Here Is The Story Of Daughter & Her Mom Who Is A Working Woman

 

Contributed By Telugu Lessa

 

“ఉండూ… కదలకు. చేతి వేళ్ళతో బిడ్డ రెండు బుగ్గలూ పట్టుకుని బొట్టు పెట్టకపోతే నేనేం తల్లిని?”
మా మమ్మీ.

 

ఏంటీ, తెలుగు అమ్మాయి అమ్మని మమ్మీ అంటుంది అనుకున్నారా? మా ఉమ్మడి కుటుంబంలో మా నలుగురిని, అంటే అన్నయ్య, నేను, మా బాబాయ్ పిల్లలు – మా అందర్ని మా పిన్నే పెంచింది. మమ్మీ బ్యాంక్ ఉద్యోగం చేస్తే, పిన్ని మా బాధ్యతలు తీసుకుంది. M.Sc Integrated Mathematics అంత గొప్ప చదువు చదువుకున్నా, అందరు ఉద్యోగాలకి బయటకి వెళ్ళిపోతే పిల్లలు ఇబ్బంది పడతారని ఆవిడ ఆగిపోయింది. ఇంటికి, మా పెంపకాలకి పరిమితం అయిపోయింది. నలుగురిని ఒకేలా పెంచింది. నా, నీ అని తేడా లేకుండా, పెసరబద్దంత స్వార్ధం లేకుండా. అలంటి త్యాగం, ప్రేమ ఆ తరానికే చెల్లేమో. అంతలా ప్రేమ పంచిన ఆవిడ్ని అమ్మ అని పిలవడం, నాకు జన్మనిచ్చిన తల్లిని మమ్మీ అని పిలవడం అలవాటైపోయింది. ఇద్దరి తల్లుల ప్రేమ, పద్దతి, ప్రేరణ ఒక మాదిరిగా ఉండదు. పిల్లలు అతి గారాభం వల్ల చెడిపోకూడదని వెన్నముద్దల్లాంటి మనసులకి కఠినత్వం అనే కవచం వేస్కొని ఉంటారిద్దరు.

 

మమ్మీ బ్యాంకర్ కాబట్టి ఆర్ధిక సంవత్సరం క్లోసింగ్ అప్పుడు చాలా బిజీగా ఉంటుంది. అప్పుడే నా పుట్టినరోజు రావడంతో, ప్రతి యేడు మా ఇద్దరికి కోల్డ్ వార్ నడుస్తుంటుంది. పని వత్తిడి వల్ల ఒక్కోసారి తను టైంకి రాకపోవడం, నా పుట్టినరోజు కంటే ఎక్కువా అని నేను…ఇలా ఒక వారం ముందు నుంచే ఇంట్లో కంటి చూపుల్తో గొడవ పడేవాళ్ళం. అక్కడికీ తాను ఏ శాఖలో ఉంటే ఆ శాఖలో అందరికి స్వీట్స్ పంచేది. లోకల్ పోస్టింగ్ అయితే, సాయంత్రం స్కూల్ అయ్యాక బ్యాంక్ దగ్గరకి ఎవరో ఒకరు తీస్కెళ్ళేవారు. అప్పుడు అందరిని పిలిచి అక్కడే కేక్ కట్ చేయించేది. తన ట్రాన్స్ఫర్ బట్టి నా పుట్టినరోజు ఒక్కోసారి ఒక్కో శాఖలో జరిగేది. విజయవాడ సూర్యారావుపేట శాఖలో క్యాషియర్ మూర్తిగారికి ఒక యేడు కేక్ ఇస్తే, ఆ తర్వాత సంవత్సరం “మాలతీ, రేపు అందరికి భోజనం నేను తెస్తాను. మా అమ్మాయ్ పుట్టినరోజు” అని హైద్రాబాదుకి 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న మారు మూల గ్రామంలో రురల్ సర్వీస్ చేస్తూ చెప్పింది. ఇలా చాలా మంది మమ్మీ కొలీగ్స్ మామ అని, అంటీ అని, అంకుల్ అని చుట్టాలు అయిపోయారు. కొంత మంది పిల్లలు పేర్లు కూడా ఇంకా గుర్తు నాకు. అందుకే అంటారేమో కొలీగ్స్ తో ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ సమయం గడుపుతాం, వాళ్ళు కూడా కుటుంబం అని. ఉద్యోగం అంటే ఏదో పొద్దున్న రెడీ అయ్యి, ఆఫీసుకి వెళ్లి, నాలుగు ఫైల్స్ మీద సంతకం చేసి, సాయంత్రం ఇంటికి వచ్చేయటం అనుకునేదాన్ని. నేను ఉద్యోగంలో చేరాక కానీ తెలీలేదు మమ్మీ రోజూ పడే శ్రమ, తీసుకునే వత్తిడి, ఫ్యామిలీ లైఫ్ పట్టాలు తప్పకుండా ఆవిడ చేసే బ్యాలన్స్.

 

మమ్మీ చాలా హూందాగా ఉంటుంది. రకరకాల చేనేత చీరలు కడుతుంది. డిజైనర్ చీరలు, వాటి మీద వర్కులని ఆరాటపడదు. తన చేతులు మీదగా ఎంతో మందికి కుటీర పరిశ్రమ రుణాలు ఇచ్చింది. వాళ్ళని కుటీర పరిశ్రమ కార్మికులని ఎవరైనా సంభోదించినా ఇష్టపడడు. కుటీర పరిశ్రమ కళాకారులని పిలవాలని వెంటనే సరి దిద్దుతుంది. వాళ్ళని ప్రోత్సహించాలని చెప్తుంది. తనకి మన దేశంలో ఏ రాష్ట్రం పేరు చెప్పినా, అక్కడ ఫేమస్ అయిన చేనేత చీరల పేర్లు వెంటనే చెప్పేస్తుంది. నాకు, అమ్మకి, అత్తలకి, ఇంట్లో ఆడవాళ్లందరికి అవే అలవాటు చేసింది. బాగా గంజి పెట్టి, ఇస్త్రీ చేసిన చీరలు, ఆవిడ ఎంత పని చేసినా అవి నలగకుండా అలాగే ఉంటాయి. తను చేసే ప్రతి పనిలో పద్దతి, పరిపూర్ణత ఉంటుంది. పండగలు వచ్చినా అంతే. గుమ్మానికి అందరూ పసుపు రంగు పెయింట్లు, ముగ్గులు వేస్తే, మమ్మీ మాత్రం పసుపు కలుపుకొచ్చి గుమ్మానికి రాసి, మావిడి తోరణాలు కట్టించి, పూజ మొదటి నుండి చివరి వరకు పద్దతిగా ఆచరించడం, ప్రసాదాలు, తాంబూలాలు, మహానైవేద్యాలు సమర్పించడం…అంతు లేదు ఇక.

 

మూడేళ్ళ క్రితం ఇలానే ఉగాదికి అన్ని పనులు మొదలుపెట్టింది మమ్మీ. అంతా తలా ఒక చెయ్యి వేసి సాయం చేస్తున్నాం. ఇంతలో వచ్చి “పాయసంలోకి బెల్లం బాలేదు. మరీ నల్లగా ఉంది. వీధి చివర ఉన్న కిరాణాలో త్వరగా తీసుకురండని నాకు అన్నయ్యకి చెప్పింది. తీరా వెళ్ళాక పండగని ఆ కొట్టు మూసేస్తే మెయిన్ రోడ్డు వరకు వెళ్లి సూపర్ మార్కెట్లో తీస్కోని, ఇరవై నిమిషాల్లో ఇంటికి వచ్చాం. ఇంటి గుమ్మం దగ్గరకి వస్తుంటేనే ఏదోలా అనిపించింది. ఇళయరాజా గారి పాటలో ఎవరో వయోలిన్ అపశృతిలో వాయిస్తున్నట్టు…అలా ప్రకృతికి అతీతంగా ఉన్నట్టు వింతగా అనిపించింది. పండగలప్పుడు మధ్యాహ్నం వరకైనా సింహ ద్వారం తీసి ఉంచండి, లక్ష్మీ దేవి వస్తుంది అని చెప్పేది ఎప్పుడు. అలాంటిది మేము ఇప్పుడే బయటకి వెళ్తే, ఇంతలోనే తలుపులు మూసేసున్నాయ్. మేము వస్తామని తెలుసు, అంత తొందరేమొచ్చింది అనుకున్నాం.

 

డోర్ బెల్ కొట్టాము. ఎవరూ రాలేదు. ఒక అయిదు ఆరు సార్లు కొట్టాక నేను చుట్టూ తిరిగి వెన్నక్కి వెళ్లి వంటింటి కిటికీ నుండి చూసాను. ఎవరూ లేరు. పిలిచినా పలకలేదు. అన్నయ్యకి అనుమానం వచ్చి నాన్నకి ఫోన్ చేస్తే ఆయన తీయలేదు. మమ్మీ ఫోన్ కూడా అంతే. నేను బాబాయ్ కి చేశాను. ఆయన హలో అని, అమ్మతో మాట్లాడు అని ఫోన్ ఇచ్చేసారు.

 

“ఎక్కడున్నారు అందరు ? గుడికి ఏమైనా వెళ్ళారా? మాకు చెప్పలేదేంటి?” అని అడిగాను.
“హాస్పిటల్ కి వచ్చాము. నువ్వు అన్నయ్య వెంటనే వచ్చేయండి. ఖంగారులో ఇంటి తాళం కూడా పెట్టలేదు” అంది.

 

హాస్పిటల్ ఆ? ఎందుకు, ఏంటి, ఎవరికి ఏమైందని అడిగేలోపే అమ్మ ఫోన్ కట్ చేసింది. బీటెక్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ పరీక్షకి ఎంత చదివినా, పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రం ఇవ్వగానే, పేపర్ మొత్తంలో ఎన్ని ప్రశ్నలకి జవాబులు తెలుసు, ఎన్ని మార్కులు వస్తాయి అని ఖంగారుగా చూసుకునే భావం కలిగింది అప్పుడు. జీవితంలో ఎంత ప్రిపేర్ అయినా ఎప్పుడూ ఏవో అనుకోని మలుపులు మరి. ఆ క్షణం నాకు అన్నయ్యకు ఏ ప్రశ్నకి సమాధానం లేదు. దాగుడుమూతల ఆట ఆడుతూ మధ్యలో అందరూ తప్పిపోయినట్టు అనిపించింది.

 

ఇంటి దగ్గరే హాస్పిటల్. ఇద్దరం లోపల రిసెప్షన్ కి వెళ్లి అమ్మకి కాల్ చేసాము. ఎక్కడకి రావాలో చెప్పింది. ఎంత వేగంగా నడిచామో తెలీదు, అర నిమిషంలో అక్కడకి వెళ్లినట్టు అనిపించింది. అందరు ఆపరేషన్ థియేటర్ బయటున్నారు. అంతా గందరగోళంగా ఉంది అక్కడ వాతావరణం. మేమిద్దరం అక్కడే నిలబడి చూస్తున్నాం, ఎవరికి ఏమైందాని. సంతలో పిల్లాడు తప్పిపోతే ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆ రంగు కోసం వెతుకుతాము. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏమైంది, ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు అని చెక్ చేయడానికి మైండ్ పని చేయలేదు. ఒక పది సెకన్లు తర్వాత అర్ధమైంది. మమ్మీ. మమ్మీ లేదక్కడ. అమ్మ దగ్గరకి పరిగెత్తుకొని వెళ్ళాము.

 

మమ్మీ కి ఏమైంది? నాన్న ఎందుకు ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు? డాక్టర్ ఎందుకు అడ్మిట్ చేయమంటున్నారు అని ప్రశ్నలు మీద ప్రశ్నలు. ఈలోపల ముమ్మీని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చారు. కుడిచేతికి ఏంటో దెబ్బలా ఉంది. ఎమెర్జెన్సీలో కట్టు కట్టి, ట్రీట్మెంట్ చేసి థియేటర్ కి తీసుకొచ్చారు. కట్టులో నుండి ఇంకా రక్తం వస్తోంది. పండగ పూట అందరికి టిఫిన్ ఆలస్యం అయ్యిందని ముందు గారెలు వేసేద్దాం అని పప్పు మిక్సీలో వేసిందంట. ఈ లోపల ఏదో మాట్లాడుతూ, మిక్సీ మూత పెట్టాననుకోని స్విచ్ ఆన్ చేస్తే కుడిచేతి ఉంగరం వేలు, మధ్యవేలు సగానికి నరుక్కు పోయాయి.

 

నాకు ఆరో క్లాసులో బాగా తలనొప్పి వచ్చేదని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే, ఎందుకైనా మంచిది CT స్కాన్ తీయించండి అని చెప్పినందుకే గురువారం ఉపవాసం ఉంటాను అని బాబాకి మొక్కిందటని అమ్మ చెప్పింది. మమ్మీకి అప్పటి నుండి ఈ రోజు వరకు గురువారం అంటే ఉపవాసం. ఎంత మంది చెప్పినా ఆ మొక్కుని వదల్లేదు. అలాంటిది ఆమె ఇంత బాధలో ఉంటే నేనేం చెయ్యాలి? ఆ నొప్పి నేను తీసుకోవచ్చా? మోచేతి నుండి మసాజ్ లా చేస్తే ఏమైనా తగ్గుతుందా? ఎం చెయ్యాలి? థియేటర్ కి తీసుకెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేసి వేళ్ళు సరిచేస్తారట. మత్తు ఇచ్చారు. నిద్రలో ఉంది. ఒక్కసారి లేచి నన్ను చూస్తే బాగుండు అనిపించింది. అప్పుడు కూడా స్వార్థమే. మమ్మీ నన్ను చూడాలని.

 

ఈ లోపల ప్లాస్టిక్ సర్జన్ వచ్చారు. నాన్నతో మాట్లాడి, సర్జరీ ఎలా చేస్తారో చెప్పారు. రెండు గంటలు పైన పాడుతుందని అన్నారు. అంతా అయ్యాక మూడు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. బాబాయ్ ఏవో కాగితాలు అని, అన్నయ్య పేమెంట్ అని, ఎమర్జెన్సీ వార్డులో వాడిన మందులు రీఫిల్ చేయటంలో ఉన్నారు. నాకు మాత్రం మమ్మీతో ఉండాలని, థియేటర్ లోపాలకి వెళ్ళాలని అనిపించింది. ఉదయం పదకొండింటికి మమ్మీ థియేటర్కి వెళ్తే బయటకి వచ్చే సరికి రెండు దాటింది. అంతా బాగుంటే అన్ని రకాల వంటలు చేసి మీకు, సరోజకి, అందరికి పెట్టే దాన్ని. ఇంటికి వెళ్లి ఏమైనా తినండి లేకపోతే ఇక్కడే ఏమైనా తెచ్చుకోండి అని అమ్మ ఎన్ని సార్లు చెప్పినా ఎవ్వరం కదల్లేదు. ఆ మూడు గంటలు నాకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు చల్ల పడటం, ముమ్మీని విసికించిన ప్రతి చిన్న విషయం గుర్తు రావటం, కళ్ళు తడవటం, అంతా దిగులుగా అనిపించింది. నాకు ఆఫీస్ కాల్స్లో లేట్ అయ్యిందని కాల్ మధ్యలో వచ్చి అన్నం తినిపించేది…ఇప్పుడు వేళ్ళు లేకుండా మమ్మీ ఎలా అని ఏవేవో ఆలోచనలు. ఏదో అనుకుంటాం కానీ, మన వాళ్ళు బాధ పడితే ఆ బాధ భరించలేనిది. సర్జరీ పూర్తి చేసి మమ్మీని చివరికి రూంకి తీసుకొచ్చారు. అంతా బానే జరిగింది, ఇది వరకు లానే రెండు వేళ్ళు ఉంటాయి, కాకపోతే ఉంగరం వేలు మాత్రం కొంచం వంకరగా ఉండచ్చు, అది కూడా బాగా గమనిస్తే కానీ తెలీదు అని చెప్పారు డాక్టర్. మందులు అవి రాసి, నర్స్ కి చెప్పి వెళ్లిపోయారు.

 

మూడు రోజులు మమ్మీ హాస్పిటల్లో ఉంటే, ఆమె కోసం నర్సులు, డాక్టర్లు, హౌస్ కీపింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్స్, ల్యాబ్ టెక్నిషియన్స్, కొలీగ్స్…ఇలా ఎంత మందో రావడం, పలకరించడం, వారికి కుదిరిన దాన్లో పళ్ళ బుట్టలు నుండి బ్రెడ్ ప్యాకెట్స్ వరకు ఏదో ఒకటి తేవడం జరిగింది. మమ్మీ పని చేసేది ఆ హాస్పిటల్లో ఉన్న బ్యాంకు బ్రాంచ్లో. వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఆ బ్యాంకే చూస్తుంది. మేడం ఎప్పుడు వెళ్లినా పెద్ద చిన్న అని లేకుండా అందరిని నవ్వుతూ పలకరిస్తారు, సాయం చేస్తారు, ఒప్పిగ్గా కొత్త వాళ్లకి రూల్స్ చెప్తారు, డిపోసిట్స్ మీద సలహాలు ఇస్తారు ఇలా చెప్పుకు వచ్చారు. తనకి అక్కడున్న పేరు అలాంటిది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ గారి పాత్ర చూసి ఇలా ఉంటారా బయట అనుకున్నాను. మమ్మీ లాంటి నిజ జీవితం పాత్రలు చదివి తీసుంటారు సినిమా. ఉద్యోగం చాలా మంది చేస్తాం కానీ, జ్ఞానానికి, ప్రవర్తనకి ఇచ్చే విలువ, గౌరవం వేరే ఉంటుంది. She commanded that respect and still does.

 

నాలుగో రోజు ఇంటికి రావడం, మమ్మీకి విశ్రాంతి ఇచ్చి పనులన్నీ మేము పంచుకున్నాం. అయినా ఖాలీగా లేదు తను. రెండో చేత్తో చిన్న పనులు చేసేది. మొక్క వాడిపోయిందనో, ఇస్త్రీ పొద్దులనో, దేవుడి సామాను జిడ్డుగా ఉన్నాయనో…ఒంటి చేత్తో ఎంత చేయగలిగితే అంత చేసింది. రోజూ డ్రెస్సింగ్ కి హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ ఎంట్రన్స్ లో వినాయకుడికి దండం పెట్టడం, దారిలో కొబ్బరి బొండాం తాగటం, ఫీజియోథెరపీ చేయించటం… ఇలా తనతో ఉండిపోవటం నచ్చింది. నీకోసం ఎంత మంది వచ్చారో అంటే, అవును వాళ్లకి ఫోన్లు చేసి పలకరించాలి అంది. వాళ్ళు వచ్చింది నీకోసం కదా, మళ్ళీ పలకరించడం ఏంటి అంటే, నాకోసం వాళ్ళు రావాలని లేదు కదా. అయినా వచ్చారు, మన బాధ్యత అంది. మొత్తానికి నాలుగు నెల్లలో మమ్మీ మామూలు అయిపోయింది. అదే నెలలో నాకు ఆఫీస్ లో బోనస్ వచ్చింది. ప్రతి విషయం మమ్మీకి చెప్పే నేను, ఈసారి బోనస్ వచ్చిందని చెప్పలేదు. తనకి తెలీకుండా తన మధ్య వేలుకి డైమండ్ రింగ్ కొనాలని అనుకున్నాను. తనకి ఆ వేలు, ఆ చేదు అనుభవం గుర్తు లేకుండా చేయచ్చు అనుకున్నాను. పది వేలు పైన ఖర్చుపెట్టటం, అది కూడా మమ్మీకి తెలియకుండా అదే మొదటి సారి.

 

శనివారం సాయంత్రం అందరూ టీ తాగే టైంకి రింగ్ తీస్కెళ్ళి చూపించాను. చెప్పకుండా కొన్నాను అని సారీ చెప్తే, కాదు సర్ప్రైస్ అయ్యాము అన్నారు ఇంట్లో అందరు. మమ్మీ నవ్వేసింది. పోనీలే కొంటే కొన్నావు, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ మంచిదేలే అంది. అయినా, ఇంత పెద్ద డైమండ్ నువ్వుంటే ఇది నాకెందుకురా అని తీస్కెళ్ళి జాగ్రత్తగా బీరువాలో పెట్టింది. డైమండ్ ఎన్ని క్యారెట్స్ అని అడగలేదు, రింగ్ ఖరీదు అడగలేదు. ఎప్పుడు పెట్టుకో అని అడిగినా నువ్వే నా డైమండ్ అంటుంది. నా కోసం ఇంత ఆలోచించి తెచ్చావు, చాలు నాకు అంది.

 

ఆ తర్వాత సంవత్సరం నాకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది. నేను మేనేజర్ అయ్యిన సంవత్సరం. చాలా సంతోషంగా అనిపించింది. ఇంటి పక్కనావిడ, “బాగుందండీ…తల్లీ కూతుళ్లు ఇప్పుడు ఇద్దరూ మేనజర్లే అనమాట” అంటే మమ్మీ నన్ను చూసి కళ్ళతో నవ్వింది. ప్రమోట్ అయిన వాళ్లందరికి ఆఫీసులో పార్టీ ఏర్పాటు చేసారు. పెళ్ళైన వాళ్ళు మీ బెటర్ హాఫ్ ని తెచ్చుకోవచ్చు పార్టీకి అని చెప్పారు.
నేను మా బాస్ దగ్గరకి వెళ్లి “May I bring my parents, please?” అని అడిగాను
“Ok, if that makes them happy” అన్నారు.

 

ఇంటికి వెళ్లి మమ్మీకి చెప్పను. నువ్వు రావాలి, మా ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని కలవాలి అంటే సరే అంది. మళ్ళీ అంతే, ఏం హడావిడి లేదు. మంచి చేనేత చీర, బొట్టు కింద కుంకుమ బొట్టు, బంగారపు గాజులు మధ్యన మట్టి గాజులు. ఒక లిప్స్టిక్ కానీ, మేకప్ కానీ ఏమీ లేదు. అయినా అదే హుందాతనం, అదే ఆత్మవిశ్వాసం.
పార్టీకి వెళ్ళాక అందరిని పరిచయం చేస్తున్నారు. నాన్న ఎవరో తెలిసిన వాళ్ళతో మాట కలిపారు. మమ్మీ మాతో కూర్చుంది. స్టాండప్ కామెడీ అని, డాన్సులు అని ఏవేవో చేసారు వచ్చిన గెస్టులు కోసం. ఈలోపల మా బాస్ వచ్చారు. ఆయన్ని మమ్మీకి పరిచయం చేశాను. మమ్మీ లేచి నిలబడి, చేతిలో ఉన్న పర్సు టేబుల్ మీద పెట్టి, రెండు చేతులు జోడించి నమస్కరించింది.
అప్పుడు చూసాను. మమ్మీ కుడి చేతి ఉంగరం వేలుకి డైమండ్ రింగ్ మెరిసిపోతోంది. ఆమె చేతి వేళ్ళు ఆ రాయికి అంత అందం ఇచ్చాయా అన్నట్టు ఉంది.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , ,