Here’s The Deeper Meaning Behind The Krishnam Vande Jagadgurum’s Beautiful Title Song

 

Contributed By Yashwanth Aluru

 

పరిచయం:
తెలుగు సినిమా ఆరంభం నుండి వచ్చిన అత్యుత్తమ పాటల్లో కృష్ణం వందే జగద్గురుమ్ పాట ఒకటని అనడంలో అతిశయోక్తి లేదు. “ఈ పాట వ్రాయడానికే నేను ఇన్నేళ్ళుగా చిత్రపరిశ్రమలో ఉన్నానేమో” అని రచయిత సీతారామశాస్త్రి గారు అన్నారంటే ఆ పాట ఆయన ప్రస్థానంలో ఆయనకెంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. కేవలం, ఆయన ప్రస్థానంలో మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రస్థానంలో కూడా ఈ పాట అంతే విలువైనది.

 

శాస్త్రి గారు వ్రాసిన అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క పాట ఒక ఎత్తు అని చెప్పొచ్చు. సహజంగా, ఆయన వ్రాసిన పాటలు సూటిగా ఒకే అర్థాన్నిస్తూ సాగిపోతాయి. కానీ ఈ పాట ఎవరెలా వింటే అలా వినిపించే, ఎవరెలా అర్థం చేసుకుంటే అలా అర్థమయ్యే పాట. ఆ జగన్నాథుని రూపాల్లాగే దీనికీ పలు అనుసృజనలుంటాయి.

 

ఈ పాటను ఇదివరకు ఎంతోమంది విశ్లేషించారు. అందులోని భాగవత, భగవద్గీత సారాలను చాలా అద్భుతంగా వివరించారు. ఇవే కాక, అందులోని భాషా ప్రయోగాలను గురించి చర్చించిన విశ్లేషణలూ ఉన్నాయి. అయితే, ఇలాంటి విశ్లేషణలు ఎన్ని ఉన్నప్పటికీ ఇదొక సినిమా పాట. ఓ సినిమాలోని కథ, కథనం మరియు పాత్రలకు అనుగుణంగా వ్రాయబడినదే. కనుక, సినిమానే దీని వేరు. తనలోని అనంతమైన ఆలోచనలను, సమాజం కోసం తను పడే నిత్య మానసిక సంఘర్షణను తెలియజేయడానికి శాస్త్రి గారు ఈ పాటను ఒక ఊతంగా ఎలా వాడుకున్నారో, పాటలో సినిమా కథను ఇనుమడింపజేసి దానికి బలం చేకూర్చే తన సహజ లక్షణాన్ని కూడా వదులుకోలేదు. అక్కడే, ఇది మంచి పాట అనే స్థాయిని దాటి గొప్ప పాట అనే స్థాయికి చేరుకుందని నా అభిప్రాయం. మిగతా విశ్లేషణలకు భిన్నంగా ఈ పాట కృష్ణం వందే జగద్గురుమ్ అనే సినిమాకు ఎలా పనికొస్తుంది అన్న కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను.

 

ముందుగా, ఇంతటి గొప్ప పాటను ఓ గొప్ప రచయిత వ్రాయగలిగేంత స్ఫూర్తిని నింపే కథను వ్రాసిన దర్శకుడు క్రిష్ గారికి, తొమ్మిదిన్నర నిమిషాల పాట, అందులోనూ సాహిత్యానికి బాణీ కట్టిన పాట అయినప్పటికీ, విన్న వెంటనే శ్రోత నోటిలో నాని మనసులోకి చొచ్చుకొనిపోయేలా చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ గారికి, పాటలోని భావాన్ని, తత్త్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని విన్న శ్రోతకు కూడా అదే భావన కలిగేలా ఆలపించిన గాయకుడు బాలు గారికి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను.

 

విశ్లేషణ:
(గమనిక: ఈ పాటను విశ్లేషించే ముందు కథను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, కథను పూర్తిగా వినందే శాస్త్రి గారు పాట వ్రాయరు. ఆయన పాటలో లేని కథ సినిమాలో ఉండదు. కనుక, సినిమా చూసినట్టయితేనే ఈ విశ్లేషణను చదవడం కొనసాగించండి.)

 

కథ:
“మహిమలు చూపేవాడు కాదు సాయం చేసేవాడు దేవుడు. ఇతరులకు సాయం చేస్తే మనిషి కూడా దేవుడు కాగలడు” అన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా బీటెక్ బాబు (రానా) అనే వ్యక్తి జీవిత ప్రయాణంగా సాగుతుంది. స్వతహాగా స్వార్థపరుడైన బాబు తన తాతయ్య సుబ్రహ్మణ్యం (కోట శ్రీనివాసరావు) ప్రోద్బలంతో సురభి సంస్థలో నాటకాలు వేస్తుంటాడు. అమెరికా వెళ్ళే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తాతయ్య చనిపోతాడు. ఆయన అస్థికలు స్వగ్రామంలో కలిపి, బళ్ళారి నాటకోత్సవాల్లో తన తాతయ్య చివరిగా వ్రాసిన కృష్ణం వందే జగద్గురుమ్ అనే నాటకాన్ని ప్రదర్శించడానికి తన బృందంతో వెళ్తాడు..

 

బళ్ళారి ప్రాంతంలో రెడ్డప్ప (మిళింద్ గునాజీ) అనే వ్యక్తి అక్రమంగా మైనింగ్ చేస్తుంటాడు. అతడిని ఆపే దిశగా దేవిక (నయనతార) అనే రిపోర్టర్ పనిచేస్తుంటుంది. నాటకోత్సవాల్లో కొన్ని పరిస్థితుల వల్ల ఆ మైనింగ్ మాఫియాతో బాబు తలపడాల్సి వస్తుంది. ఆ క్రమంలో బాబు ఎదుర్కున్న పరిణామాలేంటి, కలుసుకున్న మనుషులెవరు, తెలుసుకున్న నిజాలేంటి? మాఫియాను బాబు ఎలా అంతం చేశాడు? అన్నవి మిగిలిన కథాంశాలు.

 

గమనిక: ఈ సినిమాలో దర్శకుడు క్రిష్ చివర్లో ఈ పాటను నాటకంగా చూపించడం జరిగింది, అది కూడా నరసింహావతారము వరకు మాత్రమే. హీరోని నారసింహుడిగా చూపించారు తప్ప మిగతా అవతారాలు సినిమాకు ఎలా సంబంధమో సూటిగా చూపించలేదు. వాటిని వెలికితీసే ప్రయత్నమే ఈ వ్యాసం. అందుకు సినిమాలోంచి పలు ఘట్టాలను ఉదహరించడం జరుగుతుంది.

 

కథనం:

జరుగుతున్నది జగన్నాటకం… (2)

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం

నిత్య జీవనసత్యమని భాగవత లీలల అంతరార్థం

జరుగుతున్నది జగన్నాటకం…(2)

 

ఈ సినిమా చివర్లో బాబు ఓ మాట అంటాడు, “తాత రాసింది దేవుడి గురించి కాదు సాయం గురించి” అని. ఏవేవో మహిమలతో కూడుకున్న ఈ పురాణ వర్ణన పైకి కనబడే అంశం మాత్రమే. నిజానికి అక్కడ జరిగినవి మహిమలు కాదు, సహాయాలు. అలా సహాయం చేసినవారినే దేవుళ్ళుగా ప్రపంచం పూజిస్తోంది. బాబు జీవితంలో కూడా అదే జరుగుతుంది. అదెలాగంటే…

 

మత్స్యావతారము:

చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని

ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని

సత్యవ్రతునకు సాక్షాత్కరించి, సృష్టి రక్షణకు చేయూతనిచ్చి

నావగ త్రోవను చూపిన మత్స్యం… కాలగతిని సవరించిన సాక్ష్యం…

 

స్వార్థపరుడైన బాబుకి సాటి మనిషికి చేసే సాయం విలువ తెలియడమే ఈ సినిమాలోని ముఖ్య కథాంశం. అందుకు అతడి జీవితంలో ఎవరెలా సాయపడ్డారో తెలియజేసే కొన్ని ఘట్టాలుంటాయి. వాటిలో మొదటిది, అతడు తన తాత సుబ్రహ్మణ్యం పంచన చేరడం. కథనంలో, బాబు తన తాతను చేరే ఘట్టం గతంలా వస్తుంది కనుక కాలానుగుణంగా అదే ముందు జరిగినట్టవుతుంది. తన తల్లిదండ్రులను మేనమామ చక్రవర్తి హత్యచేసే క్రమంలో బాబుని వారింట్లో పనిచేసే జోగమ్మ (అన్నపూర్ణ) సుబ్రహ్మణ్యంకు అప్పగిస్తుంది. నిత్య జీవన సత్యమని మొదలుపెట్టిన పల్లవికి ఉదాహరణగా వెనకటికి కృతయుగంలో మత్స్యావతారములో వచ్చిన మహావిష్ణువు సత్యవ్రతుడికి సాయం చేసి ప్రపంచాన్ని రక్షించిన ఉదంతాన్ని ఈ చరణంలో చెప్పడం జరిగింది. సినిమాలో సత్యవ్రతుడు జోగమ్మ కాగా మత్స్యావతారము సుబ్రహ్మణ్యం అవుతాడు. పురాణకథలో నావకు దారి చూపించిన తరువాత మత్స్యావతారము ముగుస్తుంది. సినిమాలో బాబుని చేరదీసి పెంచిన తరువాత అతడికి అసలు దారి చూపించడానికి సుబ్రహ్మణ్యం పాత్ర ముగుస్తుంది.

 

ముందుగా చెప్పుకున్నట్టు, శాస్త్రి గారు వ్రాసే పాటలో ప్రతీ వాక్యం కథకు సంబంధించిందే ఉంటుంది. అదెలాగంటే…

చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని – అక్రమంగా చేసే మైనింగ్ ఉచ్ఛస్థాయికి చేరుకోవడం.

ధర్మమూలమే మరచిన జగతిని – ఇక్కడ రెండు పార్శ్వాలు. ఒకటి, సొంత అక్కాబావలను చంపిన చక్రవర్తి. రెండోది, అక్రమంగా మైనింగ్ చేసే రెడ్డప్ప.

యుగాంతమెదురై ముంచునని – యుగాంతం అంటే భూమిపైనున్న మానవాళి నిర్వీర్యమైపోవడం. కథానుసారంగా, రెడ్డప్ప తన మైనింగ్ వ్యాపరం కోసం అనేక ఊర్లను నాశనం చేయడం.

సత్యవ్రతునకు సాక్షాత్కరించి, సృష్టి రక్షణకు చేయూతనిచ్చి – ప్రాణాల కోసం పరిగెడుతున్న జోగమ్మను ఆదుకొని బాబుని చేరదీయడం. ఇక్కడ సృష్టి రక్షణ అంటే, ఆ మైనింగ్ మాఫియాను అంతం చేసి అక్కడి ప్రజలను కాపాడే బాధ్యత భవిష్యత్తులో బాబుదే కనుక అతడిని చేరదీసి తెలియకుండానే దానికి తనవంతు సాయం చేయడం.

నావగ త్రోవను చూపిన మత్స్యం – సుబ్రహ్మణ్యం పాత్రే మత్స్యావతారము. అది బాబుకి చూపించిన త్రోవ నాటకం. నాటకం కోసమే బాబు బళ్ళారికి పయనమవుతాడు. అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది.

కాలగతిని సవరించిన సాక్ష్యం – ఒకవేళ చక్రవర్తి చేతిలో బాబు చిన్నప్పుడే చనిపోయుంటే కథ అక్కడితోనే ముగిసిపోయేది. సుబ్రహ్మణ్యం చేసిన సహాయం అలా జరగకుండా ఆపింది. ఇక్కడ సాక్ష్యం అనే మాట కృతయుగంలోని మత్స్యావతార ఘట్టాన్ని సినిమాలోని కథకు ఉపమానం చేసిన విషయాన్ని చెబుతుంది.

 

కూర్మావతారము:

చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే…

పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే…

బుసలుకొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక

ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమథన మర్మం…

 

మత్స్యావతారముగా సుబ్రహ్మణ్యం బాబుకి ఓ దారి (బళ్ళారి) చూపించాడు. అక్కడ ఓ నిజముంటుంది. దాన్ని బాబుకి తెలియజేయడానికి జోగమ్మ వేచివుంటుంది. అతడిని చూసినప్పటి నుండి అది చెప్పాలని ప్రయత్నిస్తుంది. కుదరకపోయినా ఓర్పుతో ప్రయత్నిస్తూనేవుంటుంది. కొన్ని సందర్భాల్లో ఓర్పుగా ఉండడం కూడా కార్యసాధనకు తోడ్పడుతుందని కూర్మావతారము చెప్పిన నీతిని మళ్ళీ చెబుతూ, కథనక్రమంలో జోగమ్మ సత్యవ్రతుడి (సాయం పొందిన వ్యక్తి) నుండి కూర్మావతారముగా (సాయం చేసే వ్యక్తి) మారుతుంది. అలా నిజం చెప్పిన తరువాత ఈ పాత్ర కూడా అంతర్థానమవుతుంది. సినిమాకు నాటకీయ స్వేచ్ఛ (Dramatic Liberty) అవసరం కనుక చివర్లో ఈ పాత్ర మళ్ళీ కనిపిస్తుంది.

 

వరాహావతారము:

ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును

కరాళ దంష్ట్రుల కుళ్ళగించి, ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల

ధీరోద్ధతి రణహుంకారం… ఆదివరాహపు ఆకారం…

 

పురాణం ప్రకారం భూమిని హిరణ్యాక్షుడనే రాక్షసుడు పాతాళంలో దాచేస్తే మహావిష్ణువు వరాహావతారంలో వచ్చి వాడిని అంతమొందించి తన కోరలతో భూమిని మళ్ళీ సముద్రంపైకి తెచ్చాడు. ఈ సినిమా కథ ప్రకారం ఆ వరాహ మూర్తి దేవిక అవుతుంది. ఆ పురాణ పాత్రను దేవికకు ఆపాదిస్తూ శాస్త్రి గారి చరణం సాగుతుంది. అయితే ఇందులో హిరణ్యాక్ష వధను వదిలేసి సహాయం అనే అంశాన్ని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. అదెలాగంటే…

 

ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును – ఈ పాటలో అనేకసార్లు భూమి ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే, సినిమా కథాంశం మైనింగ్ చుట్టూ తిరిగేది. మానవుడి ఉనికికి కారణమైన భూమిని భూగర్భ మైనింగ్ పేరిట ధ్వంసం చేస్తుంటాడు రెడ్డప్ప. సముద్రంపై తేలియాడే భూమిని (మట్టి) తొలుచుకుంటూపోతే చివరికి అది మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది.

 

కరాళ దంష్ట్రుల కుళ్ళగించి, ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల – కరాళ దంష్ట్రులు అంటే భయంకరమైన కోరలు (పళ్ళు) అని అర్థం. సినిమాలో అది దేవిక తీసిన డాక్యుమెంటరీగా పరిగణించవచ్చు. రెడ్డప్ప తాలూకు మైనింగ్ మాఫియా రహస్యాలను దాని ద్వారా బయటపెట్టి ఆ ప్రాంతానికి ఆమె చేసే సహాయాన్ని ఈ వాక్యంలో చెప్పడం జరిగింది.

 

ధీరోద్ధతి రణహుంకారం, ఆదివరాహపు ఆకారం – దేవిక ఓ ధైర్యశీలి. ఈ వాక్యం ఆమె పాత్ర వర్ణన.

 

(ప్రకృతిపై ఆధారపడి జీవించే ప్రతి ప్రాణికి ఆ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తాయి జంతురూపంలోని మొదటి మూడు అవతారాలు. కానీ అధర్మం పెచ్చుమీరిపోయినప్పుడు దాన్ని ఎదురుకోవడానికి వాటికున్న శక్తిసామర్థ్యాలు సరిపోలేదు. అప్పుడే భూమిపై అవతరించింది ఓ రూపం. మొదట చూడడానికి జంతువులా అనిపించినా, క్రమంగా రూపంతో పాటు లక్షణాలను కూడా మార్చుకుంది. దేహంతో పాటు మనసుని కూడా పెంచుకుంది. అదే మనిషి అవతారం.)

 

నరసింహావతారము (పుట్టుక):

ఈ పాటలో ఎక్కువ శాతం వాక్యాలు నరసింహావతారముకే ఉంటాయి. ఎందుకంటే, దశావతారాలలో మనిషి ప్రస్తావన ఇక్కడి నుండే మొదలవుతుంది. బాబు అనే ఓ మనిషిలోని ఇంకో మనిషి (నరుడి లోపలి పరుడు) పుట్టుక జరగడమే సినిమా కథ. సాయం విలువ తెలుసుకున్న బాబు లోపలున్న మనిషి పుట్టుక జరగడానికి ఎవరెలా తోడ్పడ్డారన్నది కథనం. దాన్ని దశావతారాలాకు ముడిపెట్టారు దర్శకుడు క్రిష్.

 

దశావతారాల్లో దేని విశిష్టత దానిదే అన్నట్టుగా, వేర్వేరు సమయాల్లో వేర్వేరు కార్యాలను నెరవేర్చడానికి అవి భూమ్మీదకి వచ్చినట్టు కనిపిస్తాయి. అదే, పైకి కనిపించే పురాతనపు పురాణ వర్ణన. ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా కనిపించే వాటిని ఒక్కటిగా అల్లే సన్నని దారాన్ని పట్టుకున్నారు శాస్త్రి గారు. నిత్యజీవన సత్యం అని సినిమా కథ, కథనాలకు దాన్ని ఆపాదిస్తూ గీతరచన చేశారు.

 

పురాణంలో మత్స్యావతారము, వరాహావతారము కూడా దుష్టసంహారం చేశాయి. కానీ సినిమా కథానుసారంగా అది మనిషి (బాబు) చేయాలన్న ఆలోచనతో ఆ రెండు అవతారాలు చేసిన సహాయాన్ని మాత్రమే చర్చించడం జరిగింది. బాబుకి జీవితమిచ్చింది సుబ్రహ్మణ్యం (మత్స్యావతారము), నిజం చెప్పింది జోగమ్మ (కూర్మావతారము), అతడికి బళ్ళారి ప్రాంత ప్రజల సమస్యను పరిచయం చేసింది దేవిక (వరాహావతారము). ఈ మూడు అవతారాలు కలిసి ఓ సరికొత్త అవతారానికి జన్మనిచ్చాయి. అదే బీటెక్ బాబు (నరసింహావతారము). ఇదే శాస్త్రి గారు పట్టుకున్న దారం. ఇప్పుడు బాబుకి రెండు కర్తవ్యాలు. ఒకటి తన వ్యక్తిగతం, రెండోది వ్యవస్థాగతం. వ్యక్తిగతం నరుడిది, వ్యవస్థాగతం హరిది. నరుడు స్వార్థపరుడు కనుక కథారంభం నుండీ బయటే ఉన్నాడు. హరి నిస్వార్థపరుడు కనుక లోపలే ఉన్నాడు. ఓ చోట బాబు దేవికతో అంటాడు “ఇప్పుడు కూడా రెడ్డప్ప వాళ్ళకు (గ్రామస్థులు) దొరకాలనుకుంటున్నాను. అంతేకానీ నేను తీసుకెళ్ళి ఇద్దామనుకోవట్లేదు” అని. అప్పుడు దేవిక చెప్పే సమాధానమే అతడిలోని హరికి జన్మనిస్తుంది.

 

ఏడీ ఎక్కడరా నీ హరి?

దాక్కున్నాడేరా భయపడి?

బయటకి రమ్మనరా

ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి

 

పురాతనపు పురాణ వర్ణనలో ప్రశ్నించిన హిరణ్యకశిపుడు (చెడు), సమాధానంగా వచ్చిన నారసింహుడు (మంచి) వేర్వేరు రూపాలు. కానీ వారిద్దరూ ఒకే రూపంలో ఉన్నారన్నదే కలియుగ నిత్యజీవన సత్యం. ఆ రూపం పేరే మనిషి. కనుక, ఈ ప్రశ్న బాబుదే, ఇందుకు సమాధానం కూడా బాబే. ఇక్కడినుండి వచ్చే ప్రతి అవతారం కూడా బాబే.

 

నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు

నీ నాడుల జీవజలమ్ముని అడుగు

నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు

నీ ఊపిరిలో గాలిని అడుగు

నీ అణువుల ఆకాశాన్నడుగు

నీలో నరుని, హరిని కలుపు…

నీవే నరహరివని నువ్వు తెలుపు||

 

మానవ శక్తిని పంచభూతాలతో సమన్వయం చేస్తే నరుని లోపలి పరుని దర్శించడం సాధ్యమని ఈ చరణంలోని భావం. అయితే, ఈ వాక్యాలను సినిమా కథనానికి కూడా ఆపాదించవచ్చు. బాబు తన వ్యక్తిగత సమస్యతో పాటు ప్రజల సమస్యను కూడా తీర్చడానికి అతడి మనసు చెప్పిన కారణాలే ఈ వాక్యాలు. అదెలాగంటే…

 

నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు – మైనింగ్ మాఫియా వల్ల తల్లడిల్లిపోతున్న ప్రాంతం గురించి తెలుసుకోమనడం.

నీ నాడుల జీవజలమ్ముని అడుగు – నాడుల జీవజలమ్ము అంటే అతడిలో ప్రవహించే రక్తం. అనగా, అతడి గతం గురించి తెలుసుకోమనడం.

నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు – ఈ రెండు అంశాల మూలాన రగులుతున్న అతడి యువరక్తం.

నీ ఊపిరిలో గాలిని అడుగు – శ్వాసలో పెరుగుతున్న వేడి.

నీ అణువుల ఆకాశాన్నడుగు – మానవ శరీరం అనంతమైన అణువుల సమాహారం. అందుకే, వాటిని ఆకాశంతో పోల్చారు శాస్త్రి గారు. ప్రతీ అణువుకి ఒక శక్తి ఉంటుంది. అన్ని అణువుల శక్తిని కూడగట్టుకోమని చెప్పడం.

నీలో నరుని హరిని కలుపు – ఇక్కడ బాబు ఇద్దరు వ్యక్తులను అంతమొందించడానికి పూనుకుంటాడు. ఒకరు తన కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి, ఇది వ్యక్తిగతం (నర). మరొకరు ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న వ్యక్తి, ఇది వ్యవస్థాగతం (హరి).

నీవే నరహరివని నువ్వు తెలుపు – ఒకేసారి రెండు సమస్యలను తీర్చడానికి నరహరిగా మారాడు.

 

అప్పటివరకు తన మునుపటి అవతారాల (మనుషుల) నుండి సాయం పొందిన బాబుకి ఇప్పుడు సాయం చేసే అవకాశం వచ్చింది. ప్రజల ఉసురుపోసుకుంటున్న రెడ్డప్ప లాంటి వ్యక్తుల భరతం పట్టాలి. అందుకే ఉగ్రనారసింహ రూపం ధరించి దుష్ట సంహారానికి పూనుకున్నాడు. దాని గురించి శాస్త్రి గారు చేసిన వర్ణన ఇది…

 

ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి – ఈ వాక్యానికి అర్థం మదమెక్కిన ఏనుగుల గుంపు అని. కథానుసారంగా, డబ్బు, పరపతి ఉన్నాయని రెచ్చిపోయే రెడ్డప్ప లాంటి వ్యక్తులు.

హంతృ సంఘాత నిర్ఘృణ నిబిడమీ జగతి – ఈ వాక్యానికి అర్థం హంతకులతో నిండిపోయింది ఈ ప్రపంచం అని. కథానుసారంగా, రెడ్డప్ప, అతడి అండ చూసుకొని చెలరేగిపోయే హంతకులు.

అఘము నగమై ఎదిగె అవనికిదె ఆశనిహతి – ఈ వాక్యానికి అర్థం పాపం కొండలా పెరిగిపోయి భూమికి పిడుగుపాటులా మారింది అని. కథానుసారంగా, అక్రమ మైనింగ్ తారాస్థాయికి చేరుకొని భూమిని నాశనం చేస్తోంది. ఈ రెండు అంశాలను నగము (కొండ) మరియు ఆశనిహతి (పిడుగు) అనే పదాలతో చెప్పారు శాస్త్రి గారు.

ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి – ఈ వాక్యానికి అర్థం దుర్మార్గుల అంతం అనివార్యమైన నియమం అని. కథానుసారంగా, అరాచకాలు సృష్టిస్తున్న రెడ్డప్ప లాంటి వ్యక్తులను చంపడమే న్యాయమని నిర్ణయించుకుంటాడు బాబు.

శితమస్తి హతమస్తకారి నఖ సమకాసియో కౄరాసి గ్రోసి – ఈ వాక్యానికి అర్థం పదునైన కొనలు కలిగి శత్రువుల తలలను చీల్చగల కత్తుల్లాంటి గోళ్ళతో కోసి అని.

హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయు మహిత యజ్ఞం – ఈ వాక్యానికి అర్థం అగ్ని కోరల్లోకి తోసి మసిచేసే మహాయజ్ఞం అని. కథానుసారంగా, చివరకు రెడ్డప్ప కూడా మంటల్లో ఆహుతి అవుతాడు.

 

వామనావతారము (ఎదుగుదల):

అమేయమనూహ్యమనంత విశ్వం…

ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం

కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్పప్రమాణం

ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం

జరుగుతున్నది జగన్నాటకం…(2)

 

ఈ పాటలో నరసింహావతారము బాబు కోణంలో సాగేది. స్వార్థపు స్తంభాల్ని చీల్చి, తనలోని నిజమైన మనిషిని చూపి, తరువాతి కర్తవ్యాన్ని తెలిపేది. వామనావతారము గురించి వ్రాసిన ఈ చరణం బాబుని చూసే ప్రపంచపు (ముఖ్యంగా రెడ్డప్ప పాత్ర) కోణంలో సాగుతుంది.

 

పురాణం ప్రకారం, తనకెదురు లేదన్న గర్వం నిండిపోయిన బలిచక్రవర్తి అనే ఓ దానవరాజు దగ్గరికి పొట్టిగా (కుబ్జాకృతి) ఉన్న ఓ బాలుడు వచ్చాడు. తనకు మూడడుగుల నేల దానం కావాలని అడిగాడు. అందుకు బలి సమ్మతించగానే ఊహించని ఎత్తు ఎదిగిపోయాడు. రెండడుగులతో భూమిని, ఆకాశాన్ని కప్పేశాడు. మూడో అడుగు ఏకంగా బలి తలపైనే పెట్టి అతడిని పాతాళానికి తొక్కేశాడు.

 

సినిమా ప్రకారం, బళ్ళారి ప్రాంతంలో తనకెదురులేదని అరాచకాలకు పాల్పడుతుంటాడు రెడ్డప్ప. పరిస్థితుల దృష్ట్యా, అతడికి సురభి సంస్థలో నాటకాలు వేసే బీటెక్ బాబు (కుబ్జాకృతి) పరిచయమవుతాడు. అతడిని సులువుగా ఎదురుకోగలనని అనుకుంటాడు రెడ్డప్ప. కానీ స్నేహితుడి నాలుక కోసిన సైదా (బాహుబలి ప్రభాకర్) అనే రెడ్డప్ప మనిషి కోసం వచ్చాడని తెలుస్తుంది. ఇది మొదటి అడుగు. ఆ తరువాత, తన మేనమామ చక్రవర్తి కోసం వెతుకుతున్నాడని తెలుస్తుంది. ఇది రెండో అడుగు. చివరికి, రెడ్డప్పనే ఎదిరించడానికి సిద్ధమవుతాడు. ఇదే మూడో అడుగు, వెరసి త్రైవిక్రమ విస్తరణం. అలా, ఈ చరణం బాబు ఎదుగుదలను చెబుతుంది. తన మేనమామని అప్పగిస్తానని చెప్పిన రెడ్డప్పను బలిచక్రవర్తిని చేస్తుంది.

 

ఇది రెడ్డప్ప కానీ ఆ ప్రాంతం కానీ ఊహించని నాటకీయ పరిణామం. అదే అక్కడ జరుగుతున్న జగన్నాటకం.

 

పరశురామావతారము (చర్య):

పాపపు తరువై పుడమకి బరువై

పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ

పరశురాముడై, భయదభీముడై

ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన

శ్రోత్రియ క్షత్రియ తత్త్వమే భార్గవుడు…

 

అధికారమిచ్చిన అహంకారంతో జమదగ్నిని చంపుతాడు కార్తవీర్యార్జునుడు అనే రాజు. అ మదాన్ని అణచడానికి జమదగ్ని కొడుకు పరశురాముడు ప్రపంచంలో అధర్మపాలన చేసే రాజులందరి (ధర్మగ్లాని – గ్లాని అంటే నీటిలో పెరిగే నాచు. ఇక్కడ రాజులను ధర్మానికి పెరిగిన నాచుగా వర్ణించడం జరిగింది) మీద దండయాత్రలు చేసి ధర్మాన్ని పునరుద్ధరించాడు.

 

ఈ సినిమాలో కూడా అధికార గర్వంతో అరాచకాలకు పాల్పడే రెడ్డప్ప కథకు బాబు ముగింపు పలుకుతాడు. ఈ ఘట్టాన్ని పరశురామావతారముతో పోలుస్తూ శ్రోత్రియ క్షత్రియ తత్త్వమే భార్గవుడు అని వర్ణించారు శాస్త్రి గారు. శ్రోత్రియుడు అంటే బ్రాహ్మణుడు. పరశురాముడు బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుడిలా యుద్ధం చేసి రాజులను అంతమొందించాడు. నాటకాలు వేసుకునే బాబు (శ్రోత్రియుడు) కూడా ఓ ప్రాంతాన్ని శాసించే రెడ్డప్పపై తిరగబడ్డాడు (క్షత్రియుడు).

 

రామావతారము (లక్షణం):

ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక

నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక

మనిషిగానే పుట్టి, మనిషిగానే బ్రతికి

మహిత చరితగ మహిని

మిగలగలిగే మనికి సాధ్యమేనని

పరంధాముడే రాముడై ఇలలోన నిలచె

 

ఎక్కడినుండో వచ్చిన ఓ రంగస్థల నటుడు బాబుకి ప్రజలను, ప్రభుత్వాన్ని సైతం శాసించే రెడ్డప్పను అంతం చేయడం, ఓ పెద్ద సమస్యను పరిష్కరించడం ఎలా సాధ్యపడింది అన్న ప్రశ్నకు శాస్త్రి గారు రామావతారమును సమాధానంగా చెప్పారు. సంకల్పం గొప్పగా ఉండాలే తప్ప ఎటువంటి మహిమలు, మాయలు లేకుండా మనిషి తాను అనుకున్నది సాధించగలడని, ప్రపంచానికి స్ఫూర్తిగా నిలవగలడని రాముడు నిరూపించిన విషయం బాబు జీవితం ద్వారా మరోసారి నిరూపితమయ్యింది.

 

కృష్ణావతారము (ధర్మం):

ఇన్ని రీతులుగా, ఇన్నిన్ని పాత్రలుగా

నిన్ను నీకే నూత్నపరిచితునిగా

దర్శింపజేయగల జ్ఞానదర్పణము

కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము…

 

తన తాతయ్య చివరి కోరికైన ఓ నాటకాన్ని వేసి తరువాత తన దారిన తాను వెళ్ళాలనుకున్న బాబు జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రతి మలుపులో తనకు తాను కొత్తగా కనిపించాడు. ఎంత కొత్తగా అంటే “రెడ్డప్ప వాళ్ళకు (గ్రామస్థులు) దొరకాలనుకుంటున్నాను. అంతేకానీ నేను తీసుకెళ్ళి ఇద్దామనుకోవట్లేదు” అన్న వ్యక్తి చివరికి తనే స్వయంగా రెడ్డప్పను గ్రామస్థులకు అప్పగించేంత. ఇదే కృష్ణతత్త్వం. బాబు తన నిత్య జీవనంలో తెలుసుకున్న సత్యం. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరినీ చంపకుండా యుద్ధానికి సహాయపడినట్టుగా బాబు కూడా రెడ్డప్పను చంపకుండా అతడిని గ్రామస్థులకు అప్పగించి సహాయం చేశాడు. సృష్ట్యావరణతరణము (సృష్టి + ఆవరణ + తరణము) అంటే భూమిని వదిలి వెళ్ళడం అని అర్థం. కృష్ణుడిగా ధర్మసంస్థాపనని చేసిన తరువాత భగవంతుడు ఆ అవతారం చాలించి భూమిని వదిలి వెళ్ళాడని పురాణం చెబుతుంది. సినిమాలో బాబు కూడా రెడ్డప్పను గ్రామస్థులకు అప్పగించి ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోతాడు.

 

అణిమగా – అణువంత పరిమాణంలో మారిపోవడం

మహిమగా – అనంతమైన పరిమాణంలో మారిపోవడం

గరిమగా – అత్యంత భారంగా మారిపోవడం

లఘిమగా – అత్యంత తేలికగా మారిపోవడం

ప్రాప్తిగా – ఎక్కడికైనా ఉన్నపాటుగా వెళ్ళడం

ప్రాకామ్యవర్తిగా – ఎదుటి వ్యక్తి మనసులోని ఆలోచనలను తెలుసుకోవడం

ఈశత్వముగా – దైవత్వం కలిగివుండడం, అన్నింటిపై అధికారం కలిగుండడం

వశిత్వమ్ముగా – దేన్నైనా వశం చేసుకోవడం

నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా…

స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా…

 

ఈ పాటలో చర్చించిన మహావిష్ణువు అవతారాలు ఈ ఎనిమిది లక్షణాలను కలిగివున్నవి. ఆ అవతారాలన్నీ తనలోనే ఉన్నాయని గీతను బోధిస్తున్న కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. సంకల్పం బలంగా ఉంటే ఈ ఎనిమిది లక్షణాలు మనిషికి తనలోనే కనబడతాయన్న నీతిని ఈ కథలో అంతర్లీనంగా చెప్పుకుంటూ వచ్చారు దర్శకుడు క్రిష్ గారు. అదే ఈ పాట చివర్లో చెప్పారు శాస్త్రి గారు.

 

నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా

తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే

నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే…

 

నరుని లోపలి పరుడు అంటే అంతర్వాణి (ఆత్మ). నీ ఆత్మే నిన్ను నడిపే గురువు అన్న భగవద్గీత సారాంశాన్ని ఈ మూడు వాక్యాల్లో చెప్పారు శాస్త్రి గారు. అలా, తనలోని ఆత్మను అనుసరించిన బాబు తన తాతయ్య నాటకంలో వ్రాసిన మత్స్య, కూర్మ, వరాహావతారములు చేసిన సహాయాల గురించి నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ తత్త్వాల గురించి తెలుసుకొని, అష్టసిద్ధులు కలిగి తనలోనే విరాట్ విశ్వరూపం ఉందని గుర్తించాడు. తన వ్యక్తిగత సమస్యను తీర్చుకోవడమే కాక ప్రజల సమస్యను కూడా తీర్చి వారికి దేవుడయ్యాడు.

 

మునుపటి ఏడు అవతారాల సమాహారమైన కృష్ణుడికి నమస్కరిస్తూ కృష్ణం వందే జగద్గురుమ్ అని కథను మొదలుపెట్టారు క్రిష్. అదే మాటతో తన పాటను ముగించారు శాస్త్రి.

 

ప్రపంచానికి సహాయం అవసరమైనప్పుడు వచ్చి, అది అందించిన తరువాత అంతర్థానమైన ప్రతి అవతారం లాగే బీటెక్ బాబు కూడా రెడ్డప్పను గ్రామస్థులకు అప్పగించి వెళ్ళిపోతాడు. నాటకీయ స్వేచ్ఛను తీసుకున్న దర్శకుడు క్రిష్ సినిమాను బాబు మీద షాటు వేసి ముగించారు. అలా కాకుండా మనిషి దేవుడు అని మట్టిరాజు చెప్పే ఈ సన్నివేశంతో ముగించివుంటే బాగుండేది.

 

తెలుగు సినిమా పాట చరిత్రలో ఈ పాటకు స్వర్ణాక్షరాలతో ఓ పుట ఎప్పటికీ ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటున్నాను.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,