This Guys Introspection About His Hardships Will Surely Give You An Eternal High

 

టైమ్ – నా టైమ్ కాదు
రోజు – నా జీవితంలానే చీకటిగా ఉన్న అమావాస్య రాత్రి
మూడ్ – ఎలా ఉండకూడదు అనుకున్నానో అలానే
ప్లేస్ – ఎక్కడ ఉండకూడదు అనుకున్నానో అక్కడే

 

అక్కడే నిల్చున్నాను….చలనం లేకుండా…శారీరకంగానే కాదు..మానసికంగా కూడా
ఏమీ మారలేదు….కొంచెం కూడా మారలేదు…ఇప్పుడప్పుడే మారేలా లేదు…
ప్రకృతి కూడా నాలానే ఉంది,
ఆకాశం కటిక చీకటితో నిండిపోయింది.భూమి నన్ను అడుగుతున్నట్లు ఉంది,ఎందుకు నువ్వు నాకు భారంగా అని,
కన్నీటితో క్షమాపణ చెబుతున్నానేను,గాలికి కూడా నేను నచ్చలేదేమో,నా వైపే రావట్లేదు,వేదన నాలో జ్వాలలా మారి
నన్ను దహిస్తుంది.
ఆలోచనలు నన్ను చుట్టుముట్టెస్తున్నాయి,ఓటములు కుంగదీస్తున్నాయి,వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి,గాయాలు
గమ్యం వైపు అడుగు వేయనీయకుండా చేస్తున్నాయి,గతం వెంటాడుతుంది,భవిష్యత్ భయపెడుతుంది,మెదడు
వదిలేయమంటుంది,కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉన్నాయి,ఎదురుగా ఉన్నది కూడా స్పష్టంగా కనిపించనంతగా,కాళ్ళు
వణుకుతున్నాయి,కుదురుగా నిలబడలేకున్నాను,నాకే ఎందుకిలా అని ఆకాశం వైపు చూస్తూ, ఎందుకు ఇలా
చేస్తున్నావు దేవుడా అని మౌనంగా రోదిస్తున్నాను.చుట్టూ ఉన్న ప్రపంచం నాది కాదు అనిపిస్తుంది,నేను ఇక్కడికి
చెందిన వాడ్ని కాదేమో అని అనుమానం వస్తుంది.అందరిలా లేను,అందరిలో లేను.పడిపోయి ఉన్నాను,అందరికంటే
వెనకపడి ఉన్నాను.ప్రపంచం పరిగెడుతుంది,నేనేమో ఆగిపోయాను, అలసిపోయాను, ఇంక లేవలేనేమో?లేచినా

 

నడవలెనేమో?నడిచినా అందరినీ అందుకోలేనేమో? అన్నీ సందేహాలే,అన్నీ అనుమానాలే…నేను జవాబు దొరకని
ప్రశ్నలా మిగిలిపోతానేమో?
పంచుకోడానికీ ఎవరూ లేరు.అసలు నన్ను మనిషిగా కూడా ఎవరూ గుర్తించరు.ఓడిన వాడంటే అంతా చులకనా?
గెలుపు లేకుంటే నేను పీల్చే గాలి కూడా దండగ అన్నట్లే చూస్తున్నారు .నేను నిజంగా అంత చేతకాని వాడినా? నాలో
నిజంగానే చేవ లేదా?నేనెందుకూ పనికిరానా?కనీసం పలకరింపుకి కూడా నోచుకోనా?పదే పదే అదే కథే
మొదలవుతుంది,నా కథ కంచికి చేరదా? భగవంతుడా భరించలేకున్నాను,నన్ను తీసుకువెళ్లొచుగా,నీక్కూడా నేను
నచ్చలేదా?ఇలాంటి రాత రాసావు…..
ఆకాశం శూన్యంగా కనిపిస్తుంది,అచ్చం నాలానే….
తదేకంగా అలానే చూస్తూ ఉన్నా,కొన్ని నక్షత్రాలు మబ్బుల మాటు నుండి బయటకి వస్తున్నాయి,ఆ చీకటిని తమ
కాంతితో పారద్రోలుతున్నట్లు అనిపించింది… ఎక్కడ నుండి వచ్చిందో,చల్లటి గాలి నను తాకుతుంది.మళ్ళీ ఆలోచనల్లో
పడిపోయాను,నా జీవితాన్ని మళ్ళీ మొదటి నుండి చూసుకుంటున్నాను.అన్నీ గాయాలే కనిపిస్తున్నాయి కానీ ఆ
గాయాలన్నీ నాకేదో చెబుతున్నట్లు అనిపిస్తుంది, ఏమిటదీ.. ఒక్కో గాయం ఒక అనుభవం అయ్యింది,ఒక్కో అనుభవం
ఒక్కో పాఠం నేర్పింది,ఆ పాఠం వల్ల నేను మళ్ళీ అదే తప్పు ఎన్నడూ చేయలేదు,ఆ పాఠం నేనెప్పుడూ తప్పలేదు..
మరి ఇన్ని గాయాలు నాకు తగులుతున్నాయి అంటే నేను ఒక్కోసారి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటున్నాను,ఆ
తప్పుని మళ్ళీ ఎప్పుడూ చేయట్లేదు.అంటే నేను ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను,ఆ క్రమంలోనే
పడుతున్నాను,మళ్ళీ లేస్తున్నాను,మళ్ళీ ప్రయత్నిస్తున్నాను….నిజమే…నేను ప్రతీ సారి కింద పడిన నన్ను చూసి
బాధ పడుతున్నానే తప్ప,పైకి లేచి మళ్ళీ కొత్తగా ప్రయత్నిస్తున్న నన్ను చూసి ఎందుకు గర్వ పడట్లేదు.కనీసం
గుర్తించలేదు ఎందుకు నేనా విషయాన్ని.
క్రమంగా నా ఆలోచనా విధానం మారుతుంది..
నేను కేవలం ప్రయత్నించడమే కాదు.పోరాడుతున్నాను కూడా,ఒంటరిగా,ఒక్కడినే,ఎవరి సాయమూ లేకుండా,నేనే ఒక
సైన్యంగా మారాను,నేనే వ్యూహాలు వేస్తున్నాను, నన్ను నేనే కాపాడుకుంటున్నాను,నన్ను అడ్డగిస్తున్న వాటిపై నేనే
దాడి చేస్తున్నాను…అంటే నేనొక్కడినే ఒక యుద్దం చేస్తున్నాను అన్నమాట …అంటే నాలో పోరాట పతిమ ఇంకా ఉంది,
ఎప్పటికీ ఉంటుంది అన్నమాట…అంటే నేను ఏదైనా సాదించగలను జీవితంలో.
ఎందుకో ఎక్కడ లేని శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది,

 

మళ్ళీ ఆలోచనల్లో పడిపోయాను,ఈ సారి నన్ను నేను వెతుకుంటున్నాను,నా జీవితంలో జరిగిన వాటన్నిటినీ ఒక్కొటీ
అనుసందానించుకుంటూ చూసుకుంటున్నాను… జీవితంలో నాకు ఎదురైన ప్రతీ మనిషి,నేనేదుర్కున్న ప్రతీ సంఘర్షణ
అంతర్లీనంగా నాకేదో చెబుతూనే ఉన్నాయి, అప్పుడు అది తెలియలేదు,ఈరోజు అర్దం అవుతుంది.అంటే ఈ ప్రపంచం
నాకోసమే ఉంది,నన్ను ఉన్నతంగా మలచడానికే నాకివన్నీ ఎదురయ్యేలా చేస్తుంది.నాకు ఎప్పటికప్పుడు
స్పూర్తినిస్తుంది.
The World Is Conspiring Me Each & Every Day.నాకు సమస్యలు పరిచయం చేస్తూ సవాళ్లని అధిగమించే శక్తిని
ఇచ్చింది.నాకు ఓటములను పరిచయంచేస్తూ గెలుపు కోసం కృషి చేయాలనే కసిని పెంచింది.నన్ను ఒంటరిని చేసి
ఒక్కడినే దేనినైనా ఎదుర్కోగలను అనే ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది.నాకు ప్రశ్నలు ఎన్నో ఇచ్చి సమాధానాలు
చెప్పమంది.భయాలు ఎన్నో కలిగించి, ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది.బాధలు ఎన్నో ఇచ్చి భరించే బలాన్ని ఇచ్చింది.
ఇప్పుడు నాకు అర్దం అవుతుంది.
నా ఓటములు – గుణ పాఠాలు,నా గెలుపు – పాఠం,నా జీవితం – అనుభవం,నా గతం – అందమైన జ్ఞాపకం,నా భవిష్యత్
– నేను రాయబోయే చరిత్ర.
ఇప్పుడూ ప్రకృతి అచ్చం నాలానే ఉంది –
ఆమావాస్య చీకటి నాకు రాబోయే పౌర్ణమిని గుర్తు చేస్తుంది,అది ఒక్క రోజులో రాదనీ,రోజుకి రోజుకీ పెరుగుతూ నిండు
చంద్రుడిలా వస్తుంది అని చెబుతుంది.భూమి నా వైపు చూస్తుంది,రా నన్ను పరాక్రమించు అని అంటుంది. ఆనంద
బాష్పాలతో కృతజ్ఞతలు చెప్పాను .గాలి గంభీరంగా నను తాకుతుంది,నువు పోరాడు,నీకు స్వాంతన నేను కలిగిస్తాను
అని చెబుతుంది.పోరాడగలననే నమ్మకం నా గుండెల్లో హోమాగ్నిలా మారింది,దానికి నేనే తపన అనే ఆజ్యం పోసి
నిరంతరం జ్వలించేలా చేస్తున్నాను.

 

నేను రాయాల్సింది కేవలం కథ కాదని,విజయ గాధ రాయాలని అర్దం అయ్యింది.

చివరగా నాకు తెలిసింది ఏమిటంటే -నేను శూన్యం కాదు నేను అనంతం

టైమ్ – నన్ను నేను తెలుసుకున్న సమయం
రోజు – ఇక మీదట అన్నీ నా రోజులే అని గ్రహించిన రోజు
మూడ్ – ఎలా ఉండాలి అనుకున్నానో అలానే
ప్లేస్ – నేను చేరాలనుకున్న గమ్యానికి ప్రయాణం మొదలు పెట్టిన చోటు

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,