You Must Read This Inspiring Story Of A Cab Driver Who Is Fighting Against All Odds Just To Survive!

 

ఇదేంటి Title కొంచెం Differentగా ఉందని అనుకుంటున్నారా.? అవును ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్ వేర్ జాబ్ కాకుండా వ్యవసాయం చేస్తున్న వారిని చూస్తున్నాం, అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసినవారినీ చూస్తున్నాం.. కాని మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన హిమబిందు క్యాబ్ డ్రైవింగ్ చేయడమేంటి.? పోని తనకి డ్రైవింగ్ అంటే ఇష్టమా, కాదు.! మరి.? మిగిలిన వారు తనకు నచ్చిన రంగం ఎంచుకుంటే హిమబిందు గారు తన పరిస్థితులు చూపించిన దారిలో పయనిస్తున్నారు.


 

తన జీవితం ఇంకొకరి ఆధీనంలో ఉంది:
ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే “ఇది చాలా గొప్ప సంబంధం, ఇది తప్పితే ఇక ఇలాంటి మంచి సంబంధం మనకు అస్సలు దొరకదు” అని అమ్మనాన్నలు, బంధువులు హిమబిందు గారిని ఒప్పించి పెళ్ళిచేశారు. కట్ చేస్తే ఏముంది తనకి బయటి ప్రపంచానికి తెలియని భర్త నిజస్వరూపం తెలిసిపోయింది. ఐనా గాని అన్ని దిగమింగి అమ్మనాన్నలు బాధపడకూడదని ఓర్చుకున్నారు, బహుశా ఆ ఓర్పుకు భగవంతునికి జాలి కలిగిందేమో తనకు కొడుకును అందిచాడు. కనీసం బాబు పుట్టాకైనా భర్త మారుతాడేమో అని భ్రమపడిన హిమబిందు గారికి నిరాశే ఎదురైయ్యింది, వేదింపులు మరింత ఎక్కువయ్యైయి. ఇలా భర్త మీద ఆధారపడకూడదని కర్నూల్ లోనే ఓ స్కూల్ స్థాపించారు. ఒకే ఇంట్లో భర్తతో విడిగా ఉండేవారు ఇలా 12 సంవత్సరాల పాటు జరిగింది. కాని ఇదంతా అమ్మనాన్నలకు ఏ మాత్రం నచ్చలేదు.


 

ఆఖరికి అమ్మనాన్నలు కూడా:
భర్త చెప్పినట్టుగా నడుచుకోవడం లేదు, సమాజంలో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పి అమ్మ నాన్నలే హిమబిందు గారు నడిపిస్తున్న స్కూల్ ను, తన నగలను, ఆఖరికి బాబును కూడా తనకు దూరం చేశారు. ఆత్మాభిమానం, తన మీద తనకు నమ్మకం ఉన్న వారు ఇంకొకరి ముందు తలవంచడానికి ఏ మాత్రం ఇష్టపడరు. “స్కూల్ ను ఆధీనంలోకి తీసుకోవడం, బాబును కూడా వారి వద్దే ఉంచుకోవడం వల్ల హిమబిందు మేము చెప్పినట్టు వింటుందని” నమ్మిన తల్లిదండ్రులకు ఓటమే ఎదురయ్యింది, హిమబిందు గారు ఇంట్లో నుండి ఒంటరిగా బయటకు వచ్చేశారు.


 

క్యాబ్ డ్రైవర్ గా:
తన దగ్గరున్న పదివేలతో హైదరాబాద్ కు వచ్చేశారు, హాస్టల్ లో జాయిన్ అయ్యారు. ఇంత వరకే తను ప్లాన్ చేసుకున్నారు ఇక తరువాత ఏం చేయాలనుకున్నారో తనకి ఒక నిర్ధిష్టమైన ఆలోచన లేదు. కొన్ని రోజులకు టీచర్ గా ఉద్యోగం వచ్చినా గాని అందులో జీతం చాలా తక్కువ. ఇలా కాదు ఇంకా ఏదైనా పెద్ద జాబ్ కావాలి అని ఆలోచిస్తుండగా ఓలా క్యాబ్ సర్వీస్ గురించి తెలిసింది. హిమబిందు గారి దగ్గరున్న కారును అమ్మేసి ఆ డబ్బుతో పాటు బ్యాంక్ లోన్ తీసుకుని ఓలా లో క్యాబ్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టారు.

 

కత్తి పట్టుకుని కారు నడుపుతున్నారు:
వందల మంది జనాలున్న ప్రాంతంలోనే మహిళలపై దాడులు జరుగుతున్నాయి ఇంకా పగలు రాత్రి అనే తేడా లేకుండా డ్రైవింగ్ చేస్తున్న తనపై గారిపై కూడా దాడి జరిగే అవకాశం ఉందని కత్తి పెట్టుకుని కార్ నడుపుతున్నారు. కేవలం డబ్బు సంపాదించడం వరకు మాత్రమే కాదు దానిని ఖర్చు పెట్టడం లోను తన పోరాటాన్ని సాగిస్తున్నారు. మిత్రులతో కలిసి ఓ ట్రస్ట్ ను స్థాపించి పదిమంది పిల్లలను ఏ లోటు లేకుండా చదివిస్తున్నారు. ఉదయం 6 నుండి మద్యాహ్నం 2 వరకు క్యాబ్ డ్రైవింగ్, తర్వాత కొంత సమయం పిల్లలతో గడిపి మళ్ళి అర్ధరాత్రి వరకు డ్రైవింగ్ చేస్తుంటారు. ఒక కొడుకు దూరమైతే ఏంటి తన బాబు లాంటి పదిమంది పిల్లలను చదివిస్తూ వారిని జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా ఆసరాను అందిస్తూ ఎంతోమందిలో స్పూర్తిని రగిలిస్తున్నారు.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,