This Letter Written To A Guy By His Own Consciousness Is Something We Can All Relate To!

 

ప్రతీ మనిషి లో అంతరాత్మ ఉంటుంది,మనకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసేది ఆ అంతరాత్మే, అందరికంటే ఎక్కువగా అర్ధం చేసుకునేది . మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించేది మన అంతరాత్మే . ఇది మీ అంతరాత్మ మీ మీద ప్రేమతో మీకు రాస్తున్న ప్రేమలేఖ

 

ప్రియమైన నాకు, నేను రాయునది,

నువ్వెలా ఉన్నావని నేనడగను . నేనేమి నిన్ను పరామర్శించడానికి రాలేదు,కాసేపు మనసారా మాట్లాడదాం అని వచ్చాను . నాకు తెలుసు నువ్వు ఎందుకిలా ఉన్నావో,రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయి,ఓ నకిలీ నవ్వుని మొహానికి తగిలించుకొని అందరి ముందు నటిస్తున్నావు . ప్రతీచోటా, ప్రతీసారి ఏవో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి . ఎదో చెప్పలేని భాద మనసుని తొలిచేస్తోంది, పంచుకోడానికి కూడా ఎవరు తోడు లేరు. గుండెల్లో ఎదో పర్వతాన్ని మోస్తున్నంత బరువు ఉంది, ఏదేదో చేయాలనీ , సాధించాలని ఉన్నా , కాళ్ళకి పేద్ద రాయిని కట్టేసినట్టు ఎక్కడికి కదలనీయకుండా ఉంది . రాత్రుళ్ళు చీకటిలో ఒంటరిగా కన్నీరు కారుస్తున్నావు. ఉదయాన్నే శూన్యం వైపు చూస్తూ ఏకాంతంగా ఎదో ఆలోచిస్తున్నావు . ఇవన్నీ మళ్ళీ గుర్తుచేసి భాదపెట్టాలని కాదు. నీ గురించి నేనేమనుకుంటున్నానో చెబుదామని . ఇంత దూరం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు ఎడారి లాంటి ముళ్ళదారిలో … ఎంత ఓపిక నీది , ఎంతో బరువుని మోస్తున్నావు ఎంత బలవంతుడివి నువ్వు….

నా వరకు నువ్వే హీరోవి,ఎవరుంటారు నీలా ??? మనసుకి గాయమైనా, వెన్నుతడుతూ ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయినా, నలుగురు నిన్ను చూసి నవ్వుతున్నా , నీకంటూ ఒక నిర్దేశిత లక్ష్యం పెట్టుకున్నావు, కఠినమైన దారి అని తెలిసినా ధైర్యంగా అడుగేస్తున్నావు . పడిన ప్రతీసారి పైకి లేస్తున్నావు . ఎన్ని ఆటంకాలు , అడ్డంకులు ఎదురైనా నీ దారిని మార్చుకోవట్లేదు . నీ దృష్టిని మర్లనీయట్లేదు . ఎంత నిబ్బరం కావాలి ఇవన్నీ ఓర్చుకోడానికి … నువ్వు ఇక్కడే ఆగిపోలేదు,అలసిపోయావు అంతే , ఇది విరమణ కాదు,విరామం మాత్రమే , నీలో ఎంత శక్తి ఉందొ నాకు మాత్రమే తెలుసు , ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలబడి,కలబడే నీ ఆత్మస్తైర్యం అంటే నాకు చాలా ఇష్టం . ప్రతీ రాత్రి ఎదో ఆవేదనతో,అసంతృప్తితో ఉన్నా మళ్ళీ ఉదయాన్నే ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని పరాక్రమించడానికి బయలుదేరే నిన్ను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది . అందుకే నువ్వే నా హీరోవి…

జీవితం అంటే అదో చీకటి వెలుగుల వైకుంఠపాళి . ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఇదే మొదటి సారి కాదు,ఇదే చివరిసారి కాదు . ఇంకా జీవితం నీకోసం ఏమేమి దాచిందో,నువ్వు అనుభవించాల్సిన ఆనందమే దాగుందో,లేక నువ్వు పరిష్కరించాల్సిన సమస్యలే ఉంచిందో . ఏదేమైనా ముందుకు వెళ్లడమే. నిన్ను ఇంత దగ్గరగా చూస్తున్న నాకే తెలుసు నువ్వెంటో,నీ సత్తా ఏంటో .
నువ్వేమి అనుకోనంటే చనువు కొద్దీ ఓ మాట చెబుతా , నువ్వేమి ప్రపంచభారాల్ని మోయట్లేదు, ఎవరికీ లేని సమస్యలు కావు నీవి , ఈ అఖండ విశ్వం లో ఒక చిన్న రేణువువి . నీవరకు నీది పెద్ద కష్టమే ఒప్పుకుంటా , కానీ అది నీలో శక్తిని పరీక్షించేదే . నిన్ను అశక్తుడిని చేసేది కాదు . జీవితం నీకిలాంటి సవాలు విసిరిందంటే దానిని ఎదుర్కోగల దమ్ము నీలో ఉందనే కదా . పక్కవాడితో పోల్చుకొని నీ విలువ నువు తగ్గించుకోకు . నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ స్థాయిని, సామర్ధ్యాన్ని మర్చిపోకు.

ఎవరు నిన్ను నమ్మినా నమ్మక పోయినా నేను నిన్ను నమ్ముతా, నీకు పోరాడడం మాత్రమే తెలుసు . నువ్వు ఎన్నో సార్లు ఓడిపోయావేమో,కానీ ఏ ఒక్క సారికూడా నీ దారిని వొదిలి పోలేదు , వేరేవాళ్లకి నువు సామాన్యుడివే కావొచ్చు,నా వరకు నువ్వో నిరంతర శ్రామికుడివి, విరామమెరుగని సైనికుడివి , నీ గెలుపుని నేనిప్పుడే చూస్తున్నా.

నిన్నటి రోజు నీది కాదు …………ఈ రోజూ నీది కాదు ………….రేపు కూడా ఇలానే ఉంటుందేమో, కానీ నీకంటూ ఓ రోజు ఉంటుంది ………….గుండెల్లో దాచలేని ఆనందం అప్రయత్నంగా కన్నీటి రూపంలో కంటిలోంచి బయటకి వస్తున్నపుడు , ఇన్నాళ్లూ నీకు దూరమైన నీ చిరునవ్వు మళ్ళీ నిను చేరేరోజు కచ్చితంగా దగ్గర్లోనే ఉంది . …….ఇవన్నీ నీకు తెలియనివి కాదు, గుర్తుచేస్తున్నానంతే.

ఇట్లు
నిన్ను అమితంగా ప్రేమించే
నీ….. నేను

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,