This Travelogue Describing A Visit To The Historical “Konark Sun Temple” Is A Must Read!

 

Contributes by Sri Kaushik

అప్పడు సమయం మధ్యాహ్నం 3.00 గo||లు, మేము ఒక 20 మందిమి బస్సు లో సూర్యదేవాలయానికి చేరుకున్నాం. వేసవి కాలం కావటం వలన, పెద్దగా జనాలు లేరు. రోడ్డు మీద బస్సు ఆగింది, మేము దిగాము. మాతో పాటు వొచ్చిన గైడ్ అందరికి, ఎంట్రీ టికెట్స్ తీసుకున్నారు. బయటనుంచి దేవాలయం ఏమి కనపడట్లేదు. చిన్న చిన్న అంగళ్లు తప్పితే ఒక “world heritage site” ముందు వుండవల్సిన ఏ లక్షణాలు నాకు కనపడలేదు.ఇంతలో మా గైడ్ మమ్మల్ని అందర్నీ అక్కడే ఉంటున్న ఇంకొక గైడ్ కి అప్పజెప్పి,”ఇదిగో, బాగా చెప్పూ, ఏది మర్చిపొకూ” అని చెప్పి తను మమ్మల్ని అతనితోపాటు వెళ్ళమని సంజ్ఞ చేసాడు.మేమందరం అతనితో పాటు లోపలి వెళ్ళాం. అప్పుడు చూసా మొదటిసారి సుర్యదేవలయాన్ని. నిజం చెప్పాలంటే, నేను ఇంటర్నట్ లో చూసిందే బావుంది అనిపించింది. కట్టడం పెద్దదే కాని మన గవర్నమెంట్ వాళ్ళు పునరుద్ధరణ కార్యక్రమం వలన అంత కట్టెలు పెట్టి, accident అయిన రోగికి కట్లు కట్టినట్టు వుంది.మమ్మల్నందర్నీ మా గైడ్, ఒక చెట్టు కింద చేర్చి మొదట దాని ఇతివృత్తం చెప్పటం మొదలుపెట్టారు.


సూర్యదేవాలయం అన్నది, 1238 లో నరసింహదేవ అనే రాజు అప్పుడు సమయం, ఋతువులు అంచనావేసుకోవటానికి అలానే శత్రు దేశాల నౌకల నుంచి తమని తాము రక్షించుకోవటానికి నిర్మించుకున్నారు. ఈ కట్టడం అక్షరాల 12 సంవత్సరాలు, 1200 మంది శ్రామికులు కట్టారు.కాబట్టి, 1238 లో మొదలుపెట్టి 1250 లో నిర్మాణం పూర్తి అయ్యింది. కాలం మొత్తం భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమం మీద ఆధారపడి వుంటుంది కనుక, ఈ దేవాలయం కుడా సూర్యునితో అనుసంధానం చెస్తూ నిర్మించారు.సూర్యుని రధానికి 24 చక్రాలు వుంటాయి, అలానే ఈ దేవాలయం లో కూడా 24 చక్రాలు వుంటాయి, సూర్యుని రధానికి వుండే గుర్రాలు 7, ఈ దేవాలయం లో వుండే గుర్రాలు 7. ఒక్కొక్క చక్రం ఒక గంటని సూచిస్తుంది, ఒక్కొక్క గుర్రం వారం లో ఒక రోజుని సూచిస్తుంది. అంటే మనం ఇప్పుడు స్టైల్ గా అనుకునే 24X7 వ్యవహారం మన వాళ్ళు 1250 లోనే చేసి పెట్టారు.


ఇక మొత్తం దేవాలయం లో రెండు గోపురాలు వుంటాయి. మొదటి గోపురం లో సభలు అవి జరిగేవి,రెండవ గోపురం లో పెద్ద అయిస్కాంత స్థూపం వుండేది. ఈ అయిస్కాంత స్థూపం ఎందుకంటే, సముద్ర మార్గం గుండా వచ్చే శత్రుదేశాల పడవలలో వాడే దిక్సూచులను(compass) ఇది పని చెయ్యకుండా చేసి వారికి దిక్కులు తెలియకుండా చెయ్యటానికి.కాని కాలక్రేమేనా దానిని చొరబాటుదారులు ధ్వంసం చేసారు. కాబట్టి ఇప్పటికి మనకి మొదటి గోపురం మాత్రమె మిగివుంది.ఇది స్థూలంగా, అసలు సూర్యదేవాలయం ఎందుకు కట్టారు అన్న విషయం. ఈ కధ ముగిసేసమయానికి నాకు ఇందాక కట్లతో మూలుగుతున్న పేషెంట్లా కనిపించిన కట్టడమే, కుర్చీలో కదలకుండా కూర్చున్న Stephen Hawkins లా కనిపించటం మొదలుపెట్టింది.


ఇక మమ్మల్ని గైడ్, గోపురం దగ్గరికి తీసుకు వొచ్చారు. గోపురం ముందు ఒక ప్రాంగణం వుంటుంది. దానికి ముందు మెట్లు, మెట్ల ముందు రెండు విగ్రహాలు. రెండు విగ్రహాలు ఏమిటంటే,సింహo కింద ఏనుగు,ఏనుగు కింద నలగిపోతున్న మనిషి. ఈ విగ్రహం చెప్పేది ఏమిటంటే, సింహం బలానికి గుర్తు, ఏనుగు ఐశ్వర్యానికి గుర్తు. కాబట్టి ఈ రెండు మీద పడితే మనిషి పాతాళానికి పోతాడు అని చెప్తాయి. మీరు చాల మంది ఇళ్ళ బయట ఒక వాక్యం చదివివుంటారు, “keep your shoes and egos outside” అని. అదే విషయం, ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు విగ్రహం రూపం లో రాజా వారు గోపురం ద్వారం దగ్గర వేయించారు.


ఇక విగ్రహాలు మెట్లు ఎక్కి ప్రాంగణం లోకి వెళ్ళాం. ప్రాంగణం సరిగ్గా గోపురానికి ఎదురుగా వుంటుంది. ప్రాంగణానికి మూడు ద్వారాలు వుంటాయి. మూడు ద్వారాలు ఎందుకంటే, మనకి సూర్యుడు ఎప్పుడూ సరిగ్గా తూర్పున ఉదయించడు. సంవత్సరంలో సగం రోజులు north-east అంటే ఉత్తరాయణం లో మిగిలిన సగం రోజులు south-east అంటే దక్షిణాయనం లో ఉదయిస్తాడు. కేవలం రెండు రోజులు మాత్రం సరిగ్గా east లో ఉదయిస్తాడు. కాబట్టి, సంవత్సరంలో ఆ భాగాన్ని బట్టి సూర్యకిరణాలు ఆ ప్రాంగణంలొనీ ఒక్కొక్క ద్వారంగుండా ప్రసరించి సరిగ్గా గొపురంలోని తలుపుల మీద పడతాయి.అది architectural intelligence అంటే. అది అసలు ముఖద్వారం అంటే. అది అద్భుతం అంటే .


ఇక గోపురం లోకి వెళ్దాం. గోపురం లో మొదట మనకు కనిపించేది, సూర్య భగవానుని గుర్రాలు. మొత్తం 07 గుర్రాలు వుంటాయి.03 ఒక వైపు,04 ఇంకొక వైపు. ఇవి గోపుర మెట్లకు ఇరువైపులా వుంటాయి.గోపురం కూడా పునరుద్ధరణ పనుల నిమిత్తం మూసివేసారు. తొందర్లోనే తెరుస్తారని వినికిడి. ఇక గోపురం బయట కొంచెం లోపలి వెళ్తే రధచక్రాలు మొదలవుతాయి. ఈ చక్రాలే మన రుపాయి నోట్ల మీద వుండే చక్రాలు.
మొత్తం 24 చక్రాలు(24 గంటలు). 12 అటు, ఇంకొక 12 గోపురానికి ఇటు. ఒక్కొక్క చక్రం లో 8 spokes. రెండు spokes మధ్య 180 సన్నని గుండ్లు వుంటాయి. ఆ 180 సన్నని గుండ్లు, 180 నిమిషాల్ని సూచిస్తాయి. అంటే రెండు spokes మధ్య వ్యత్యాసం మూడు గంటలు. కాబట్టి 8 spokes వల్ల మనకి తెలిసే సమయం 24 గంటలు. ఒక్కొక్క గంట సూర్యకిరణాలు ఒక్కొక్క చక్రం మీద పడతాయి. ఆ 8 spokes మీద బొమ్మలు ఆ సమయం లో మనం చేసే పనులని సూచిస్తూ చెక్కబడ్డాయి. అంటే, తెల్లవారుజామున కిరణాలూ పడే చక్రం యొక్క spokes మీద మనం తెల్లవారగానే చేసే పనులన్నీ వుంటాయి.

ఇప్పుడు చక్రాల సహాయంతో మనం సమయం ఎలా తెలుసుకుంటాం అంటే:
ముందుగా మనకి సూర్యకిరణాలు ఏ చక్రం మీద పడుతున్నాయో ఆ చక్రం యొక్క ఇరుసు మీద చెయ్యి పెట్టాలి. ఆ తరువాతి మీ చేతి నీడ నెల మీద ఎక్కడ పడుతుందో అక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చక్రం యొక్క ఇరుసుని, మీరు నేలమీద పెట్టిన గుర్తుని కలుపుతూ ఒక గీత గీస్తే అది చక్రంలో ఏ భాగం గుండా వెళ్తుందో దానిని బట్టి సమయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు(రమారమి కాదు ఖచ్చితంగా) ఇక మొత్తం గోపురం మీద మూడు సూర్యభగవానుని విగ్రహాలు వుంటాయి. ఒకటి బాల్య దశలో, ఒకటి యౌవ్వన దశలో, ఇంకొకటి వృద్ధావస్తలో. ఇవి గోపురంలో మూడు చోట్ల వుంటాయి. వీటి గొప్పతనం ఏంటంటే, ఉదయం బాల్య దశలో వున్నా సూర్యభగవానుని మీద సూర్య కిరణాలూ పడతాయి, మధ్యాహ్నం యౌవ్వన దశలో వుండే సూర్యుని విగ్రహం మీద, ఇక సాయంత్రం వృద్ధావస్తలో వున్నా సూర్యుని విగ్రహం మీద. కాబట్టి అల్ల్లంత దూరం నుంచి గోపుర్రాన్ని చూసినంతనే, మనం రోజులో ఏ దశలో ఉన్నామో చెప్పివేయవొచ్చు.

ఇవి కాక దేవాలయం అంత మనకి వివిధ కళారూపాలు చెక్కబడి వుంటాయి. వీటికి కూడా ఒక విశిష్టత వుంది. మొత్తం కళారూపాలు అన్ని మూడు వరసలలో చెక్కబడి వుంటాయి. కింద రెండు వరసలలో పొట్టిగా వుండే చిన్నపిల్ల్లలు ఇష్టపడే ఏనుగులు, గుర్రాలు వుంటాయి. ఆ పైన కొన్ని వరసలలో కౌమర దశకి సంబంధించిన బొమ్మలు. అన్నిటికన్నా పై వరసలో ముక్తికి సంభందించిన దేవతామూర్తులు చేక్కబడివుంటాయి. ఇవేకాక అప్పటి జీవన శైలి, వైద్య విధానాలు, రాజుగారి ప్రయాణ విశేషాలు ఇలాంటివి కూడా అందులో పొందుపరిచారు.వెనక గోపురం పూర్తిగా ధ్వంసమైనందున, దాని వివరాలు,విశిష్టత పెద్దగా తెలుసుకోలేక పోయాము. ముందువున్న ప్రాంగణం కాక ఇంకొక మూడు ప్రాంగణాలు గోపురం యొక్క మిగిలిన మూడు దిక్కులలో వుంటాయి. అవి కూడా పాక్షికంగా ధ్వంసమయి వున్నాయి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,