Meet The Sibling Geniuses Who Composed More Than 1000 Keerthanas On Lord Ram

 

కృష్ణాదిత్య, శశాంక్ ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు. కృష్ణ కన్నా శశాంక్ నాలుగు సంవత్సరాలు చిన్న, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. నాన్న కిషోర్ గారు మార్కెటింగ్ బిజినెస్ చేస్తుంటారు, అమ్మ హోమ్ మేకర్. సంగీత సాహిత్యం మీద ప్రేమే తప్ప అందులో అమ్మ నాన్నలు అంత ప్రావీణ్యులు కూడా కారు. మనిషిగా పుట్టి, మనిషిగానే బ్రతికి, ఏ మాయలు మంత్రాలు లేకుండా బ్రతికిన శ్రీరాముడు కథను కృష్ణ శశాంక్ చిన్నతనం నుండే వినేవారు, కర్నాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. కృష్ణ ఐతే 6 సంవత్సరాల నుండే అమ్మ ప్రేమపై కవితలు రాసేవారు.. ఇలా ఇద్దరి బాల్యం గడిచాక రామాయణ మహాభారత కావ్యాలను వదలడం కష్టతరం అయ్యింది.


 

“ఇంజినీరింగ్ చదివినా స్వామి వారు చూపిన దారిలోనే నడుస్తున్నాము. మా నరనరాల్లో సంగీతం, సాహిత్యం జీర్ణమైపోయాయి. ఒక్కోసారి రోజుకు 20, 30 సంకీర్తనలు రచిస్తాము..”


 

అన్నను చూసి తమ్ముడు:
కృష్ణకు బెంగళూర్ లో మంచి ఉద్యోగం వచ్చాక దాదాపు 18 నెలల పాటు అక్కడే పనిచేశాడు. ఉద్యోగం అంటే ఎదో చేస్తున్నాను అంటే చేస్తున్నాడు తప్ప ధ్యాస శ్వాస అంతా సంగీతం మీదనే ఉంది. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే దగ్గర్లోని దేవాలయాలలో సంకీర్తనలు పాడేవాడు. ఉద్యోగం కష్టంతో శ్రీరామ సంకీర్తనలు ప్రేమతో చేసేవాడు. ఇలా ఎంతకాలం కొనసాగాలి.? మరొకరికి ఇబ్బంది కలుగకుండా మనసుకు నచ్చిన కార్యాన్ని చెయ్యడమే కదా జీవితానికి అర్ధం అని అమ్మకు ఒక మాట, మరియు ఆశీర్వాదం తీసుకుని జాబ్ కు రిజైన్ చేసి పూర్తి స్థాయిలో సంకీర్తనలు పాడడానికి సిద్ధమయ్యాడు. కృష్ణను చూసి తమ్ముడు ఆదిత్య కూడా కొన్నాళ్లకు అన్న మార్గంలోకే వచ్చేసాడు. ఇద్దరు రామ నామాన్ని జపిస్తూ ప్రతి ఊరు తిరగడంతో “అభినవ లవకుశలుగా” మారిపోయారు.


 

“అన్ని సంకీర్తనలకు మేమే సంగీతం సమకూరుస్తాం. ఈ కీర్తనలన్నింటికి భగవంతుడే స్వరం కట్టి, మా మనసులో ప్రవేశపెడతాడేమో అనిపిస్తుంటుంది”.


 

500 కచేరీలు:
2014 నుండి మొదలుకొని ఇప్పటివరకు ఈ అభినవ లవకుశలు 500 కచేరీలు పూర్తిచేశారు. రామాయణం, మహా భారతం, భగవద్గిత, దేవి భాగవతాలను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, బెంగళూర్, భువనేశ్వర్ మొదలైన ప్రాంతాలలో ఆలపించారు. అభినవ లవకుశలు అనే పేరు పెట్టింది మొట్టమొదటి కచేరిలోనే. 2014 హైదరాబాద్ ఉప్పల్ రామాలయంలోని కచేరికి కొంతమంది విద్వాంసులు కూడా హాజరయ్యారు “మీరు రామకథను పారాయణం చేస్తుంటే సాక్షాత్తు త్రేతాయుగం నాటి ఆ లవకుశలే కలియుగానికి వచ్చి మరల పాడుతున్నట్టుగా ఉందని ఆరోజే చప్పట్ల సాక్షిగా నామకరణం చేశారు”.


 

“దేవాలయాలలో మాత్రమే కాదు పాఠశాలల్లోనూ పిల్లలకు అర్ధమయ్యేలా గానం చేస్తుంటాము. ప్రోగ్రామ్ అయ్యాక అక్కడి విద్యార్థులు మా దగ్గరికి వచ్చి రామాయణం ప్రేరణ పొందుతున్నామని చెబుతుంటే మా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోతాయి”.


 

ప్రపంచ సంస్కృతులలో మనది భిన్నమైనది ఉన్నతమైనది. దీనిని ముందు తరాలకు అందించాలి. వేదాలలో అద్భుత విజ్ఞానాన్ని శాస్త్రీయ కోణంలో అవగాహన చేసుకుని కీర్తనలు చేస్తుంటారు. వీరి మృదుమధురమైన గానంలో ఇతర మతాల వారు కూడా పులకించిపోతుంటారు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,