The Beauty Of ‘మిథునం’: Revisiting The Love Story Of An Unconventional Couple

 

Contributed by Raviteja Ayyagari

చరిత్రని ఒక్కసారి కదిలిస్తే, ప్రేమ గురించి మనకి కనిపించే కథలు లైలా మజ్ను, మన దేశానికీ వస్తే దేవదాసు పార్వతి. అంటే, ప్రేమ శాశ్వతం, కానీ ప్రేమించుకున్న వారు తాత్కాలికం. ఈ చెప్పిన కథలలో ప్రేమ అనేది ఒక అబ్బాయి, అమ్మాయికి మధ్యలో కలిగే ఒక బంధం అని చెప్పి మన రచయితలు, కవులు జనరల్ గా చెప్పేసారు. కానీ, నాకు ఎప్పుడు ప్రేమ అంటే ఒకటే భావన. అదేంటంటే, ప్రేమ అనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి కి మధ్యలో మాత్రమే కాదు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో, ఇద్దరు స్నేహితుల మధ్యలో, అన్న చెల్లెళ్ళ మధ్యలో, ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ కథకి బరువు పెరిగిపోతుంది, అందులో నేను చెప్పే బంధాల జాబితా పెరిగిపోతుంది.

ఇప్పుడు నేను చెప్పబోయే కథ అలాంటి ఒక పవిత్రమైన బంధాన్ని తెలిచేస్తుంది.

 

గోదావరి జిల్లా…
రామచంద్రయ్య గారి నిలయం…
రాములవారి గుడిలో మొదటి దీపం వెలిగించే సమయం…

ఈ ఇల్లు, గోదావరి జిల్లాలోనే అతి ప్రాచీనమైన ఇళ్లల్లో ఒకటి. ఈ ఇంట్లో ఉంటున్నది, కేవలం రామచంద్రయ్యగారు, వారి అర్ధాంగి జానకమ్మ గారు. గోదావరి జిల్లాలలోని ఒక చిన్న పల్లెటూరిలో, ఆ పల్లెటూరులో కేవలం సైకిల్ మాత్రమే పట్టగలిగినంత అతి చిన్న వీధిలో, తరాలు అంతరించినా మంచితనం ఆవిరవ్వని మనుషులు నివసించిన ఇంట్లో, అంతే మంచితనం కలిగిన ఆయన నివాసితున్నారు. ఆయన ఆ ఊరిలో ఉన్న చిన్న రామాలయానికి పెద్ద పూజారి, మహా పండితులు. మన పురాణాలూ, నాలుగు వేదాలు, ఉపనిషద్దులు అర్థాలతో సహా కంఠస్థం వచ్చిన బ్రహ్మగ్యాని. చీమకి కూడా హాని చెయ్యని అతి తక్కువ మనుషులలో ఈయన కూడా ఒకరు.

 

రాముడికి సీత లాగా, ఈయనకి జానకమ్మ గారి తోడు దొరికింది. రామాయణంలో లాగా, వీళ్ళకి రాజ్యాలు లేవు, కాబట్టి వనవాసం చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ, రావణాసురుడు లేకపోయినా యుద్ధం మాత్రం చేస్తున్నారు. కాలంతో యుద్ధం. మరణానికి దగ్గరలో ఉన్న వీరు ఇరువురు, ఒక పందెం వేసుకున్నారు. చనిపోయేలోపు విదేశాలలో స్థిరపడిపోయిన వీరి పిల్లలు ఒక్కసారైనా వీరిని చూడటానికి వస్తారని ఆవిడ, నోట్ల కట్టల కోసం కన్నవారిని ఎప్పుడో మర్చిపోయారు, ఇంక వాళ్ళు రారు అని ఆయన. ఆ పందెం వేసుకుని ఇప్పటికి అయిదు సంవత్సరాలయ్యింది. కాలంతో పాటు ఆ పందెం యుద్ధంలాగా మారింది. ఆవిడలో రోజు రోజుకి పిల్లలు ఇంక రారు అనే భయం, ఆయనలో పిల్లలు రావట్లేదు అనే బాధ కంటే ఈవిడ బాధ పడుతున్నారు అనే బాధ రెండు పెరుగుతూ వచ్చాయి.

 

పగలంతా రాములవారి సేవకి అంకితం, సాయంత్రం చుట్టు పక్కల వారి లాగే పిల్లలు విదేశాలలో స్థిరపడ్డ తల్లిదండ్రులతో కలిసి కబుర్లు చెప్పుకోవడం, రాత్రి భోజనం సమయంలో తింటున్న పదార్థంలో పిల్లల ఇష్టాలు గుర్తు చేసుకోవడం, రేపు లేస్తామో లేదో అనే భయంతో నిద్రపోవడం, ఇదే ఈ ఇద్దరితో పాటు ఆ వీధి లో నివసించే ప్రతి ఒక్కరి దినచర్య. ఒక మాటలో లో చెప్పాలంటే ఆ వీధి, రిజిస్ట్రేషన్, కేర్టేకర్ లేని ఒక వృద్ధాశ్రమం. ఇంత బరువైన బాధని గుండెల్లో మోస్తున్నా, వాళ్ళని నడిపిస్తున్న ఒకే ఒక్క ఇంధనం, ప్రేమ. వారి వివాహం పెద్దలు నిశ్చయించినదైనా, వారిలో ప్రేమ మాత్రం వారిద్దరి మధ్యలోంచే పుట్టింది.

 

రామచంద్రయ్య: ఏమేవ్! భోజనం చేద్దాం రా.

జానకమ్మ: మీరు కాళ్ళు కడుక్కుని రండి. ఈ లోపులో నేను వడ్డిస్తాను.

భోజనానికి కూర్చున్నారు ఇద్దరు.

రామచంద్రయ్య: ఏం వండావే?

జానకమ్మ: ముద్ద పప్పు, మజ్జిగ పులుసు.

రామచంద్రయ్య: ఓహో! అన్నట్టు, పిల్లలు ఫోన్ చేసారు. రేపు కోడలు, అల్లుడు, పిల్లలతో కలిసి బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు అని నీతో చెప్పమన్నాడు.

ఆ మాట వినగానే జానకమ్మగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి బాధ వల్ల వచ్చిన కన్నీళ్లు కావు. ఆనందం వల్ల వచ్చిన కన్నీళ్లు. పిల్లలు వస్తున్నారు అని వినగానే, భోజనం కూడా తినకుండా లేచిపోయారు.

జానకమ్మ: ఈ మాట ఇంత నీరసంగా చెప్తారేంటి, రేపు బయలుదేరతారు అంటే, మనకి ఎల్లుండి కదా, వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసేయాలి తొందరగా. మీరు భోజనం చేస్తూ ఉండండి.

 

రామచంద్రయ్య: ఒసేయ్! వాళ్ళు ఇంకా విమానం కూడా ఎక్కలేదే, నువ్వు ఇక్కడ భోజనం నుంచి దిగేశావ్. వచ్చి ప్రశాంతంగా భోజనం చెయ్యి. ఆ పిండి వంటలేవో ఇద్దరం కలిసే చేద్దాం.

జానకమ్మ: అలాగే. అన్నట్టు, చూసారా! నేనే గెలిచాను. నాకు తెలుసు పెద్దోడు ఈ అమ్మని వదిలి ఎక్కువ కాలం ఉండలేదు అని. అయితే మరి రేపు నను రాజముండ్రి తీసుకెళ్లి రోజ్ మిల్క్ ఇప్పిస్తారు కదా.

రామచంద్రయ్య: అలాగేనే బాబు. ముందు నాకు ఆ మజ్జిగ పులుసు వడ్డించు.

పందెం అంటే ఏ ఆస్తో, అంతస్థో అని అనుకున్నారు కదూ. వాళ్ళు అల్పసంతోషులు. చిన్న చిన్న వాటికే కొట్లానందం పొందేస్తూ ఉంటారు. రాజముండ్రి లో రోజ్ మిల్క్ అనేది చాలా మాములు విషయం. కానీ వాళ్ళకి మాత్రం అది బ్రహ్మానందం.

 

భోజనం ముగిసింది. ప్రతి రోజు 5 నిముషాలు కూడా దాటని వారి భోజనం ఈ రోజు సంతోషంతో గంట సేపు గడిచింది. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఒక పట్టి రాసుకుని దాన్ని పదే పదే చూసుకుంటూ మురిసిపోయారు. పిండివంటలకు కావాల్సిన సామాలన్ని సేకరించారు. ఆ రాత్రి జానకమ్మ గారికి నిద్రపట్టలేదు. అదే రాత్రి రామచంద్రయ్యగారికి కూడా నిద్ర పట్టలేదు. ఆవిడకి ఆనందంతో పట్టకపోతే, ఆయనకీ అబద్ధం చెప్పాను అనే ఆవేదనతో పట్టలేదు. అవును. పిల్లలు వస్తున్నారు అని ఆవిడకి అబద్ధం చెప్పారాయన. ఎప్పుడు నిద్రపోయారో తెలియదు. ఇద్దరు నిద్రలోకి వెళ్లారు. మర్నాడు రాములవారి దీపం పెట్టాల్సిన సమయం వచ్చింది. కానీ గాలి వాన వల్ల రాత్రి వీళ్ళ ఇంట్లో దీపం ఆరిపోయింది. వారు లేవలేదు. నిద్రలోకి వెళ్లిన వారిద్దరూ, కొంచం సేపటి తర్వాత ఆ రాముడి దగ్గరకే వెళ్లిపోయారు.

 

5 సంవత్సరాలలో ఎప్పుడు చెప్పని అబద్ధం ఆ రోజే ఎందుకు చెప్పాలనిపించింది? చనిపోయే ముందు పిల్లలు వస్తున్నారు అని చెప్పిన అబద్ధం వల్ల, జానకమ్మ గారు సంతోషం, సంతృప్తి తో నిద్రపోయారు. భార్య సంతోషంగా నిద్రపోతోంది అనే తృప్తితో రామచంద్రయ్యగారు కూడా సంతోషంగా కనుమూశారు. కడదాకా కలిసుండి, సంతోషంగా ఒకరి కౌగిలిలో ఒకరు నిద్రలో కన్నుమూసిన రామచంద్రయ్యగారు, జనకమ్మగారి ఈ కథ, స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం. మిథునం సినిమా ఆధారంగా రాసిన ఈ కథ లోని పాత్రలు ఎక్కడో అక్కడో ఎదో ఒక మారు మూల గ్రామంలో ఇంక ఉండే ఉంటాయి. ప్రేమ అనగానే నాకు గుర్తొచ్చే మొదటి కథ, నేను తెలిపిన ఈ మిథునం కథ.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , ,