From 0% Crime Rate To Clean Roads, This Village In TS Is An Example For The Future

 

మాల్కాపూర్ లో చెత్తను రోడ్డు మీద పారివెయ్యరు, 100% సేకరిస్తారు.. రికార్డ్ స్థాయిలో 45 రోజులలో 305 వాష్ రూమ్స్ నిర్మించారు, ప్రస్తుతం 100% ప్రతి ఇంటికి వాష్ రూమ్ ఉంది.. సూర్యుడి నుండి ఉచితంగా వచ్చే కాంతి కిరణాల నుండి 100% సోలార్ పవర్ వాడుకుంటున్నారు.. ఊరిలో దొంగతనంగా కూడా యువత దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవ్వరూ మందు తాగరు. ఇలా చెప్పుకుంటూ పొతే మల్కాపూర్ లోని గొప్పతనాలు ఎన్నో.. మల్కాపూర్ లో ఒక్క సూర్యుడు ఉదయించలేదు తాము వెలుగుతూ మరెందరికో వెలుగునిస్తున్న నక్షత్రాల సమూహంతో ఆకాశమే ఏర్పడింది. ప్రతీ ఒక్కరూ ఆ ఊరిలో స్టార్స్ యే!! 

రోనాల్డ్ రోస్ గారు మొదటి నక్షత్రం:

ఒకప్పుడు మెదక్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామానికి వెళ్ళడానికి దారి కూడా లేదు. మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వల్ల పోలీసులకు మావోయిస్టులకు మధ్య సామాన్య ప్రజలు నిత్యం భయంతో జీవితాన్ని గడిపేవారు. 2015లో ఐఎస్ ఆఫీసర్ రోనాల్డ్ రోస్ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఊరి కన్నా మొదటి మార్పు అక్కడి ప్రజలలో కలిగింది. “నేను వేరు మీరు వేరు, నేను అధికారిని మీరు సామాన్యులు” అనే తారతమ్యాలు ఆయనలో ఏ చోట లేవు. దత్తత తీసుకున్నప్పుడే గ్రామ ప్రజలందరితో మాట్లాడారు. రోడ్లు, స్కూల్స్ లో మంచి Infrastructure, డ్రైనేజ్ facilities లాంటివి సెకండరీ, ముందు మనందరిలో మార్పు రావాలి ఆ మార్పు వస్తే రేపొద్దున నాలాంటి అవసరం కూడా మీకు ఉండదు.. లాంటి మాటలతో యువతను ప్రభావితం చేయగలిగారు. 

మొదట మొక్కలను బ్రతికించారు.

మల్కాపూర్ ఇప్పుడు తెలంగాణాలోనే ఆదర్శగ్రామం. యునిసెఫ్ అధికారులు, దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి ఎమ్.ఎల్.ఏ లతో పాటు తమ ఊరిలోను ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలని ఇతర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి నిత్యం వస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రగతి సాధించడానికి వారికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పట్టింది. నీళ్ళు లేక ఎండిపోతున్న మొక్కలను బ్రతికించి ఊరిని బాగు చేసుకోవాలి అనే కాంక్షను కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత “సక్సెస్ యూత్, జీనియస్ యూత్, వివేకానంద యూత్, అంబేడ్కర్ యూత్, సిద్ది వినాయక యూత్” పేర్లతో కొంతమంది యువకులు గ్రూపులుగా ఏర్పడి వారి వారి అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం విభజించుకున్నారు. 

మేక్ ఇన్ మల్కాపూర్:

హైదరాబాద్ మహానగరంలో అద్భుతమైన శిల్పారామం ఉంది. ఇలాంటిది మన దగ్గర కూడా ఉంటే చాలా బాగుంటుందని రాళ్లతో నిండిన వెయ్యి గజాల స్థలంలో 100మంది యువకులు కలిసి “రాక్ గార్డెన్” ని రూపొందించారు. గ్రామంలో దాదాపు 340 ఇళ్ళు ఉంటే అందులో కేవలం 34 ఇళ్ళల్లో మాత్రమే వాష్ రూమ్స్ ఉండేవి. స్వచ్ఛ భారత్ లో భాగంగా 45 రోజులలో 305 వాష్ రూమ్స్ పూర్తిచేశారు. ఆ మధ్య జరిగిన హరితహారంలో మాల్కాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఒకేరోజు లక్ష మొక్కలు నాటి వాటిని ఇప్పటికీ సొంతబిడ్డల్లా పెంచుతున్నారు. 

100% మధ్యనిషేధం:

ఒకపక్క మొక్కలు నాటి మరోపక్క మేకలను వదిలేస్తే మొక్కలు నాటిన ప్రయోజనం ఎంత వ్యర్ధమో.. ఒక పక్క అభివృద్ధి చేస్తూ మరోపక్క మందు అమ్మడం వల్ల అంతే వ్యర్ధమని గ్రామస్థులు ముందుగానే తెలుసుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇంత చిన్న ఊరిలోనూ ఏడు బెల్టు షాపులుండేవి. వీళ్ళు డబ్బులు ఇవ్వకున్న ఖాతా పేరుతోనూ ఇస్తుండడం వల్ల సేల్స్ కు ఎప్పుడు లోటు ఉండేది కాదు. బెల్ట్ షాపులు నడుపుతున్న వారిలో గ్రామాన్ని మారుస్తున్న యువత ఉండడం వల్ల వారు ముందుకు వచ్చి బెల్ట్ షాపులన్నింటిని స్వచ్చందగా మూసివేశారు. 

వీదులకు నాయకుల పేర్లు:

కులాలు, మతాల మధ్య మనస్పర్ధలు లాంటివి ఈ ఊరిలో ఉండకూడదు అని “గాంధీ, అబ్దుల్ కలాం, వివేకానంద, ప్రొఫెసర్ జయశంకర్” నాయకుల పేర్లను ఆ ఊరి వీదులకు పెట్టారు. వర్షాకాలంలో నీటిని కాపాడుకుని రాబోయే వేసవికాలంలో ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకున్నారు. రైతులు వ్యవసాయం కోసం ఇక్కడ సరైన ప్రణాళికలు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను నేరుగా పొలాలకు తీసుకువెళ్ళి భూమిని, బయట మార్కెట్ ను పరిశీలించి వ్యవసాయాన్ని చేయిస్తున్నారు. 

చిన్నతనం నుండే పిల్లలకు తెలిసిరావాలి అని.. “మా ఊరు ప్రగతికి ఒక ఉదాహరణ. ఎప్పటికైనా పిల్లల స్కూల్ పుస్తకాలలో మల్కాపూర్ అభివృద్ధి ఒక పాఠంగా రావాలి” అనేదే వీరి ఆశయం. నీ ఇల్లు వేరు నా ఇల్లు వేరు అని ఆలోచిస్తే ఇద్దరి ఇళ్ళులు బాగుపడవు. ఈ ఊరంతా మా ఇల్లే వీరంతా మా కుటుంబ సభ్యులే అనే వసుదైక కుటుంబ భావనతో ముందుకు వెళుతున్నందుకే జగమంత కుటుంబం వారిది అయ్యింది.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , ,