Our Childhood’s Fictional Character Budugu Writes An Adorable Letter To His Creator Bapu!

 

Contributed by – సహృదయ్ పున్నమరాజు

బాపు గారికి,

నేను మీ బుడుగుని ! ఇక్కడ అమ్మ,నాన్న,బామ్మ,బాబాయ్,రెండుజెళ్ళ సీత,పక్కింటి పిన్నిగారు,….ఆ ఆ .. సీగానపెసునాంబ అంతా బావున్నాం.మిగతా లోకులు( అంటే కాకులట,బామ్మ చెప్పింది) కూడా బానే ఉన్నారు.బాబాయ్ ఫ్రెండ్స్ అందర్నీ బామ్మ కాకుల్లా ఎండలో తిరుగుతారని కోప్పడుతుంది, అందుకు !


మీరు ఎలా ఉన్నారు?! బానే ఉంటారు లెండి,మీకు తోడుగా మీవాడు ఉన్నాడుగా..కబుర్లు చెప్పి కాలక్షేపం చేసేస్తాడు.ఇంతకి మేష్టారు ఎలా ఉన్నాడు?అదే దేముడు.మేష్టారు అంటే దేముడు అని అమ్మ చెప్తుంటుంది కదా… నా దగ్గర మొన్నే ఇంకో కొత్త మేష్టారు పనిలో చేరాడు.వీడు ఎన్ని రోజులు భరిస్తాడో చూడాలి. అన్నట్టు ఇవాళ మీ పుట్టినరోజట కదా.!మీ పుట్టినరోజు ఐతే మాకు పండగని బామ్మ చెప్పింది.పండగకదాని పకోడీలు చెయ్యమంటే పులిహోర చేసింది అమ్మ…నేనేమో కోప్పడేశాను. ఇంకెప్పుడైనా చేస్తానులే ఉరుకోరా అంది.నేను ఊరుకోలేదు…మహామహా చిన్నవాళ్ళే ఊరుకోరు.ఉరుకుంటే ఇంకా లోకువ కట్టేస్తారు.లోకువ కట్టడం అంటే అర్ధం తెలుసుగా.నాకు తెలీదులే!

ఇగో మరేం, ఒక్క బాబాయ్ దగ్గరే కాదు..నా దగ్గరా బోల్డు అయిడియాలు – అభిప్రాయాలు ఉన్నాయి తెలుసా.. అయిడియాలు అంటే నాకు తెలీదు,కానీ నా దగ్గర బోల్డు ఉన్నాయిలే..నేను బోడి వెధవనని,నావి బోడి అభిప్రాయాలని బాబాయ్ చెప్తుంటాడు.అంతే కాదు,గుండు మీద ఒక టెంకిజెల్ల ఇస్తాడు.ఇలా టెంకిజెల్లలు,మొట్టికాయలు తింటేనే అనుభవం వస్తుంది మరి….నా అభిప్రాయాలు చెప్పాకా మా బామ్మ లాగా మీరే ఒప్పుకుంటారు నావి బోడివి కాదని ..
మీ పుట్టినరోజు కాబట్టి,మీ మీద నా అభిప్రాయాలూ చెప్తానులెండి…

ముందుగా మీ అక్షరాల గురించి….మీరు అర్జెంటుగా ఏదో ఒక మేష్టారుని (రాముడినో,కృష్ణుడినో… రాముడినే పెట్టుకుంటారేమో, మీరు “రాంబంటు” కదా) పనిలో పెట్టించుకుని అక్షరాలు ఎలా రాయాలో నేర్చుకోండి,ఎందుకంటే నాకన్నా ఘోరంగా రాస్తున్నారు మీరు !..అసలు ఒక్కటీ తిన్నగా లేదు….జంతికలులాగా అటు ఇటు తిరుగుతున్నాయి.జాటరఢమాల్ !(అంటే అర్ధం లేదని అర్ధం).జంతికలు అంటే గుర్తొచ్చింది అమ్మ అవి కూడా చేసింది.
ఇదిలా ఉంటే… మీ వంకర టింకర రాతని ఏదో బాపూ ఫాంటు, రవణ బ్రష్హూ అని పేర్లు పెట్టి అద్భుతః ( అంటే బావుంది అని అర్ధంట) అనేసుకుంటున్నారు !ఒక విధంగా నాకూ అదే బావుంది లెండి.కొంచెం వంకరగా రాసి మీ మీదకి తోసేస్తున్నాను..అది అమ్మ,నాన్న నమ్మేస్తున్నారు.పాపం యీ పెద్దవాళ్ళు యింతే.. చిన్నపిల్లలు ఏం చెప్పినా నమ్మేస్తారు.
బావుంది అన్నాను కదా అని మీరు మేష్టారుని పనిలో పెట్టుకోడం మానేయకండి…

కానీ మీ బొమ్మల విషయానికొస్తే,చాలా బావుంటాయండి… నిఝంగా! .నేనే ఒప్పుకుంటున్నాను కదా,ఎందుకంటే నేను బావుంటాను కనుక.

ఇంకో విషయం ఏదో చెప్దామని మర్చిపోయాను.నేను పెద్దవాణ్ని అవుతున్న కొద్ది గ్నాపకం గబగబ రావట్లేదు.ఆ .. మీ సినిమాల గురించి.మొన్న బాబాయ్ ఒక సినిమాకి తీసుకెళ్ళాడు. నిఝంగా సినిమా చూద్దామని కాదు,రెండుజెళ్ళ సీత వస్తోంది అని.నేనుంటే బాబాయ్ కి కొంచెం ధైర్యంగా ఉంటుందని నన్ను కూడా తీసుకెళ్ళాడు.
ఇలానే మీ సినిమాలు చాలా చూశాను.అదేంటోనండి,మీది ఏ సినిమా చూసినా నాకు సీరామాయణం చూసినట్టే ఉంటుంది.అన్నిట్లోకి నాకు సీతాకళ్యాణం లోని ఆ గంగావతరణం అంటే భలే ఇష్టం మరి.సీగానపెసునాంబకి కూడా అదే ఇష్టం. మరి అంత బావుంటుంది కనుకే యీ సినిమాను లండన్ లోనో ఎక్కడో ఏదో బడిలో సిలబస్ (అంటే చదువు లెండి)కింద పెట్టించారు మరి. మీరు హోంవర్క్ ఎక్కువ చేస్తారట కదా నాలాగా (మా బామ్మ దృష్టిలో).అందుకే అంత బాగా తీస్తారని బాబాయ్ చెప్పాడు.

కానీ, మీ పెళ్ళిపుస్తకం సినిమా విషయంలో నాకూ పెసునాంబకి ఎప్పుడూ గొడవే.అదేమో,మిస్సమ్మ సినిమానే రివర్స్ చేసారు అంటుంది.(ఏదో పెద్ద ఆరిందాలాగ)నాకేమో ఖోపం వచ్చేస్తుంది మరి.ఇలా కొంసేపు గొడవపడతాం మీ పెళ్లిపుస్తకంలోలా..
అవును నాకో డౌటు..మీరు రాంబంటు కదా..మరి “భక్త కన్నప్ప” ఎందుకు తీశారు.నిఝంగా నిఝం చెప్పండి ఆ శివుడు దేముడు కల్లోకి వచ్చి చెప్పాడు కదా..,దాని సంగతి అలా ఉంచితే కిష్టుడి కధ బుల్లితెర “భాగవతం” కూడా బాగొప్పగా తీసేశారు.పెసునాంబకి కూడా భలే నచ్చిందిలెండి.అసలు నా అయిడియా ఏంటంటే అందరూ దేముళ్ళు ఒకటే కదా అని…దానికి మీరు ఇన్నేసి సినిమాలు తీయడం ఎందుకూ అని..

నాకు ఇంకో డౌటు కూడా ఉందండి.అదే ‘ముత్యాలముగ్గు’ గురించి.అసలు నాకు ఆ పేరే అర్ధం కాలేదు.. అంటే ముత్యాలతో ముగ్గు వెయ్యటమా లేక,ముగ్గుని ముత్యం లాగ వెయ్యటమా అని..పేరు విని ఏదో ముగ్గుల సినిమా అనుకున్నాను, తీరా చూస్తే నన్ను ముగ్గులోకి దింపేసారు.. (అంటే బాబాయ్ సీతని దింపినట్టు) ఎంతైనా మీకు కలాపోసన కుంచెం ఎక్కువే!

అదలా ఉంచితే మొదటి సినిమా “సాక్షి” తోనే ఏదో అవార్డు కొట్టేసారట కదా(అంటే నా ఉద్దేశం పొందారని).నేను చూడలేదు కాని,చాలా బావుంటుందని నాన్నారు చెప్తుంటాడు.
నాలాంటి చిన్న పిల్లల మీద “బాలరాజు కధ” అని ఏదో తీసారట కదా,మొన్న బామ్మ చెప్తే చూశాను.బావుంది.ఆ సినిమా తీశారని మీకు ఏదో నంది బొమ్మ ఇచ్చారట కదా.(చిన్న పిల్లల సినిమా అని ఆ బొమ్మ ఇచ్చుంటారు లెండి)
ఇంకా మీ సినిమాల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చీటినే అవుతుంది.అన్ని గొప్ప గొప్ప సినిమాలు తీసారు కాబట్టే మీకు ‘పద్మశ్రీ’ యిచ్చారు మరి..అయినా పెపంచవ్యాప్తంగా మీకున్న అభిమానం ముందు యీ అవార్డులు పెద్ద గొప్పేముంది లెండి.ఇంక నాకు మేష్టారు వచ్చే టైం అయ్యింది మరి.ప్రైవేటుకి వెళ్ళాలి.వెళ్ళకపోతే మళ్ళీ భరించలేను బాబోయ్ అని ఉత్త అబద్దాలు చెప్తాడు బడవ.

దేవుడ్ని వెతుక్కుంటూ మీవాడు,మీవాడ్ని వెతుక్కుంటూ మీరు మమ్మల్ని వదిలేసి వెళిపోయారు.సొర్గానికి వెళిపోయారు కదా అని సినిమాలు తీయడం మానేయకండి.అలాని మళ్ళీ అక్కడ కూడా దేముడు సినిమాలు తియ్యకండి.మాలాంటి మనుషుల మీద తీయండి.ఎప్పటికైనా తెలుగు వినాలంటే మీవాడు,తెలుగు చూడాలంటే మీరు..అంతేనండి…
నాకు మాటలు నేర్పిన మీవాడిని అడిగానని చెప్పండి.ఉంటా మరి..

ఇట్లు,
మీ చిచ్చర పిడుగు – బుడుగు

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,