This 5 Time MLA From Khammam Is The Honest Politician That We Have Always Dreamed About!

ఎం.ఎల్.ఏ కావాలంటే బార్ షాప్ ఉండాలి, కోట్ల రూపాయాలు విలువ చేసే మైన్స్ ఉండాలి, నలుగురు రౌడిల్లాంటి అనుచరులను వెనుకేసుకుని అతని దగ్గరికి రావాలంటే ప్రజలను భయపెట్టించాలి, ఎలక్షన్లలో కోట్ల రూపాయలను మంచినీళ్ళలా ఖర్చుపెట్టాలి, తమ నాయకుడిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే ఎదురుదాడికి దిగాలి.. ఇవన్నీ ఉంటేనే ఆ నాయకుడిలో దమ్ము ఉందని రాజకీయ పార్టీలు గుర్తించి టికెట్టు ఇచ్చే దౌర్భాగ్యపు రోజులు ఇవి. ఇప్పటి రాజకీయ గంజాయి వనంలో ఉన్న అతికొద్ది తులసి మొక్కలలో మరో తులసి మొక్కలాంటి మంచి నాయకుడు ఆయన, 5సార్లు ఎం.ఎల్.ఏ గా ఎన్నికై 25సంవత్సరాలు అధికారంలో ఉంటూ ఏనాడు లంచం తీసుకోలేదు, దాదాపు 35సంవత్సరాల అలుపెరుగని సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తున్న ధృడ వ్యక్తిత్వం గల వక్తి ఆయన.. ఆయన పేరు గుమ్మడి నర్సయ్య. మనం చూస్తుంటాం ఒక మామూలు వార్డ్ కౌన్సిలర్ 5సంవత్సరాలలో అడ్డదారులు తొక్కి ఎంత సంపాదిస్తాడో, అదే ఎం.ఎల్.ఏ ఐతే ఇక జీవితంలో ఏ పని చెయ్యనవసరం లేకుండా ఐదు సంవత్సరాలలో దోపిడీ చేస్తాడు. ఎంతటి మంచి ఆశయాలు ఉన్నా కాని రాజకీయాలలో వేసే ఎత్తులు, జిత్తులు, మోసాలకు అడ్డదారులు తొక్కాల్సి ఉంటుంది.. అంతటి సులభంగా గొప్ప వ్యక్తిత్వాన్ని దిగజార్చే రాజకీయ వ్యవస్థలో గుమ్మడి నర్సయ్య గారు ఏనాడు స్వార్ధ ప్రయోజనాల కోసం తన ఆశయాలను వదులుకోలేదు. బుజ్జిగించినా, బ్రతిమలాడినా, ఆఖరికి బెదిరించినా గాని తాను నమ్మిన ఆశయాల కోసం ఏ ఒక్కడి ముందు తలవంచలేదు.


రాజకీయ ప్రవేశం:
గుమ్మడి నర్సయ్య గారి కుటుంబం మరియు అతని గ్రామం కాస్త వెనుకబడిన ప్రాంతం. ఒకసారి సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసి పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో సంచరించడం, ఇంకా వారి విలువైన ఆశయాలు నచ్చడంతో ఒక వ్యక్తిగా చేయడం కన్నా ఒక నిజాయితీ గల రాజకీయ పార్టీ తరుపున పోరాడితే అనుకున్నది వేగంగా సాదించగలమనే నమ్మకంతో 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు(ఇప్పటికి అదే పార్టీలో ఉన్నారు).

KHAMMAM_ (ANDHRA PRADESH) _31-12-2011- CPI (ML-New Democracy) district secretary Potu Ranga Rao and Ex-MLA Gummadi Narasaiah and other party activists taking out padayatra from Dummugudem project construction site in Khammam District on Saturday. PHOTO: G_N_RAO
సాదారణ జీవితం:
సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసి పార్టీకి చెందిన గుమ్మడి నర్సయ్య గారు ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎం.ఎల్.ఏ(ప్రస్తుతం మాజీ). పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య ఇంకా కొంతమంది అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళారని మనం చదువుకున్నాం.. నర్సయ్య గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత కాలం తన నియోజక వర్గం ఖమ్మం జిల్లా ఇల్లందు నుండి హైదరాబాద్ కు బస్సులో, ట్రైన్ లలో వెళ్ళేవారు. ఐదుసార్లు ఎం.ఎల్.ఏ గా చేసిన కాలంలో ఆయనకు వచ్చే జీతంతోపాటు, ప్రస్తుతం మాజీ ఎం.ఎల్.ఏగా వస్తున్న ప్రభుత్వ పెన్షన్ ని కూడా పార్టీ కి విరాళంగా అందిస్తారు(పార్టీ బ్రతికితేనే ప్రజలు బాగుంటారు అనే బలమైన నమ్మకంతో).

కుటుంబ నేపధ్యం:
నర్సయ్య గారికి ఏ వ్యాపారాలు లేవు ఉన్నది కొద్దిపాటి భూమి, అందులోనే వ్యవసాయం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడతారు. నర్సయ్య గారికి మొత్తం నలుగురు సంతానం. నర్సయ్య గారు మాత్రమే కాదు వారి కుటుంబం కూడా ఉన్నత ఆశయాలను పెంచి పోషిస్తున్నారు. తండ్రి అధికారాన్ని ఏనాడు అడ్డుపెట్టుకోకుండా నీతిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. చిన్నకొడుకు చిన్నతనంలో ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు, మరో కొడుకు నర్సయ్య గారితో పాటు వ్యవసాయ పనులుచేస్తుంటారు. ఒక కూతురు గృహిణి, మరో కూతురు టీచర్ గా పనిచేస్తారు.


నియోజిక వర్గం:
ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజిక వర్గం బొగ్గు గనులకు పుట్టిల్లు. బ్రిటీష్ వారు మొదట ఈ ప్రాంతంలోనే బొగ్గు గనులు కనుగొన్నారు. వనరులు అధికంగా ఉన్నా కాని ఇక్కడ గిరిజనులు, ప్రజలు కాస్త వెనుకబడి ఉండడంతో నర్సయ్య గారే అన్ని తానై వ్యవహరించారు. తన వారికి ఏంతటి చిన్న సమస్య వచ్చినా ఇంటి పెద్ద కొడుకుగా నర్సయ్య గారు పరిష్కరించారు. మొదటిసారి ఎం.ఎల్.ఏ గా ఎన్నికైనప్పుడు కేవలం ఐదు గ్రామాల్లో ఉన్న కరెంటును యుద్ధ ప్రాతిపదికన నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి అందించారు, నియోజికవర్గం అభివృద్ధితో పాటు, భూస్వాముల వ్యవస్థపై తిరగబడి ఏ ఒక్కరికి భయపడకుండా వేల ఎకరాలను భూమి లేని నిరుపేదలకు పంచారు.


ఎం.ఎల్.ఏ కాకముందు గుమ్మడి నర్సయ్య గారి ఆస్థులు, ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికి అదే పరిస్థితి.. డబ్బు పరంగా చూస్తే నర్సయ్య గారు మధ్యతరగతే కాని ఎం.ఎల్.ఏ గా, రాజకీయ నాయకునిగా చూసుకుంటే ఆయనో సంపన్నుడు. ఏ స్వార్ధంతో సంపాదించలేని ప్రేమను ఆయన ప్రజల నుండి సంపాదించుకున్నారు. ఒక నాయకుడు అనే వాడు డబ్బుతో సహా పేరు కోసం కూడా ఆలోచించకూడదు. పేరు, డబ్బు కోసం చేసే పనిలో స్వార్ధం ఉంటుంది. స్వార్ధంలో ఖచ్చితంగా నటన, భయం ఉంటుంది. నర్సయ్య గారు కేవలం తన వారి సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నారు కాబట్టి ఆయనను ఇంత వరకు ఎవ్వరు కొనలేకపోయారు.. నిజంగానే నేటి రాజకీయ గంజాయి వనంలో ఉన్న అతికొద్ది తులసి మొక్కలలో ఆయన ఒకరు. హాట్సాఫ్ నర్సయ్య గారు. ఊహల్లో బ్రతుకుతూ సినిమాలలో డైలాగులకే పరిమితమయ్యే స్టార్ హీరోల కన్నా, స్వార్ధ, నీచ రాజకీయ నాయకుల కన్నా మీ లాంటి వారే ప్రతి నియోజికవర్గానికి నాయకుడిగా రావాలి.

If you wish to contribute, mail us at admin@chaibisket.com