An 80’s Kid Rewinds His Memories Of Watching Chiru’s Blockbuster ‘Hitler’

 

Contributed By Ravindranath Sriraj

 

అప్పటికే ఏడాదికి పైగా చిరు సినిమా లేని లోటుని అభిమానులు విపరీతంగా ఫీలవుతున్నారు. రిక్షావోడు, ఎస్పి పరశురాం, బిగ్ బాస్ తాలుకు చేదు జ్ఞాపకాలు ఎంత మర్చిపోవాలని ట్రయ్ చేస్తున్నా ఆడియో టేపులు, వీడియో క్యాసెట్ల రూపంలో ఏదో ఒక చోట వెంటాడుతూనే ఉన్నాయి. ఇక చిరంజీవి పనైపోయిందనే కామెంట్స్ యాంటీ ఫాన్స్ కు బ్రహ్మాస్త్రంలా దొరికాయి. ఇంకేముంది ప్రచారం ఊపందుకుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు మరోపక్క బాలయ్య, వెంకీ, నాగ్ లు దూసుకుపోతున్నారు. నేను పదో తరగతి పూర్తి చేసుకుని నూనూగు మీసాల నూత్న యవ్వనంలోకి అడుగుపెడుతున్న స్వర్ణయుగం. బాసుకు గట్టి హిట్టు పడితే తప్ప ఇవన్నీ ఆగవని అర్థమవుతోంది. కానీ ఎలా.

 

ఇప్పటిలా ఆ టైంలో వెబ్ సైట్లు లేవు కాబట్టి దేనికైనా సినిమా పత్రికలే ఆధారం. అసలే సెంటిమెంట్ తో కన్నీళ్ల ఆయింట్మెంట్ రాసే ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. బడ్జెట్ భారీగా పెట్టలేని ఎడిటర్ మోహన్ నిర్మాత. ఇవి చాలదన్నట్టు ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు. పైగా మలయాళీ రీమేక్ విత్ నెగటివ్ టైటిల్. ఈ సినిమా తాలూకు వార్తలు చదివినప్పుడంతా ఒకరకమైన నిరాశానిస్పృహ. ఇలాంటి కథను ఎంచుకుని చిరు తప్పు చేశాడా అని. మళ్ళీ ఇంకో ఫ్లాపు తప్పదా అనే టెన్షన్ మరోవైపు. ఇన్ని అనుమానాల మధ్య జనవరి 4 విడుదలైందా సినిమా. టైటిల్ హిట్లర్.

 

తెల్లవారుజామునే లేచి బెనిఫిట్ షోకు వెళ్లేంత భౌతిక, ఆర్థిక స్వాతంత్ర్యం లేని వయసు కాబట్టి మనసు చంపుకుని ఆ రోజు కాలేజీకి వెళ్ళా. పేరుకి క్లాసులో కూర్చున్నానన్న మాటేగాని మనసంతా హిట్లర్ ఆడుతున్న శ్రీనివాస థియేటర్ మీదే ఉంది. నాలుగు రోజుల ముందే థియేటర్ ఎత్తు కటవుట్, కలర్ఫుల్ బ్యానర్లతో హాల్ బయట ఓ రేంజ్ లో డెకరేషన్ చేశారు. అవి చూసేందుకు సైకిల్ వేసుకుని ఎన్ని రౌండ్లు వేశానో గుర్తులేదు కానీ ఇదే ప్రాక్టీస్ సిన్సియర్ గా కంటిన్యూ చేసుంటే ఖచ్చితంగా పోలీస్ సెలెక్షన్స్ లో పాసయ్యేవాడిని. ఇక రిలీజ్ రోజున నా మానసిక స్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. మొత్తానికి ఆ ఘడియలకు స్వాగతం చెబుతూ ఈవెనింగ్ షోకి గడియారం దారి చూపింది. అప్పటికే చిన్నగా టాక్ వచ్చేసింది

 

“ఇంట్రో చప్పగా ఉందట”

“మరీ సెంటిమెంట్ ఎక్కువయ్యిందంటున్నారు. హీరో నాలుగైదు సార్లు ఏడిస్తే ఇక సినిమా ఆడినట్టే”

“చిరంజీవే లేని పాటలు రెండు పెడితే ఎవడు చూస్తాడు”

“సెకండ్ హాఫ్ లో దాసరి పాత్రే డామినేట్ చేసింది”

“కామెడీ పెద్దగా లేదు. ఫైట్లు తక్కువే ఉన్నాయి”

 

ఇలా నానారకాలుగా ఏవేవో కామెంట్లు, ఫీడ్ బ్యాకులు వద్దన్నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. మనం చూశాకే పెదరాయుడు తీర్పు ఇవ్వాలని డిసైడ్ అయిపోయి స్నేహ బృందం థియేటర్లో అడుగు పెట్టాం. మొత్తం గోలగోలగా ఉంది. అతికష్టం మీద ముందే మాలో ఒకణ్ణి లోపలికి పంపాం కాబట్టి సీట్లు దొరికాయి. లేదంటే స్టాండింగ్ ఓవెషన్ లో చూడాల్సి వచ్చేది. ఏదైతేనేం బొమ్మ మొదలైంది. మా గుండెల్లో గుబులు కూడా కరగడం స్టార్ట్ అయ్యింది.

 

హిట్లర్…….
ఎప్పుడూ లేనంత కొత్తగా ఉన్నాడు.
కోపంగా ఉన్నాడు.
ఏదైనా తేడా కొట్టినా, చెల్లెళ్ళ వంక ఎవడైనా కన్నెత్తి చూసినా వాళ్ళ బాడీని బర్మాకు పార్సిల్ చేస్తున్నాడు.
ఏడిపిస్తున్నాడు.
మరదలు ఎంత కవ్వించినా నిగ్రహంతో తొణక్కుండా పెద్దరికం చూపిస్తున్నాడు.
నిందలు పడుతున్నాడు.
ఎన్నో ఎన్నెన్నో…..

 

కానీ ఒక్కటి మాత్రం నిజం. మాస్ మసాలా ఫార్ములా తెరలను చించేసి మరీ చిరు చేసిన కొత్త ప్రయత్నం ఫ్యామిలీ ఆడియెన్స్ ని కదిలించింది. గుండెల్ని తడి చేసింది. ఫ్యాన్స్ కి మరో కొత్త కథానాయకుడిని పరిచయం చేసింది. వెరసి బొమ్మ బ్లాక్ బస్టర్.

 

అబీబీ అబీబీ పాటను నేను థియేటర్లోనే ఐదారుసార్లు చూసినా ఒక్కసారి కూడా పూర్తి ఆడియో నాకు వినిపించలేదు. కోటి కిరాక్ ట్యూన్ కి లారెన్స్ కంపోజ్ చేసిన స్టెప్పుకి బాస్ అలా వయ్యారంగా కింది నుంచి లేచి శరీరాన్ని మెలితిప్పుతుంటే తిన్నగా కుర్చీల్లో ఎవడైనా కూర్చుంటే ఒట్టు. ఒకటే పూనాకలు. అప్పుడు యుట్యూబ్ లేదు. మళ్ళీ చూడాలంటే టికెట్ తెగాల్సిందే. అందుకే హిట్లర్ ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీనే


 

ప్రీ క్లైమాక్స్ లో రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ ఒకటుంది

“అరె ఉల్లిపాయలు తరిగితే ఎక్కడ మీ కంట్లో కన్నీళ్లు వస్తాయోనని వాటిని వాడటం మానేసిన వెర్రి బాగులోడే మీ అన్నయ్య”

 

ఒక సెంటిమెంట్ డైలాగుకు హాల్ మొత్తం దద్దరిల్లిపోవడం నాకు గుర్తుండి అదే ఫస్ట్ అదే లాస్ట్. గుర్తుపెట్టుకుని మరీ రెండోసారి వచ్చినప్పుడు చూశా సంభాషణల రచయిత పేరు “ఎల్బి శ్రీరామ్”

దీన్నే నా స్టైల్ లో ఫ్రెండ్స్ తో పంచుకోవడం ఇప్పటికీ గుర్తే

“అరె తొందరపడి సినిమాలను చేస్తే ఎక్కడ ఫ్లాపులొచ్చి అభిమానులు బాధపడతారోనని ఒప్పేసుకున్న కథలను డబ్బును వద్దనుకున్న వెర్రిబాగులోడే మీ హీరో”

 

పోస్టు లెన్త్ ఎక్కువై “అంతొద్దు” అనుకున్నా కానీ మొత్తం రాశాక హమ్మయ్య “ఇది చాలు” అనిపించింది. ఇదీ హిట్లర్ స్టయిల్ లోనే


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,