Why Do You Think JP, Lok Satta Quit Politics? – An Analysis

సుమారు పదేళ్ళ క్రితం పెట్టిన ఒక రాజకీయ పార్టీ మనుగడలో ఉంది అని తెలియకుండానే తన ప్రస్థానాన్ని ముగించుకుంది. ఐఏఎస్ అధికారిగా మంచి స్థానం లో ఉన్న వ్యక్తి 1996 లో అందులోంచి బయటకి వచ్చి లోక్ సత్తా అనే ప్రజా సంస్థ ని స్థాపించి కొన్నాళ్ళకి రాజకీయాలలో కూడా అడుగు పెట్టారు. సామాన్యుడి జీవితాన్ని ఎదో మారుద్దామని కలలు కని , ఈ రాజకీయంలోకి అడుగు పెట్టిన పెద్దాయన రెండు రోజుల క్రితం రాజకీయ ప్రస్థానం ముగించేస్తున్నట్టు ప్రకటించారు. నాన్ గవర్నమెంట్ ఫర్మ్ గానే లోక్ సత్తా ఇకపై పోరాడుతుంది అనీ, ఎలెక్షన్ లో పాల్గొనదు అనీ ప్రకటిస్తే ఎందరికో అది షాకింగ్ గా తగిలింది. నిజానికి మల్కాజ్గిరి నియోజికవర్గం లో ఓడిపోయినా జేపీ ఈ నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేదానికంటే రాజకీయ ఆట ని ఎంతగా మార్చగలిగారు అనేది ఒకసారి చూద్దాం

ఉద్యమ సంస్థ గా, పార్టీ గా రెండు పాత్రల్లో ఆయనది ఒకటే ఆలోచన, మంచి సంస్కరణలు తీసుకుని రావడం. అందులో ఆయన ఖచ్చితంగా ప్రభావం చూపించారు అని
చెప్పాలి. లోక్ సత్తా ఉద్యమం ఎన్నో సంస్కరణల ని మనందరికీ సాధించి పెట్టింది అని ఎవ్వరికీ తెలీదు. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రావడం లో జయప్రకాష్ నారాయణ్ కృషి అపూర్వం. మిడిల్ క్లాస్ వారికి ఒక ఆశా దీపంగా నిలిచినా జేపీ 1.80 % ఓట్లని మాత్రమే 2009 ఎలెక్షన్ లో సాధించుకో గలిగారు. జేపీ కి కనీసం ఒక 10 % ఓట్లు పడినా ఆయన రాష్ట్ర, దేశ రాజకీయ పురోగతి లో ఖచ్చితంగా ఆయన పంథా, ఆయన శైలి చొరబడేవి అని చెప్పచ్చు. 2009 లో Kukatpally లో గెలిచిన జేపీ అసెంబ్లీ లో తన కంటూ సూపర్ బ్రాండ్ ని ఏర్పరుచుకున్నారు. ఏ నాయకుడు మాట్లాడుతున్నా ఎదిరించి అరవడం, అడ్డు తగలడం చేసే విపక్షాలూ – ప్రతిపక్షాలూ ఆయన మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటూ ఆయన చెప్పిన లెక్కలకి మతులు పోగొట్టుకునేవి. అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి కూడా జేపీ కి మంచి సపోర్ట్ లభించింది. మరి కాస్త క్యాడర్ బలం పెంచుకుని ఉంటే లోక్ సత్తా పార్టీ ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధించేది అని చెప్పచ్చు. జేపీ మంచి రాజకీయ నాయకుడు అని చెప్పేవాడు, లోక్ సత్తా ఉత్తమ పార్టీ అనేవాడు కనిపించాడు కానీ ఓట్ల రూపంలో లోక్ సత్తాకి సపోర్ట్ ఇచ్చిన పాపాన ఒక్కడూ పోలేదు. మీడియా తో కలిసి రాజకీయ పార్టీలు లోక్ సత్తాని ఎంతగా తొక్కగలవో అంతగా తొక్కాయి అనేది నిర్వివాదాంశం.

లోక్ సత్తా కి సరైన క్యాడర్ లేకపోవడం అన్నింటా ఈయనే అయ్యి ఉండి నడిపించడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. నిజాయతీ విషయం లో తిరుగులేని జేపీ అచ్చం తనలాంటి వాళ్ళని వేత్తుకోవడం లో ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన చేసిన అతిపెద్ద తప్పు మల్కాజ్ గిరి నియోజికవర్గానికి పోటీ చెయ్యడం, బంగారం లాంటి కుకట్పల్లి లో తేలికగా గెలవగల ఛాన్స్ ని పక్కన పెట్టేసి మల్కాజ్ గిరి కి ఎంపీ గా పోటీ చెయ్యడం ఆయన్నీ ఆయన పార్టీనీ
ఆయన్ని నమ్ముకున్న వారినీ నట్టేట ముంచేసింది. నిజానికి ఆయన ప్లాన్ వేరే ఏదైనా ఉండి ఉండచ్చు గాక. కానీ మల్కాజ్ గిరి ప్రాంతం లో పోటీ విషయం లో
లెక్క తప్పింది జేపీ ది. అప్పటి వరకూ వచ్చిన ఫేం కోల్పోలేదు కానీ పర్సనల్ గా కుంగుబాటు జేపీ కి తీవ్రంగా దెబ్బ కొట్టింది. అంతే కాకుండా పార్టీ లో చేరుతున్న కొత్త రక్తం , వివిధ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వారిని సరిగ్గా ఉపయోగించుకోలేక పోవడం లాంటివి ఆయన కి తలకి మించిన భారంగా మారాయి. క్యాడర్ నిర్మించుకోవడం లో జేపీ అడ్డంగా ఫెయిల్ అయ్యారు. గణనీయంగా ఓట్ల శాతం పెంచుకుంటూ వెళ్ళాల్సిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా చాప చుట్టేశారు. తాను ఉన్నత స్థానంలో అంటే ఏ ముఖ్యమంత్రి స్థాయి కో ఎదిగితే జనాలకి ఎలా మంచి చెయ్యచ్చు, ఏ చట్టాన్ని రూపొందించవచ్చు, తేలికగా చదువు ఎలా అందిచ్చచ్చు ఇలాంటివి బాగా చిత్తశుద్ధి తో ఆలోచించిన జేపీ దాంట్లో సగమైనా తన పార్టీ క్యాడర్ నిర్మాణానికి, సంస్థాగత ప్రగతి కీ ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మోడీ అంతటి వ్యక్తి స్వయంగా జేపీ ని బీజేపీ తో పొత్తు పెట్టుకోమని కోరినట్టూ, దాన్ని ఆయన తిరస్కరిం చినట్టూ అప్పట్లో వార్తలు వచ్చాయి. టీడీపీ లోక్ సత్తా తో పొత్తు కోసం ఎంతగానో ప్రయత్నాలు చేసింది. ఇప్పటికి ఆయన తన వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసారు. జేపీ అంటే ఈ రోజు ఆయన ఒక్కరే కాదు. ఆయన్ని నమ్ముకుని రాజకీయాలవైపు వచ్చిన యువత ఉంది, చదువరులు ఉన్నారు, ప్రొఫెషనల్స్ కూడా ఎందరో ఈ నిర్ణయం తో అవాక్కు అయ్యారు. “లోక్ సత్తా ఒక ఉద్యమ సంస్థ కాగా అందులో రాజకీయాలు ఒక భాగం మాత్రమే.. పూర్తి గా తమది రాజకీయ సంస్థ కాదు” అనేది జేపీ సమాధానం. కానీ జనాలు ఆ పార్టీ ని చూసింది మాత్రం అన్ని రాజకీయ పార్టీలకీ ప్రత్యామ్నయం గానే. అలాంటి వారంతా ఇంకా ఆ షాక్ లోంచే తేరుకుని ఉండరు గాక, వారికి ఆయన ఏం సమాధానం చెబుతారు ??

ఏతా వాతా… తక్కువ ఓట్లు సంపాదించినా ఎక్కువ ప్రభావం చూపించిన పార్టీగా లోక్ సత్తా చరిత్రలో మిగిలిపోతుంది. ఆ పార్టీ ఓట్ల విషయం లో ప్రభావం చూపించలేక పోయింది గానీ ఓటింగ్ శాతాన్ని ఖచ్చితంగా పెంచింది. సంస్కరణలూ, మిడిల్ క్లాస్, ఎబవ్ మిడిల్ క్లాస్ ని తీవ్రంగా ప్రభావితం చేసినా ఓటు బ్యాంకు రాబట్టుకోలేకపోయింది. ఇప్పటికీ జేపీ ని జనాలు ఒక్క మాట కూడా అనలేకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఓటమిలో గానీ, గెలుపులో గానీ ఎవరినీ విమర్శించలేదు. ఒక విమర్శ ఎంత సుస్పష్టంగా ఉండాలి అనేది ఆయన నుంచి అందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆయన పార్టీ గెలవలేదు, ఆయనకి చేతకాలేదు ఎవ్వరినీ తప్పు బట్టకుండా ప్రజలని కూడా ఒక్క మాట అనకుండా ఆయన మానాన ఆయన తప్పుకుంటున్నారు. అంతే గానీ గెలిచి కుట్రలు చేసి ఎమ్మెల్యేలని లాక్కోడం లేదు, ఓడి ప్రతిపక్షం లో ఉండి అధికారం కోసం ఎగబడట్లేదు, క్లారిటీ లేకుండా పొత్తులు పెట్టుకుని ప్రశ్నిస్తా అంటూ సరైన సమయంలో తప్పించుకోవడం
లేదు, అతిపెద్ద పార్టీ కి సొంత పార్టీ ని అమ్మేసుకుని సొమ్ము చేసుకుని, మంత్రి గిరీ పొందలేదు, తిక్క రేగింది అని రైళ్ళూ, బస్సులూ, పోలీస్ స్టేషన్ లూ, పాల కేంద్రాలూ, ప్రభుత్వ ఆస్తులూ తగలబెట్టలేదు. ఎటొచ్చీ ఒక అధ్యాయం విడత – సమయం గడిచిన తర్వాత సామర్ధ్యం లో, ఉద్దతి లో సాధారణ –
డబ్బున్న – మాయ చెయ్యగలిగే కంటెంపరరీ పాలిటిక్స్ లో తాము ఇమడలేము అని పక్కి తప్పుకున్నారు అది కూడా ఒక్కటంటే ఒక్క మచ్చ కూడా లేకుండా.. అంతే. ఆయన నిస్సహాయత ఆయనది కాదు మనది. సరైన నాయకుడు రంగంలోకి దిగితే బాగుండు అని ఎదురు చూసి చూసి తీరా వచ్చిన తరవాత సపోర్ట్ ఇవ్వకుండా దేశాన్ని స్కాముల, మత పిచ్చి ఉన్న రాజకీయ పార్టీల చేతుల్లో పెట్టి చేతులు కట్టుకుని చోద్యం చూసే మనది. కాబట్టి ఆయన ఓడిపోలేదు.. నువ్వు నేను అందరం కలిసి ఆయన్ని ఓడించాం.. ఆయన్ని ఓడించి మనమూ ఓడిపోయాం.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,