అమ్మతో పోటీ ఎంటి, తన ప్రేమకు పోలిక ఎంటి..!? – A Short Musing

 

Contributed By Chandu machineni

 

రెండక్షరాల పిలుపు,
తొమ్మిది నెలల ఓర్పు,
ఓనమాలు దిద్దు ఒడి,
నడకలు నేర్పు బడి
అమ్మ కదా మనకన్ని మొదలు తనే,
అమ్మ కదా తనకన్ని ఎప్పటికీ మనమే,
ఎన్ని చెప్పినా తనివితీరని అమ్మతనమే,
ఎంత పొగిడినా అందుకోలేని గొప్పతనమే..!!!
నీ ప్రేమ నిస్వార్థం,
నా ఆనందం నీ త్యాగం,
నా బ్రతుకు నీ భిక్ష,
నా జీవితం నీకు అంకితం.

 

అనురాగం, మమకారం కలగలిపిన ప్రేమకు ప్రతిరూపం అమ్మ❤️
తను చూపించే ప్రేమకు హద్దులు లేవని తెలిసినా,
మనసులో తనంటే పెరిగిన ప్రేమకి పరిధులు పెట్టడం లేదు.
ఋణపడి ఉన్నా తనకి,
తొమ్మిది నెలలు తనను మించిన నన్ను భారం అనుకోకుండా మోసినందుకు,
ఇంకా తన ప్రేమతో కొత్తగా పుట్టిస్తున్నందుకు..
ఈ జీవితం రాసిచ్చినా చాలదు,
మనం ఎక్కడున్నా తన తోడు, మన నీడను మించి చల్లని చూపుల వెంటుంటుంది.
అమ్మా అని మనసులో స్మరిస్తే చాలు..
కలిగే ఆ హాయి, నిమిరే తన చేయి..
కలిస్తే చాలదా తరించడానికి,
తన ఒడిన చేరితే చాలదా అలా స్థిరంగా ఉండిపోవడనికి.

 

తన నిస్వార్థమైన ప్రేమను చూసేందుకు కళ్ళు చాలక, కన్నీళ్ళు వచ్చాయి.
తన ప్రేమ ముందు, మనసు రాలేక సవాలక్ష ఆలోచనలు రెక్కేత్తించాయి.
తను కురిపించే అనురాగలకి, సాటిలేక ఊహలే చిన్నబోయాయి.
తను చూపించే ఆప్యాయతలను దాటిరాలేక ఆశలే ఆగిపోయాయి.
తన ఒడిలో తల వాల్చి, ప్రపంచాన్నే మర్చిపోవాలని ఉంది.

 

అమ్మ కొంగు పట్టుకొని తిరిగిన రోజులు,
అమ్మ వెనక పడుతు లేస్తూ గడిపిన క్షణాలు,
నిజమైన ప్రేమకు మిగిలిన జ్ఞాపకాలు,
అసలైన అనుబంధానికి చెదరని గుర్తులు, తీపిస్మృతులు.

 

మనది ప్రేమైతే తనది సర్వస్వం,
అయినా అమ్మతో పోటీ ఎంటి, తన ప్రేమకు పోలిక ఎంటి..!?

 

అమ్మ
నా శ్వాసకు ఆధారం,
నా కలలకు ఆకారం,
నా మొదటి అక్షరం,
నా జన్మకు శ్రీకారం,
తరగని నీ మమకారం,
ఎరుగని ఘన సత్కారం,
ఎనలేని ప్రేమకు ఆస్కారం,
నాలోని తనే నా సంస్కారం.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,