Here’s The Deeper Meaning Behind The Song “Itu Itu Ani” From Kanche Movie

 

Contributed By Aditya Gangadhar

 

సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈయన గురించి చెప్పడానికి మన త్రివిక్రమ్ గారికే సరిగ్గా కుదర్లే. ఇంకా మన వాళ్ళ ఏం అవుతుంది!
అందుకే అంత సాహసం చెయ్యను. కానీ ఆయన పాటలని అర్థం చేసుకోగలను. నాకు అర్థమైంది మీతో చెప్పుకోగలను. మొన్న ఏదో అలా ఆలోచిస్తూ కంచె సినిమా లో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవరివో అనే పాట విన్నాను. పైకి ఇద్దరి మధ్య డ్యూయెట్ లా ఉంది కానీ లోపల మనం ఎలా ఒక సమాజంగా ఎదిగామో వివరంగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా లోపాలకి వెళ్ళిపోదాం.

 

పల్లవి:
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో
ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో
సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

అర్థం:
చిన్నతనం లో మనల్ని రా రా అని పిలుస్తోంది ఎవరో మనకి తెలీదు. అయినా మన మనసు ఆ పిలుపుని వింటుంది. అటు వైపు మనం మనకి తెలియకుండా నే అడుగులు వేస్తాం. వాళ్ళు ఎవరు, ఏం అంటున్నారో మనకి తెలియదు, ఇలాంటివి ఏమి తెలియకుండానే వాళ్ళు మనవాళ్ళు అని అనేసుకుంటాం. నేను అనే ఆలోచన నుంచే మేము అని అప్పుడే మనకి తెలియకుండానే అనేసుకుంటాం.


 

చరణం 1:
ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారైందోయ్ సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళిపోదా
తనోటి ఉందని మనం ఏలాగ గమనించం గనక
కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా
మనదరికెవరు వస్తారు కదిలించగా
ఉషస్సెలా ఉదయిస్తోందో నిశీధెలా ఎటుపోతుందో
నిదుర ఎపుడు నిదురోతుందో
మొదలు ఎపుడు మొదలవుతుందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

అర్థం:
సమయం లో ఎన్ని గంటలు ఉంటాయో, ఎన్ని నిముషాలు ఉంటాయో మనకి అనవసరం. కాలం తో పాటు మన వయసు పెరుగుతోందని కూడా ఆలోచించకుండా బతికేస్తాం. మన చుట్టూ ఏం జరుగుతోందో కూడా మనం పట్టించుకోము ఎదిగే వయసులో, మనకి ఏవేవో ఆలోచనలు, మనం ఎప్పుడు కష్టాలకి ప్రిపేర్ అయ్యి కూడా ఉండం. మెలుకువగా ఉన్న ఏవేవో కలల్లో ఉంటాం. సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, అస్తమిస్తాడో ఇలాంటివి ఏమి ఆలోచించకుండా ఎదుగుతాం. ఇదే ప్రేమలో పడితే కూడా జరుగుతుంది అని చాలా అందంగా రెండిటికి కుదిరేలా రాయటం అంటే మామూలు విషయం కాదు.


 

చరణం 2:
పెదాల మీదుగా అదేమీ గల గల పదాల మాదిరిగా
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా
ఇలాంటివేళకు ఇలాంటి ఊసులు ప్రపంచభాష కదా
ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటవుండదుగా
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా
వినబోతున్న సన్నాయి మేళాలుగా
హొ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

 

అర్థం :
అప్పుడే మాట్లాడటం వస్తుంది. చిన్న చిన్న పాదాల నుంచి ఇంకొక మనిషికి నచ్చేలా మాట్లాడటం కూడా ప్రారంభిస్తాం. కొన్ని సార్లు మన భావాలని మాటలు లేకుండా కూడా చెప్పటం నేర్చుకుంటాం. వాటికి ఒక వ్యాకరణం లేకపోయినా కూడా అర్థం అవ్వాల్సిన వాళ్లకి అర్థం అయ్యేలా చెప్పగలిగే స్థాయికి చేరతాం. ఒక మనిషి తో కలిసి జీవించగలం అనేంతలా ఎదుగుతాం. పెళ్లి చేసుకుంటాం. మళ్ళీ తాను నేను అనే నుంచి మేము అనుకొని కలిసి బతుకుతాం. ఒక సమాజం మళ్ళీ మన నుంచి వస్తుంది. మళ్ళీ కథ మొదలు.


 

ఒకే పాట తో రెండు వేరు వేరు భావాలని వేరు వేరు కథలని ఇమడ్చిన సిరివెన్నెల గారికి ఆయన రాసిన పాటలన్ని నమస్కారాలు తెలుపుకుంటున్నాను..


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,