Meet Jayalakshmi, The Unbelievable Lady Who Cremated 4000 Dead Bodies By Her Own Hands

తల కొరివి కాదు కదా కనీసం మహిళలను అసలు స్మశానంలోకి రానివ్వరు.. ఎందుకని కారణం అడిగితే అశుభం, అపవిత్రం, సంప్రదాయం ఒప్పుకోదనంటారు. గర్భంలోని శిశువు దగ్గరి నుండి స్మశానం వరకు ఈ వివక్ష అడుగడుగునా ఉంది. ప్రస్తుతం అనకాపల్లి లో కాటికాపరిగా పనిచేస్తున్న జయలక్ష్మి గారు మొదట ఈ పని చెయ్యడానికి ముందుకు వచ్చినప్పుడు అధికారులు ఒప్పుకోలేదు తర్వాత ఒక్క అవకాశం ఇచ్చిన తర్వాత వారే గర్వపడే పనితనం చూపిస్తున్నారు.
జయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక మహిళా కాటికాపరి. ఈ పనిని భర్త దగ్గరినుండి వారసత్వంగా తీసుకున్నారు. భర్త చనిపోయాక కాలం మరింత కష్టాలకు గురిచేసింది. పిల్లలు చాలా చిన్నవారు, వారు ఎదగాలంటే తను ఖచ్చితంగా పనిచేయ్యాలి అది ఏదైతే ఏంటి.? అని అధికారుల దగ్గరికి వెళ్లారు. నా భర్త చేసిన పనినే నేనూ చేస్తాను దయచేసి నాకు ఆ బాధ్యతలను అప్పగించండి అనే జయలక్ష్మి అభ్యర్ధనకు అధికారులు “ఇది పక్కా మగవాళ్ళు చేసే పని, కట్టెలు తీసుకురావడం, శవాన్ని దహనం చెయ్యడం.. రకరకాల పనులుంటాయి వద్దమ్మా నీకొచ్చిన కష్టం వల్ల అనుకుంటున్నావు అని దగ్గరి బంధువులకు చెప్పినట్టుగా సూచించారు.
“ఈ పని నేను చేయగలను, నాకు ఇప్పించండి. ఒకవేళ సరిగ్గా చేయలేకపోయినా లేదంటే నా వల్ల ఏ తప్పు జరిగినా మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి” అని జయలక్ష్మి గారు నమ్మకంగా చెప్పిన విధానానికి ఫలితంగా ఒక అవకాశాన్ని 2007 లో ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటివరకు తన నుండి ఏ విధమైన ఇబ్బందిని ఎదుర్కొనలేదు. స్మశానాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు ఆత్మీయులు చనిపోయినందుకు ఏడుస్తూ తట్టుకోలేని వారిని సైతం తనకు తెలిసిన తత్వంతో ఓదార్చడం వరకు స్మశాన స్వరూపాన్ని తనదైన వ్యక్తిత్వంతో మార్చగలిగారు..
జయలక్ష్మి గారి జీవితంలోని మలుపులు, 4000 ల దహన సంస్కారాలు ఎలా చెయ్యగలిందని తన మాటల్లోనే ఈ వీడియోలో చూడవచ్చు..
Souce: BBC Telugu
If you wish to contribute, mail us at admin@chaibisket.com