This Telugu Translation Of Irrfan Khan’s Letter While He Was Battling Cancer, Tells Us How Hard Life Can Be

 

This post is originally written by Rambabu Thota on his Facebook

2018 జూన్ నెలలో ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ, కండీషన్ చాలా సీరియస్ గా ఉందనీ సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అయింది. అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం ఎక్కువమంది ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో, well-wishers అందరికీ బ్రిటన్ నుండి ఒక లేఖ రాసాడు. ఆ లేఖ చదివిన వెంటనే ఇర్ఫాన్ ని హగ్ చేసుకోవాలనిపించింది. ఎందరో కాన్సర్ బాధితులకు, బాధల్లో కుంగిపోయే ఎందరికో జీవితం మీద ఆశ పుట్టించే లేఖ అది. ఇరవై నెలల ముందు రాసిన ఆ లేఖకు ఇది తెలుగు భావానువాదం.


 

ఇర్ఫాన్ ఖాన్ లేఖ

నేను హై-గ్రేడ్ న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నానని కొన్ని వారాల క్రితమే తెలిసింది. ఆ పదాన్ని వినడం అదే మొదటిసారి. చాలా అరుదుగా వచ్చే కేన్సర్. తక్కువ కేసులు, తక్కువ రీసెర్చ్ మరియు తక్కువ ఇన్ఫర్మేషన్ కారణంగా, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో కూడా గెస్ చేయడం కష్టం. ప్రస్తుతానికి నేనొక ట్రయల్ అండ్ ఎర్రర్ గేమ్‌లో ఆట వస్తువుని.

ఇప్పటి వరకూ నేనొక ఆటలో ఉన్నాను. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తూ ఉన్నాను. నా జర్నీలో బోలెడన్ని డ్రీమ్స్, ప్రణాళికలూ, లక్ష్యాలూ ఉన్నాయి. వాటిలోనే పూర్తిగా మునిగిపోయాను. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో నా భుజంపై గట్టిగా తట్టారు. తిరిగి చూస్తే టికెట్ కలెక్టర్. “మీ గమ్యం రాబోతోంది. దయచేసి దిగండి” అన్నాడు. నేను అయోమయంలో పడ్డాను. “లేదు, లేదు. నా గమ్యం రాలేదు” అన్నాను. “లేదు. వచ్చేసింది. ఇదంతే. కొన్నిసార్లు ఇలాగే అవుతుంది” అన్నాడు. నేను ట్రెయిన్ దిగిపోవాలి

అకస్మాత్తుగా వచ్చిన ఈ కుదుపు వల్ల, అస్తవ్యస్తంగా కదిలే సముద్రపు ప్రవాహాల్లో నేనొక తేలియాడే బెండు ముక్కనని అర్థమైంది! బెండు ముక్కనై ఉండి సముద్రపు కదలికల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని అర్థమవుతోంది.

ఇంత గందరగోళంలో, షాక్ లో ఉంటూ, ఒకసారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, “ప్రస్తుతానికి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే నా నుండి నేను ఆశించేది. భయం నన్ను అధిగమించకూడదు. అది నన్ను పిరికివానిగా మార్చకూడదు” అంటూ ఏవేవో సూక్తులు నా కొడుకుతో వాగాను. నేనలా ఉండగలనని, ఉన్నానని ఫీలయ్యాను. ఇంతలో బాధ నన్ను కుదిపేసింది. అప్పుడే అర్ధమయింది. ఇంతకాలం నేను బాధ గురించి వివరణలు తెలుసుకున్నానని, ఇప్పుడే మొదటిసారి బాధ యొక్క స్వభావాన్ని, దాని తీవ్రతనీ అనుభవిస్తున్నానని. ఏదీ ఆ బాధని ఆపలేకపోయింది. ఏ ఓదార్పు ఏ మోటివేషన్ పని చేయలేదు.

నేను అలసిపోయి, నిస్పృహలో హాస్పిటల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, నా హాస్పిటల్ లార్డ్స్ స్టేడియం ఎదురుగా ఉందన్న విషయాన్ని గ్రహించనేలేదు. ఆ మైదానాన్ని చూడటం నా చిన్ననాటి కల. బాధ మధ్యలో, అక్కడ నవ్వుతూ ఉన్న వివియన్ రిచర్డ్స్ పోస్టర్ చూసాను నాలో ఏ చలనమూ లేదు. ఆ ప్రపంచం ఎప్పుడూ నాకు చెందినది కాదు అనిపించింది.

ఒకసారి, హాస్పిటల్ బాల్కనీలో నిలబడి ఉండగా, విచిత్రమైన ఆలోచన నన్ను కదిలించింది. జీవితమనే ఆటకూ మరణమనే ఆటకూ మధ్యలో ఒక రోడ్డు మాత్రమే ఉంది. ఒక వైపు హాస్పిటల్ మరొక వైపు స్టేడియం. నిజానికి నేను హాస్పిటల్ లేదా స్టేడియంలో ఎందులోనూ భాగం కాదు. ఎందుకంటే దేనిలోనూ నిశ్చయత్వం లేదు. ఆ ఆలోచన భూకంపంలా కుదిపేసింది.

అనంత విశ్వం యొక్క ఇంటెలిజెన్స్ ముందు నేనొక చిన్న ధూళి కణంలా మిగిలిపోయాను. నా హాస్పిటల్ కి ముందే స్టేడియం ఉండటం నన్ను గట్టిగా హిట్ చేసింది. నిశ్చయముగా చెప్పగలిగేది అనిశ్చితి(uncertainty) ఒక్కటే. నేను చేయగలిగేది నా బలాన్ని గుర్తెరిగి, ఈ ఆటను బాగా ఆడటమే.

“ఈ అవగాహన, నన్ను ఫలితంతో సంబంధం లేకుండా జీవితాన్ని స్వీకరించేలా చేసింది. ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. ఇప్పటి నుండి ఎనిమిది నెలలా, నాలుగు నెలలా, లేదా రెండు సంవత్సరాలా అన్నది సంబంధం లేకుండా నన్ను నేను సమర్పించుకోవడానికి సన్నద్ధం చేసింది. అప్పటి వరకూ ఉన్న ఆందోళనలన్నీ వెనుక్కిపోయి మసకబారి, నా మైండ్ స్పేస్ నుండి బయటకు పోయాయి.

మొదటిసారి, ‘స్వేచ్ఛ’ యొక్క నిజమైన అర్థం తెలిసింది. ఇదే జీవిత సాఫల్యం అనిపించింది. నేను మొదటిసారి జీవితాన్ని రుచి చూస్తున్నట్లుగా ఉంది. అనంత విశ్వం యొక్క ఇంటెలిజెన్స్ పై నమ్మకం కలిగింది. నా విశ్వాసం సంపూర్ణంగా మారింది. ఆ ఇంటెలిజెన్స్ నా ప్రతి కణంలోకి ప్రవేశించినట్లు ఫీలయ్యాను. ఇదిలాగే ఉంటుందో లేదో సమయం చెబుతుంది, కానీ ప్రస్తుతానికి ఇలా భావిస్తున్నాను.

నా ప్రయాణంలో ప్రజలు నా బాగు కోరుకుంటున్నారు. ప్రపంచం నలుమూలల నుండి నా కోసం ప్రార్థిస్తున్నారు. నాకు తెలిసిన వ్యక్తులు, తెలియని వ్యక్తులు. వారు వేర్వేరు ప్రదేశాల నుండి, వేర్వేరు టైం జోన్స్ నుండి ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలన్నీ ఒకటవుతున్నాయని నేను భావిస్తున్నాను. అవన్నీ ఒక పెద్ద శక్తిగా, కరెంట్ ఫోర్స్ లాగా, నా వెన్నెముక చివరలో నా లోపలికి ప్రవేశించి నా శిరస్సు పై భాగానికి చేరాయి.

ఆ శక్తి మొలకెత్తుతోంది – వేర్లు వేస్తూ, ఆకులూ, కొమ్మలుగా పెరుగుతూ మొగ్గ తొడుగుతూ ఎదుగుతోంది. ఇదంతా ఫీలవుతూ నేను ఆనందిస్తూనే ఉన్నాను. ఈ బుడ్డి బెండు ముక్క సముద్ర ప్రవాహాల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. ప్రకృతి ఒడిలో సున్నితంగా ఊయలూగితే చాలు.

-ఇర్ఫాన్ ఖాన్, June 2018

 

 

Tap here to read the same letter in English

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , ,