Meet Krishna, From Vizag, Whose Life Is A Perfect Example Of Quote ‘Never Give Up’

 

జీవితంలో లక్ష్యం కోసం పోరాటం ఎంత త్వరగా మొదలుపెడితే అంత వేగంగా మన విజయం సాధించవచ్చు, మిగిలిన వారికి, మనకు ఒక స్పష్టమైన తేడా చూపించవచ్చు. ఈరోజు “వైజాగ్ ఐరన్ మ్యాన్” అంటూ ఎంతోమంది మన్ననలు అందుకుంటున్న కృష్ణ కూడా చిన్నతనం నుండే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విశాఖపట్నం మహారాణి పేటలో నాన్న రాము గారు జిల్లా పరిషత్ లో ఉద్యోగం చేస్తుండేవారు. చదువు మాత్రమే కాదు స్పోర్ట్స్ ద్వారా కూడా ఉన్నత స్థాయికి ఎదుగవచ్చు అని భావాలున్న రాము గారు తన ముగ్గురు పిల్లలను అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కుని స్పోర్ట్స్ లో మంచి శిక్షణ ఇప్పంచారు. అలా “ఐరన్ మ్యాన్ కృష్ణ” మాత్రమే కాదు ఇద్దరు అన్నయ్యలు కూడా అంతర్జాతీయ స్థాయిలో (స్విమ్మింగ్ విభాగం) ఎన్నో పతకాలు గెలుచుకున్నారు.


కానిస్టేబుల్ గా..
చిన్నతనం నుండే రన్నింగ్, స్విమ్మింగ్ విభాగంలో ఎన్నో అవార్డులు, ఎంతో ప్రతిభ ఉండడంతో స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం ఎంపికవ్వడానికి అంతలా కష్టపడాల్సిన అవసరం రాలేదు. డిగ్రీ పూర్తిచేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నా గాని అక్కడితో సంతృప్తి చెందలేదు సరికదా రెగ్యులర్ గా చేసే ప్రాక్టీస్ ను కూడా ఆపలేదు. ఆస్ట్రేలియాలో జరిగే “ఐరన్ మ్యాన్” పోటీలలో పాల్గొనాలి అని చెప్పి 6 నెలలపాటు ఉద్యోగానికి విరామం ఇచ్చి కఠోర సాధన మొదలుపెట్టాడు.


ఐరన్ మ్యాన్ కోసం:
ప్రపంచంలోని అన్ని పోటీల కన్నా ఐరన్ మ్యాన్ పోటీలు అత్యంత కష్టతరం. ఇందుకోసం కృష్ణ ఆ స్థాయిలోనే ప్రాక్టీస్ కూడా చేశాడు. ప్రతిరోజు ఉదయం మూడున్నరకే ప్రాక్టీస్ మొదలవుతుంది. మొదట ఏడు గంటలపాటు స్విమ్మింగ్, రెండు గంటల విశ్రాంతి తర్వాత జిమ్, లంచ్ తర్వాత 30 కిలోమీటర్ల రన్నింగ్, 60 కిలోమీటర్ల సైక్లింగ్.. ఇవన్నీ కూడా కృష్ణ ప్రతి రోజు చేసే సాధన.


గెలుపు కన్నా పోరాటం గొప్పది:
మహా సముద్రంలో నాలుగు కిలోమీటర్ల దూరం ఈతతో మొదలయ్యే ఐరన్ మ్యాన్ పోటి వెనువెంటనే 180 కిలోమీటర్ల సైక్లింగ్, తర్వాత 42 కిలోమీటర్ల రన్నింగ్ ఇవన్నీ కూడా విరామం లేకుండా ఒక నిర్ణీత సమయంలో అందరికన్నా వేగంగా పూర్తిచేయాలి అప్పుడు మాత్రమే టైటిల్ విన్నర్ అవుతారు. ఇది వినడం ఎంత కష్టమో చేయడం అంతకన్నా కష్టం. కృష్ణ నాలుగు కిలోమీటర్ల సముద్ర ఈత తర్వాత సైక్లింగ్ మొదలుపెట్టారు. సుమారు 30కిలోమీటర్ల తర్వాత కండరాలు పట్టేశాయి. ఐనా ఆగకుండా వార్మప్ చేసుకుంటూ 180 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తిచేశాడు. తర్వాత వెనువెంటనే చేసే 42 కిలోమీటర్ల రన్నింగ్ లోనూ ఇదేరకమైన ఇబ్బందులు ఎదుర్కున్నాడు. రన్నింగ్ మధ్యలో కాలి లిగ్మెంట్ కు గయమైనా ఆ బాధలోను గమ్యాన్ని చేరుకున్నాడు. 4కిలోమీటర్ల స్విమ్మింగ్, 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42 కిలోమీటర్ల రన్నింగ్ అంతా కూడా 13:49 గంటలలో పూర్తిచేశాడు. కాని “ఐరన్ మ్యాన్” టైటిల్ నీ మాత్రం గెలుచుకోలేకపోయాడు.


ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరిగే పోటీల కోసం ఎంతో ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్న కృష్ట ఆస్ట్రేలియాలో ఎదురైన అనుభవాల నుండి ఎంతో నేర్చుకుని ఈసారి ఎలా ఐనా టైటిల్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. చాలామంది గెలిచినప్పుడే మనల్ని చూసి గర్వపడుతున్నామని అంటుంటారు. కాని గెలుపు కన్నా పోరాటం ఎంతో గొప్పది ఆ పోరటంలో కృష్ణ నిజంగా ఐరన్ మ్యానే.



 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,