A Story Of A Wife Who Finds Out That Her Husband Is Gay After 5 Years Of Marriage!

 

చిన్నప్పుడే నాన్న చనిపోయాడు.. నాన్నని ఫొటోలో చూస్తూ “మా నాన్న ఇంత అందంగా ఉండేవారా” అనుకుంటూ చూసేదాన్ని తప్పా నాన్న ఫొటో చూస్తూ ఏనాడు ఏడవలేదు, ఎందుకంటే అమ్మ వల్ల.. “నిజంగా మా ఎంత కష్టపడింది.!” ఇంజినీరింగ్ చేసి రెండు నెలల నుండి జాబ్ చేస్తుంటే అమ్మ కష్టం కన్నా తన ధైర్యం, నా కోసం వెలికితీసిన తనలోని తెగువ తెలుస్తుంది. నేను కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మకు అక్షరం ముక్క రాదు. మా దగ్గర డబ్బు లేదని, సంఘంలో పలుకుబడి లేదని మా బంధువులు ఎవ్వరూ కనీసం మనస్పూర్తిగా కూడా మాట్లాడలేదు. మాట్లాడితే ఎక్కడ సహాయం కోసం ఇంటికొస్తారేమోనన్న భయంతో.. అమ్మకు ఆత్మాభిమానమెంతో ఎక్కువ.. పైసా ఇవ్వని జాలి చూపులనూ, పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని లైంగికంగా లోబరుచుకునే గుంట నక్కలను అమ్మ సమర్ధవంతంగా ఎదుర్కున్నది. అమ్మ స్కూల్ లో ఆయాగా పనిచేస్తూ, మూడెకరాల ఎకరం పొలం కౌలు తీసుకుని ఒక్కో రూపాయి దాచిపెట్టి జీవితంలో ఎంతో సాధించింది. ఐదెకరాల పొలం, 20 పాడి గేదెలు, కూతురిని ప్రయోజికురాలిగా.. ఇలా అమ్మ ఎంతో సాధించింది. రోడ్డు మీద అడుక్కు తినక అమ్మ ఎన్నో సాధించిందని కొందరు అసూయ పడ్డారు కాని అమ్మ ద్వారా పొందలేని ఆనందాన్ని ఒకానొక సందర్భంలో నా ద్వారా పొందారు.

ఎక్కడో చదివాను “ఇంట్లో తండ్రి ప్రేమ కరువైతే బయట అబ్బాయిల ప్రేమలో ఈజీగా పడిపోతారని”.. అమ్మ ప్రేమ ముందు బయట చూసే ప్రేమలన్నీ ఎందుకో తక్కువగానే కనిపించాయి. అందుకే చిన్నతనం నుండి ఏ ఒక్కరిలోనూ ఆకర్షణ తప్ప ప్రేమ లేదని గుర్తించగలిగాను. అమ్మ డబ్బులు సంపాధించడం చూసి బంధువులు మమ్మల్ని వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని కృత్రిమ గౌరవాన్ని, ఆప్యాయతను చూపించేవారు. “మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వింకా పుట్టనే లేదు, నిన్ను పెంచడం కోసం మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడిందనుకుంటున్నావు..”? అంటూ రాగాలు తీస్తూ మా కథనే మాకు కొత్తగా చెప్పి, నాకు బుద్దులు చెబుతూ, నా మీద ఆధిపాత్యం చూపాలని ప్రయత్నించేవారు. ఈ సందర్భంలోనే మా మేన మామయ్య నా పెళ్ళి విషయమై మాట్లాడడానికి ఇంటికొచ్చారు. కొంపతీసి ఆయన సుపుత్రుడికిచ్చి పెళ్ళి చేసి నన్ను వారింటికి తీసుకుళ్ళే ప్రయత్నాలేవి చేయడుకదా అని ఒకింత కంగారు కూడా పడ్డాను.

విజయవాడ సంబంధం. అబ్బాయికి హైద్రాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం. నెలకు లక్ష జీతం. ఒక్కడే కొడుకు.. ఒక కూతురు. అన్నయ్యకు పెళ్ళైతే తప్పా నేను పెళ్ళి చేసుకోను అంటూ భీష్మీంచుకు కూర్చుందట పాపం పాప. ఆ అమ్మాయి పెళ్ళి కూడా నీ అంగీకారం మీదనే ఆధారపడి ఉందని కళ్ళజోళ్ళ నుండి నా వైపు ఇంతకంటే గొప్ప సంబంధం రాదన్నట్టు మామయ్య చూశాడు. చెల్లి పెళ్ళికీ నా పెళ్ళికి లింకు దరిద్రంగా ఉన్నా మామయ్య కొడుకుకు కాకుండా వేరే సంబంధం చూపించినందుకు కొంత పాజిటీవ్ గానే అనిపించింది. అమ్మ నేను కలిసి వారింటికి వెళ్ళాము. అద్బుతంగా ఉంది. వారి సంస్కారం, గౌరవాలు కూడా నమ్మకాన్నిచ్చాయి. మంచి ముహూర్తాలున్నాయని నెల తిరక్కుండానే పెళ్ళి జరిగింది.

“నాకు ఒంటరిగా గడపడమంటే చాలా ఇష్టం.. ఇది నా రూమ్, నువ్వు పక్కన రూమ్ వాడుకోవచ్చు.. అందులోనే సపరేట్ వాష్ రూమ్, టీవి అన్ని ఉన్నాయి. ఒకే కదా గుడ్ నైట్ మరి”. ఇవ్వి మొదటి రాత్రి, మొదటిసారి నాతో ఆయన మాట్లాడిన మాటలు. నా ఆశల సౌధాన్ని బలమైన పెద్ద సుత్తితో కొట్టినట్టుగా అనిపించింది. ఎన్నో మాటలను మనసు విప్పి మాట్లాడాలని ఎంతో తపన పడ్డాను.. తన ఊపిరితో నా ఊపిరిని జతచేయాలనీ ఆశించాను.. సరేలే పెళ్ళి పనులలో అలసిపోయినట్టున్నారు అనే ఆలోచనతో తెరుకున్నాను.

మా ఇద్దరికీ భార్య భర్తలుగా తొలి ఉదయం ఉదయం.. తలస్నానం చేసి కాఫీ కప్పుతో పలుకరించడానికి వెళ్ళాను. తలుపు కొట్టాను, ఎవరితోనో “పెళ్ళైతే ఎంట్రా మన బంధం ఎన్నడు విడిపోదు” అని మాట్లాడుతున్నారు ఫోన్ లో.. కాఫీ చల్లరేలోపు చేరాలని మళ్ళీ కొట్టాను.. బలంగా ఘడియ తీసి కనీసం నా ముఖం చూడకుండానే కాఫీ కప్పును లాక్కొని టెబుల్ మీద పెట్టుకుని మళ్ళి డోర్ వేసుకున్నాడు. ఓ సరదా సంభాషణ లేదు, ఓ ఆత్మీయ స్పర్ష లేదు నేను ప్రశ్న అడిగితే ఆయన సమధానం చెప్పేవారు.. ఆయన ప్రశ్న అడిగితే నేను సమధానం చెప్పెదానిని తప్పా మా మధ్య ఏ బాంధవ్యం లేదు. “పెళ్ళి జరిగి సంవత్సరం గడుస్తున్నా ఇంకా ఏ విశేషం లేదేమిటో” అత్తయ్య మాటల దాడి ప్రారంభమయ్యింది. తండ్రి లేని పిల్ల ఏదో జాలిపడి చేసుకున్నామ్.. ఇలా ఆరోగ్య కారణాలున్నాయని తెలిస్తే మాకీ కర్మ ఎందుకు!! అని అమ్మతో కూడా తన బాధను మొరపెట్టుకున్నారట అత్తయ్య. మూడు సంవత్సరాలయ్యే సరికి విషయం పంచాయితికి చేరింది.

అన్ని రోజులు అందరికి తెలియకుండా ఎలా నటిస్తున్నాడో నాకు ఆరోజు తెలిసింది. “తప్పంతా నాదే అన్నట్టుగా ఏవేవో ఉదాహరణలతో వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు”. నాకు విసుగొచ్చేసింది అందరి ముందు దోషిలా నిలబడడం నాకు నచ్చలేదు. “అసలు ఆయన మూడు సంవత్సరాల నుండి నన్ను ముట్టుకోనూ లేదు” అని కుండ బద్దలు కొట్టేశాను. గుండు సూది పడినా వినిపించేంతటి శబ్ధం అక్కడ రాజ్యమేలింది. “ఏదో వర్క్ టెన్షన్లు, మగాడన్నాక సవాలక్ష పనులుంటాయి, మనమే దారికి తెచ్చుకోవాలి”” అనే సూక్తి వచనాలతో ఆ పంచాయితీ అక్కడితో ముగిసింది. హైదరాబాదుకు తిరిగొచ్చేశాము. ఇకనైనా మార్పుంటుందేమోననే ఆశ ఎక్కడో ఆకాశంలో మినుకు మినుకు మంటూ వెలుగుతున్నది నా మదిలో. ఇబ్బందిగా ఉన్నా నేనే ఆయనను కవ్వించడానికి ప్రయత్నిస్తే అదో రకంగా అసహ్యంగా ఓ వేశ్యను చూస్తున్నట్టుగా చూసేవారు. ఇంట్లో ప్రతి చిన్న సమస్యను చూపిస్తూ “మీ అమ్మ నిన్ను గారాబంగా పెంచింది, ఏ పని నేర్పించలేదు” అని చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ గొడవలు చేయడం మొదలుపెట్టారు. ఓసారైతే ఈ గొడవ తారా స్థాయికి చేరుకున్నది రాత్రి 2గంటలకు నన్ను కొట్టి బయటకు గెంటేశాడు. ఐనా గాని నాకు తెలుసు అమ్మ నా పెళ్ళి కోసం ఎంత ఖర్చుచేసిందో.. ఇంట్లో తెలిస్తే అమ్మ తీవ్రంగా బాధ పడుతుంది మార్చడానికి ప్రయత్నించాలని ఎంతో ఆరాటపడ్డాను. ఈ విషయంలో నా ఇంజినీరింగ్ మిత్రుడిని సలహా అడిగితే “ప్రయత్నిద్దాం.. ఒకవేళ జరుగకుంటే నాకో అవకాశమివ్వు స్వర్గం చూపిస్తా.” నేను ఆ తర్వాతి మాటలు కూడా వినలేకపోయాను. మిత్రుడు అని సిగ్గు విడిచి సమస్య వివరిస్తే ఇదా వీడు మాట్లాడేది. ఛీ!! ముళ్ళకంపల ఆకారంలో వాడు కనిపించాడు మనసులో..

ఆయన ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు ఏవో మాటలు సన్నగా వినిపిస్తున్నాయ్. కాఫీ తాగుతారేమోనని అడగడానికి డోర్ కొట్టేలోపే ఓపెన్ ఐయ్యింది.. “” ప్రపంచమే కాదు నా గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయినట్టుంది.. నగ్నంగా ఇద్దరూ ఆయన వంగుంటే..”” ఛీ ఛీ దారుణం.

నాకొక రూమ్ అతనికొక రూమ్ అంటే ఏమో అనుకున్నాను. కాని ఇదా ఇతను చేస్తున్న భాగోతం.. ఛా!! బాధ బాధ.. కన్నీళ్ళు కూడా రాలేదు. అమ్మ అమ్మ.. నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఎంతటి శోకం నీలో ఉందో అప్పుడు తెలిసింది. ఐదు సంవత్సరాలు.. ఐదు సంవత్సరాల నా జీవితాన్ని వృధా చేశాడు. అయ్యే ఇంతలా అపురూపంగా తీర్చిదిద్దిన నా కూతురి జీవితం ఇలా ఐపోయిందేంటి.? అని అమ్మకు బాధ మిగిలింది. ఇది జన్మతహా వచ్చే హార్మోన్ల ప్రాబ్లమ్ కావచ్చు, మధ్యలోనే ఈ రకమైనది అలవాటు ఏర్పడి ఉండవచ్చు.. ఇలాంటి వాడు ఒక అమ్మాయికు తాళి కట్టి ఆమె ఆనందానికి ఎందుకు సంకెళ్ళు వేయ్యాలి.? పెళ్ళి చేసుకోకుండా వారికిష్టమైనట్టుగా బ్రతకొచ్చు కదా..నాకు భరణం అవసరం లేదు.. విడాకులు తీసుకోగలిగాను. మొన్న నా డాక్టర్ మిత్రురాలితో ఈ విషయం మీదనే గంటల తరబడి తీవ్రమైన చర్చ జరిగింది. హార్మోన్ల సమస్య అనేది మేనరికం వివాహాల వలన, ఇంకా ఒకే కులంలోని వారిని పెళ్ళిచేసుకున్న తరువాత వారి వంశంలోని నాలుగో తరం వారి నుండి ఈ హార్మోన్ల సమస్య వచ్చే అవకాశం ఉందట. తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంటర్ కాస్ట్ మ్యారేజేస్ కి ధన రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ఎంతో గొప్ప పరిణామం. పంజాబ్ తరహాలో లానే ప్రతి పెళ్ళికీ “మెడికల్ టెస్ట్” (హెచ్.ఐ.వి, పొటెంట్ టెస్ట్ తో సహా) చేయించాలి.. అప్పుడే నాలాంటి ఎందరో మహిళల పరిస్థితి మరొకరికి ఎదురుకావు. కాని అమ్మ నువ్వే నన్ను ఈ బాధ నుండి విముక్తురాలని చేయగలవు. నీ జీవితమే నాకో ఉదాహరణ. నా ప్రపంచంలో ఎన్ని సునామీలు రానీ, ఎన్ని భూకంపాలు రానీ నేను నీ లాగే తట్టుకుంటాను.. నీకు మళ్ళే పోరాడతాను.. నువ్వే నాకు స్పూర్తి.!!

 

Cover Image Source: Anvesh

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,