంట్లో వాళ్ళకి అర్ధమయ్యేలా సెప్పావా?…పుట్టిన రోజుకి వేలు ఖర్చుపెట్టి పది మందికి పార్టీ ఇవ్వడమే కాదు…ఆ పది మంది చల్లగా బ్రతకడానికి ఉపయోగపడే నాలుగు మొక్కలు కూడా నాటలని తెలీదా నీకు?…పైగా పట్టుమని పది నిముషాలు కూడా లేని…మీ ఇంటి పక్కనున్న కాలేజీ కెల్లడానికి…నీకు బైక్ కావాలని ఇంట్లో అలకా?… గుంపులో గొర్రె లాగా…నీ కోసం నువ్ పరిగెడుతూ…ఈ రోజు నేను సుఖపడితే చాలు…రేపటి తరం ఎలా తగలడితే నాకెందుకనుకుంటున్న…నీ లాంటి వాళ్ళ గురించేరా…ఆ నాడు శ్రీ శ్రీ ‘ఎవుకలు కుళ్ళిన…వయస్సు మళ్ళిన సోమరులని’ రాసింది. ఇదిగో…సెగట్రీ…ఈ సోమరిపోతుని awareness (అవగాహన) సెక్షన్ కింద…ఇందాకడ బాచ్ తో పాటు పోల్ కి కట్టేసి ‘రగ్గు లో రగడ’ ఆడించండన్న” కాంట్రాక్టర్ ఆజ్ఞ డెత్ సెంటెన్స్ లా వినిపించి….“నో…నో…నన్ను వదిలేయండి…నాకు బైక్ అక్కర్లేదు…డాడీ…నాకు ఏ బైక్ కొనద్దు”…అంటూ…గట్టిగా కేకలేస్తూ…నరకం కల నుండి నేరుగా… నేల మీద పడ్డాడు గౌతమ్. “ఏరా…నీకు బైక్ అక్కర్లేదని మామూలుగా చెప్పొచ్చు కదరా! దానికిలా…మంచం పై నుoడి కిందకి దూకి…కాళ్ళు రెండు ఇదిలిస్తూ చెప్పాలా?…ఏదో చిన్నపిల్లాడు ఐస్ క్రీమ్ కావాలంటూ….అలిగినట్టు. కావాలని అడగడానికీ…వద్దని చెప్పడానికీ…ఒకటే బాడీ లాంగ్వేజ్ అయితే ఎలారా?…ఇంజినీరింగ్ కి వచ్చావ్…ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలా బ్రతుకుతావ్రా రేపు…లే…కాలేజికి…టైం అవుతుంది” అంటూ చమత్కరించాడు గౌతమ్ తండ్రి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,