మన ఇంటి భారతం కన్నా పక్కింటి రామాయణం చాలా బాగుంటుంది కదా – A Short Story

 

Contributed by Vammsi

 

ఆఫీస్ పని లో అలసిపోయి ఇంటికి వచ్చిన ఆనందరావు తన అపార్ట్మెంట్ సెల్లార్ లో బండి పార్క్ చేసి నడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు,లిఫ్ట్ లోపలి వెళ్లి 4వ బటన్ నొక్కాడు.లిఫ్ట్ నాలుగవ అంతస్తు లో ఆగింది.లిఫ్ట్ గ్రిల్స్ తీస్తున్న ఆనందరావుకి ఏవో అరుపులు,గొడవ పడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.లిఫ్ట్ గ్రిల్స్ మూసేసి తన ఫ్లాట్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళాడు.తన ఫ్లాట్ దగ్గరగా వెళ్లే కొద్దీ ఆ అరుపులు ,గొడవ పడ్తున్న శబ్దాలు ఇంకా గట్టిగ స్పష్టంగ వినిపించాయి.తన ఫ్లాట్ తలుపు దగ్గర ఆగినప్పుడు అర్ధమైంది ఆ అరుపులు వస్తుంది తన ఫ్లాట్ ముందున్న ఫ్లాట్ లోనుంచి,ఆ గొడవలు పడుతున్నది కొత్తగా పెళ్లైనభార్య భర్తలు విజయ్ పల్లవి అని.

 

కొత్తగా పెళ్లయింది,ప్రేమించి ,పెద్దలను ఎదిరించి ,ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు ,ఎందుకు గొడవాడుకుంటున్నారో ఏంటో అనుకుంటూ తన ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు.ఎప్పుడూ ఏదోక పనిలో ఉండే ఆనందరావు భార్య రాగిణి,ఆనందరావు కాలింగ్ బెల్ కొట్టిన ఏఒక్కసారి కూడా వెంటనే తలుపు తీయలేదు అలాంటిది బెల్ కొట్టిన ఐదు సెకన్ల లో డోర్ తీసింది.తాను ఇంట్లోకి వస్తున్నట్టే తన భార్య కూడా ఎదో పని మీద బైటకి వెళ్తుందేమో కరెక్ట్ గా డోర్ దగ్గర ఉన్నప్పుడే బెల్ మోగడం వల్ల వెంటనే డోర్ తీసిందేమో అనుకోని ఇంట్లోకి వేళ్ళ సాగాడు.కానీ ఆశ్చర్యయంగా తన భార్య వెంటనే తలుపు మూసేసి తలుపు ఎదురు గా ఉన్న సోఫా లో కూర్చొని ఒక చెవి తలుపు వైపు పెట్టి ఎదురు ఫ్లాట్ భార్య భర్తల గొడవ వింటుంది.సోఫా లో ఉండబట్టే డోర్ తొందరగా తీసిందని అర్ధం చేసుకున్న ఆనందరావు తన ఆఫీస్ బాగ్,లంచ్ బాక్స్ పక్కన పెట్టి కిచన్ లో షింక్ దగ్గర చేతులు కడుక్కుంటూ..

 

“ఆ ఇంటి రామాయణం ఈ ఇంట్లో కుర్చొని విన్నది చాలు కానీ,ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు,కాస్త ఈ ఇంటోడి బాధ చూడవే”అన్నాడు ఆనందరావు
అబ్బా,కాసేపుండండి,ఇందాక నుండి వింటున్నాను వీళ్ళ గొడవేంటో అర్ధం కాట్లేదు,ఇప్పుడిప్పుడే కొంచెం అర్ధం అయ్యేటట్లు ఉంది..,ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టండి…

 

“వాళ్ళ గొడవేంటో తెలిసినంత మాత్రాన నీకేం రాదే,ఆకలితో ఉన్న మొగుడ్ని ఇలా వదిలేస్తే మాత్రం పంచ మహా పాపం తగుల్తుంది..” అని చిరాగ్గా అరిచాడు .
సరే,ఇలా రండి,ఇక్కడ కూర్చోండి,నేను వెళ్లి మీకు తిండానికి తీసుకు వచ్చే దాకా వాళ్ళేం గొడవాడుకుంటున్నారో విని తర్వాత నాకు చెప్పండి ” అంది రాగిణి.
అది విన్న ఆనందరావు,అంతకుమించి వాదించే ఓపిక లేక,వచ్చిన ఒక్క అవకాశము వదులుకోలేక అయిష్టంగానే “సరే పో” అంటూ అసహనంగా బదులిచ్చాడు.
భార్య రాగిణి వంటింట్లోకి వెల్లింది.సోఫా లో కూర్చున్నాడు ఆనందసరావు.భార్య చెప్పినట్టు ఆ గొడవ విందామని,భార్య కూర్చున్నట్టే కూర్చొని,ఒక చెవిని డోర్ వైపు పెట్టి ఎదురింటి గొడవ వినడం మొదలు పెట్టాడు.పావు గంట అయింది.భార్య వంటింట్లోనే ఉంది.ఆనందరావు ఆకలి బాధ కూడా మర్చిపోయి మరీ వింటున్నాడు.ఇంతలో ప్లేట్లో ఉప్మా తీసుకొచ్చింది రాగిణి.ప్లేటు ఇస్తూనే
“ఇంతకీ ఆ గొడవేంటో,ఎందుకో అర్ధం అయ్యిందా” అని ఆత్రంగా అడిగింది.
“నువ్వెంత సేపటినుండి వింటున్నావు” అని అడిగాడు ఆనందరావు.
“గంటన్నర” అని సమాధానం ఇచ్చింది భార్య.
“గంటన్నర నుంచి వింటున్న నీకే అర్ధం కాకపోతే,పావుగంట నుండి వింటున్న నాకేం అర్ధం అవుతుంది చెప్పు”అంటూ ప్లేట్ లో ఉప్మా తినసాగాడు ..
ఉపయోగం లేని సమాధానం చెప్పిన భర్త ని ఒక్క ఉదుటున సోఫా లో పక్కకి జరిపి యధా స్థానం లో కూర్చొని మళ్ళీ ఎదురింటి గొడవ వినడం మొదలు పెట్టింది …

 

ఆనందరావు ఉప్మా తింటున్నాడు,రాగిణి ఆ గొడవేంటో తెలుసుకుందామని అలా వింటూనే ఉంది. కొంత సేపటికి ఆ గొడవలో ఎదురింటి పల్లవి ఇలా అంది,”మిమ్మల్ని అని ఎం లాభం లెండి,నన్నుకోవాలి,మీకీ పాడు అలవాటు ఉందని తెలిసి కూడాప్రేమించడం,పెళ్లి చేసుకోడం నాది తప్పు.
ఆ మాట వినిపించి వినిపించగానే,”ఏవండీ” అని అరిచింది రాగిణి.
ప్రశాంతంగా ఉప్మా తింటున్న ఆనందరావు ఉలిక్కి పడి,”ఏంటే” అని అరిచాడు.
“ఆ అబ్బాయికి తాగుడు అలవాటు ఉందనుకుంటా,దాని గురించే గొడవ పడుతున్నారు”అని హడావిడి గా చెప్పింది.
“అవునా,ఉండు,ఉప్మా ఐపోయింది,ప్లేట్ షింక్ లో పడేసి వచ్చి నేనూ వింటాను”అని చెప్పి లేచి కిచెన్ వైపు వెళ్ళాడు.
ఇంతలో మళ్లీ ఇలా వినిపించింది..”పల్లవి నీకు ముందే చెప్పాను కదా అప్పుడప్పుడు…” అని విజయ్ ఎదో చెప్పబోతుంటే పల్లవి విజయ్ ని మాట్లాడనివ్వకుండా,”అప్పుడప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి అని,అంతే కానీ వారానికి రెండు మూడు సార్లు కాదు .ఈ వారం లో ఇది ఎన్నో సారోకూడా గుర్తు లేదు మీకు”

 

షింక్ లో ప్లేట్ పడేసి,సోఫా దగ్గర కి వచ్చి కూర్చున్న ఆనందరావు,”ఆ ఇప్పుడు చెప్పు,వాళ్ళ గొడవ ఎందుకంటావ్??” అని అడిగాడు .
“ఆ అబ్బాయి కి తాగుడు అలవాటు ఉందండి,మరీ ఎక్కువ తాగేస్తున్నాడని పాపం ఆ పిల్ల బాధ తో గొడవ పడుతుందండి”అని విజయ్ మీద కోపం తో,పల్లవి మీద జాలి తో ఆనందరావు కి చెప్పింది.
“ఈ రోజు సెలవే కదా,నాలుక లాగుతుందని తెచ్చుకున్ననే”అంటున్న విజయ్ గొంతు వినిపించింది.
“అదుగో అదే,ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చారు చూడండి అదే నా కోపానికి సగం కారణం” అంటూ ఇంకా గట్టిగా అరిచిన పల్లవి గొంతు వినిపించింది.
“అది కాదు పల్లవి నువ్వు బయటికి వెళ్లి రావడానికి టైం పడుతుందని అన్నావని ,నువ్వొచ్చే లో కానిచ్చెదమని అనుకోని తెచ్చుకున్నాను”అని సున్నితంగా చెప్తున్న విజయ్ గొంతు వినిపించింది

 

.
“నేను లేననుకున్నారు సరే,నేనొచ్చాక ఈ దరిద్రపు వాసన సంగతేంటి,ఇల్లంతా పట్టేసుకుంటుంది,తలతిరుగుతుంది నాకు.మీకు ఈ అలవాటు ఉన్నట్టు మా ఇంట్లో తెలియదు,పక్కంటి కోటేశ్వరరావు గారికి మా ఫామిలీ తెలుసు,పక్క ఫ్లాట్ దాక వాసన వస్తే ఎంత తక్కువగా మాట్లాడుకుంటారు,మా ఇంట్లో చెప్తే ఏమవుతుందో అది ఆలోచించారా? అంది పల్లవి.
“పల్లవి నేను చెప్పేది వినవె”అని సౌమ్యంగా చెప్పబోతుంటే ..
“వినను,మీరు చెప్పేది అస్సలు వినను,ఒక వేళా విన్నా ఎం చెప్తారు ?ఇంకెప్పుడు ఇలా చేయను అంటారు,నా వల్ల కాదండీ” అని పల్లవి కోపంగా అంది .
తనేం చెప్పిన పల్లవి వినదని,ఇంకా సర్ది చెప్తూ గొడవ ఆపలేనని అర్ధం చేసుకున్న విజయ్ ..
“సరే పల్లవి ఇప్పుడు నన్నేం చేయమంటావు నువ్వే చెప్పు”అని నిరుత్సాహంగా,విసుగ్గా అన్నాడు విజయ్.

 

“ఇంతకముందు చెప్పినట్టు ఎప్పుడన్నా ఒకసారి,అంతే కానీ వారానికి రెండు మూడు సార్లు అంటే మాత్రం కుదరదు.అంతగా నాలుక లాగిన,నరాలు లాగినా బైటేక్కడన్న కానిచ్చేయండి అలా కాదని ఇంటికి తెచ్చుకున్నా,ఆ వాసన నా దరిదాపుల్లో వచ్చిన,ఊరుకోనంతే”అని గట్టిగా విజయ్ ని హెచ్చరించింది పల్లవి.
ఈ మాటలన్నీ వింటున్నారు ఆనందరావు,రాగిణి లు.
ఆనందరావు భార్య ని చూస్తూ “చూడవే ఆ పిల్ల ఎంత మంచిదో,మొగుడ్ని ఇంట్లో తాగొద్దు,బైట తాగండి అని చెప్తుంది.నువ్వూ ఉన్నావు ఇంట్లో తాగిన గొడవే బైట తాగినా గొడవే,అదృష్టవంతుడు ఆ పిల్లాడు” అని నిరుత్సాహం గా అన్నాడు ఆనందరావు.
“ఏడిసారు,ఆ పిల్ల చదువుకుంది కాబట్టి,బీర్ కిడ్నీకి మంచిదని,విస్కీ గుండెకి మంచిదని అప్పుడప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదని,అక్కడ ఇక్కడ రాసిన వార్తలు చదివి,పనికి మాలిన సర్వే లు చూసి అంటుంది కానీ,అలా తాగేయమని భర్త ను వదిలేస్తే ఏమవుతుందో ఏ వార్తల్లో చూపించరు,సర్వేలు చేసి చెప్పరు.జీవితం లో ఎంతో అనుభవంతో ఎన్నో చూసిన నా లాంటి వాళ్ళు చెప్తే కానీ తేలీదు”అని ఆవేశంగా అరుస్తూ…”ఉండండి ,ఇప్పుడే వెళ్లి ఆ పిల్లకి నాలుగు మంచి మాటలు చెప్పొస్తాను”అంటూ సోఫా లొంచి లేచి వెళ్ళబొయింది.
“ఒసే,ఆగవే,వాళ్ళ గొడవ మనకెందుకు”అని అరుస్తున్న ఆనందరావు మాట వినకుండా,తన ఇంటి డోర్ తీస్కొని,మూడడుగుల దూరం లో ఉన్న పల్లవి విజయ్ ల ఫ్లాట్ డోర్ దగ్గరకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది రాగిణి.

 

డోర్ తీసిన పల్లవి రాగిణి ని చూసి “ఆంటీ,మీరా,లోపలి రండి” అంటూ పలకరించింది.
సరాసరి లోపాలకి వెళ్లి,విజయ్ ని చూస్తూ,”ఏంటయ్యా నువ్వు,ఆ పిల్ల బాధపడే పనులెందుకు చేస్తున్నావు,ఐనా నువేంటమ్మాయ్,పిల్లోడు అలాచెడిపోతుంటే బుద్ధి చెప్పకుండా,ఒక పద్దతిగా చెడిపో అని నువ్వే సలహాలు ఇస్తున్నావు”అంటూ పల్లవి విజయ్ లను అరిచేసింది.
చూడమ్మా పల్లవి,మా ఆయన కూడా మీ ఆయన లాగే ఉండేవాడు.నాకు తెలిసిన రీహాబిలేషన్ సెంటర్ లో ట్రీట్మెంట్ ఇప్పించాను ఇప్పుడు అంతా మాములుగా అయ్యాడు.డీటెయిల్స్ ఇస్తాను,మీ ఆయనని కూడా అదే రీహాబిలేషన్ లో జాయిన్ చేయి”అని సర్ది చెప్పినట్టుగా అంది రాగిణి.
“అయ్యో ఇంత చిన్న విషయానికి రీహాబిలేషన్ సెంటర్ దాకా ఎందుకు లెండి ” అంది పల్లవి.
“ఇప్పుడేమో రిహాబిలేషన్ సెంటర్ దాకా ఎందుకులే అని అనిపిస్తుంది,తర్వాత రిహాబిలేషన్ సెంటర్ లో కూడా వల్ల కావట్లేదు అని నువ్వే బాధపడతావు,మగాడు తాగుడికి బానిస అయ్యాడంటే బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు అని అంటుండగానే “తాగుడేంటి ” అని పల్లవి విజయ్ ఇద్దరు ఆశ్చర్యంగా అరిచారు.
“తాగుడేంటి అంటావేంటమ్మాయ్,రెండు గంటలనుండి వింటున్నాను,మీ ఆయన తాగుడు గురించి నువ్వు బాధపడటం,మీ ఆయన తో గొడవ పడటం…”
అయ్యో!ఆంటీ,మా ఆయనకి అసలు తాగుడు అలవాటు లేదు.
“మరి మీ గొడవ దేని గురించి” అని అయోమయం గా అడిగింది రాగిణి.

 

“నాన్ వెజ్ గురించి”అని సమాధానం చెప్పింది పల్లవి
“నాన్ వెజ్ గురించా” అంటూ ఆశ్యర్యంగా,అనుమానంగా అడిగింది రాగిణి.
అవునాంటీ,నేనెమో బ్రహ్మీన్స్,అయన రెడ్డీస్,నాకేమో నాన్ వెజ్ పడదు ఆయనకేమో నాన్ వెజ్ లేనిదే రోజు గడవదు.నేను బయటకి వెళ్లి రావడానికి టైం పడుతుందని ఈలోపు చూడండి,”అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న.చికెన్ లెగ్ పీసెస్ చూపించింది పల్లవి…
అంతా చూసి,ఎం మాట్లాడాలో తెలియక పల్లవి,విజయ్ ల మొహాలను అయోమయంగా చూస్తూ,మారు మాట్లాడకుండా పల్లవి వాళ్ళ ఫ్లాట్ డోర్ తీస్కొని వాళ్ళ ఇంటి డోర్ దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది.డోర్ తీసిన ఆనందరావు,భార్య లోపాలకి రాగానే మళ్ళీ డోర్ మూసేస్తూ..,”ఏమోయ్,ఆ పిల్లకి మంచి మాటలు చెప్పావా”అని అడిగాడు.

 

హాలు దాటి కిచెన్ లోకి వేళ్ళ బోతున్న రాగిణి,భర్త అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్దామని వెనక్కి తిరిగి”ఆ చెప్పానండి,చెప్పిందంతా విని,సరే ఆంటీ,మీరు చెప్పినట్టే చేస్తాను అంది”.
“అవునా,నేను కూడా విన్నానులే,ఒక వేళ నేనేమన్నా తప్పుగా విన్నానేమో,అని నిన్ను మళ్ళీ అడిగాను అయినా మన ఇంటి భారతం కన్నా పక్కింటి రామాయణం చాలా బాగుంటుంది కదా “అని వెటకారంగా నవ్వడం మొదలు పెట్టాడు ఆనందరావు.
భర్త నవ్వు చూసి ఏమి అనలేక,వంటింట్లోకి వెళ్లి వంట చేయాలనుకున్న రాగిణి మూతి ముడుచుకొని బెడ్ రూమ్ లోకి వెల్లింది.
భార్య అలక,నడుచుకుంటూ వెళ్లిన వేగం చూసి తలపట్టుకుంటూ,”ఆ ఇంటి రామాయణం ఐపోయిందని,నా ఇంటి రామాయణం మొదలెట్టావా భగవంతుడా”అని అనుకుంటూ భార్యని బతిమాలడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు ఆనందరావు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,