Meet The Parents, Who Don’t Want Their Kid To Be Registered Under Any Religion

 

సైన్స్ ప్రకారం దాదాపు 20లక్షల సంవత్సరాల నుండి మనిషి ప్రయాణం మొదలైంది, మతాలు మాత్రం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం వచ్చాయని ఒక అంచనా, మూడు వేల సంవత్సరాల క్రితం కొన్ని లక్షల సంవత్సరాల పాటు మతం లేకుండానే మనిషి బ్రతికాడు కదా, మరి ఇప్పుడెందుకు…?

 

మతాల నుండి స్వేచ్ఛ:
డేవిడ్ గారు ఇంతకు మునుపు క్రైస్తవ మతానికి చెందినవారు, తన జీవన సహచరి రూప గారు ఒకప్పుడు హిందూ మతానికి చెందినవారు.. వీరి ప్రేమకు ప్రతిరూపమైన కుమారుడు ‘ఇవాన్ రూడే’ మాత్రం పుట్టుకతోనే ఏ మతానికి చెందినవాడు కాదు అని ఆ అస్తిత్వం కోసం పోరాటం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో మీరు ఏ మతానికి చెందినవారు.? అనే ప్రశ్నతో పాటు నేను ఏ మతానికి చెందిన వ్యక్తిని కాను!! అనే సమాధానం కూడా ఉండాలని అది మా ఇంటి నుండే మొదలవ్వాలని, డేవిడ్ రూప దంపతులు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు..


 

ఏ మతం లేనివారిగా ఉండకుండా, మీరు ఏదో ఒక మతం తీసుకోవచ్చు కదా అని అంటున్నారు రాజకీయ నాయకులు. మతం పేరు చెప్పే ప్రజలను వంచించి, రెచ్చగొట్టి, నాయకులు దోపిడి చేస్తున్నారు. మతం అనేది లేకపోతే ముందుగా నష్టపోయేది రాజకీయ నాయకులు.

 

నాస్తికత్వం వైపు పయనం:
నీరో అనే గ్రీకు చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడు, దేవుడు కేవలం ఆరు రోజుల్లో సృష్టిని తయారుచేసి విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు. అన్నిటికీ కారణం దేవుడే అనుకుంటే, జనాలు కష్టాలు నష్టాల పాలవ్వడం, బాధలను అనుభవించడానికి కూడా దేవుడే కారణం కదా.? ఆయన చేసిన వాటిలో ఇన్ని లోపాలు, తప్పులు ఉంటే బాగుందని ఎలా కీర్తించగలను.? ఒకవేళ ఇదంతా బాగుందని అనుకుంటే ఆయన నీరో చక్రవర్తి కన్నా కౄరుడు అవుతాడు కదా.? ఆయన దేవుడు ఎట్లా అవుతాడు.? అని భగత్ సింగ్ గారు ‘నేను ఎందుకు నాస్తికడినయ్యాను’ అనే పుస్తకంలో ప్రశ్నిస్తారు.. ఈ పుస్తకం డేవిడ్ గారిపై తీవ్ర ప్రభావం చూపించింది. రూప గారు హిందూ మతానికి చెందిన దళిత కులస్థురాలు. గ్రామాల్లో ఐతే టీ కొట్టులో టీ తాగడానికి సైతం దళితులకు ఒక గ్లాసు, మరో కులస్తులకు మరో గ్లాసు ఇచ్చేవారు. ఇలా రూప గారు స్కూల్ స్థాయిలో, కాలేజి స్థాయిలో, మాములు బయటి సమాజంలో ఎన్నో గమనించారు, ఎంతో వివక్షతకు గురయ్యారు. డేవిడ్ రూప గారు పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి సైతం వారు ఎన్నో అవమానాలకు గురి అయ్యారు. మతం అనేదే లేకుంటే అభివృద్ధికి సరిహద్దులు ఉండవు, మానసిక వికాసం మొదలవుతుంది, అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛను పొందవచ్చు. ఇవన్నీ మతాలు ఇవ్వలేవని డేవిడ్ రూప గార్ల నమ్మకం.


 

ఇప్పుడు కోవిడ్19 గురించి భయపడుతున్నారు. మా మతం గొప్పది అనే పేరుతో కోట్లాదిమంది కొట్టుకు చచ్చిపోతున్నారు. ఒక్క మధ్య యుగంలో హిందువులకు ముస్లింలకు జరిగిన పోరులో సుమారు 2 కోట్లమంది చనిపోయారన్నది చరిత్ర.

 

అబ్బాయికి ‘ఇవాన్ రూడే’ (Ivan Rudey) అనే పేరు పెట్టడానికి కారణం ఉంది:
‘ఇవాన్ ” అనేది ప్రముఖ రష్యన్ రచయిత, నవలా కారుడు అయిన ‘ఇవాన్ తుర్గేనెవ్’ (1818-1883) లోంచి తీసుకున్నది. వివిధ దేశాలకు చెందిన చాలా మంది రచయితలు ఆయన్ని తమ సాహిత్య గురువుగా చెప్పుకుంటారు. అంతటి ప్రతిభాశాలీ ఆయన. ‘తండ్రులూ కూడుకులూ’ (Fathers and Sons ) అన్న ఆయన సుప్రసిద్ద నవల సాహితీ ప్రపంచాన్నీ ఒక కుదుపు కుదిపింది. రష్యన్ సమాజంలో తీవ్రమైన అలజడిని కలిగించింది. రెండు తరాల మధ్య ఉన్న సంఘర్షణనను, తండ్రుల తరానికి, కొడుకుల తరానికీ గల అంతర్యాన్ని చిత్రించిన నవల అది. ఆ నవలలో తండ్రుల తరానికి ప్రతినిధిగా ‘పావెల్ ఉంటే, కొడుకుల తరానికి ప్రతినిధిగా ‘బజరొవ్’ ఉంటాడు. చరిత్ర గమనంలో ఒక తరం అనేది పెద్ద కాలగమనం కానపట్టికీ మొదటి తరం అలోచనలూ రెండో తరం అలోచనలకూ ఎంతో అంతరం ఉంటుందన్న విషయాన్ని సమర్థవంతంగా చర్చించిన నవల అది. అప్పటి రష్యన్ సమాజంలోకి సంక్లిష్ట విషయాలను ఆ నవలలొ చర్చిస్తూనే, నూతన తరానికి ప్రతినిధియైన కొడుకుల ప్రజాస్వామిక, విప్లవ భావాలు తండ్రుల తరంతో ఎలా ఘర్షణ పడుతుందో ‘ఇవాన్ తుర్గేనెవ్’ ప్రతిభావంతంగా చిత్రించాడు. ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన ఆ నవల డేవిడ్ గారిపై బలమైన ముద్ర వేసింది. ఆ ‘తండ్రులూ- కొడుకులూ’ లాగే ‘ఇవాన్, డేవిడ్ దంపతులు’ వేరు వేరు తరాలకు చెందినవాళ్లే కదూ..! ‘వచ్చు కాలం మేలు గతకాలం కంటే’ అన్నట్లు, నూతన తరానికి చెందిన ఇవాన్ కు, డేవిడ్ గారు అభిమానించే రచయిత పేరును పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ పేరులోని ‘ఇవాన్’…! ఇక పేరులోని రెండో భాగం ‘రూడే’ అనేది జన్మకు కారణమైన డేవిడ్ రూప గార్ల ఇద్దరి పేర్లలోంచి మొదటి అక్షరాన్ని (రూప, డేవిడ్) తీసుకొని ‘ఇవాన్ రూడే’ గా పెట్టారు.


 

దేవుడు ఉన్నాడు అని మీరు ఎలా నమ్ముతున్నారో, దేవుడు లేడు అని మేము నమ్ముతున్నాము. మా అభిప్రాయాలకు కూడా స్వేచ్ఛనివ్వాలి, మా అడుగులకు ఎలాంటి బౌండరీలు ఉండకూడదు. – డేవిడ్, రూప.

మా అబ్బాయికి మతం మురికి అంటకూడదు:
మనిషి పుట్టుకతోనే మనిషిగా, స్వేచ్ఛగా పుడతాడు, ఆ తర్వాత వీడు కమ్మోడు, ముస్లిం వాడు, దళితుడు అనే పేర్లు పెడతారు. పుట్టినవాడికి కూడా నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి అని బౌండరీ గీస్తారు, అవి ఉండకూడదు. ఇప్పటివరకు అంటే ఇలానే కొనసాగింది, కనీసం రాబోయే భవిషత్ తరం పిల్లలకైనా ఈ బౌండరీలు ఉండకూడదు. ఇవాన్ ను ఇప్పుడు ఏ మతానికి చెందనివాడిగానే పెంచుతున్నారు కానీ అతను పెరిగి పెద్దవాడయ్యాక మతాన్ని, దేవుడిని నమ్మితే కనుక స్వేచ్ఛగా ఆహ్వానిస్తామని, ఇవాన్ అభిప్రాయానికి విలువనిస్తామని డేవిడ్ దంపతులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇప్ప తమిళనాడులో న్యాయవాది స్నేహ గారికి ఎలా ఐతే సర్టిఫికెట్ వచ్చిందో మన తెలంగాణలో మా బాబుకు కూడా సర్టిఫికెట్ వస్తుందని డేవిడ్ దంపతుల నమ్మకం.
పూర్వం కులాంతర వివాహం జరుగుతున్నప్పుడు అదొక మహా అపరాధంగా ఊరి నుండి బహిష్కరించేవారు, విపరీతమైన శిక్షలు విధించేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకుంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. గుజరాత్ ప్రభుత్వం ఐతే ఒక లక్ష రూపాయలు నగదు, మరో లక్ష రూపాయలు గృహోపకరణాలు కొనడానికి ప్రోత్సాహం ఇస్తుంది, నాస్తికత్వానికి సైతం పార్టీలు గౌరవించాలి. ఇప్పుడు కులాంతర వివాహాలు అభ్యుదయ భావజాలం అయినట్టుగానే భవిష్యత్తులో మతాలు లేని రోజులు వస్తాయి.. మనిషిని ఆ కులస్థుడు ఈ మతస్థుడు అని కాకుండా మనిషిని మనిషిగా నమ్మే రోజులు వస్తాయి…


 

మతం సమానత్వం బోధిస్తుంది.. నీ దగ్గర రెండు చొక్కాలు ఉన్నాయంటే ఒకటి లేనివారికి ఇవ్వమని, ఆకలితో ఉంటే నీ దగ్గర ఉన్న కొంత భోజనం పెట్టమని భోదిస్తుందని అంటారు.. అసలు రెండు చొక్కాలు ఒకరి దగ్గరే ఎందుకు ఉన్నాయి.? ఒకడి దగ్గరేమి ఎందుకు లేవు.? ఒకరి దగ్గర కడుపు నిండా తినడానికి భోజనం ఉంటే మరొకరి దగ్గర తినడానికి ఏమి లేకపోవడానికి కారణం ఏంటి.? ఇది తప్పే కదా, ఉంటే అందరికి ఉండాలి లేకుంటే ఎవ్వరికీ ఉండకూడదు. మతం ఇవ్వమని చెబుతుంది కానీ ఒకని దగ్గర ఎందుకు ఉంది, మరొకరి దగ్గర ఎందుకు లేదు.? అని చెప్పడం లేదు, అసమానతలు నిండిన సమాజంలో ఓదార్పు కోసం ఇలా చెబుతున్నారు, మతంలో లోపం ఉంది – కారల్ మర్క్స్. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , ,