Meet The Revolutionary Telugu Poet & Activist Whose Work Has Deep Meanings

 

నాకు జాలి మాటలొద్దు – కన్నీటి మూటలొద్దు నేను బాధితుణ్ణి కాదు – అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని నా కోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను.

మహానుభావుల శరీరం వంద సంవత్సరాలు ఈ భూమి మీద లేకపోయినా వారి జీవితం, భావాలు భూమి ఉన్నంత కాలం ఉంటాయి. కలేకూరి ప్రసాద్ గారు 48 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న కవి. వెలివేసి బలిచేసిన ప్రతి మనిషిలోనూ తనని తాను చూసుకుంటారు. జీవితంలో ఎక్కువ శాతం పుస్తకాలతోనే గడిపిన కలేకూరి ప్రసాద్ గారు కలం కాదు, అందులోని సిరా కాదు, వాటిని కదిలించి సరైన విధంగా ఉపయోగించుకున్న ఒక “పిడికిలి”.. రాసిన కవిత్వాన్ని ఎవరైనా కాపీ చేస్తే బండ బూతులు తిట్టుకునే పరిధిలో ఆయన బందీ కాలేదు, చాలా సార్లు రాసిన కవిత్వాలపై తన పేరు వేసుకునే వారు కూడా కాదు. ఆయన పేరు కోసం ఏనాడు చచ్చిపోలేదు. వందల వేల కవితలు రాసి వాటిని అలా వదిలేశారు.


 

కలేకూరి గారి అమ్మానాన్నలిద్దరూ టీచర్లే. జీతాలు మాత్రం ఐదు నెలలకు ఒకసారి వచ్చేవి. ఒక పక్క చదువులు విద్యాబుద్దులు, పైకి ఎదగాలని చెబుతూనే మరోపక్క కూలి పనులకు వెళ్ళేవారు. సమాజం నుండి వెలివేయబడి రియాలిటిలో బ్రతకడం వల్ల ఒక వైపు నుండి జనాలను పరిశీలించే అవకాశం లభించింది. దళిత ఉద్యమాలలో పాల్గొన్నారు, పీపుల్స్ వార్ తో కలిసి పనిచేశారు. కవిగా, కార్యకర్తగా, గాయకుడిగా, జర్నలిస్ట్ గా, అనువాదకుడిగా ఏ దారిలో ఉన్నకాని ఆయన అంతిమ లక్ష్యం మానవహక్కులు, దళిత ఉద్యమాల కోసం జీవితాన్ని వాడుకున్నారు.

నలుగురు కూర్చుని మాట్లాడుకునే సందర్భం నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే సభలు సమావేశాలలో ఆయన భావాలు నిజాయితీగా వెల్లడించేవారు. ఒకసారి డర్బన్ లో జాతి వివక్షత పై జరిగిన సమావేశంలో వివిధ దేశాల నుండి ప్రతినిధులతో పాటు “అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో కూడా వచ్చారు, ఉద్విగ్నన్నంగా ప్రసంగిస్తున్న కలేకూరి ఉపన్యాసాన్ని కాస్ట్రో కూడా అంతే ఉద్విగ్నన్నంగా విన్నారు.” కలేకూరి గారికి ఇంగ్లీష్ బాష మీద మంచి పట్టు ఉంది. తెలుగువారికి వివిధ భాషలలో పబ్లిష్ ఐన ఎన్నో గొప్ప పుస్తకాలను అనువాదకుడిగా చదివించారు. కలేకూరి గారి కవిత్వాలను సినిమాలోకి తీసుకువచ్చింది మాత్రం ఎన్. శంకర్ గారే.. శ్రీరాములయ్య సినిమాలోని “కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా… భూమికి పచ్చాని రంగేసినట్టు.. జయం మనేదేరా లో చిన్ని ఆశలన్నీ చిందులేసేనే.. ఇవ్వన్నీ కలేకూరి ప్రసాద్ గారి పాటలే..


 

శరీరంలోని ప్రతి కణాన్ని చైతన్యం చేసే కలేకూరి గారి పాటలు..

1. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా..


 

2. భూమికి పచ్చాని రంగేసినట్టు..


 

3. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే..


 

జీవితాంతం పేదలు దళితల కోసం ఏడ్చి ఏడ్చి శాశ్విత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోరేటి వెంకన్న గారి పాట నివాళి.


 

యువతను, మానవ హక్కులను జాగృతం చేసిన ప్రసాద్ గారి కవిత్వం..
పిడికెడు ఆత్మగౌరవం కోసం —

1.
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేల ఏళ్ళక్రితం ఈ గడ్ఖమీదనే చంపబడ్డాను
పునరపి మరణం పునరపి జనం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను నా దేహం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమయ్యింది. నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి. నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది.
త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేణ్మణి,కారంచేడు, నీరుకొండ
ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెలమీద నాగేటి కర్రులతో పచ్చబొడిసిన పేరు చుండూరు.
ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు రగిలే రాచపుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి
అవమానాలకు,అత్యాచారాలకూ,మానభంగాలకూ,
చిత్రహింసలకు గురై
పిడికెడు ఆత్మగౌరవంకోసం తలెత్తినవాణ్ణి
ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకున్నవాణ్ణి
బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి
నన్ను బాధితుడని పిలవకండి
నేను అమరుణ్ణీ‌, నేను అమరుణ్ణి,నేను అమరుణ్ణి !
లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంఠుణ్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుడి నెత్తిమీద యీడ్చితన్నినవాణ్ణి
రగిలే గుండె కొలిమిలో నినాదాలు సరిపిస్తున్నవాణ్ణి
నాకు జాలిజాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే
నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను
మీ గుండెల్లోకి అవాహన చేసుకోండి
ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను.


 

2.
కోబలి :

నీమూడో పాదం మోపడానికి
నేనిప్పుడు శిరస్సును అవనతం చేసిలేను
పాతాళాన పాదాలు మోపి
చేతుల్ని జెండాల్లాగా
ఆకాశంలోకి ఎగరేస్తున్నాను
నా కిప్పుడు
నువ్వు కాజేసిన నా భూమి కావాలి
నువ్వు కాటేసిన నా వాళ్ళు కావాలి
నువ్వు కాల్చేసిన నా ఒళ్ళు కావాలి
నువ్వు కూల్చేసిన నా ఇళ్ళు కావాలి
నువ్వు పెరికేసిన నా కళ్ళు కావాలి
శరీర విన్యాసాలు చేస్తున్న ఓ వామనుడు !
మొత్తంగా నాకు నా బతుకు కావాలి
దేబిరించి అడుక్కునేదేమిలేదు
బరిగీసి నిలబడ్డవాణ్ణి
ఆడినా! ఓడినా!పోరాడినా!
గుండె కొలిమిలో సమరనాదమై
రగులుతున్న వాణ్ణి
రా!రా!రా!
నీ ఎత్తుకు నిన్ను సాగధీసి
సరైన కోలతలతో సమాధి చేసేందుకు
నా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు
వామనుడా !నీకోసం శాశ్వితంగా సమరగీతం పాడేందుకు
నేనూ నా వాళ్ళు పొలిమేరలు దాటి
ఊరి నడిబొడ్డుకు నడుచుకుంటూ
ఊరేగించి వస్తున్నారు !

 

3.
అమ్మా ! అంబేద్కరా . . .

కాగితాల పైనే కాదు
పుస్తకాలలోనే కాదు
పక్కటెముకల కింద ప్రవహించే
జీవనదుల పైనా
నీ పేరు రాసుకుంటాము
కనురెప్పల కింద విచ్చుకొనే
పువ్వుల్లాంటి ఆకాంక్షలపైనా
నీ పేరు రాసుకుంటాము
సజీవ దహనమైన దళిత పల్లెల
బూడిదలోంచి ఎగిరి వచ్చే ఫీనిక్స్ పక్షి
కంఠనాళాల పైనా నీ పేరే రాసుకొంటాము
నీపురిటి నొప్పులతో రాజ్యాంగాన్నే కాదు
తరాల స్వప్నాల్ని ప్రసవించావు
జాతికి నువ్వు తండ్రివా ! తల్లివా !
కోట్ల కోట్ల జనం దుఃఖితులైన జనం
అన్నార్తులైన జనం అంగలార్చే జనం
అణగారిన జనం కునారిల్లే జనం
ఆకాశంలో ఎగిరే పక్షుల రెక్కల పైన
యిప్పుడు నీపేరే చదువు కొంటున్నారు . . .
నీలో అమ్మతన్నాన్ని చూసుకొంటున్నారు
తెరుచుకున్న కిటికీ కటకటాల్లోంచి ప్రసరించిన
తెలి తెలి తేటల సూర్యకిరణం
పగుల గొట్టింది
కన్నీటి బుడగనో మంచు తుషారాన్నో . . .
ఆవిష్కృతమైన ఏడురంగుల ఇంద్రధనుస్సు రెక్కలపైనా
నీ చిరునవ్వుల రూపం
పెదవుల పైన హక్కులకు హామి యిచ్చిన
నీ చిరు చిరు నవ్వుల సంతకం
తండ్రీ ! తల్లీ ! దేముడా !
దేశమంతా నిద్రపోయేవేళ
నువ్వు కళ్ళు తెరచి కలలెందుకు కన్నావు
తరం నుండి తరానికి అందుతున్న
అవమానాల దుఃఖపు నదుల్ని నీలోనే యింకించుకొని
దేహాన్నంతటినీ ఒక అల్పపీడన ద్రోణిని చేసి
ముసురు ముసురుగా ఎందుకంత కుమిలిపోయావు
కనలిపోయావు ఎందుకంతగా కంకటిల్లి పోయావు ?
గుండెల్లో తుఫానులు చెలరేగుతుంటే
కళ్ళెందుకు కణ కణ నిప్పులు కురిశాయి ?
నీ అర్ధనిమీలిత నేత్రాల ముందు సాగిలపడి
గుప్పెడు గుండెంత బతుకును కోరుకున్నాము
నగరం నడిబొడ్డులోంచి మెలుచుకొచ్చిన
ధవళ కాంతుల మహావృక్షంలా సాక్షాత్కరించి
ఒక చూపుడు వేలునిచ్చావు
అది చూపే ఒక సూర్యోదయాన్నిచ్చావు
పార్లమెంటులో అసెంబ్లీలనో మాత్రమే కాదు
మనుష్యుల హృదయాలనే జయించి పాలించి
ఒక సందేశానిచ్చావు
ఒక కాంతి ఖడ్గాన్నిచ్చావు . . .
అవునూ !
నీ పేరు స్వేచ్ఛా ? సమానత్వమా ? సౌభ్రాతృత్వమా ?
తల్లీ !
ఈ భూమి గర్భంపైన నీ పేరే రాసుకొంటాము
అది జన్మనిచ్చే మరసటి తరం నీ పేరును
ధరించి ఏపుగా ఎదుగుతుంది .

 

4.
దయాపవార్!!
వాల్మీకీ !
నువు కవులకే కవివి కాబట్టి
మహాకవివి కాబట్టి
నువు రామరాజ్యపు
ఘనకీర్తినే గానం చెయ్యాలా ?

నువ్వు పుట్టింది అంటరాని వెలివాడలోనే కదా !
నవ్వుల్నెరుగక, పువ్వుల్నెరగక
విషాదం మూర్తీభవించిన ముఖాలు
బతుకులీడ్చే నిక్పష్టపు వాడలోనే కదా !
దుర్బర దారిద్ర్యమే
ఒక గుడిసెల సమూహంగా రుపొందినట్టు
అవమానాలతో నిలిచివుండే దళితవాడలోనే కదా !
నేల కూలిన క్రౌంచుపక్షిగాయాలను చూసే
కరుణతో నిండిన నీ గుండె బద్దలై పోయిందే
మరి నిత్యమూ కష్టాలతో కన్నీళ్లతో కునారిల్లే
నీ జాతి జనాల ఆకలి కేకల ఆర్తనాదాలు ,
గుండె గాయాలూ, శోక గీతాలూ
నిజంగా నీకు విన్పించనే లేదా ?
నువు కీర్తించే రామరాజ్యంలోనే
నీకు పేగుబంధం, నీ నెత్తుటి బంధువు
శంబూకుడు నేల కూలి పోయాడు కదా
ఆ ప్రవహించిన నెత్తుటి జ్వాలల స్పర్శ
నిన్ను తాకనైన లేదా ?
అయితే ఓ మహాకవీ !
నిన్ను మహాకవని ఎలా పిలిచేది
నీ జాతి అవమానాల పైన
ఒక్కటంటే ఒక్క వాక్యం రాసినా
నీ పేరును మా గుండెల మీద చెక్కుకొనే వాళ్ళం
వాల్మీకీ !
నిన్ను మహాకవి అని పిలువలేను.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , , , , ,