Spotlight On C/o Kancharapalem: ప్రపంచాన్ని నడిపిస్తున్న నాలుగు స్తంబాల గురించి కంచరపాలెం చెప్పిన నిజం

 

SPOILERS AHEAD!

టీచర్ తో తనకి కూడా ‘ రాణి రంగు ‘ అంటే ఇష్టం అని చెప్దాం అనుకున్నాడు సుందరం .. అంతలోనే స్కూల్ బెల్ మొగేసింది ..

” నా రెండు రూపాయలు మాత్రం నాకు ఇచ్చేయ్యాలో రోయ్ ” అన్నాడు పక్కన ఫ్రెండు గాడు ..

ఆ ఫ్రెండు గాడు మన సుందరానికి చేసిన ‘సాయం – సలహా’ ఆమెకి ఇష్టమైంది తనకి ఇష్టం అని చెప్తే సునీత కూడా ఇష్టపడుతుంది అని చెప్పడం .. దాన్ని ఇంకాస్త సొంత తెలివి వాడి రెండో రోజే రాణీ రంగు చొక్కా వేసుకొచ్చి సునీత ని మెప్పించాడు – ఇష్టపడే లా చేసుకున్నాడు .. ఇక్కడ తన సాటి మనిషి ఇచ్చిన ఐడియా కి సొంత తెలివి వేసుకుని చేసిన పంథా ..


మరి పాటల పుస్తకం అప్పుడో ? అప్పుడు కనీసం ఆ ఫ్రెండు గాడికి చెప్పను కూడా చెప్పడు ” ఎవ్వరికీ చెప్పకు ఇప్పుడే ఒస్తా ” అంటూ గోడ దూకేసి వెళ్లి పాటల పుస్తకం పట్టుకొస్తాడు .. ఆ పుస్తకం దొరికిన గొప్పతనం దేవుడికి ఇచ్చేస్తాడు సుందరం .. దొరకడం వలన వచ్చిన కష్టాన్ని కూడా నీవల్లే అంటూ దేవుడిమీద నెట్టేస్తాడు .. ఆ వయసు లో వాడికి అర్ధం కాలేదు పక్కన ఉండే ఫ్రెండో , టీచరమ్మో , అమ్మో , నాన్నో , తమ్ముడో వీళ్ళే దేవుడు వాడికి అంత పెద్ద విగ్రహం – మ్యాజిక్ లూ – పాటల పుస్తకాలు దొరికించడాలూ ఉండవు అని ..

(దక్కే అవకాశం లేని , దక్కాల్సిన వయసు కాని పిల్లని కోరుకున్నప్పుడు ‘దేవుడిని’ నమ్ముకున్నాడు సుందరం .. )

కొన్నేళ్ళు పోయాక మళ్ళీ భార్గవి అనే బ్రాహ్మల పిల్ల కోసం అదే దేవుడిని నమ్ముకున్నాడు .. ఈ సారి ఆ దేవుడి పేరు జీసస్ – హిందూ దేవుడిమీద చిన్నప్పుడే నమ్మకం పోవడం వల్ల పెద్దయ్యాక వివిధ కారణాల వల్ల కన్వర్ట్ గా మారిపోయి తన ప్రేమకి ఈ సారి యేసు సహాయం చేస్తాడు అని నమ్మాడు ..


(ఈ సారి దక్కే వయసే కానీ ఆ దేవుడు కూడా దక్కించలేదు అతనికి అసలు సిసలు పిల్లని .. ఆమె ప్రేమని ..)

జీవితం లో దేవుడు మతం ఏదీ వద్దు అనుకుని మెడలో సిలువని కూడా పక్కన విసిరేశాడు జోసెఫ్ గా మారిన చిన్నప్పటి సుందరం ..

ఏ మతాన్నీ ఏ కులాన్నీ ఏ దేవుడినీ నమ్మని ‘గడ్డం’ గాడు ముస్లిం పిల్ల సలీమా ని ప్రాణం గా ప్రేమించాడు .. దాన్ని ఎవరో చంపేస్తే తను ఎందుకు చనిపోయిందో , ఎవరు చంపారో కూడా తెలియని నిస్సహాయ స్థితి లో మిగిలిపోయాడు గడ్డం ..


(ఈ సారి దక్కాల్సిన పిల్ల , దక్కే పిల్లే .. దేవుడు కూడా లేడు దక్కించడానికి .. కానీ దక్కలేదు – కారణం తెలీలేదు గడ్డంగా మారిన జోసెఫ్ కి .. )

ఆఖరి సారిగా జీవితం లో ‘ ప్రేమ ‘ రుచి చూసాడు .. ఆఫీసర్ మ్యాడం ని పెళ్లి చేసుకోకపోతే అతని జీవితం లో ‘ ప్రేమ ‘ అనే పదానికి అర్ధమే లేదు .. ఈ సారి అతన్ని అడ్డుకునే శక్తులు ఇంకా ఎక్కువే ఉన్నాయి .. ఆ పిల్ల తమ్ముడు , ఈ పిల్ల కూడా దక్కదేమో అనే భయం , ఇంజనీరింగ్ చదివే కూతురు ఉందన్న జంకు, ఇంకా బోలెడు కానీ ‘ తోడు – ప్రేమ ‘ కావాల్సింది ఖచ్చితంగా .. ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు మళ్ళీ అడ్డంకులు మీద పడ్డాయి .. చితక్కొట్టాయి – కాళ్ళతో తన్నాయి .. కానీ ఈ సారి రాళ్ళు విసిరిన దేవుడు రాలేదు , సిలువ విసిరిన దేవుడు రాలేదు – రాడు అని కూడా ఇతనికి తెలుసు .. అసలైన దేవుడు మాత్రం వచ్చాడు .. ట్రైన్ వెళ్ళిపోయిన తరవాత ఆ దేవుడు ఇతన్ని కాపాడడం కోసం రైలు గేటు కి అవతలపక్క నుంచున్నాడు .. ఆ దేవుడు నీ సైకిల్ కొట్టు సత్యం గాడు , మంగళ షాపు రమణ , లైబ్రరీ రాజేష్ గాడు , ఎదురింటి ముసల్ది , చుట్టుపక్కల అమ్మలక్కలు – వాళ్ళ మొగుళ్ళు ..


ఈ సినిమా సెకండ్ హాఫ్ మధ్యలో ఒక అద్భుతమైన సాహిత్యం తో కూడిన పాట వస్తుంది .. అందులో ఒక లిరిక్ ఇలా ఉంది ..

♫ సిక్కుముళ్ళుగప్పి రంగుళీనుతున్న
లోకమంటే పెద్ద నాటకమే
తెలియకనే సాగే కథనం … ♫


 

లోకమంతా పెద్ద నాటకం .. దాన్నిండా చిక్కుముళ్ళు .. అవి తీసుకుంటూ బయలుదేరారు సుందరం .. జోసెఫ్ .. గడ్డం .. రాజు .. వీళ్ళే కాదు నువ్వూ, నేను , వాడు, అదీ , ఇదీ అందరం అదే పన్లో ఉన్నాం .. మన చిక్కు ముళ్ళు కూడా వీడతాయి ఎప్పుడంటే – పందిట్లో వినాయకుడిని , శిలువ ఎక్కిన యేసు నీ , మసీదు లో కురాన్ నీ పక్కనెట్టి సాటి మనిషిని నమ్మడం మొదలెట్టినప్పుడు … అప్పటి దాకా ఆ మనిషి అలాగే చేతులు కట్టుకుని గేటుకి అవతల పక్క నుంచుని ఎదురు చూస్తూనే ఉంటాడు ..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,