స్నేహితునికి ఆత్మీయ లేఖ : Happy Friendship Day!

స్నేహితుల దినోత్సవం సందర్భం గా…మా అనుభవాలు అన్నిటిని క్రోడీకరించి, స్నేహం అంటే ఏంటో తెలీకుండా, అర్ధం లేని పనులు నేర్పించేవాడే నేస్తం అనుకుంటూ గడిపేస్తున్న మా ఆత్మీయులు కొందరిని ఉద్దేశించి రాయబడిన లేఖ.
 
ప్రియమైన ఆత్మీయునికి,
 
మిత్రమా, ముందుగా నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఉభయ కుశలోపరి. లోకం పోకడ చూసి స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నావు. ఒళ్ళు తెలీని మైకం నీకు పరిచయం చేసేవాడు, వినలేని మాటలు నీతో పలికించే వాడు, చెప్పుకోలేని పనులు నీతో చేయించేవాడు, గర్వపడలేని గొప్పవాడిగా నిన్ను మార్చేవాడు; అలాంటి వాడసలు మిత్రుడే కాదు, అదసలు స్నేహమే కాదు.
 
చూడు మిత్రమా…
మద్యం మత్తు ఎంత సేపు, మహా అయితే ఒక పూట ఉంటుందేమో, ఒక లక్ష్యం అంటూ పెట్టుకొని దాన్ని సాధించి చూడు అప్పుడే వచ్చే కిక్కు ముందు, ఈ మందు జుజుబి. సాధించటానికి నువ్వు పడే తపన లోని కిక్కు, ఎన్ని సిట్టింగ్ లు వేస్తే వస్తుంది. ఓడిపోయినప్పుడు మళ్ళీ ప్రయత్నించి, గెలవాలి అని తరిమే కసి ఎంత కాస్ట్లీ సరుకు తాగితే దొరుకుతుంది. ఏ మాత్రం కష్టం పడకుండా తాగితే వచ్చే ఆనందం ఏముంది భయ్యా…ఇష్టం గా చేసే కష్టం లో పొందే ఆనందం రుచి చూడు ఒక్కసారి.
 
మిత్రమా, ఇది కాదు హీరోయిజం…
తలవంచుకు వెళ్ళే ఆడ పిల్లని గేళి చేయటం ఎంతసేపు భయ్యా..మీ తల్లి తండ్రులు తలయెత్తుకు తిరిగేలా ఏదైనా చేసి చూడు. ఎటువంటి హద్దులు లేకుండా, తప్పు ఒప్పులు చూడకుండా, నచ్చినట్టు చేయటం చాలా సులభం బాబాయ్.. కాని కొన్ని కట్టుబాట్లు, సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి బ్రతికి చూడు ఒక్కసారి.
 
సృష్టి కాదు, నీ దృష్టి మారాలి మిత్రమా…
కొన్ని లక్షల మంది రోజూ చెత్త తిన్నంత మాత్రాన అది తినుబండారం అవ్వదు. తప్పుడు మాటలు కుప్పలు గా వినిపిస్తున్నా అవి ఎన్నటికి గొప్పవి కావు. బురదలోని పందిని తీసుకొచ్చి మినరల్ వాటర్ తో శుద్ధి చేసినా అది అశుద్ధం తినకుండా ఆపగలవా. ప్రేక్షకులకు నచ్చని చిత్రానికి ఎంత గొప్పగా ప్రచారం ఇచ్చిన లాభం ఉంటుందా చెప్పు.
 
మిత్రమా… నువ్వెవరో మరచిపోకు…
సమాజం తీరు చూసి మోసపోకు మిత్రమా, నువ్వేంటి, నీ వారసత్వం ఏమిటి, పెరిగిన పరిస్తితులు, కలసిన మనుషులు, చదివిన చదువులు, మెదిలే ఊహలు అన్నిటిని ఎప్పుడూ రివ్యూ చేస్తుండాలి. నీకంటూ ఒక వ్యక్తిత్వం, అసాధారణ ఆలోచనలు, ఆశ్చర్యపరిచే ఆవేదనలు, ఆనందం కలిగించే జ్ఞాపకాలు పెంపొందించుకో.
 
మిత్రమా.. ప్రస్తుతం ఈ లోకం లో…
నలుగురికి మంచి చేయకపోయినా పర్లేదు చెడుచేయకపోతే చాలు, నలుగురితో మంచి వాడు అనిపించుకోవలసిన పని లేదు చెడ్డ వాడు అనే పేరు రాకుంటే చాలు. నలుగురికి సాయం చేయాల్సిన పని లేదు ఒక్కరికి కూడా ద్రోహం చేయకుంటే చాలు.
 
నేస్తమా..చివరిగా…
నిజమైన స్నేహం నిన్నెప్పుడు ఇబ్బందులపాలు చేయదు. నీ ఆరోగ్యాన్ని పాడు చేయదు. నీ స్థాయి తగ్గించదు. నీ పేరు చెడగొట్టదు. నీ ఉనికిని ప్రశ్నించదు. నీ దారి తప్పనివ్వదు. నీ వ్యక్తిత్వాన్ని వెక్కిరించదు. నీ ఆలోచనా శక్తిని కుదించదు. నీ గౌరవాన్నితుంచదు.
 
గుర్తుంచుకో మిత్రమా… అంతా కొంత కాలమే… వీలైనంత ఆనందం గా జీవిద్దాం.. సంతోషాలు పంచుదాం.
 
ఇట్లు,
నీ మంచే ఎప్పుడూ కోరుకునే మిత్రుడు.
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,