Here’s Why Tanikella Bharani Is A Language Treasure Trove Of All Telugu People!

 

Contributed By సహృదయ్ పున్నమరాజు

 

ఎప్పుడు తనికెళ్ళ భరణిగారి పేరు తలచుకున్నా ఎందుకో నాకు వంటినిండా విభూది రాసుకున్న శివుడే గుర్తొస్తాడు. అంతలా నా మనసులో ప్రతిధ్వనిస్తోంది ఆయన ఆడించిన “ఆట గదరా శివా”….! ఆయన శివాపోసన ఒక ఎత్తు అయితే కళాపోషణ మరింత ఎత్తు !

సంప్రదాయ గళమెత్తే ఆయన కలం నుంచి జాలువారే రచనలు మనల్ని నవ్విస్తూ పులకింపచేస్తాయి, పులకింపచేస్తూ ఆలోచింపచేస్తాయి.
ఆయన అందంగా కుట్టిన అచ్చ తెలుగు అక్షరాల “పరికిణీ” దండెం మీద ఇంద్రధనస్సుని పిండి ఆరేసినట్టుంటుంది! నాకైతే ఎక్కడేనా అర్ధం కాక ఒకసారి చదివితే, అర్ధం అయ్యాక వందసార్లు చదవాలనిపిస్తుంది. ఆయన పదాల్లో చిలిపితనం, భావుకత చిరంజీవులు. పంజాబీ డ్రెస్సులొచ్చి పరికిణీల్ని మాయం చేశాయని దుగ్ధ భరణి గారిది. చాలా మంది ఆడపిల్లలు పరికిణీ కట్టడం వల్ల మరింత అందంగా ఉంటారన్నది ఆయన థియరీ….. అదేంటో నాకూ అలానే అనిపిస్తుంది. సందేహం లేదు

“అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి…
ఓణీయే ఓంకారం!!
పరికిణీయే పరమార్ధం!! “

 

ఒక చోట ఓణీకి ఓంకారానికి ముడివేసి ఎంత మురిపించగలడో, మరో చోట అంత ఏడిపించగలడాయన! మురిసిపోతూ కళ్ళ చివర ఆగిపోయిన కన్నీళ్ళు “కన్యా-కుమారి” లాంటి కవితలు చదివినప్పుడు మొత్తంగా జారిపోతాయి! దానికి ఉదాహరణే ఈ పంక్తులు …

“ వోణీ – చీరైపోతుంది
వాలు జడ ముడై పోతుంది
లోలకులు దుద్దులైపోతాయ్….
తాళిబొట్టు పడాల్సిన చోట
కన్నీరు బొట్టు… బొట్టు… పడ్తూనే ఉంటుంది
ఎక్కడ మంగళ వాయిద్యం వినిపించినా … గుండెల్లో నిప్పులు పోసినట్టుంటుంది ! “

 

ఆయన తన ఊహా ప్రపంచంలో మనల్ని వేలుపట్టుకుని విహరింపచేయగలరు, ఆ ప్రయాణంలో వేలెత్తి జీవిత సత్యాలు కూడా చూపించగలరు.

“పగటి కన్నీటి బొట్టు పేరు సూర్యుడు
రాత్రి అశ్రుబిందువు పేరు చంద్రుడూ
మధ్యలో ఉండే ఏడుపు పేరే…మనిషి!!”
అని బిందుస్వరూపంగా మనిషిని విచిత్రించారాయన.

మనం మర్చిపోయిన ఎందరో మహానుభావులైన విద్వాంసుల జీవితాల్ని మనకు పరిచయం చేసిన మహానుభావుడు భరణి. పదాల పొందికలో జోడించిన నాటకీయత, ఉద్వేగానికి లోను చేసే రసరమ్య భావచిత్రాలు “ఎందరో మహానుభావులు “ పుస్తకంలో ప్రతి పేజీకి అలదిన కొత్త అలంకారాలు.

విశేషమైన సినీరంగానుబంధంతో ఆయన ఆవిష్కరించిన ‘నక్షత్ర దర్శనం’ మనల్ని అలరిస్తుంది , తారా విహారం చేయిస్తుంది . పాత, కొత్త సినీతారల గురించి, వివిధ రంగాలలో లబ్దప్రతిష్టుల గురించి రాసిన కవితలు ‘అద్భుతః’ అనిపిస్తాయి.తన జీవితంలో తనకు నచ్చిన వ్యక్తులను, తనపై ప్రభావం చూపిన వ్యక్తులను కవితాత్మకంగా దర్శించుకున్నారు దశభరణి.

ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే తాను మేల్కొంటూ , బ్రాహ్మీ ముహూర్త వైశిష్ట్యాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్న భరణి , ఎన్టీయార్ గురించి ప్రస్తావించినపుడు “తనే ముందు లేచి, భాస్కరుడిని లేపుతాడు, శశిని చూడకనే పడుకునే పసిమనస్సువాడు!” అని ప్రశంసించడం ఆయన పసిమనసుకు నిదర్శనం !

వారి ఇంటి ముంగిట్లో మహానటి సావిత్రి నిలువెత్తు చిత్తరువుని అలంకరించుకోవడమే కాదు, ఆమెను ”త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం, నటరాజుకి స్త్రీ రూపం” అని అభివర్ణించారు. “ఎమ్ ఎస్ అంటే మంగళ స్వరం, ఎమ్ ఎస్ అంటే మెస్మరిజం” అని రాయగలగడం ఆయన కలానికే చెల్లు ! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయితే, గుడిపాటి వెంకటచలం స్త్రీస్త్రీ అని చమత్కరించారు.
తెలుగు సాహితీరంగంలో తమ కృషితో విఖ్యాతులైన దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, వేటూరి సుందరరామ్మూర్తి, జాలాది, సినారె వంటి వార్ని భరణి మాటల్లో చదువుతుంటే వారి పట్ల గౌరవభావం కలిగి, మనకు విశేషమైన ప్రేరణ లభిస్తుందనడంలో సందేహం లేదు.
విలక్షణ నటుడిగా అనేక పాత్రలకి ప్రాణం పోసి ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకున్న భరణి సినీ దర్శకుడుగా చేసిన సాహసం రెండే పాత్రల ‘మిధునం’. మిధునం మాటలతో సంభాషణా రచయితగా నూటికి రెండొందల మార్కులు స్వంతం చేసుకున్న చతురాత్ముడు భరణి.

‘బ్నిం’ గారు అన్నట్టు “మంచి అభిరుచి, మంచి హృదయం, మంచి భావం, మంచి భాష కలబోస్తే – తెలుగు మాటల ఖని మన తనికెళ్ళ దశ భరణి !”

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,